Friday, February 27, 2026

*****భగవాన్ బోధ: ప్రపంచ మోహాల నుండి, పాశాల నుండి...వీర్యస్థలనం.....

 82
భగవాన్ బోధ

121. ప్రపంచ మోహాల నుండి, పాశాల నుండి తప్పుకోవడానికి ప్రపంచం అసత్యం, మిథ్య అని భావించవలసినదే. మరొకమార్గం లేదు. ప్రపంచం సత్యం అని భావిస్తుంటే, మనస్సు ప్రపంచం వెంటే పరుగెడుతుంది. బాహ్యరూపమే సత్యమని తలిస్తే, అసలు సత్యాన్ని (ఆత్మను) గుర్తించలేరు. మనోబలంచేత సిద్ధించేవి సిద్దులు. మనోనాశమయితే సిద్దించేది ఆత్మ. అహంచావనివాడు, ఎంత ఉత్తముడైనా, నిందాస్తుతులలో, సాధారణులలాగే ప్రవర్తిస్తాడు. కారణం అతను దేహాత్మ (దేహమేనేను) బుద్దిని వదలకపోవడమే.

122. ఆత్మకు అన్యంగా, భిన్నంగా దేవుడే లేడు. ఒకవేళ వుంటే ఆయన ఆత్మలేనివాడు అవుతాడు. అది అసంభవం. ఆత్మకు భిన్నంగా నీవు లేవు, దైవమూ లేదు. ఉన్నది ఆత్మ ఒక్కటే. సత్యం వాక్కుకి అతీతం. దానిని విశ్లేషించలేము. మహా అయితే సూచించగలము.

123. అహంలేకపోతే, ఇక సాధన, ఆరాధన, ప్రార్థన ఎలాకుదురుతుంది. అనగా ఇక చేయవలసిన అవసరం ఏముంది ? నీ నిజస్ధితిలో నీవుంటే, భగవంతుని గురించిన ఏ ఆలోచన వుండదు. జ్ఞానికి ఎట్టి పరిస్ధితులలోను సంకల్పాలు వుండవు.

124. మనం భగవంతుడి (విగ్రహం) ముందు కాని, గురువు ముందు కాని సాగిలబడి నమస్కరించినట్లైతే, (అదే శరణాగతి అని మనమను కొంటుంటాము. కాని అది కాదు) ఆయన మన బాహ్యక్రియలకు మోసపోడు. మనలో అహం ఎంత వరకు నిగ్రహంతో వుందో, ఎంతవరకు నాశనానికి దగ్గరగా వుందో చూస్తాడు. అహం పూర్తిగా అణగడమే శరణాగతి కర్తృత్వ భావమే శరణాగతికి పెద్ద అడ్డం.

125. సాధకులకి, అప్పుడపుడు, నిద్రలో వీర్యస్ఖలనం జరుగుతుంది. సాధకుడు దానికి చాల బాధపడి, అయ్యో బ్రహ్మచర్యం పాడైపోయిందే అని బాధపడుతాడు. కాని రమణులు ఏమంటారంటే, వీర్యస్థలనం అయితే నీకు వచ్చిన నష్టం ఏమిటి. నీవు శరీరానివే అని నీవు బావిస్తున్నంత కాలం యిలాంటి తప్పుడు భావనలుంటాయి. కాని నీవు ఆత్మవు కదా. నీకు వచ్చిన నష్టమేమిటి ? సర్వవ్యాపకమయిన ఆత్మకు పోయేదేమిటి, వచ్చేదేమిటి. జ్ఞానదృష్టికలవారికి అన్నీ సహజంగానే కన్పిస్తాయి. ఆత్మకి భిన్నంగా ఏముందసలు. ఆత్మ గురించిన యదార్థమేమంటే, జ్ఞానులూ లేరు, అజ్ఞానులూ లేరు. ఉన్నదల్లా జ్ఞానమే, ఆత్మే. అలాగని వీర్యాన్ని అనవసరంగా స్ఖలనం చేయకు.

126. జ్ఞానమే వైరాగ్యం, జ్ఞానమే స్వచ్ఛత, జ్ఞానమే భగవంతుని పొందు. ఆత్మని విస్మరింపని జ్ఞానమే అమరత్వమూ, సకలమూనూ.

127. ఆత్మ, సాక్షి అనేభావము, మనసులో వున్నదే. అది ఆత్మ గురించిన కేవల సత్యంకాదు. సాక్షీభూతమవడానికి, పదార్థాలతో సంబంధం వుంటుంది. సాక్షీ, పదార్థమూ, అవన్నీ మనసుచేత కల్పించబడినవే. నీవు దేహానివైతే, చూడబడే (సాక్షి ద్వారా) ప్రపంచమూ వుంటుంది. నీవు ఆత్మవైతే, ఉండేదల్లా ఆత్మే. ఇక సాక్షి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.

128. ఎంత వివరంగా చెప్పినా, మనుష్యులు ఆత్మని, అనగా తమ అసలు స్వరూపాన్ని గుర్తించకపోవడం వల్లా, అర్థం చేసికొనకపోవడం వల్లా, శాస్త్రాలు, భగవంతుడిని రంగంలోకి దించి, మాయనిగురించి, భగవంతుని లీల గురించి అనేక రకాలుగా వర్ణించి చెపుతాయి. కాని ఉన్నది ఆత్మ ఒక్కటే. అదే అసలైన సత్యం. ఆత్మ తప్ప నేనూ, నాది అంటూ ఏమీ లేదన్న గ్రహింపే జ్ఞానం. జీవించి ఉన్నపుడే యీ భావనను బాగా ఒంట బట్టించుకొనగలిగితే, శరీరం వదిలే ఆఖరి క్షణంలో ఏ వస్తువు మీద గాని, ఏ వ్యక్తి మీద గాని ఆసక్తిలేక మనసు ఆత్మ యందే నిలచిపోయి, వాసనలన్నీ నశించి పునర్జన్మలు లేకుండా పోతాయి.

129. వ్యక్తిత్వం (అహం) అంటూ లేకపోవడమే సహజస్థితి. అహంకారం లేకపోతే అలజడే లేదు. అహంకారం లేకుండా చేసేపని ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అహంకారం వున్నంతకాలం మనస్సు దేనినో వెదుకుతూనేవుంటుంది. ఒక్కక్షణం కూడా విశ్రాంతి వుండదు. అహంకారం లేకపోతే యిక అంతా స్వేచ్ఛయే.సంపూర్ణమైన స్వేచ్ఛ మనసుకు అతీతమైనది.




No comments:

Post a Comment