బామ్మ కొత్త కథలు
తొక్కుడు లడ్డూలు (001)
(ప్రభాకర్ పెదపూడి)
“ఏమిటి బామ్మగారు పనేమీ లేనట్టుంది, ఖాళీగా కూర్చున్నారు” అటుగా వెడుతున్న నాంచారి అరుగుమీద కూర్చున్న బామ్మని నవ్వుతూ అడిగింది. “ఆ ఎప్పుడో గుప్తుల కాలంలో డిగ్రీ వెలగబెట్టిన దాన్ని నాకేం పనుంటుంది, ఒకటో క్లాసు రెండుసార్లు పిల్లిమొగ్గలు వేసి దాటినదానివి నీకే బోలెడు పనులు ఉంటాయి” బామ్మ పాత పేపరుతో విసురుకుంటూ అంది. “ఏమిటి బామ్మగారు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు” అరుగుమీద కూర్చుంటూ అంది నాంచారి. “అన్నట్టు సందుచివర అప్పిగాడి దగ్గర ఉల్లిపాయ పకోడీలు తెమ్మంటారేటీ” అడిగింది నాంచారి. “ఉల్లి పకోడీలు వద్దుకానీ, ఉదయం పనిమనిషి రాలేదు కాస్త గిన్నెలు తోమేసిపో! ఉత్తినే తోమద్దులే మొన్నీమద్యన పెట్టిన వెల్లుల్లి ఆవకాయ, మా చుట్టాలు పంపిన నాలుగు తొక్కుడు లడ్డూలు తీసుకుపోదువుగాని” నవ్వుతూ అంది బామ్మ. “మీరు ఇస్తానన్న ఆవకాయ, లడ్డూల గురించి కాదుగానీ మీ మీద అభిమానంతో తోముతాను” అంది నవ్వుతూ నాంచారి. “పోదూ వెధవ బడాయీ నువ్వూనూ, అభిమానంతో తోమద్దుగానీ ఆ అరుగుపక్కన కొబ్బరిపీచుతో తోము” అంది బామ్మ. నాంచారి గిన్నెలు మెరిసేలా తోమి అరుగుమీద బోర్లించి “బామ్మగారు తోమేసాను” అంది చేతులు చీర కొంగుతో తుడుచుకుంటూ. “అదేమిటే సూర్యుడు వచ్చి గిన్నేలమీద కూర్చున్నట్లు అంత మెరిసేలా తోమావేమిటే! ఒక నెల వరకూ గిన్నెలు తోముకోవక్కర లేదా ఏమిటి నీ మొహం మండా! ఇంకో రెండు తొక్కుడు లడ్డూలు ఎక్కువ ఇస్తాను పట్టుకుపో” అంటూ ఉల్లి ఆవకాయ, తొక్కుడు లడ్డూలు నాంచారికి ఇచ్చింది బామ్మ.
సరిగ్గా అదే సమయానికి అటుగా వెడుతున్న తెలుగు మాస్టారు బామ్మవైపు చూసి చిరునవ్వు నవ్వి “ఏమిటో బామ్మగారు తెగ పంచడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు” వ్యంగంగా అన్నారు. “ఆ పంచడాలు, దంచడాలు ఏమీ లేవండి మాస్టారు, ఓ నాలుగు గిన్నెలు ఉంటే తోమింది, ఇక ఇల్లు దులపడాలు అవీ ఉన్నాయి, తమరుకానీ కాస్త రేపు ఆదివారం సాయం చేస్తే మిగిలిన తొక్కుడు లడ్డూలు పట్టుకుపోదురుగాని” అంది బామ్మ నవ్వుతూ. “కొంత మంది నోట్లో నోరు పెట్ట కూడదు” దూరంగా వెళ్ళాక అనుకున్నారు మాస్టారు.
No comments:
Post a Comment