Thursday, October 23, 2025

 ఎవరండీ మనం కట్టుకునే బట్టలకి, మన ఇంట్లో కొనుక్కునే వస్తువులకే measurement తయారుచేసి మనల్ని ఇలా ఉంటేనే గొప్ప అని చెప్పినది? 

ఒకప్పుడు పెళ్లికి ఒకటో రెండో పట్టు చీరలు కొనుక్కుంటే అవే చీరలు పిల్లల పెళ్ళిళ్ళకి పీటల మీద కూర్చోడానికి కూడా ఉపయోగించేవారు. అవే చీరలు మడికి, ఆ తరవాత మనవలు పుట్టే సమయానికి పట్టుబొంతలలాగా కూడా ఉపయోగించడం నాకు తెలుసు. 

ఆడవారు మెడలో తాళి నల్లపూసలు, మహా అయితే మరో గొలుసు లేదా నెక్లెస్ తో జీవితం గడిచిపోయింది. కొన్ని కుటుంబాలలో పెళ్ళిళ్లకి వెళ్ళినప్పుడు పక్కింటి ఒదినగారిని తాళిబొట్టు కూడా అప్పడిగి ఆ కార్యక్రమం అయిన వెంటనే తిరి వచ్చి ఆవిడ నగ ఆవిడకి  ఇచ్చేసిన సందర్భాలు కూడా తెలుసు. 

బంధువులు, వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదైనా కథ కార్యాలు జరిగినప్పుడు ఎవరింటికి అయినా వెళ్తే అందరూ చక్కగా హాల్లో (మండువా అయితే మండువాలో) బొంతలు, చాపలు వేసుకుని కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వులు కేరింతల మధ్య నిద్రపోవడం నాకు తెలుసు. 

వేసవి కాలం కరెంటు పోతే సాయంత్రాలు హరికేన్ లాంతరు పెట్టుకుని చుట్టూ కూర్చుని చదువుకోవడం తెలుసు. బుడ్డి కిరసనాయిలు దీపాల వెలుగులో భోజనాలు తెలుసు. 

గాలి ఆడకపోతే పెరట్లో చెట్లకింద చక్కగా మడత మంచాలు, పట్టిడి మంచాలు వేసుకుని కథలు, పాటలు, ఆ వెన్నెలలోనే ఆటలు ఆడుకుంటూ గడిపిన రాత్రులు తెలుసు. 

ఒకరు ఇంటికి వస్తున్నారు అంటే మర్యాద కోసం గొప్పకోసం లేదా మనకున్న వస్తువులు చూపించడం కోసం అలంకరణలు ఉండేవి కావు. చక్కగా కడుపునిండా వారికి నచ్చిన పిండివంటలు చేసి పక్కన కూర్చుని విస్తరిలో వడ్డించి కబుర్లు చెప్తూ భోజనాలు చెయ్యడం తెలుసు. 

పిల్లలందరికీ పెద్దమ్మ, అమ్మ, పిన్ని, అత్త, పెద్దక్క ఇలా ఎవరో ఒకరు కలిపి ముద్దలు చేసి పెట్టడం తెలుసు. 

ఆ అందరితో పంచుకుని తినడంలో చిన్నవారికి గోరుగుజ్జులు, వెన్నముద్దల పెట్టి గారాలు చెయ్యడం తెలుసు. 

వేసవికాలం చక్కగా అష్టాచెమ్మా, వైకుంఠపాళి, చింతపిక్కలు, వామనగుంటలు, గచ్చకాయలు అంటూ పగలంతా ఇంటిపట్టున వట్టివేళ్ళ చాపల తడిసిన వాసనల మధ్య ఆటలు తెలుసు. ఓడిపోయి ఉడికిపోయిన బుజ్జి దాన్ని జంతికలు గోరుమీటీలు పెట్టి బతిమాలుకోవడం తెలుసు.

అక్క బట్టలు చెల్లి, అన్న సైకిలు తమ్ముడు తొక్కుకోవడం తెలుసు. 

ఎప్పుడెప్పుడు అమ్మ నైవేద్యం పెడుతుందా చక్కగా బూరెలు బొబ్బట్లు చకచకా తినేద్దామా అని ఆవురావురంటూ ఎదురు చూడ్డం తెలుసు.  

పట్టులంగాలకి ఫిల్ట్ వేసుకుని పొట్టైన ప్రతి సారి ఒక ఫిల్ట్ కుట్లు విప్పి మళ్ళీ వేసుకోవడం తెలుసు. అమ్మ చీరలు పురిటిలో మెత్తగా కట్టుకుని, నడికట్టు కట్టుకోవడం తెలుసు. 

పురుడైన పదిరోజులు ఉదయాన్నే ఉడుకు కాయం, నీళ్ళైన తర్వాత కొట్టుకాయం తినడం తెలుసు. నల్లబెల్లం వాసన, నెయ్యి మరుగుతున్న వాసన తెలుసు. పక్కింటి ఒదిన కూతురికి పురుడైతే వేడినీళ్లు, కుంకుడు కాయలు, నలుగుపిండి పంచిపెట్టడం తెలుసు. నలుగురూ కలిసి కార్యక్రమాలకి వంటలు వండడం వడ్డించడం తెలుసు. 

అమ్మాయిని చూసుకోడానికి పెళ్లివారొస్తున్నారు, ఒదినా నీ పట్టుచీర ఇవ్వవా, పెద్దదానికి కూడా ఆ చీరలోనే పెళ్ళి కుదిరింది అంటూ ఆడపడుచు చీర కట్టి పిల్లకి పెళ్లి చెయ్యడం తెలుసు. 

ఆ వెధవ నా మాట వినడం లేదు అన్నయ్యా, ఓసారి నీ దగ్గరకి పంపిస్తా మాట్లాడు అన్నయ్యా అన్న తమ్ముళ్ళు తెలుసు. 

ఒరేయ్ మీ నాన్నకి తెలియకుండా ఉంచు, తెలిస్తే బాధ పడతాడు అంటూ తమ్ముడి కొడుకు చేతిలో డబ్బులు పెట్టి ఖర్చులకి ఆదుకున్న పెద్దన్నయ్యలు తెలుసు. 

అదేమిటమ్మా మనందరం ఒకటే కదా, ఎవరైతేనేంటి, ఇటు వచ్చేయండి అంటూ చనువుగా పిలిచిన పెద్ద తోటికోడలు తెలుసు. 

పిల్లాడు నచ్చాడా అంటే ఇంకా నసుగుతోంది, ఓసారి దానితో మాట్లాడవే అంటూ పెద్ద కూతురికి పెత్తనం ఇచ్చిన పిన్నమ్మ తెలుసు. 

ఈ ఏ ఒక్క సందర్భంలోనూ డబ్బు నగలు డాబు పదవి లాంటివి ఏ ఒక్కటి వ్యక్తుల మధ్య బంధాన్ని కొలవలేదు. 

ఈరోజు ప్రతిదీ కొలతలే. ఎవరికి ఎక్కువ ఆస్తిపాస్తులు, ఎవరి దగ్గర ఎక్కువ పదవులు, ఎవరికి ఎంత పలుకుబడి అంటూ... 

పక్కింటి వాళ్ళ మనవడి పుట్టిన రోజుకి కూడా మనమే కొత్తబట్టలు కొనుక్కుంటూ, అక్కడికి థీమ్ అంటూ ఒకే రంగు చీరలు, ఒకేలాంటి నగలు, పైగా హోదాకు తగ్గ బహుమతులు... అంతటితో సరా..? రిటర్న్ గిఫ్ట్ లో కూడా ఆ హోదానే చూపించడం. Buffet lunch / dinner. అద్దెకు తెచ్చుకున్న పని వారి పలకరింపులు. పసుపు కుంకాలు ప్యాకెట్లు వరకే. ఇంటి యజమాని దగ్గరుండి వాయనం, తాంబూలం ఇచ్చిన సందర్భాలు కరువైపోతున్నాయి. అతిథులకి హాయ్ అని ఆ తర్వాత బాయ్ అనే పలకరింపులు కూడా కరువే. హాజరు వేయించుకున్నాం అనుకోవడం కోసమే వెళ్ళడాలు. 

ఏ ఆనందాల కోసం ఏ ఆత్మీయత నిండిన సంతృప్తి ని వదిలేసి ఎంత దూరం వచ్చేసేం?

పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వినే మర్యాద వినయం ఎక్కడ? పైగా వెటకారం కూడా... చుట్టాలు అంటే అసహ్యం అంటూ పోస్టులు, స్టేటస్ లు, జడ్జిమెంట్లు, దెప్పిపొడుచుకోవడాలు..

కష్టం అంటే పలకరించే నలుగురు లేరు. నిజంగా చెప్తే పరామర్శ కి వచ్చే వాళ్ళు ఉన్నా కాటికి మోసుకుని వెళ్ళడానికి కూడా పట్టుమని నలుగురు రాని స్థితి...

ఎటో పోతున్నాం మనం.... 
ఆత్మీయత లేని పలకరింపులు
ఆనందం లేని సంబరాలు 😊(సేకరణ)

No comments:

Post a Comment