Sunday, January 25, 2026

 *సండే స్టోరీ*

*విన్నపాలు*
✉️

రచన: నండూరి విఠల్


మా బామ్మ పోతూ పోతూ ఈ వీధిచివర ఉన్న మండువా యిల్లు మా యింటావిడ పేర రాసి మరీపోయింది. నాలుగు రాళ్ళు ఎక్కువిస్తానన్నాడని మనస్సు కీడు శంకిస్తున్నా దాన్ని ఓ ఆసామీకి అద్దెకిచ్చాను మా యింటావిడ సలహాపై.

ఆ ఆసామీ పేరు బండ వీరాసామి. వృత్తి  కుస్తీ పోటీలు.

ఆ వస్తాదు ఒక నెల ఎడ్వాన్సు ఇచ్చి అద్దెకు యిళ్ళు తీసుకునే అసామీలందరి లాగానే సలక్షణంగా యింట్లోకి ప్రవేశించాడు శిష్యగణంతో సహా. పదినెల్లయింది. నాటికీ నేటికీ అద్దెతాలూకు రాగి పైసాయివ్వలా. "తొమ్మిదినెలల అద్దె బాకీ పెడితే ఎవరూరు కుంటారండీ ? మనల్ని మరీ వాజమ్మల్నిచేసి ఆడిస్తున్నాడా వీరాసామి" అంటూ మా యింటవిడ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కొద్దీ నా సహనం నీరసించింది. ఆ 'వాజమ్మ' అనే విశేషణం నా తాలూకుదే నని మా శ్రీమతి నమ్మకమని నాకు అనుమానం కలిగింది.

ఆపై పౌరుష మొచ్చింది.

వచ్చి - బండ వీరాసామికి ఘాటుగా ఓ రిజిస్టర్ నోటీసు తగిలించాను. దాని నకలు తమ ముందుంచుతున్నా తప్పులుంటే చెప్పండి.

అది ఇది.

"ఘనమైన ఆయ్యా

కలియుగ భీములూ, వీరహనుమాన్ ప్రియ భక్తాగ్రేసరులూ, అఖిలభారత మల్లయుద్ధ పోటీలలో సువర్ణకంకణ విజేతలూ అయిన బండ వీరాసామిగారి దివ్యసన్నిధికి తమ వసతిగృహ యజమాని కట్టుకున్న భర్త సీతావతి వ్రాసుకున్న విన్నపాలు.

గత వారంరోజులుగా మన ఊరి చింతల తోపులో అర్భకులైన వేలాది ప్రజల సమక్షంలో చండప్రచండులైన, అఖిలభారత వస్తాదుల నెందరినో చిత్తుచేస్తున్న విషయం కర్ణాకర్ణిగా వినడమేగాని కనులారా చూసే భాగ్యానికి నోచుకున్నవాణ్ణి కాదు.

ఇందుకు కేవలం నా అనారోగ్యమే కారణం గాని తమయందుగల ఉపేక్ష మాత్రం ఎంతమాత్రం కారణంకాదంటే తమరు నమ్మగలరనుకుంటాను. తిరుగులేని భుజబలంగల తమబోంట్లు మా యింట్లో అద్దెకుండటమే మాకు కొండంత పెట్టు. ఒక్క మా కుటుంబానికేగాక, ఈ వీధికట్లు యావత్తుకు నిజానికి తమఉనికే ఒక శ్రీరామరక్ష.

ఒక చిన్న మనవి.

మరేమంత పెద్దవిషయం కాదనుకోండి…

తమరు గత పదినెలలుగా మా యింటి అద్దె చెల్లించలేదు. పెద్దమనుషులకు లక్షపనులు. పనుల వల్ల తీరిక లేక మరిచిపోయి వుంటారు. మరీ పేరుకుంటున్న అద్దె బాకీ విషయం, లోగడ పోస్టు బంట్రోత్తు పీరు సాయిబు ద్వారా తమకి గతంలో నాలుగైదు సార్లు వర్తమానాలు పంపుకున్నాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
నా విన్నపాలను తమకు అందించడం అలగాడూ మరిచిపోయివుంటాడు.

మరో స్వల్ప విషయం.....

మన యింటి దూలాలను తమరు  కొన్నింటివి పీకినట్లున్నూ, వాటితో మన పెరట్లో బస్కీలు తీయించేటందుకు నిచ్చెనల పోలికలున్న ఏదో కట్టడాన్ని నిర్మించినట్లు న్నూ ఓ గాలివార్త నా చెవిలో పడింది.

తమరు ఏదో సదుద్దేశంతోనే యింతటి ఘనకార్యాన్ని తలపెట్టివుంటారనే విషయం తెలియనివాణ్ణికాదు. కాని నా మనస్సులోని భయాన్ని తమ ముందుంచడం నా విధి.

తమరుంటున్న వసతిగృహం మా ఇంటావిడ కి వాళ్ళ బామ్మ పోతూపోతూ ఇచ్చిపోయిన తాతలనాటి పెంకుటిల్లు. అసలు ఎన్నడో కూలిపోవలసిన పాతకొంప. అయినా తమకు జడిసి అలా నిలిచివుంది.

మనవిచేసేదేమిటంటే మరో పోటీ పెట్టకుండా ఆ దూలాలుపీకితే అది ఆద్ధంతరంగా కూలి తమ నెత్తినపడే ప్రమాదముంది. మరి తమకేదన్నా జరిగితే ఈ వాడకట్టుకేగాక యావత్తూ భారతదేశానికే తీరనినష్టం. మీకు అటువంటి ఆపదరాకుండా పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుగాక. 

చిట్టచివరి మనవి…

అద్దె బాకీ యావత్తూ ఒకేసారి తమరు అనుగ్రహించినా ఒక్కసారి నేనేం చేసుకుంటాను గనుక. నెలకు నాలుగైదు రూపాయల వంతున తమరు పంపినా తమ ఖాతాలో కట్టుకుంటాను. ఆ రేటున తమ పదినెలల అద్దె బాకీ యావత్తూ తీరటానికి కనీసం ఓ పుష్కరం పడుతుంది గనుక ఈ లావాదేవీల పుణ్యమా అని మా యిల్లు మీరు ఖాళీచేసినా మన స్నేహ బాంధవ్యాలు పదికాలాల పాటు దిమ్మిసాచేసినట్లు నిలిచి వుండే సదవకాశం కలుగుతుందని సంబరపడుతున్నా.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అన్నట్లు తమ శిష్య పరమాణువు భజరంగ పహిల్వాన్ గారిని మొన్న కూరగాయల అంగడిలో కలుసుకునే భాగ్యం కలిగింది. ఇరుకైన కారణంగా మనయిల్లు ఖాళీ చేయాలనే తలంపు తమకు ఆ మధ్య కలిగినట్లు విన్నాను.

తమకు తగిన వసతిగల యింట్లోనే తమరు సుఖశాంతులతో హాయిగా బ్రతకాలని  త్రికరణశుద్ధిగా కోరుకునే తమ శ్రేయోభిలాషుల్లో నేనొకణ్ణి. మన పార్థసారధి స్వామి కోవెల వెనుకగల పరాంకుశంగారి మండువా యిల్లు తమకు తగినంత వసతి గానే వుంటుందిమరి.

తమరు మన యిల్లు ఖాళీ చేసేటప్పుడు... యిల్లు తాళం వేసి ఆ తాళంచెవిని పోస్టు బంట్రోతు పీరుసాయిబు ద్వారా నాకు ముట్టచెబితే అదే పదివేలు. తమరు మహానుభావులైన పెద్దలు. తమరే స్వయంగా తాళంచెవి యివ్వడానికి రావడం జరిగితే అది నేను పెద్దలపట్ల చేసిన అపచారమే గదా మరి.

ఇంతే సంగతులు

ఇట్లు:

తమ శ్రేయోభిలాషి

మన వసతిగృహ యింటియజమాని

సీతాపతివ్రాలు. 
🙏
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment