Monday, April 28, 2025

 కెవ్వ్ కేక
              --------------

          చాలా రోజులతరువాత భర్తతో కలసి హఠాత్తుగా ప్రత్యక్షమైన స్నేహితురాలు పద్మని చూసి సంతోషంలో మునిగిపోయింది సుగుణ. 
             గేటుతీసుకొని లోపలికొస్తున్నవారిని  సంతోషంగా ఆహ్వానించి మేడమీదగల తన అపార్ట్ మెంటుదగ్గరకు  తీసికెళ్ళింది.
                మెయిన్ గుమ్మందగ్గరకు వస్తూనే "కెవ్ "మన్నపద్మను చూసి తుళ్ళిపడింది సుగుణ."అబ్బా! ఎందుకే అలా అరిచావు ?చూడు నీ అరుపుకు పక్క వాటావాళ్ళుకూడా పరిగెత్తుకొచ్చేసారు" అంటుంటే, "అదేంలేదండీ "! గుమ్మానికి కుడిపక్కన జోళ్ళ స్టాండ్ పెట్టేరు కదా!అదిచూసి అలా అరచింది".ఆమెభర్త వివరించాడు".ఓస్ అంతేగదా!ఇంకా ఏమయ్యిందో అని హడలిచచ్చేను అంటూ తనగుండెలపైన నోటితో ఉఫ్ ఉఫ్ మంటూ నోటితో గాలి ఊదుకొని, తన వెన్నును మూడుసార్లు తట్టుకొంది సుగుణ.అవును గానీ ,అలా కుడిచేతివైపు పెట్టకూడదా ?నాకు తెలియకడుతున్నాను "అంటూ స్నేహితురాలిని ఆరాతీసింది సుగుణ.
            "ఆమాత్రం తెలియదా? కుడివైపు చెప్పులస్టాండుంటే , లక్ష్మీదేవి ఇంట్లోకెలావస్తుంది? ఇన్నేళ్ళోచ్చేయ్ ఆమాత్రంతెలియదా?"అంటూ  సుగుణనుచూసి కళ్ళెర్రజేసింది పద్మ,సుగుణ బుగ్గల్లో ఒక పోటు కూడాపొడిచింది .
             సుగుణ వాళ్ళకు హాల్లో సోఫా చూపించి ,"కూర్చోండి ,క్షణంలో మీకు మంచినీళ్ళూ కాఫీ తెస్తానని "లోపలికి వెళ్ళింది.
               మళ్ళీ ఈసారి హాల్లోంచి "కెవ్వ్ కెవ్వ్ "మన్నకేకలు వినిపించాయి. ఆ అరపులకు సుగుణ చేతిలోవున్న మంచినీళ్ళగ్లాసులు జారిపడ్డాయి."ఏమైయ్యింది ?ఎందుకలా అరచిందని పరుగు పరుగున రాబోతున్న సుగుణ క్రిందవలికిన నీళ్ళలో జారి పడబోయి ,ఎలాగో తమాయించుకొని, అలా తలుపు పట్టుకొని పడకుండా ఆపుకొని "ఏమే మళ్ళీ ఏమైయ్యిందే !అలా అరచి చచ్చేవు?హడలిచచ్చేను నేను ఈసారే మైయ్యిందోనని,"ఆత్రంగా పద్మని ప్రశ్నించింది సుగుణ.
               "ఏమండీ? మీరలా అస్తమానూ హడలిపోకండిసుమీ! తూర్పు ఈశాన్యంలో గోడకి గోడ టీవీ తగిలించారు,దానికి ఒకకెవ్వ్ ,అలాగే,దక్షిణద్వారం తెరచి వుంచారు, దానికి మరొక కెవ్వ్ అంతే!నిజానికి ఇంకోసారికూడా కెవ్వుమనాలి.ఎందుకంటే,సోఫా తూర్పుముఖంగా లేకుండా దక్షిణముఖంగావుంది. అలాగే మీబెడ్ రూమ్ లోబీరువా నైరుతిలో లేకపోయినా, పటాలు ఉత్తరంగోడకీ ,తూర్ఫుగోడకీ తగిలించివున్నా ఇలాగే కెవ్వ్ ,కెవ్వ్ అంటుంది.మీరెన్నిసార్లని హడలిపోయి చెేతుల్లోవున్నవి కాళ్ళమీద చేతులమీదా పోసుకొని ప్రమాదంలో పడుతుంటారు??" సుగుణ మీదజాలిపడుతూ ప్రశ్నించాడు  పద్మభర్త.
            "అదేమిటి పద్మా? కొత్తగా ఈ కెవ్వ్ కెవ్వ్ లేమిటే? 
దక్షిణ ద్వారం మూసేస్తే ఇంట్లోకి గాలెలావచ్చిచస్తుంది? అసలు కొంపలోకి గాలి దక్షిణంవైపునుంచేకదా వస్తుంది? అలాగే  టీ .వీ కి  ప్లగ్ అక్కడే ఇచ్చేడు ఇల్లుకట్టినవాడు.మరది అక్కడేకదాపెట్టాలి! అలాగే అపార్ట్ మెంట్స్ లో ఒకరికి వాస్తుకి సరిపోతే, దాని ప్రక్కది దానికి వ్యతిరేకంగా  వుంటుందిగదా!మరి వాళ్ళమాటేమిటి? అయినా దీనికింత వాస్తుశాస్త్రం ఎలాతెలిసిపోయిందండీ బాబూ!అదిచదివింది సన్స్ డిగ్రీకదా!" బుగ్గలునొక్కుకొంటూ ఆశ్చర్యపోతూ పద్మమొగుడిని ప్రశ్నించింది సుగుణ.
"వాస్తుశాస్త్రంతెలియడమా?నా పిండాకూడా?పొద్దున్నలేచింది మొదలు టీ.వీల్లో స్వామీజీలు చెప్పేవన్నీ విని ఇలా తయారయ్యింది. సొంతకొంప వాస్తువిరుధ్ధంగా వుందని,అద్దెకొంపలమ్మట పిల్లి పిల్లలని పెట్టి ఏడిళ్ళు తిప్పినట్లు ,నన్ను,నా సంసారాన్నీ ఇప్పటికి పద్నాలుగిళ్ళుతిప్పి చచ్చింది. ఆ అద్దెకొంపల్లోంచైనా ఆఫీసుకెళ్ళడానికి దారంట తిన్నగా  మెయిన్ రోడ్డుకు వెళితే కలిసిరాదని, ముక్కెక్కండంటే ,బుర్రచుట్టూతిప్పి చూపించినట్లు,ఇంటి కెదురుగావున్న మెయిన్ దారొదలి ,ఇంటి చుట్టుతిరిగి వెళ్ళమంటుంది. ఇంక గుమ్మం దిగేముందు అది శకునం కుదిరి వెళ్ళమనే సరికి రోజూ అరగంట ఆలస్యం అయ్యేసరికి, మా మేనేజర్ చెప్పిచెప్పి కడకు ఉద్యోగం తీసేసేస్తానని బేదిరించి, హెచ్చరించి హెచ్చరించి విసిగి వేసారి, రెండురోజులక్రితమే నా ఉద్యోగం పీకేశాడు. ఇప్పుడు నేనిక్కడకివచ్చింది కూడా ఉద్యోగం వెతుకులాటకే సుగుణగారూ!" కడుపులోవున్నబాధను కక్కేశాడు పద్మమొగుడు.
     ఈలోగా ఇల్లూ,పెరడూ వాస్తు పరిశోధనకువెళ్ళిన పద్మ ,మళ్ళీ ఈసారి నాలుగు కెవ్వులకు పైగా అంబులెన్స్ హారన్ లా అరచేసరికి,హాల్లోకూర్చుని మాట్లాడుకొంటున్న  పద్మభర్తా,సుగుణా పరుగుపరున వంటింట్లోకి వచ్చారు.
     "అవునే సుగుణా! ఇంతవయసొచ్చింది కదా నీకు ఆమాత్రం వాస్తుజ్ఞానంలేకపోతే ఎలా బ్రతికి చస్తావే! గాస్ గట్టుపైన ఉత్తర ఈశాన్యంలో వాటర్ ఫ్యూరీ ఫైయర్ బిగించారు.అదివాస్తుకెంతవిరుధ్ధమో తెలుసా?కంచాల ,గిన్నెలస్టాండ్ ని తూర్పుగోడకు పెట్టించావ్ అదెంతదోషం. దేవుడిగదిలోఅయితే,పైన పెట్టవలసిన దేవుడి ఫోటోలు కిందా ,కిందపెట్టవలసిన ఫోటోలు పైనా పెట్టేవ్ ! అయినా నాకు తెలియకడుగును, తూర్పుగోడకు గాలికెగిరే కేలండర్ కూడా పెట్టకూడదని తెలియకుండానే ఇన్నేళ్ళనుంచీ సంసారమెలా చేస్తున్నావే సుగుణా?మీ ఆయనకుకూడా  వాస్తు గురించి తెలికపోవడమేమిటి చిత్రంకాకపోతే!
ఇలా నీంటి వాస్తుశాస్త్రవిరుధ్ధమైనవన్నీ చూసి కెవ్వకెవ్వ్ మని అరచి అరచి  నా గొంతు గుండెల్లోకి జారిపోయిందంటే నమ్ము."ఆగకుండా ఆవేశంగా అరగంటకు పైగా ఉపన్యాసమిచ్చిన పద్మకు ఆయాసంకూడా వచ్చింది.
      పద్మకు యేమనిజవాబులు చెప్పాలో తెలియని సుగుణకు, అంతా అగమ్య గోచరంగా అయోమయంగా చూస్తూండిపోయింది.
     "చూడు పద్మా !పాపం నీ స్నేహితురాలి పరిస్థితి ఎలావుందో!ఆమె ఇంటికొచ్చి, ఆమె మనసును ఇలా బాధపెట్టడం నీకు మర్యాదేనా?"అని అడిగాడతగాడు.
                    భర్త కేసి మిర్రు మిర్రు మనిచూస్తున్న, వాస్తు పిచ్చి పట్టిన పద్మకేసి జాలిగాచూసి, "రావే పద్మా వట్టింట్లోకెళ్ళి పనిచేసుకొందాం"!అంటూ సోపాలోంచి లేపి వంటింట్లోకి తీసికెళ్ళగానే ,మళ్ళీ "కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ "మంటున్న పద్మను "ఈసారేమయ్యిందే !"అని అడిగింది సుగుణ చేతి లోవున్న పాలగిన్నెని  అదిరిపోయి వదిలేస్తూ!
               "అదేమిటే సుగుణా!గ్రైండర్ బవుకదా దాన్ని ఈశాన్యంలో పెట్టావు. డైనింగ్ టేబుల్ పడమరముఖంగానూ  వేసావ్ ,ఇంటికెంత అరిష్టమో తెలుసా? ముందు దాన్ని అక్కడనుంచి తీసెయ్ "!అంటున్న పద్మవైపు అయోమయంగా చూస్తూవుండిపోయింది సుగుణ.               
     కొంతసేపటితరువాత తేరుకొన్న సుగుణ ,"అవునింతకీ మీ వాస్తునిపుణులు  వాస్తుదోషాలున్న ఇంటిలో మంచినీళ్ళు కూడా తాగరని విన్నాను."అంటూ బీరువాతెరచి జాకట్ గుడ్డముక్కతెచ్చి, "పద్మా!బొట్టుపెడతాను, ఏదిక్కుగా నించుటావో నించోవే !"అంటూ నించోపెట్టి జాకట్ గుడ్డ పద్మచేతిలో పెడుతూ,"మీరు ఈఊళ్ళో ఉద్యోగం సంపాదించుకొని,ఇల్లూ అదీ ఎర్పాటుచేసుకొనేవరకూ మాఇంట్లోనే వుండమందామనుకొన్నానండీ!కానీ వాస్తుబాలేనీ ఇంట్లో మాపద్మ మంచినీళ్ళుకూడా తాగదని అర్థమైయ్యింది!అందుకని మీకేవిధంగానూ సహాయపడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగావుంది.మరేమనుకోకండి .!"అంది సుగుణ . వెర్రిమొఖంవేసుకొని, గడప దాటుతున్న పద్మాదంపతులకు వీడ్కోలు చెప్పింది సుగుణ.  

              సత్యవాణి కుంటముక్కుల

No comments:

Post a Comment