*కాలభైరవుడు -1*
👺
కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి! తన్నో కాలభైరవ ప్రచోదయాత్!!
శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైర వాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తిమంతుడు. ఈ స్వామీ కాల స్వరూపం ఎరిగినవాడు. రక్షణకు కూడా తిరుగు లేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలం లాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగి పోనివాడు. శాశ్వతుడు, నిత్యుడు. ఈ స్వామీ కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడు.
శ్రీ కాలభైరవ స్వరూపం:
ఈ స్వామీ కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. నాలుగు చేతుల్లో శూలం, కపాలం, గద మరియు ఢమరుకం ఉంటాయి. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం.
కాలభైరవుడు.. సాక్షాత్తు పరమశివుడి అంశ. ఈ స్వామిని భూతప్రేత.. రాక్షస, రోగ ఇతరత్రా బాధల నివారణకు ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది. కాలభైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యుగండాలూ తొలగిపోతా యనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది.
బైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. బైరవుణ్ణి శరణుకోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈ కాలభైరవాష్టమి రోజు గంగాస్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది.
శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. సమీపంలోనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో కొందరికి లోపలి కెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మిక వేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కళ్లెదుటే మనకు దర్శనమిస్తాడట.
కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.
📖
కాలభైరవుడు ఎవరు?
ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖము లతో ఋషుల వంక చూస్తూ అన్నాడు 'అదేమిటి బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును' అన్నాడు.
అపుడు బ్రహ్మ 'నేనే ఈ లోకముల అన్నిటిని సృష్టించాను, నేనే పుట్టుకకు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను, నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును' అన్నాడు.
తరువాత పక్కనున్న విష్ణువు 'బ్రహ్మా అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా, కావున నేనే బ్రహ్మమును' అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది.
మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.
ఋగ్వేదం: అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త, ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో, అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది.
యజుర్వేదము: తరువాత యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతు న్నవాడు కనుక పరమ శివుడే పరబ్రహ్మము అని చెప్పింది.
సామవేదము : తరువాత సామవేదమును పిలిచి అడిగారు. మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతు న్నాడో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో, అటువంటి శివుడు పరబ్రహ్మము' అని చెప్పింది.
అధర్వణవేదము: పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని
ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో, అటువంటి పరమశివుడు పరబ్రహ్మము' అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనంకాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.
ప్రణవం: ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో, అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము' అని చెప్పింది.
ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించ లేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు.
జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి' అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. కనుక ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. 'శంకర ఏమి నీ ఆజ్ఞ' అని అడిగాడు.
'బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఐదవ తలను గిల్లెయ్యి' అన్నాడు.
ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపంతో, బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం.
ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి 'ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు' అన్నాడు.
అపుడు శంకరుడు కాలభైరవునితో "నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్ళి నుంచి కాలభైరవ అని పిలుస్తారు.
కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో ఆహారమును స్వీకరించవలసినది. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది." అని చెప్పాడు.
బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మ హత్యాపాతక ము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్ధించాడు.
కాలభైరవుడి ప్రార్ధన విన్న శ్రీ మహావిష్ణువు 'కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్ధయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది” అని సలహా యిచ్చాడు.
అలా బ్రహ్మ తల పడిన ప్రదేశమే 'బ్రహ్మకపాలం'గా ప్రసిద్ధిచెందింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తంచేయగా, ఆయన తల పడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు. బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని "బ్రహ్మ కపాల మోక్షతీర్థం".
🦮
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment