Sunday, January 25, 2026

 *25.01.2026 ఆదివారం - రథసప్తమి, భానుసప్తమి, సూర్యజయంతి, అభోజ్యార్కవ్రతం, నర్మదా జయంతి, బ్రహ్మసావర్ణి మన్వాది*
☀️

*రథసప్తమి/సూర్య జయంతి*

ఇది సూర్య జయంతి తిథి. మన్వాది దినంగానూ ప్రసిద్ధి. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. మన్వాది నాడు చేయాల్సిన తర్పణాదులను ఈరోజు చేయాల్సి ఉంటుంది.

ఈ వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు ఈ దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది. తెలుగు దేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా ఉంటున్నాయి. నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళ వారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి నాడే పడతారు.

వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి ఇన్ని వ్రతాల ప్రారంభదినమైన రథసప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు.

చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు ఆచరించదగిన మంత్ర సహితమైన అనేక వ్రతాలను గురించి పేర్కొంది. ప్రాయకంగా అవన్నీ సూర్యునికి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవి అయి ఉన్నాయి. ప్రాచీక కాలంలో ఇది మనకు ఉగాదిగా ఉండినా, ఉండకపోయినా మిక్కిలి ప్రాచీనమైన మన పండుగలలో రథ సప్తమి ఒకటి.
📖

*పద్ధతి*

ప్రతి ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడుకాయల తో చేసిన దానిని సూర్యరథం అంటారు.

*జిల్లేడు ఆకులు*

జిల్లేడు ఆకుల్ని రథసప్తమి నాడు నెత్తి మీద పెట్టుకోవడంలో ఆంతర్యం ఉంది. సూర్యుడు తన కాంతితో, వేడితో, విద్యుత్తు తో, ఆకర్షణ శక్తితో పదార్థాన్ని కాల్చివేస్తాడు. గ్రహాలను బట్టి జీవులకు కామ క్రోధాది గుణాలు కలుగుతుంటాయి. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఇతర గ్రహాలు జీవులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సూర్యుడు ఉత్తరాయణ గతుడైనపుడు గ్రహాల పలుకుబడి మనుషులపై అంతగా ఉండదు. రథ సప్తమి సూర్యుని ఉత్తరగతిని సూచించే పండుగ. ఈ పర్వం సందర్భంలో జిల్లేడులను తలపై ఉంచుకుని స్నానం చేస్తూ వాటిని జారవిడవడం కామ క్రోధాది గుణాల విసర్జనకు సూచన అని అనుకోవచ్చు.

జిల్లేడు మంచి వీర్యవంతమైన మూలిక. ఈ ఆకులు పైన నునుపుగా, కింద నూగుగా ఉంటాయి. ఇది సంవత్సరంలోని అన్ని రోజుల్లో పుష్పిస్తుంది. జిల్లేడు ఆకులు తుంచినా కొమ్మలు విరిచినా తెల్లని పాలు కారతాయి. ఆ పాలల్లో ఉప్పు కలిపి పట్టిస్తే పంటిపోటు ఇట్టే పోతుంది. జిల్లేడు చిగుళ్ల రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. జిల్లేడు ఆకులు వెచ్చబెట్టి ఆముదం రాసి పైన వేస్తే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఎరుపు, నీలి వర్ణాలు కలిసిన జిల్లేడు పువ్వుల కంటే తెల్ల జిల్లేడు పూలు శ్రేష్ఠమైనవి. పక్షవాతం, కుష్ఠు, మూర్ఛ, విష జంతువుల కాట్లు మున్నగు దుష్ట సాధ్యాలైన రోగాలలో కూడా జిల్లేడు బాగా పనిచేస్తుంది. జిల్లేడు బొగ్గు తీక్షణమైనది. దీనికి సంస్కతం లో సూర్యాహ్వాయ, అర్క, రవి అనే పేర్లు ఉన్నాయి. ఈ నామాలు దీనికి సూర్యునితో గల సంబంధాన్ని తెలియచేస్తున్నాయి. రథ సప్తమి సూర్యునికి సంబంధించిన పండుగ కాబట్టి ఆనాడు జిల్లేడు ఆకులకు ప్రాధాన్యం వచ్చి ఉండవచ్చు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇక, రథ సప్తమినాడు రేగుపండ్లు నెత్తి మీద పెట్టుకోవడంలో కూడా ఆంతర్యం ఉంది. భవిష్యోత్తర పురాణంలో రథ సప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులు కానీ, రెండు రకాల ఆకులు కానీ తలపై పెట్టుకుని స్నానం చేయాలని ఉంది. కానీ, ఆంధ్రదేశంలో జిల్లేడు ఆకుల దొంతర మీద రేగుపండ్లు ఉంచుకుని స్నానం చేయడమే ఆచారం. శిశిర రుతువైన మాఘ ఫాల్గుణ మాసాల్లో రేగుపండ్లు విస్తారంగా దొరుకుతాయి. 'ఫలశైశిర' అని రేగుకు సంస్కృత నామం ఉంది. రథ సప్తమికి ఇంచుమించు ఒక నెల ముందు వచ్చే సంక్రాంతి భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు రేగుపండ్లు తలపై పోసి దిగబారేలా చేస్తారు. అలా పోయడం వల్ల పీడ వదిలిపోతుందని మనవాళ్ల నమ్మకం. ఆనాడు రేగుపండ్ల మూలకంగా ఒక్క చిన్నపిల్లలకే జరిగే మంచి.. రథసప్తమి నాడు అందరికీ జరుగుతుందని అనుకోవాల్సి ఉంటుంది.

ఇక, చిక్కుడు కాయల విషయానికి వస్తే.. రథసప్తమి నాడు చేసే పూజలో చిక్కుడు కాయలతో పాటు ఆకులనూ వాడతారు.

చిక్కుడు కార్తికమాసం నాటికి కదురంత మొక్క ఉంటే మాఘమాసం నాటికి నా మహిమ చూపుతానన్నట్టు విస్తరిస్తుందని పెద్దలు అంటారు. ప్రకృతిని ఆరాధించే మన పెద్దలు మాఘ మాసంలో బాగా పూచి, కాచే చిక్కుడును కూడా మాఘ మాసపు పర్వాల లో చేర్చి రథ సప్తమి నాటి ఆరాధన ద్రవ్యాలలో ఒకటిగా చేర్చారు. ఈనాడు చిక్కుడు కాయలతో, వెదురు పుల్లలతో రథాన్ని చేసి దాని మీద చిక్కుడు ఆకుల్ని పరిచి నైవేద్యానికి ఆధారపాత్రగా ఉపయోగించే ఆచారం ఉంది. నైవేద్యం పెట్టడానికి వేడి పొంగలి చిక్కుడు ఆకు మీదనే వేసి చల్లార్చడం చేత ఆకులో ఉండే పసరు, ఆర్ద్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనిక మార్పు వస్తుంది. ఆ పదార్థ సేవనం ఆరోగ్య వర్థకం అవుతుంది.
📖

*సూర్య జయంతి*

రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని రాజపుటానాలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, మరికొన్నిచోట్ల జయంతి సప్తమి అనీ, ఇంకొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది.

సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు. అయితే, జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చనేది పెద్దల అభిప్రాయం. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- సప్తమి తిథులు నెలకు రెండుసార్లు వస్తాయి. అనగా, ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమికి మహా సప్తమి అనే పేరు వచ్చిందని అంటారు.

ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుని గతి మారే శుభసమయం. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ కూడా రథాకారంగా ఉంటాయి. సర్వదేవమయు డైన ఆదిత్యుని సేవించడం వలన తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యాదులు ప్రాప్తిస్తాయి. స్నానం చేసేటపుడు సూర్యనారాయణుని ధ్యానించి, తలపై జిల్లేడాకులు, రేగు ఆకులు పెట్టుకోవాలని ధర్మశాస్త్ర వచనం. 

సూర్యభగవానుని విధివిధానంగా ఆరాధించి గోమయంతో చేసిన పిడకలమంటతో వండిన పాయసాన్ని చిక్కుడాకులలో నివేదించాలి. "సూర్యగ్రహణ తుల్యా తు శుక్లా మాఘస్య సప్తమీ” సూర్యగ్రహణంతో సమానమైన పవిత్ర సమయం కాబట్టి స్నాన, దాన, జపాలకు అత్యంత ముఖ్యమైనది. 
📖

*దానం* 

ఈ రోజున గుమ్మడికాయను దానంచేయడం మంచిది. సాక్షాత్తు పరమేశ్వరుని నుండి నర్మదాదేవి ఆవిర్భవించిన ఈ రోజున నర్మదాస్నానం అత్యంత విశేషమైనది. ఎవరి ఇంటిలో వారు కలశమందు నర్మదను ఆవాహన చేసి అర్చించుకోవచ్చు.

ఈరోజు *వైవస్వత మన్వాది*.పురాణ వచనం ప్రకారం ఈరోజు వైవస్వత మన్వంతరం ప్రారంభం అయిన రోజు. ప్రతి మన్వాది రోజు పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించడం సాంప్రదాయం.

ఈ రోజు *ఆరోగ్య సప్తమీ, విధాన సప్తమీ*. మాఘ మాస శుక్ల పక్ష సప్తమీ తిథి రోజున సూర్య కిరణాలలో ఔషధీ గుణాలు ఉంటాయి అని, శరీరానికి సూర్య కిరణాలు సొకటం వలన చర్మ వ్యాధులూ, ఇతర వ్యాధులూ త్వరగా నయం అవుతాయి అనే నమ్మకంతో ఈ సప్తమి రోజు ను *ఆరోగ్య సప్తమీ* అని పిలుస్తారు. భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి, సూర్య భగవాణున్ని శ్రీ సూర్య పంజర స్తోత్రం, అరుణం మహాసౌరం త్రిచ పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలతో పూజిస్తారు. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఈరోజు  *సూర్య జయంతి*, *రథ సప్తమి*, *అచలా సప్తమి, విశోక సప్తమి వ్రతం*. సూర్య భగవానుడు, కశ్యప ఋషికి,అదితి దంపతులకు మాఘ మాస శుక్ల పక్ష సప్తమి రోజు జన్మించాడు అని పురాణ వచనం. మహాభారత కథనం ప్రకారం సూర్య జయంతి మరుసటి రోజు,భీష్మ అష్టమి తిథి రోజు భీష్మాచార్యులు వారు మోక్షం పొందారు అని కథనం. భక్తులు తమ ఆరోగ్య మెరుగుదల కోసం అరుణం, మాహాసౌరం, త్రిచ లతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. కోణార్క్ సూర్య దేవాలయం లోనూ, అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి దేవాలయంలోనూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈరోజు *అభోజ్యార్క వ్రతం*. ఈరోజు భక్తులు తమ మానసిక ఆరోగ్యం కోసం, మానసిక వత్తిడుల నుండి బయట పడడానికి రోజంతా ఉపవాసం ఉండి, సూర్య చంద్రులను పూజిస్తారు.

ఈరోజు *నర్మదా జయంతి*. మాఘ మాస శుక్ల పక్ష సప్తమి రోజు నర్మదా నది జన్మించిన రోజని భక్తుల విశ్వాసం. జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయ నే నమ్మకంతో భక్తులు ఈరోజు నర్మదా దేవిని పూజిస్తారు. మధ్యప్రదేశ్ లోని అమర కంటక్ ప్రాంతంలో నర్మదా నది ఉద్భవించి నది అని, ఆ ప్రాంతంలో నర్మదా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఈరోజు *భాను సప్తమి*.(ఆదివారం, సప్తమీ తిథి). ఈరోజు సూర్య భగవానుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తి పరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం ఈరోజు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం.

*సర్వార్థ సిద్ది యోగం* (ఆదివారం, అశ్వనీ నక్షత్ర కలయిక)ఈ రోజు మ.01.35 నుండి రేపు సూర్యోదయం వరకూ ఉంటుంది. ఈ యోగ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం.
🔆
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment