*నువ్వు పెద్ద బానిసవు.. ఇది తెలుసుకోకపోతే జీవితం మొత్తం ఇంతే.. చెంప మీద చెళ్లుమనిపించే మాటలు* - నల్లమోతు శ్రీధర్
ఓ స్మార్ట్ ఫోన్ Zombie,
నీ చేతిలో ఒక బాంబు ఉంది. అది టిక్-టాక్ అంటోంది. కానీ నువ్వు దాన్ని ఆనందంగా ముద్దుపెట్టుకుంటున్నావ్.
పొద్దున్న లేవగానే దాన్ని దర్శించుకుంటున్నావ్. రాత్రి పడుకునే ముందు దానికి గుడ్ నైట్ చెప్పి పడుకుంటున్నావ్. నీ భార్య/భర్త, పిల్లల కంటే, నీ లక్ష్యం కంటే, ఆ ఐదు అంగుళాల స్క్రీన్ నీకు ఎక్కువైపోయింది.
నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఆ స్క్రీన్ ని వాడుకోవడం లేదు... ఆ స్క్రీన్ నిన్ను వాడుకుంటోంది.
సోషల్ మీడియా కంపెనీల మీటింగ్ రూమ్ లో, నీ టైమ్ ని ఎలా దొంగిలించాలి, నీ అటెన్షన్ ని ఎలా అమ్మేసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది. నువ్వు ఓడిపోయావ్.
నీకు తెలియకుండానే నువ్వు ఒక "డిజిటల్ బానిస"గా మారిపోయావ్.
నీ జీవితం మొత్తం Watching లోనే అయిపోతోంది.
వేరే వాడు జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తూ వీడియో పెడతాడు... నువ్వు సోఫాలో పడుకుని, బొజ్జ పెంచుకుంటూ దాన్ని చూసి లైక్ కొడతావ్.
వేరే వాడు ప్రపంచం చుట్టేస్తూ వీడియో పెడతాడు... నువ్వు నాలుగు గోడల మధ్య కూర్చుని దాన్ని చూసి "వావ్" అంటావ్.
వేరే వాడు వంట చేసి చూపిస్తాడు... నువ్వు ఆకలితో దాన్ని చూస్తూ ఉండిపోతావ్.
సిగ్గుగా లేదా?
వాళ్ళు బ్రతుకుతున్నారు... నువ్వు వాళ్ళు బ్రతకడాన్ని చూస్తున్నావ్.
వాళ్ళు Players... నువ్వు కేవలం ప్రేక్షుకుడివి.
గ్రౌండ్ లో ఆడేవాడికి చెమట వస్తుంది, పేరు వస్తుంది. గ్యాలరీలో కూర్చుని చూసేవాడికి, పొట్ట వస్తుంది, టైమ్ వేస్ట్.
నీ జీవితం అనే గ్రౌండ్ లో నువ్వు ఎప్పుడు బ్యాట్ పడతావ్? ఎప్పుడు ఆడతావ్?
ఇంకెన్నాళ్లు పక్కోడి సక్సెస్ స్టోరీలను స్క్రోల్ చేస్తూ, నీ సక్సెస్ స్టోరీని చెత్తబుట్టలో పడేస్తావ్?
నువ్వు గంటలు గంటలు రీల్స్ చూస్తూ గడిపే ఆ సమయం విలువ ఎంతో తెలుసా?
ఆ సమయంలో నువ్వు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు. మేము నిర్వహిస్తున్న పవర్ఫుల్ ఉమెన్ వంటి సెషన్స్ ద్వారా మీ కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. నీ కుటుంబంతో గడపవచ్చు.
కానీ నువ్వు ఆ అమూల్యమైన సమయాన్ని "మార్క్ జుకర్ బర్గ్" జేబులో ఉచితంగా పోస్తున్నావ్. వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు, నువ్వు దరిద్రుడివి అవుతున్నావ్. మానసికంగా! ఏమి నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించవు.. జీవితాన్ని మార్చుకోవటం మీద శ్రద్ధ పెట్టవు.
మత్తు మందు తీసుకునేవాడిని చూసి మనం అసహ్యించుకుంటాం. కానీ నువ్వు చేసేది కూడా అదే.
నీ మెదడుకి "డోపమైన్" అనే మత్తు కావాలి.
కష్టపడి పని చేసి సాధించినప్పుడు వచ్చే ఆనందం "హై క్వాలిటీ డోపమైన్". ఉదాహరణకి: ఒక కొండ ఎక్కడం, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడం. కానీ దానికి కష్టపడాలి. నీ బద్ధకానికి కష్టం ఇష్టం లేదు.
అందుకే "చౌకబారు డోపమైన్" వైపు వెళ్తున్నావ్.
ఒక రీల్ చూడగానే మెదడుకి చిన్న కిక్ వస్తుంది.
ఒక నోటిఫికేషన్ రాగానే చిన్న ఆనందం.
ఎవరో లైక్ కొట్టగానే చిన్న తృప్తి.
ఇది ఎంత ప్రమాదకరం అంటే... దీనికి అలవాటు పడిన నీ మెదడు, ఇక కష్టమైన పనులు చేయలేదు.
పుస్తకం చదవడం బోర్ కొడుతుంది.
పని చేయడం చిరాకుగా అనిపిస్తుంది.
ఎందుకంటే వాటిలో తక్షణ ఆనందం లేదు.
నువ్వు ఒక డ్రగ్ అడిక్ట్ లా మారావ్. నీ డ్రగ్ పేరు "స్క్రోలింగ్". నీ బొటనవేలు నిన్ను శాసిస్తోంది.
ఫోకస్ లేని బ్రతుకు... చిల్లు పడ్డ కుండ లాంటిది.
ఈ రోజుల్లో "ఫోకస్" అనేది వజ్రం కంటే విలువైనది.
నువ్వు ఏ పనీ 5 నిమిషాలు ఏకాగ్రతతో చేయలేవు. మధ్యలో ఫోన్ చూడాలి. మెసేజ్ చెక్ చేయాలి.
నీ ఏకాగ్రత చిిన్నాభిన్నం అయిపోయింది.
చిల్లు పడ్డ కుండలో నీళ్లు పోస్తే నిలుస్తాయా? నిలవవు.
అలాగే ఫోకస్ లేని మైండ్ లో జ్ఞానం నిలవదు. సక్సెస్ రాదు.
గొప్ప గొప్ప ఆవిష్కరణలు డీప్ వర్క్ నుంచి వచ్చాయి. గంటల తరబడి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి పని చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి.
నువ్వు ప్రతి రెండు నిమిషాలకు "టింగ్" అనే శబ్దానికి కుక్కపిల్లలా తల తిప్పితే... నువ్వు గ్రేట్ వర్క్ ఎప్పుడు చేస్తావ్?
నీ బ్రెయిన్ కెపాసిటీని నువ్వే చంపేసుకుంటున్నావ్. "మల్టీ టాస్కింగ్" అని దానికి పేరు పెట్టి కవర్ చేసుకుంటున్నావ్. అది మల్టీ టాస్కింగ్ కాదు... "మల్టీ డిస్ట్రాక్షన్".
నీ ఒంటరితనాన్ని చంపేస్తున్నావ్
మనిషికి ఒంటరితనం చాలా ముఖ్యం.
ఖాళీగా ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడే కొత్త ఐడియాలు వస్తాయి. క్రియేటివిటీ పుడుతుంది.
కానీ ఇప్పుడు నీకు బోర్ కొట్టే ఛాన్స్ లేదు.
లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నావా? ఫోన్ తీస్తావ్.
బాత్రూమ్ కి వెళ్ళావా? ఫోన్ తీస్తావ్.
ట్రాఫిక్ లో ఆగావా? ఫోన్ తీస్తావ్.
నీ మెదడుకి ఆలోచించే గ్యాప్ ఇవ్వట్లేదు. ఖాళీ దొరికితే చాలు చెత్త నింపుతున్నావ్.
నీ మైండ్ ఒక డంపింగ్ యార్డ్ లా మారిపోయింది. ప్రపంచంలో ఉన్న చెత్తంతా నీ తలకాయలో ఉంది.
ఇక నీ సొంత ఆలోచనలకు అక్కడ స్పేస్ ఎక్కడిది?
నువ్వు ఆలోచించడం మానేసావ్. ఇతరుల ఆలోచనలను కాపీ కొడుతున్నావ్.
నీ ఒరిజినాలిటీ చచ్చిపోయింది.
నీ సోషల్ మీడియా ఫీడ్ ని ఒకసారి చూడు.
అందులో నీకు ఉపయోగపడేది ఎంత? నీ టైమ్ ని నాశనం చేసేది ఎంత?
నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావ్?
సినిమా స్టార్లనా? ఇన్ఫ్లుయెన్సర్లనా? గాసిప్ రాయుళ్ళనా?
వాళ్ళ వల్ల నీ జీవితంలో ఒక్క రూపాయి లాభం ఉందా?
నీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నవాళ్లలో... ఆపద వస్తే ఆదుకునే వాళ్ళు ఎంతమంది?
కేవలం నీ ఫోటోకి "సూపర్" అని కామెంట్ పెట్టే బ్యాచ్ మాత్రమే కదా?
ఆ చెత్తని ఏరి పారేయ్.
నీ డిజిటల్ స్పేస్ ని క్లీన్ చేసుకో.
నిన్ను ఎడ్యుకేట్ చేసేవాళ్ళని, నిన్ను మోటివేట్ చేసేవాళ్ళని మాత్రమే ఫాలో అవ్వాలి.
మిగతాదంతా కలుపు మొక్కలే. పీకి పారేయ్.
విసిరి కొట్టు... లేదా విసిగి చచ్చిపో
సోదరా! పరిస్థితి చెయ్యి దాటిపోతోంది.
నీ కళ్ళు, నీ మెడ, నీ వెన్నెముక, నీ మెదడు... అన్నీ ఆ చిన్న పరికరానికి బలైపోతున్నాయి.
ఇది టెక్నాలజీని వాడొద్దు అని చెప్పడం కాదు. టెక్నాలజీకి బానిస అవ్వద్దు అని హెచ్చరించడం.
ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్ తీసుకో.
రోజుకి కొన్ని గంటలు ఫోన్ ని "ఎయిర్ ప్లేన్ మోడ్" లో పెట్టు.
అప్పుడు నీకు అనిపిస్తుంది... ప్రపంచం ఎంత నిశ్శబ్దంగా, ఎంత అందంగా ఉందో.
మనుషుల కళ్ళలోకి చూసి మాట్లాడు.
ప్రకృతిని చూడు.
ఒక పుస్తకం చదువు. ఒక మంచి సెషన్ అటెండ్ అవ్వు..
నీ గురించి నువ్వు ఆలోచించుకో.
నీ జీవితం అనేది 15 సెకన్ల రీల్ కాదు. అది ఒక పెద్ద saga.
దాన్ని స్కిప్ చేయకు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకు.
ప్రతి క్షణాన్ని ఆస్వాదించు.
ఆ ఫోన్ పక్కన పడేయ్.
లే! బయటకి రా!
ప్రపంచం చాలా పెద్దది. ఆ 5 అంగుళాల స్క్రీన్ కంటే కోటి రెట్లు అందమైనది.
నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకో.
ఇప్పుడే... ఈ క్షణమే... లాగ్ అవుట్ చెయ్యి!
రియల్ లైఫ్ లోకి లాగిన్ అవ్వవు!
Disconnect to Reconnect.
ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి, కనీసం 10 నిమిషాలు ఖాళీగా కూర్చోగలవా? దమ్ముందా?
నల్లమోతు శ్రీధర్.
No comments:
Post a Comment