ఆ తోట_ఆ రుచి_ఆ రోజులు
వేసవికాలం సాయంకాలం నాలుగు గంటలు అయింది. అయినా ఇంకా ఎండ ప్రతాపం తగ్గలేదు. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతం అయింది. ఈదురు గాలులు మొదలయ్యాయి. గాలి దుమ్ము వచ్చేలా ఉంది.
“పిల్లలు అందరూ తోటలోకి వెళ్దాం. పదండి… తట్టలు పట్టుకుని రండి. ఉన్న కాయలు రాలిపోతాయి కాబోలు!” అని చలపతిరావు గారు తోటలోకి పరిగెత్తారు, పిల్లలతో సహా.
బలంగా వీస్తున్న గాలులకు కొమ్మలు అటు ఇటు ఊగుతున్నాయి. అప్పటికే తోటలో కాయలు కొద్దికొద్దిగా గాలికి కింద పడిపోయి ఉన్నాయి. పిల్లలందరూ మామిడికాయలు ఏరి ఆ తట్టల్లో వేసారు. అలా తీసుకొచ్చిన కాయలు మరునాడు ముక్కలుగా మారి కుండలో మాగాయిగా మారిపోయేవి. అది చిన్ననాటి మామిడి తోట అనుభవం.
ఆ మామిడి తోటకు అప్పటికి సుమారు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎప్పుడో మా తాతగారు అన్నదమ్ములు కలిసి నాటిన మొక్కలు. వాళ్లు బ్రతికున్న రోజుల్లో వాటి ఫలాలు తిన్నారా లేదో తెలియదు గాని, మనవలం మాత్రం ఆనందంగా ఆ తోటలో కాసిన మధుర ఫలాలు తిన్న వాళ్లమే.
ఆ తోటను చూసినప్పుడల్లా నాకు “రాజుగారు ముసలివాడు” కథ గుర్తుకొస్తుంది. ఆ తరం వాళ్లకి ఎంత ముందుచూపు! అంత పెద్ద తోటను పెంచడానికి వాళ్లు ఎంత కృషి చేసి ఉంటారో కదా!
అందుకే ప్రతి వేసవికాలంలో మా నాన్నగారు పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు పండు పెట్టి నమస్కారం చేసేవారు. అంతవరకు ఆయన పండ్లు ముట్టుకునేవారు కాదు. అది కృతజ్ఞత కాబోలు.
ఆ తోటలో అన్ని రకాల మామిడికాయలు ఉండేవి. ఆ కాలం రకాల పేర్లు ఈ కాలం పిల్లలకు తెలియవు—పాపయ్య రాజు గోవా, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, బుడతల చెట్టు, కలెక్టర్ కాయలు, నీలం కాయలు, బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి… ఇలా ఎన్నో. కొన్ని ఊరగాయలకు, మరికొన్ని పండ్ల కోసం.
అందంగా ఉన్న మనిషిని చూసి “పండు లా ఉన్నాడు” అంటారు. మనుషులు పండు తింటే పండులా అయిపోతారు. వేసవికాలానికి మామిడి పండే మహారాజు.
ఉగాది పచ్చడితో మామిడికాయ వాడకం మొదలవుతుంది. చిన్న చిన్న పిందెలు, జీడి కారుతూనే ఉన్నా, ఆ వగరు రుచి పచ్చడికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. కొంచెం ముదిరితే మెంతి బద్దలు—పచ్చడి బద్దలు—ఆ రుచి తలుచుకుంటే ఇప్పటికీ నోరు ఊరిపోతుంది.
కాయ మరింత పెరిగితే పప్పు మామిడికాయ. అందులో వెల్లుల్లి పోపు పెడితే కంచాలు ఖాళీ అయిపోతాయి. ఆ కాలం వంటలు, ఆ రుచులు వేరు.
కందిపప్పులో పుల్లగా ఉండే మామిడికాయ ముక్కలు వేసి వండిన పప్పు—దానికి కాంబినేషన్‌గా మామిడికాయ ముక్కల పులుసు. బెల్లం, ఇంగువ పోపు కలిస్తే… గిన్నె ఖాళీ కావడం ఖాయం. మా అమ్మ చేతి వంటల మాధుర్యం అలా ఉండేది.
మధ్యలో మామిడికాయ ముక్కల్ని రోటిలో నూరి పచ్చడి చేసి పోపు పెడితే—అదే మామిడికాయ పచ్చడి. మీరు చేసుకుని చూడండి!
ఇలా పప్పు, పులుసు, మెంతి బద్దలు అన్నీ అయ్యాక అసలు కథ మొదలవుతుంది—ఆవకాయ. “గొల్లప్రోలు మిరపకాయలు తెచ్చండి” అంటూ అమ్మ నాన్నను సతాయించేది. మామిడికాయలు తోటలో ఉన్నా, మిగతా సరుకులన్నీ కొనాలి కదా.
ఏడాది పొడవునా సరిపడేలా ఊరగాయలు పెట్టేవారు. పెద్ద సంసారాలు, చుట్టాలు—అందరికీ పంచాలి. నాన్నగారు మోయలేని భారం మోసి సరుకులు తెచ్చేవారు.
ఆ రోజుల్లో కారాలు రోళ్లు, రోకళ్ళతో దంచేవారు. ఆ మండుటెండలో చెమటలు కక్కుతూ పని చేసేవాళ్లను చూసి కళ్లలో నీళ్లు వచ్చేవి.
మరునాడు ఉదయం ఆవకాయ పని మొదలయ్యేది. తోటలోని కాయలు కోసి, నీటిలో నానబెట్టి, గుడ్డలతో తుడిచి, బాబాయ్ గారు కత్తిపీట మీద ముక్కలు చేసేవారు. మేము జీడి తీసి శుభ్రం చేసేవాళ్లం.
మా అమ్మగారు స్నానం చేసి, మడి కట్టుకుని, తూర్పు వైపు తిరిగి దండం పెట్టి, కారం, నూనె కలిపి కుండలో ఆవకాయ పెట్టేవారు. పైన గుడ్డ కట్టి దేవుడి గదిలో ఉంచేవారు. ఆ శుచిత్వం, ఆ సంప్రదాయం ప్రత్యేకం.
మూడో రోజు కాదు—మరునాడే కొత్త ఆవకాయ తినడం మొదలయ్యేది. రెండు మూడు రోజులు తిని, “వేడి చేసింది” అంటూ ఒక రోజు మానేసి… మళ్లీ మొదలు! అంత ఇష్టం ఆవకాయంటే.
వేసవి సెలవుల్లో సాయంకాలం తోటలోకి వెళ్లి రాలిన కాయలు ఉప్పు కారం నంజుకుని తినడం—అదో మజా. ఇంటికి వచ్చి బెల్లపు ఆవకాయ అన్నంలో కలిపి తినడం—ఆ ఆనందం ఇప్పటికీ కళ్ల ముందు.
ఆవకాయ అయిపోయాక మామిడిపండ్ల కాలం. గదిలో గడ్డి వేసి కాయలు పేర్చి, గోనె కప్పి మూడు రోజులు ఎదురు చూస్తే నాలుగో రోజు గుప్పుమని వాసన.
ఎవరికీ వారు ఇష్టమైన పండ్లు—బుడతల పండు, పాపయ్య రాజు గోవా, చెరుకు రసం… అమ్మ మాత్రం మిగిలిన దానితో సంతోషం.
కాలం మారిపోయింది. తుఫానులు, గాలులు చెట్లను కొట్టేశాయి. కొన్ని మాత్రమే మిగిలి, వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తున్నాయి. అయినా కొన్నిచెట్లు ఇంకా మధుర ఫలాలు ఇస్తూనే ఉన్నాయి.
యాభై సంవత్సరాలుగా ఫలాలు ఇచ్చిన ఆ చెట్లను తలుచుకుంటే గుండె నిండిపోతుంది. ఈరోజు బజారులో దొరికే మెరిసే కాయలు చూసి కళ్లకు చమటలు పట్టినా… ఆ రుచి, ఆ అనుభవం మళ్లీ రావు.
అంత దూరదృష్టితో తోటలు పెంచిన ఆ పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారం చేయడం తప్ప మన చేతిలో ఇంకేమీ లేదు.
రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
No comments:
Post a Comment