లింగార్చన విశేషం - మహాభారతం
*చతుర్ణాం సన్నిధానేన యత్ఫలం తదశాశ్వతమ్।
ద్వయోస్తు సన్నిధానేన శాశ్వతం ప్రాప్యతే పదమ్॥
నాలుగు ఎక్కడ ఉంటాయో ఆ పూజ విగ్రహారాధన. రెండు ఎక్కడ ఉంటాయో అది లింగారాధన. నాలుగింటితో చేసే పూజ అశాశ్వతత్త్వాన్నిస్తుంది. రెండింటితో చేసే పూజ శాశ్వతత్త్వాన్నిస్తుంది.
అర్చించేవాడి జీవభావం – దానిని ఆత్మ అనవచ్చు, మనస్సు, ఇంద్రియాలు, లౌకిక విషయాలు – ఈ నాలుగూ ప్రవర్తిస్తూ పూజ చేసినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. దీనికి అశాశ్వత ఫలం లభిస్తుంది.
మనస్సు, ఆత్మ – నేను అనే భావం, అంతఃకరణం – ఆలోచిస్తే ఈ రెండూ లింగశరీరంలోనే ఉంటాయి. అభిమన్యుడు మరణించిన రాత్రి కృష్ణపరమాత్మ అర్జునుని తీసుకువెళ్ళేటప్పుడు లింగశరీరాన్ని తీసుకువెళ్ళాడు. బాహ్యమైన ఇంద్రియ, ఇంద్రియార్థ విషయాలు ఆలోచించకుండా పరమాత్మయందు లీనమై మనస్సును, ఆత్మను ఆయనయందు ఏకాగ్రపరచి చేసే పూజ, నిష్కామమైన ఆ పూజ లింగపూజ అవుతుంది*
సర్వరూపం భవం జ్ఞాత్వా లింగే యోఽర్చయతి ప్రభుం।
ఆత్మయోగాశ్చ తస్మిన్వై శాస్త్రయోగాశ్చ శాశ్వతాః॥౯౩॥
ఎవరైతే సర్వరూపం భవుడు అని తెలుసుకుని చేస్తారో – ఇదేమాటని ఆగమాలలో -లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోఽర్చయేత్ శివలింగకమ్। - లోకమంతా లింగస్వరూపమే అని తెలిసి ఎవరు శివపూజ చేస్తున్నాడో వాడు గొప్ప పూజకుడు అన్నారు. అందుకే అనంత ఆకాశమే లింగం, భూమి పీఠం అని ఒకమాట ఉన్నది. భూమి పీఠమైనప్పుడు ఆకాశం, భూమితో ఆగిపోయిందా? ఆకాశం భూమితో అంతం కాలేదు. నీకు అంతం భూమితోనే గనుక అక్కడివరకూ కొలత పెట్టుకుని చూస్తున్నావు. ఆకాశం సర్వత్రా వ్యాపించిపోయింది.
ఆమాటకొస్తే అన్నీ ఆకాశంలో లీనమై ఉన్నాయి. ఆకాశంతో పాటు అన్నీ ఎవరిలో లీనమయ్యాయో ఆ చిదాకాశ రూపమే మహాలింగము. ఇది తెలిసిన వాడు ఆత్మయోగము, శాస్త్రయోగం – రెండు యోగములూ పొందుతాడు. అంటే ఆత్మతత్త్వాన్ని పూర్తిగా తెలియడమే కాక శాస్త్రపరమార్థాన్ని తెలిసిన వాడు అవుతాడు. రుద్రభక్తి వల్ల ఇవి సాధ్యం అవుతాయి.
సర్వభూతభవం జ్ఞాత్వా లింగమర్చతి యః ప్రభోః।
తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజః॥౯౬॥
సర్వభూతములకూ ఇతడే మూలం అని తెలిసి ఎవడు లింగాన్ని ఆరాధన చేస్తాడో వాడు శివునికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతున్నాడు.
No comments:
Post a Comment