*శివతాండవము*
శ్లోకము:
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నశ్శివశ్శివమ్ ॥ 1 ॥
పద విభజన:
జటా అటవీ గలత్ జల ప్రవాహ పావిత స్థలే
గలే అవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికామ్
డమడ్ డమడ్ డమన్ నినాదవత్ ఢమర్ వయం
చకార చండ తాండవం తనోతు నః శివః శివమ్
భావము:
శివుని జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలముచే అభిషేకించబడి పవిత్రత పొందుచున్నది తాండవ రంగము.
ఆయన మెడలో సర్పహారము మాలలా వ్రేలాడుతున్నది.
చేతిలోని ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుతున్నది
అటువంటి తాండవ నర్తకుడు- శివుడు –
మాకు సకల శుభములను ప్రసాదించుగాక.
వ్యాఖ్య:
1: ప్రథమమున నాట్యమునకు రంగ స్థలమును శుద్ధి/సంప్రోక్షణ చేయాలి.
శివుని తాండవమునకు గంగ రంగ స్థలమును శుద్ధి/సంప్రోక్షణ చేస్తున్నది.
శుద్ధికై జలము చిలకరిస్తారు.
ఇక్కడ స్వయముగా గంగ పారి పవిత్రత ఆపాదించినది.
అటువంటి పవిత్ర రంగముపై శివుడు తాండవం చేస్తాడు.
2. రంగ స్థలము సిద్ధమైన తరువాత నర్తకునకు అలంకరణ/ఆహార్యము అవసరము. ఉదాహరణగా మెడ దండ మాత్ర వర్ణన. శివుని మెడలో వేలాడుతున్నఎత్తైన సర్పాలు దండల అలంకరణ వలె ఉన్నవి.
3. తరువాత అంశము నాట్య ప్రచారము/ఎఱుకపఱచు మేళము.
అందుచే నాద ప్రస్తావన.
అతని డమరుకము డమడ్ , డమడ్ , డమడ్ ,
అను నిరంతర ధ్వని ఆకాశమును తాకి నింపుతున్నది.
4. తాండవము ప్రారంభము అయి చండముగా సాగుచున్నది.
చండ మనగా ఆర్భాటము/ ఉగ్రమనే కాక
మరెవ్వరు చేయలేని/ అనన్యమైన/అద్వితీయమని అర్థములు.
ఆకాంక్ష:
శివుని తాండవము వర్ణిస్తున్న ప్రతి శ్లోకములలో
ఒక్కొక్క ఆకాంక్ష వెల్లడింపబడును.
ఇక్కడ:
"తనోతు నః శివః శివమ్"
శివుడు మాకు శివము- సమృద్ధిగా విస్తరింపచేసి/అందించు కాక.
శివము అనగా శుభము/శాంతి సుఖము/క్షేమం /శుద్ధత/అటువంటి మంగళములు.
No comments:
Post a Comment