*🧘♂️శరీరము-ఆత్మ🧘♀️*
*“దేన్నయితే మనస్సు గ్రహించలేదో – అయినప్పటికీ, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో, దేన్నయితే కళ్ళు చూడలేవో – అయినప్పటికీ దేనిచేత కళ్ళు చూడగలుగు తున్నాయో,దేన్నయితే చెవులు వినలేవో – అయినప్పటికీ దేనిచేత చెవులు వినేశక్తి పొందగాలుగుతున్నాయో, దేన్నయితే ముక్కు వాసన చూడలేదో – అయినప్పటికీ దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో ,అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా వివరించారు.*
*అంటే మన శరీరం, మనస్సు మరియు బుద్ధి అన్నియు ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి (ఆత్మ) మాత్రమె శాశ్వతం, అదియే నీవు. ఈ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది. అప్పుడు శరీరంలోనివి ఏవి కూడ పనిచేయవు. మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు. ఆత్మ రాజయినప్పటికీ సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ అహంకారంతో ప్రవర్తించటం జరుగుతుంది. మనస్సనే మంత్రి రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు.*
*ఎప్పుడైతే మనిషి ఆత్మే నేను (అనే జ్ఞానాన్ని తెలుసుకొని) అంటే రాజే నేను అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకొని పనిచేసుకుంటూ వెళ్ళినపుడు మంత్రి ఏమి చెయ్యలేదు. జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన మనస్సు ఆత్మలో లయించవలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి నేనే ఆత్మను (రాజును) అని తెలుసుకుంటూ ముందుకు వేలతామో అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది.*
*ఆత్మ ఎక్కడ ఉన్నదని వెదుకులాడవలసిన పని లేదు.*
*ఉన్నదంతా ఆత్మే అని గ్రహించండి. ప్రశ్నల్లా, మనిషి దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది? అని ప్రశ్నించుకోవడంతో ఆత్మ విచారణ, ఆత్మానుభూతికై సాధన తీవ్రతరమౌతుంది. ఆత్మ నిత్యం, సత్యం, కాలాద్యవిచ్ఛిన్నం, అపరిమేయం, అది పరిణామానికి లోనుకాని శక్తి మూలం. ఆత్మ ఆకాశం వలె శూన్యం! గగనం వలె సంపూర్ణం. ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదు అని అర్థం. అంటే ప్రత్యేకంగా లేదని, ఉన్నదంతా అదేనని అసలు అర్థం. ప్రాణశక్తికి, ఇంద్రియ చలనాలకు కరచరణాది అవయవాల కదలికలకు, మెదలికలకు, సర్వకార్యకలాపాలకు మూలము ఆత్మే!*
*పంచభూతాలూ, ప్రాణం, ఆహారం, బుద్ధి వంటి సమస్త పదార్థమూ ఆత్మ నుండి పుట్టినవే! హృదయమనే ఖాళీ గుహ, మనిషి కుడి రొమ్మున ఉన్నది. అందులో నేను, నేను అంటూ నిస్వనంగా, నిరంతరంగా, అఖండంగా, వాఙ్మయంగా, జ్యోతిర్మయంగా ఆత్మ వెలుగుతూనే ఉన్నది. వెలుగులీనుతూనే ఉన్నది. కాలిగోటి నుండీ తల వెంట్రుక చివరి కొస వరకు ఆత్మే చైతన్యశక్తిగా శరీరాన్ని నడిపిస్తున్నది.*
*అంగాంగీభావంతో మనిషి తన దేహాన్ని శాశ్వత వస్తువుగా భావిస్తాడు. అవిద్య, అజ్ఞానం, అనాచారం, అస్పష్టత వంటి వ్యతిరిక్త శక్తుల వలన దేహం చుట్టూ తన ఆలోచనలను ఒక వలయంగా గూడు కట్టిస్తాడు. అందువల్లనే తాను ఆత్మనన్న భావన నుండి బహుదూరంగా వైదొలగుతుంటాడు. ఈ బహిరంగ వలయం నుండి మనిషి తన లోపలికి తాను తొంగి చూసుకోవడం ప్రారంభించడంతో ఆత్మానుభూతికి దారి దొరుకుతుంది. ధ్యానం ద్వారా ఆత్మానుభూతిని పొందినప్పుడు ఉనికి, అస్తిత్వం, అహం నశించి ఆత్మ ప్రకాశం అనుభవమౌతుంది.*
*ఈ స్థితిలో మరణ భయం నశించి అమరత్వ సిద్ధి కలుగుతుంది. తన శాశ్వతత్వం ఎరుకగా అనుభవంలోకి వచ్చినప్పుడు సదానందుడై పరమానందాన్ని తన సహజ స్థితిగా అనుభవిస్తూ అచలుడై శుద్ధాద్వైతంలో నిలకడ చెందుతాడు. మరణమంటే మార్పేనన్న భావన స్థిరమై మృత్యువును ఆహ్వానించడు! అలాగే కలకాలం ఉండాలని ఆశించడు!! ఇదొక అద్భుత స్థితి. ఇదే ఆత్మానుభూతి కలిగించే మహానంద స్థితి. -ఇప్పటిదాకా జరిగిన విచారణంతా ఆత్మవిద్యలో భాగమే!*
*ఆత్మానుభూతిని వేరెవ్వరూ కలిగించలేరు. ఎవరికి వారు తమ స్వీయ సాధన ద్వారా పొందాలి. అంతరంగ సాధన ద్వారా మనిషి తన జన్మను పారమార్థికంగా సార్థకం చేసుకోవాలి. జిజ్ఞాస ద్వారా సత్యాన్వేషణ కొనసాగించాలి. -ఆత్మ, ఆత్మ విచారణ, ఆత్మానుభూతి వంటి ఉదాత్త విషయాలను ఏకాగ్రచిత్తంతో, స్వానుభవంతో అర్థం చేసుకోవాలి. అనుభవించాలి..*
*-పిప్పలాద మహర్షి తనను సమీపించి ప్రశ్నించిన జిజ్ఞాసువులకు ఆత్మవిద్యా వర దానం చేసి, మంగళా శాసనం చేశాడు!*
*-జిజ్ఞాసువులందరూ సభక్తికంగా, పరమ ఋషి సత్తముడికి ప్రణామ సహస్రం సమర్పించి, సంపూర్ణ సమాధానాలను పొంది, ఆత్మనిష్ఠులైనారు! -ఒక మహర్షి, కొందరు జిజ్ఞాసువుల మధ్య సాగిన ప్రశ్నోత్తర సమాధానమే, ప్రశ్నోపనిషత్‌గా మనుష్య జాతికి లభించింది.*
🕉🌞🌎🌙🌟🚩
*లోకంలో వివేచన, విచక్షణ కలగలసిన ప్రత్యేక ప్రాణి మనిషి. హృదయస్పందనలతో, మేధస్సు నిండిన మస్తిష్కంతో ప్రాణికోటిలో శ్రేష్ఠుడై వెలుగొందుతున్నాడు. 'శుభకరమైనదీ, సుఖకరమైనదీ' అనే రెండు మార్గాలు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖం కంటే శ్రేయస్సే మేలని ఎన్నుకొంటాడు. కానీ బుద్ధి హీనుడు లోభాసక్తితో సుఖాన్నే కోరుకుంటాడు.
విజ్ఞతకు సంబంధించిన సున్నితమైన ఆలోచన మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది.*
*ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాలపట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమా ర్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటు. మాలిన్యం నుండి మనసు ప్రక్షాళన మయితే సత్య గ్రహణం సంభవం అని నిరూపించిన నచికేతుని వృత్తాంతమే కఠోపనిషత్తు రూపంలో భాసిల్లుతుంది.*
*శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తిధీర:|*
*శ్రేయోహి ధీరోభి ప్రేయసోవృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే||'*
*విశ్వజిత్ యాగం చేసిన వాజస్రవసుడనే ఋషి కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు తన సంపద నంతా దానం చేస్తున్నాడని తెలుసుకున్న నచికేతుడు శ్రద్ధతో తండ్రిని గమనించసాగాడు. శక్తినశించి కృంగికృశించిన ఆవులను దక్షిణలుగా దానం చేయడం వల్ల నా తండ్రికి దుర్గతి కలుగుతుందనీ వేదనతో తండ్రీ! నీ సంపదలో నేను భాగస్థుడినే కదా! మరి నన్నెవరికిస్తావు? అని ప్రశ్నించగా స్పందించని తండ్రిని మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడుగుతాడు నచికేతుడు. వాజస్రవసుడు చిరాకులో నచికేతా! నిన్ను యమునికిస్తాను' అంటాడు.*
*కాలగతిలో ఎలాగూ నశించిపోయే క్షణికమైన జీవితం కోసం సత్యపాలన వదులుకోరాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మహాత్ములు సత్య నిష్ఠను కాపాడుకున్నారు. కనుక తండ్రీ నేను యమలోకానికి వెళ్లడానికి అనుమతినివ్వు' అని వేడుకుంటాడు నచికేతుడు. వాజస్రవసుని ఆశీస్సులతో యమపురికి చేరిన నచికేతునికి యమధర్మరాజు ఇంటలేడనే విషయం తెలిసి మూడు రోజులవరకూ నిరాహారుడై యమునికై వేచి ఉంటాడు.*
*నచికేతుడు యమపట్టణ ద్వారం దగ్గర మూడు రోజులుగా నిరాహారుడై ఉన్నాడన్న విషయం తెలుసుకున్న యముడు అతనికి మూడు వరాలను ప్రాయశ్చిత్తంగా అను గ్రహిస్తాడు. ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించి తగిన సత్కారం చేయాలి. అతిథిని నిర్లక్ష్యం చేసే గృహస్థుని ఆశలూ, ఆం క్షలూ, సత్ఫలి తాలూ, పుణ్య కర్మలూ అన్నీ నశిస్తాయి. అందుకే నచికేతుని సంతృప్తి పరచడానికి మూడు వరాలను అనుగ్రహిస్తాడు యముడు.*
*యమధర్మరాజును ధైర్యంగా నచికేతుడు అడిగిన మూడవ వరం కఠోపనిషత్తుకే తలమానికమై జీవితరహస్యాన్ని ఆవిష్క రిస్తుంది. 'మరణానంతరం ఆత్మ ఉంటుందా?' అని నచికేతుడు అడి గిన సందేహం సృష్టి అంతరార్థాన్ని సూచిస్తుంది. మృత్యుదేవతే యమ ధర్మ రాజు. మరణాంతర గతులను నిర్ణ యించే సమవర్తీ యముడే. కనుక మరణం తర్వాత మానవుని స్థితి గురించి చెప్పగలిగే శ్రేష్ఠులెవరు? యమధర్మరాజు తప్ప. సత్యమే అయినా అసా ధ్యమనిపించే నచి కేతుని కథా రూపం సంగతి కాసేపు పక్కన పెడితే...*
*జీవితరహస్యం మరణం లోనే ఉంది. నిష్ఫాక్షికంగా విచారిస్తే ఆత్మచైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధాన్యం నాటువేయడం, కోతలో రాలిపోవడం తిరిగి అదే బీజంగా మారి మొలకెత్తడం ప్రకృతిలో సహజం. మనిషి కూడా జనన మరణ చక్రాన్ని అనుస రిస్తాడు. మనిషి జన్మ మృత్యువును సూచిస్తుంది. మృత్యువే మనిషి పునర్జన్మను సూచిస్తుంది. అందుకే అనవసరంగా శోకించే పనిలేదు. అలాగని మితిమీరిన ఆనందమే సుఖమని భావించ క్కర్లేదు.*
*జంతువుల కంటే మనిషి ఆయుష్షు ఎక్కువ కావచ్చు. మనుషుల కంటే దేవతలు వందల సంవత్సరాలు అధి కంగా జీవించవచ్చు. కల్పాంతమైన బ్రహ్మదేవుని ఆయు: పరిమితి అందరికంటే దీర్ఘమై కొనసాగ వచ్చు.*
*కానీ ఆది అంతం లేని కాలంలో బ్రహ్మ జీవితమైనా ఎంతటి వైభవంతో అలరారు తున్నా జీవితం క్షణికమే, అంటూ జీవిత రహస్యాన్ని విశ్లేషిస్తూ కఠోపనిషత్తు 'ఆత్మ' చైతన్యదిశగా అడుగులు వేయ మంటుంది. కుటిలచిత్తం లేని, జననాది వికారాలు లేని పరబ్రహ్మానికి తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమే పట్టణం. హృదయ ధామంలో విరాజిల్లే పరమాత్మను రాగద్వేషాలు లేక తలచేవాడు జనన మరణరూప సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మ నిత్యనిజరూపమే మానవునిలోని జీవాత్మ. హేతువాదానికి అందనిదీ, నిగూ ఢమైనదీ ఆత్మ.*
*ఏకరూపమైన అగ్ని ప్రపంచంలో ప్రవేశించి అది మండించే పదార్థాన్ని పోలిన రూపాన్నే ధరించినట్లు, అన్ని జీవులలోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాలనే ధరించి కనబడుతుంది. వారిని మించి కూడా విశ్వవ్యాప్తమై అలలారుతుంది. జగన్నియామకుని సకల జీవుల అంతరాత్మగా, సకల ప్రాణుల జీవాత్మలే పరమాత్మగా అనుసంధానం చేయబడే రహస్య తత్త్వమే శాశ్వతం. వస్తు ప్రపంచం ఎప్పుడూ అనిత్యమే.*
*''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు|*
*బుద్ధింతు సారధిం విద్ధి మన: ప్రగ్రహమేవచ||''*
*శరీరమనే రథాన్ని నడిపే యజమాని ఆత్మ, బుద్ధే సారధి, మనస్సే కళ్లెం అని గ్రహించి జీవిస్తే ఇంద్రియాలనే గుర్రాలనూ, ఇంద్రియ విషయాలు అవి పరుగుతీసే మార్గాలనూ ఉంచుకొని నిజమైన జీవితానందాన్నీ, మోక్ష పదాన్నీ చేరుకోగలం. శరీరం, ఇంద్రియాలు, మనస్సులతో కూడిన ఆత్మయే చైతన్యం, శాశ్వతం అంటుంది కఠోపనిషత్తు. జనన మరణాలు లేక, మనుష్యాది రూపాలే శాశ్వతం కాక, జన్మ-వృద్ధి-పరిణతి-అపక్షయ-వ్యాధి-నాశాలనే వికారాలు.*
*పొందక శాశ్వతమై విశ్వంలో అలరారే ఆత్మ అత్యున్నతమైంది. అపూర్వమైంది.*
*మనోనిగ్రహం లేని మనిషి ఆత్మతత్త్వం తెలుసుకోలేక సంసార బంధంలో పదే పదే చిక్కుకుంటున్నాడు.*
*జ్ఞానంతో, మనోనిగ్రహంతో పరిశుద్ధుడైన మనిషి పుట్టుకను తిరిగి పొందక పరమపదాన్ని చేరుకోగలడు. ఇంద్రియాల కంటే శ్రేష్ఠమైనది మనస్సు. మనస్సుకంటే శ్రేష్ఠ తరం బుద్ధి. బుద్ధికంటే శ్రేష్ఠం ఆత్మ. మహత్తు కంటే అవ్యక్తం పరం. అవ్యక్తం కంటే మనిషి శ్రేష్ఠతరం.*
*పురుషుని కంటే పరమాత్మ శ్రేష్ఠతరం, సర్వావ సానం. కనుక ఆత్మచైతన్యమే ఆలంబనగా జీవితాన్ని స్వీకరించి, అనుభవించి పరమ పదంలో లీనం చేయగల మార్గమే మానవ జీవిత పార మార్థిక నిధి తత్త్వం. రహస్యం.*.
No comments:
Post a Comment