**పరమేశ్వర తత్త్వం* -
*సత్యం, శివమ్, సుందరం.**
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ. కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః అని యజుర్వేద అంతర్గతమైన శ్రీరుద్రం
ఆ పరమేశ్వరుని కీర్తిస్తుంది.
పరమేశ్వరుడు సత్య సంకల్పుడు. మనం ఒక పని చెయ్యాలంటే ఎలా ఒక ప్రణాళిక (ప్లాన్) వేసుకుంటామో, అదే విధంగా ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ఆయనకే సృష్టించిన జీవులకు కర్మ సంతతిని త్రివిధాలుగా ఏర్పరిచాడు. పలు జన్మలలో చేసిన కర్మల వల్ల అనుభవించవలసిన ఫలాలను "సంచిత" మని, ప్రస్తుత జన్మలో అనుభవించవలసిన ఫలాలను "ప్రారబ్ధ" మని, రాబోయే జన్మలో అనుభవించాల్సిన ఫలాలను "ఆగామి" అని అంటారు. మన ప్రారబ్ధ కర్మలు ముగిసిపోగానే మృత్యువు జీవుల ప్రాణాలను హరించివేస్తుంది.
ఈశ్వర తత్వాన్ని శ్రీమద్ భాగవతంలో సప్తమ స్కందంలోని సప్తమ అధ్యాయంలో ప్రహ్లాదుడు చాలా చక్కగా వివరించాడు. పరమేశ్వరుడు (పరమాత్మ) జీవుడు (జీవాత్మ) ఒకరే. సూర్యుడు అనేక నీటి పాత్రల్లో అనేకంగా ఎలా కన్పిస్తాడో అలానే పరమాత్మ ఆత్మ స్వరూపంలో అన్ని జీవుల్లో చైతన్య రూపంలో ఉంటాడు. అందుకే ఆత్మ నాశనం లేనిది పంచ భూతాలు దాన్ని ఏమి చెయ్య లేవు అని పరమాత్మ భగవద్గీత లో చెప్పాడు. అందుకే మనం ఆ పరమేశ్వరుని మన అంతరాత్మలో దర్శించాలని ఋషులు చెప్పారు.
పాప-పుణ్య భీతితో ఈశ్వరుని ఉపాసిస్తారో, వారికి ఈ జన్మలోనే కర్మసంచయాన్ని ఆగామితో సహా, పటాపంచలు చేసే శక్తిని అయన అనుగ్రహిస్తాడు. తద్వారా జీవులకు మృత్యువుని మళ్ళీ మళ్ళీ ఎదుర్కునే కష్టం లేకుండా చూస్తాడు. తనను ఆశ్రయించిన వారిని మృత్యువును నివారించే వాడు కాబట్టి ఈశ్వరునకు "మృత్యుంజయుడు" అనే పేరు సార్ధకం అయ్యింది.
"మృత్యుః యస్యోపసేచనం" అని శ్రుతులు పేర్కొంటున్నాయి. అంటే మృత్యువు ఈశ్వరునకు ఊరగాయ వంటిది అని అర్ధం. మృత్యువుని జయించాలనుకునే వాడు "రక్షాపేక్షమపేక్షతే" అంటూ ఈశ్వరుని శరణుజొచ్చాలని ఋగ్వేదం పేర్కొంటుంది. ఈశ్వరునికి అయిదు కళలని శ్రుతులు చెపుతున్నాయి. అవి ఆనందం, విజ్ఞానం, మనస్సు, ప్రాణం, వాక్కు. ఇందులో ఆనందమయరూపం శివుడు. విజ్ఞాన రూపుడు దక్షిణామూర్తి, మనః రూపుడు (మనస్సు కోరికలకు ప్రధాన నిలయం. కోరికను సంస్కృతం లో కామము అని అంటారు) కామేశ్వరుడు. ఋగ్వేదం లో కామేశ్వర స్వరూపం ఇలా వర్ణించబడింది.
శ్లో కామ:స్తదగే సమావర్తతాధీ మనసోరేతః ప్రథమః యదాసీత్ సబంధు మసతి నిరవిందన్ హృది ప్రతీస్యా కవయో మనీషా
మనో ధర్మమైన కామము, అనురాగములు రక్తవర్ణం గలవి కావున ఈ కామేశ్వరుడు ఎర్రని రంగు కలవాడు. ప్రాణకళారూపధరుడు కనుక అయన పశుపతి రూపుడు, వాక్కు నకు భూతేశుడు ఆధారకర్త.
పరమేశ్వరుడు ఋషి, దేవ, పితృ స్వరూపాల్లో నర్తించడంవల్ల కూడా అయన త్రినేత్రుడు అయ్యాడు. అయన గుణత్రయాల (సత్వ, రజో, తామస గుణాలు) కు, అతీతుడు, అధీశుడు కనుక ఆయన త్రినేత్రుడు అయ్యాడు అని బృహదారణ్యకోపనిషత్ చెబుతోంది. కానీ అక్షరోపాసన ప్రకారం శివుడు ఇంద్ర, అగ్ని, సామ తత్వముల సమన్వయ మూర్తి. అందుకే శ్రుతులు "వందే వహ్ని శశాంక సూర్యనయనం" అంటూ ఈశ్వరుడిని స్తుతిస్తున్నాయి. దీని ప్రకారం అయన అగ్నిని ధరించినవాడు కాబట్టి అయన త్రినేత్రుడు అయ్యాడు (సూర్య, చంద్ర, అగ్ని నేత్రాలు). అయన విశ్వము లోని ప్రతి ప్రాణి లో ఈశించి (వ్యాపించి) ఉండేవాడు కనుక ఈశ్వరుడు అయ్యాడు. అండములను సృష్టించేవాడుగా అయన అనంతుడైనాడు. తమిళ పురాణ వాఙ్మయం లో ఈయనను అండవా, అండవార్ అనే నామాలతో పిలుస్తారు.
శివుని మూడవ నేత్రం అగ్ని అని కదా. ఈ నేత్రానికి పైన వున్న భాగాన్ని "సోమ" మండలం అని అంటారు. ఈ మండలంలో సోమమునకు 'అప్' మరియు 'వాయువు' అనే రెండు ఉపవస్థలు ఉన్నాయి. వీటిలో సోమము చంద్రుడు, అప్ శబ్దానికి జలము అని కదా అర్ధం. ఈ అప్ రూపమే 'గంగ'. ఇక వాయురూపం శివుని జటాజూట మండలం. వాయువుని జటలుగా ధరించినవాడు గాన జటాధారిగా పిలవబడ్డాడు. వ్యోమము అనగా ఆకాశం. ఆకాశాన్ని జటామండలంగా ధరించినవాడు కనుక అయన వ్యోమ కేశుడు అనే అలంకార నామం కలవాడు.
అయన దుష్ట శిక్షణార్ధం త్రిశులాన్ని, శిష్ట రక్షణార్థం మృగాన్ని (లేడి, లేక జింక) ధరించడంలో సైతం ఒక విలక్షణం కనిపిస్తుంది. త్రిశులాన్ని కేవలం దుష్ట శిక్షణకే కాకుండా కాలం చెల్లినవారి ప్రాణాలను హరించేదిగా కూడా వర్ణింప బడింది శతపధ బ్రాహ్మణంలో. అదే శతపధ బ్రాహ్మణంలో మృగాన్ని యజ్ఞస్వరూపంగా చూపబడింది. తైత్తిరీయంలో మృగానికి ఇంకొక వివరణ ఇవ్వబడింది. అగ్నిదేవుడు వేదరక్షకుడు. ఒకప్పుడు అగ్నిదేవుడు ఋషుల యజ్ఞాల కారణంగా అజీర్ణ బాధతో వనస్పతులలో దాక్కున్నాడు. సంస్కృతంలో వెదక దాన్ని మృగ్యత్వాత్ లేక మృగ: అంటారు. అలా ఋషుల చేత వెదక బడ్డాడు కనుక అగ్నిదేవుడు మృగం అయ్యాడు. వేదరక్షణాభారాన్ని స్వీకరించిన సూచనగా పరమేశ్వరుడు మృగాన్ని చేత ధరించాడు. ఈ రెండు ధరించడం చేత అయన 'ద్వందీశుడు' అన్నాయి శ్రుతులు.
ఇక పులిచర్మ ధారణలో అర్ధం పాపులను సంహరించడం. ఏనుగు చర్మ ధారణలో అర్ధం సంపదలను అనుగ్రహించడం. మెడలో ఉన్న రుండ (కపాల) మాల వైరాగ్యానికి సూచిక. నాగయజ్ఞోపవీత ధారణ అంతర్యం జ్యోతిర్మండలం తనకు పేనిన తాడు వంటిదని, గ్రహాలను ఆడించగల గొప్ప ఆటగాడని అర్ధం. ఈ కారణం చేతనే అయన జ్యోతిర్ శాస్త్రానికే పితామహుడయ్యాడు. వాసుకిని గరుడుడు నుంచి రక్షించి మెడలో వేసుకున్నందుకు అయన నాగాభరణుడు అయ్యాడు. కాదు కాదు, నాగ శబ్దం కాలానికి సూచిక. ఆ కాలం అయన ఆధీనంలోనే ఉంది అనడానికి అయన నాగాభరణుడు. సూర్యుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. పరమశివుని ఆధారంగా చేసుకునే గ్రహపరిభ్రమణలు కలుగుతున్నాయి అని చెప్పడమే సర్పభూషణం లోని రహస్యం.
ఇంత గొప్ప తత్త్వం ఆ పరంబ్రహ్మం అయిన పరమేశ్వర తత్త్వం లో నిగూఢంగా దాగి ఉంది. అయన చరణాలు పట్టుకుంటే అన్నీ సాధ్యమే. మౌనంగానే అయన దక్షిణామూర్తి రూపంలో మనకి మార్గ దర్శనం చేస్తాడు. అందుకే అంతా శివమయం, ఈశ్వరమయం.
ఓం నమః శివాయ 🙏. R A V I C H A N D R J A V I B H A V N I:
No comments:
Post a Comment