*పితృ శ్రాద్ధం*
మా కులంలో ధనలోపం చేయకుండా, మా పితృదేవతలకు పిండప్రదానం చేయబోయే బుద్ధిమంతుడైన ధన్యాత్ముడైన నరుడు జన్మించడం జరుగుతుందా?
ఐశ్వర్యం ఉండగా, మా పితృదేవతలను ఉద్దేశించి, రత్నం, వస్త్రం, భూమి, వాహనం, ధనం మున్నగు వాటిని విప్రుల కొరకు దానం చేసేవాడు మావంశంలో ఉద్భవిస్తాడా!
ఈప్రకారం దానం చేయగల్గిన వైభవం అంతంత మాత్రమే కల నరుడు, శ్రాద్ధ సమయంలో భక్తి, వినయం కల్గిన చిత్తంతో విప్రులకు అన్నమైనా తృప్తిగా భోజనం పెట్టేవాడు మాకులంలో జన్మిస్తాడా ?
ఆవిధంగా అన్నం పెట్టడానికి అసమర్థుడయినా, తనశక్తిని అనుసరించి ద్విజులకు పచ్చి ధాన్యమైనా దానమిచ్చి స్వల్పంగానో, లేక ఎంతో కొంత కొంచమైనా దక్షిణ ఇచ్చేవాడు మా వంశంలో పుడతాడా?
ఆ విధంగా చేయడానికి సామర్థ్యం లేకపోయినా చేతివ్రేళ్ల కొనలతో నువ్వులు ఉంచుకొని ఏ ద్విజముఖ్యునకైనా నమస్కరించి (తిలోదకం) మాకు సమర్పించేవాడు మాకులంలో ప్రభవిస్తాడా?
అవి కూడ లేనివాడు ఏడు, ఎనిమిది నూవుగింజలయినా పట్టుకొని భక్తివినయంతో మమ్మల్ని ఉద్దేశించి భూమిపై జలాంజలితో కలిపి విడిచిపెట్టే వాడు మావంశంలో జన్మిస్తాడా?
అది కూడ లేనినాడు, ఒక గోవుకు ఒక రోజుకు సరిపడే మేత ఎక్కడ నుంచయినా తెచ్చి గోవులకు పెట్టేవాడు మా కులంలో పుడతాడా?
ఇలాపైన చెప్పిన వన్నీ శూన్యం అయిపోతే, అడవిలో ప్రవేశించి చంకలు కనబడేటట్లు చేతులు పైకెత్తి సూర్యుడు మున్నగు లోకపాలకులను ఉద్దేశించి ఇలా అయినా గట్టిగా పలికేవాడు మావంశంలో జన్మిస్తాడా?
నావద్ద శ్రాద్ధానికి ఉపయుక్తమయ్యే విత్తం లేదు. ధనం లేదు. మరేమి లేదు. నా పితృదేవతలకు నమస్కరిస్తున్నాను. నా పితరులు తృప్తిపొందెదరుగాక! ఇదిగో! నా రెండు భుజాలు పైకెత్తి ఆకాశంలో చాచాను అనేవాడయినా మావంశంలో ఉద్భవిస్తాడా?
*ఈ విధంగా పితృదేవతలు గానం చేసినట్లు ధనవంతుడైనా, ధనహీనుడయినా కలిమి లేములలో యథోక్తంగా శ్రాద్ధక్రియ ఎవడు చేస్తాడో, వాడు యథాహితశ్రాద్ధం నిర్వహించినట్లే అని శ్రీవిష్ణుపురాణం చెబుతుంది.* 🕉️🧘♀️🕉️ *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment