Saturday, February 28, 2026

స్వాధిష్టాన చక్రం అనుభవాలు - 1 మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం

 స్వాధిష్టాన చక్రం అనుభవాలు - 1 

మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం


అనుభవం - అనుభూతి : శ్రీ పవనానంద సరస్వతి


...ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.



అలాగే ఈ చక్రానుభవాలు, ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్ర దైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈ చక్రానుభవముతో పాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్ర దైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఉంటాయి. ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకి సంబంధించి అనుభవాలు, సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.


జూన్ 1: ఈరోజు నాకెందుకో విపరీతంగా ధనమును సంపాదించాలనే కోరిక మొదలైంది. ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.


జూన్ 12: ఈరోజు నాకు ధ్యానము కన్నా, ధనము మీద ఆలోచనలు ఎక్కువైనాయి.

జూన్ 15: ఈరోజు నాకు ఒక అంగుళం ఉన్న పంచలోహ మహాలక్ష్మి విగ్రహమూర్తి వచ్చింది. నన్ను కోటీశ్వరుడిని చేయటానికి కాబోలు !

జూన్ 18: ఈరోజు నాకు ధ్యానములో కొల్హాపూర్ మహాలక్ష్మి విగ్రహమూర్తి కనపడినది. చాలా సజీవ కళామూర్తిగా ఉంది.

జూన్ 25: ఈరోజు నాకు ధ్యానం చేయాలని అనిపించలేదు.ధన సంబంధ ఆలోచనలు ఎక్కువైనాయి.

జూన్ 26: నేను ఈరోజు ధ్యానములో ధనమును గూర్చిన ఆలోచనలు చేసినాను. ధ్యానమా ? ధనమా ? లేదా ధనమా ? ధ్యానమా ?  అర్థం కావడం లేదు.

జూన్ 30: ఈరోజు నాకు అమెరికా డాలర్ వచ్చినది. దీని వెనుక వైపు చింతామణి శిల బొమ్మ ఉంది. దానికి త్రినేత్రం ఉంది. నాకున్న ధన చింత తీర్చడానికి ఇది వచ్చిందా ఏమో చూడాలి.

జూలై 5: ఈరోజు ధన వ్యామోహం ఆలోచనలు ఎక్కువైనాయి. ధ్యానము కుదరటంలేదు. కారణం తెలియడంలేదు.

జూలై 6: ఈరోజు నాకు ఉద్యోగం పోయినది.క్రొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. ఆర్ధిక సమస్యలు ప్రారంభమవుతున్నాయా? 

మార్చి 27: ఈ రోజు నా పుట్టిన రోజు. జరుపుకోవడానికి నా దగ్గర ధనము లేదు.

జూలై 10: ఈరోజు నేను విపరీతంగా  కోపంతో, బాధతో ఆవేశంగా 6 గంటలపాటు ధ్యానం చేశాను. ఎందుకంటే నేను అన్నం తిని మూడు రోజులైంది. నేను పస్తులుంటాను. ఏ పాపం చేసిందని నా భార్య పస్తులు ఉండాలి ?

జూలై 20: మా గురు దేవుని కలిసి నా కష్టాలు చెప్పినాను. దానికి ఆయన “మంచిది. అదృష్టవంతుడివి. నీ సాధన స్వాధిష్ఠాన చక్రానికి చేరుకుంది. నీకు విపరీతమైన ధనకాంక్ష ధన లేమి సమస్యలకు సంకేతం స్వాధిష్ఠాన చక్ర దేవత అయిన మహాలక్ష్మి మహామాయలే అని గ్రహించు. ఇవి ఎక్కడి దాకా తీసుకొని వెళతాయో చూడు ! అప్పటి దాకా సహనంగా ఓర్పుగా వుండు. ధన ఆశలో అసలు పడకు. ఇదంతా ధన మాయ, లీల అని గ్రహించు. ధ్యానము వీడకు” అని చెప్పినారు. ఆకలితో ధ్యానం ఎలా చేయాలో నాకైతే అర్థం కాలేదు !

ఆగస్టు 10: నా దగ్గర ఉన్న ధనం అయిపోతోంది. వ్యాపారాలు కలిసి రావటం లేదు. ఉద్యోగము లేదు. డబ్బు వచ్చే మార్గాలు లేవు. ధ్యానం మ్రొక్కుబడిగా చేస్తున్నాను. ఈ రోజు మా నాన్న నుండి తను పూజించే వెండితో చేసిన లక్ష్మీదేవి విగ్రహం వచ్చినది.

అక్టోబర్ 15: ఈరోజు నా తమ్ముడికి అసలు విషయం చెప్పేశాను. వాడు అది తెలుసుకుని వాడి ఇంటికి వెళ్లిపోయాడు. వెళుతూ 250/- ఇచ్చినాడు. ఇవే రాబోవు రోజులలో నాకు ఉపయోగపడాలి. నా దగ్గర ఉన్న డబ్బు ఇదే.


అక్టోబర్ 20: ఈరోజు నా దగ్గర ఉన్న 250/- కూడా అన్నయ్య దగ్గరికి వెళుతుంటే బస్సు లో దొంగతనం చేసినారు. వాడు దొంగతనం చేస్తున్నాడు అని తెలిసినా కూడా అరవలేకపోయాను. ఎందుకో తెలియదు. అన్నయ్య దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుదామని అడిగే లోపల వాడి టీవీలో త్యాగయ్య సినిమా వస్తోంది. అందులో ఈ రోజు ఎలాంటి బిక్ష కూడా దొరకలేదని తులసి తీర్థమే రామయ్య తండ్రికి మహా నైవేద్యం గా పెడదామని భార్యతో త్యాగయ్య అంటుంటే నా మనసు విలవిలలాడింది. అన్నయ్య ని డబ్బులు అడగాలని అనిపించలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు అడిగితే లక్షలు ఇస్తారు. మరి వాళ్ళకి ఎలా తిరిగి ఇవ్వాలి అనే సందేహం వచ్చింది. వెనుతిరిగి బస్టాండ్ కి వచ్చాను. ఇంతలో నా స్నేహితుని తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఏదో వాడి జాతక సమస్యను అడిగినాడు. వాడి దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని జాతక పరిష్కారం చెప్పినాను. కారణం బస్సు టికెట్ కొనటానికి కూడా డబ్బులు లేవు. అప్పటిదాకా ఎన్నో వందల మందికి ఉచితంగా చిల్లిగవ్వ కూడా ఆశించకుండా ఉచితంగా జాతక పరిష్కారాలు చెప్పిన వాడిని, ఆరోజు నా జీవిత బండి నడవటానికి డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత దాదాపుగా ఆ రోజు రాత్రంతా నాలో నేను మౌనంగా ఏడ్వడం చేశాను. కారణం సమస్యలతో వచ్చేవారికి డబ్బులు అడిగి వారిని సమస్యలకు గురి చేయాలా లేదా నా బ్రతుకు చూసుకోవాలా ఏమో కాలమే చెప్పాలి !

అక్టోబర్ 30: నా వలన నా భార్య కూడా పస్తులు ఉండకూడదు. ఏమి జరిగితే అది జరుగుతుంది. అన్ని మానవ ప్రయత్నాలు చేసినాను. ఉద్యోగ, వ్యాపారాలు చేసినాను. నాకు ఏమీ కలిసి రాలేదు. ఇకనుంచి నా దైవవాక్కుతో డబ్బులు సంపాదించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ధన మాయ ఇబ్బందులు భరించలేము. ధనము ఎక్కువైనా సమస్యలే. ధనము తక్కువైన సమస్యలే.

నవంబర్ 10: మా గురు దేవుడికి ఈ విషయం చెబితే “అయితే, నీకు నేను సహాయం గా ఉంటాను. జాతక సమస్యలకు వాళ్లకి నీవే నీ వాక్ శుద్ధితో పరిష్కార మార్గాలు చెప్పు. వాటికి తగ్గ పరిహారాలు, హోమాలు , గ్రహ శాంతులు, దానాలు నేను చేస్తాను. కానీ ధనము ఎక్కువ ఆశించకు. ధన మాయలో పడకు. ధ్యానమును విడవకు” అని చెప్పినారు.

జులై 20: ఈ రోజు నాకు ధ్యానములో వేణువు నాదము లీలగా విన పడసాగింది.

జూలై 25: ఈ రోజు వేణునాదము బాగా స్పష్టంగా లీలగా వినబడింది. ఈరోజు వేణువు ఉన్న శ్రీకృష్ణుడి ఫోటో వచ్చింది. ఇది ఎందుకో తెలియ రాలేదు.

ఆగస్టు 1: ఈ రోజు వేణు నాద శబ్దము కాస్తా 'వం' అనే బీజాక్షర శబ్ద నాదము లాగా వినబడుతుంది అని గ్రహించాను.

ఆగస్టు 10: ఈ రోజు నాకు ధ్యానములో ఆరు దళాలు కలిగిన కాషాయ రంగు పద్మము కనబడినది.

ఆగస్టు 12: ఈ రోజు ధ్యానములో ఆరు దళాల పద్మం 'వం' అనే మధ్య బీజాక్షరము గా కనపడి అదృశ్యము అయినది. లీలా మాత్రంగా లక్ష్మి నారాయణ మూర్తి సజీవ స్వరూపముగా లీలగా కనబడింది.

మే 10: ఈరోజు మా గురుదేవుడిని అడిగితే దానికి ఆయన చిరునవ్వు నవ్వి “నాయనా! నీకు ధనము కావాలా ? సాధన కావాలా... తేల్చుకో... ఎప్పుడైతే పది రూపాయలు నీవు ఆశించినావో ఆ క్షణమే ధనలక్ష్మి నీకు 10 కోట్లు సిద్ధం చేసింది. నీకు ఆ డబ్బు కావాలా ? సాధన కావాలా? తేల్చుకో... అనగానే స్వామి నా జీవితము నడపటానికి నెలకి పదివేలు వచ్చేటట్లుగా ఏర్పాట్లు చేసుకున్నాను. ఇంకా ధనకాంక్ష వద్దు. నాకు సాధన కావాలి. నాకు ధన అత్యాశ లేదు. నన్ను ఏమి చెయ్యమంటారు... అని అడిగినప్పుడు ఆయన వెంటనే “అయితే నీవు ఖేచరి ముద్రను సాధన చేయమని” చెప్పి అది ఎలా చేయాలో నా చేత చేయించారు.

జూన్ 10: ఈరోజు ఖేచరి ముద్ర చేయటం కుదరలేదు. నాలుక వెనక్కి మడచి కొండ నాలుక అందుకోవటం ఈరోజు కష్టంగా అనిపించింది.

జూన్ 30: ఈ ముద్రా సమస్య గూర్చి మా గురుదేవుని అడిగితే దానికి అయితే... “ధ్యానములో ఆరు నెలల పాటు ఏదైనా పదార్థం వాసనను అనుభవిస్తున్నట్లు ధ్యానము చేసుకొమ్మని” చెప్పినారు.

జూలై 15: ధ్యానములో పదార్ధాల వాసన చేస్తున్నట్లుగా ధ్యానం చేస్తున్నాను. నెమ్మదిగా ఖేచరి ముద్రను నా నాలుక వేయటం ఆరంభమైనది.

జూలై 18: ఈరోజు నా ప్రమేయం లేకుండానే ఖేచరి ముద్రను నా నాలుక వేసినది.

ఆగస్టు 15: ఈరోజు నేను అనుకోకుండా సముద్ర స్నానం చేశాను. విచిత్రంగా ఈత లేకుండానే నీటిలో తేలుతున్న అనుభూతి కలగ సాగింది. అలాగే ఒడ్డుకు వస్తే కాలు మీద పీత పాకినది.అది నన్ను కరవకుండా నన్ను వదిలి పోయినది. విచిత్రంగా ఉంది. అదే పీత మా మిత్రుడుని బాగా కరిచింది. నన్ను కరవలేదు. కారణం తెలియటం లేదు. గురుదేవుని అడగాలి.

ఆగస్టు 18: మా గురు దేవుని అడిగితే “నాయనా! నీ స్వాధిష్టాన చక్రం శుద్ధి అయినది. జలము మీద ఆధిపత్యం అయినది. దాని వలన నీకు జలములో జీవించే జంతువుల వలన హాని ఉండదు. అలాగే నీటిమీద తేలియాడే శక్తి వస్తుంది. అలాగే ఆకలి, దప్పిక లేని,దుఃఖము రాని అనూర్మిత సిద్ధి కలిగినది. అరిషడ్వర్గాలు నీ ఆధీనమవుతాయని” చెప్పటం జరిగినది.

ఆగస్టు 20: ఈ రోజు నేను ధ్యానం చేస్తుండగా నాకు నిజంగానే జల సిద్ధి వచ్చినదా?పరీక్షలు చేసుకోవాలని ఆలోచనలతో చక్ర ధ్యానము నడిచినది.

ఆగస్టు 25: ఈరోజు కృష్ణా నది దగ్గర కి వెళ్ళినాను. చక్ర ధ్యానమును నదిలో కూర్చొని చేశాను. ఆశ్చర్యంగా నీటిలో మునిగి పోకుండా నీటిమీద తేలుతున్న అనుభవం కలగ సాగింది. కళ్ళు తెరిచి చూస్తే నీటి మధ్యలో బురదలో ఉండవలసిన వాడిని నీటిమీద తేలుతున్నానే అని అనిపించింది.*.    

No comments:

Post a Comment