Sunday, May 25, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…


        *చెరువు-వినాయుకుడు*
                ➖➖➖✍️
```
ఒకసారి ఒక ఊరినుండి ఊరి పెద్దమనుషులు పరమాచార్య స్వామివారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చారు. వాళ్ల ఊరిలోని వినాయకుడి విగ్రహం ఎవరో ఎత్తుకుపోవడం వల్ల ఒక కొత్త విగ్రహం కోసం మీ దగ్గరకు వచ్చామని వారు మహాస్వామితో చెప్పారు.

మహాస్వామి వారు “మీ ఊళ్ళో చెరువు ఉందా?” అని అడిగారు.

“అవును ఉంది పెరియవ”

“అందులో నీళ్ళు ఉన్నాయా?”

వచ్చిన వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని “గ్రామ పంచాయితి శుభ్రం చెయ్యనందున నీళ్ళు కొన్ని మాత్రమే ఉన్నాయి” అని చెప్పారు.

“చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకూ పశువులకూ ఉపయోగమే కదా?” 

”అవును పెరియవ”

“సరే ముందు మీరు చెరువులో పూడిక తీసి, బాగా నీరు నిలువ ఉండేటట్టు చెయ్యండి” అని చెప్పి ఇక వారు వెళ్ళవచ్చు అన్నట్టుగా వారికి ప్రసాదమును ఇచ్చారు. 

వచ్చినవారు చాలా నిరాశపడి, ‘విగ్రహం దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది కానీ  మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమి మాట్లాడలేదు’ అని అనుకున్నారు. 

‘చెరువు పూడిక తీయటం ప్రభుత్వం చేయవలసిన పని. అది మేమెందుకు చేయాలి’ అని అనుకున్నారు. కానీ  కొంతమంది పెద్దలు “మహాస్వామి వారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం చేయవలసిందే. వారి మాటలను నిరాకరించి లేని పోని బాధలను ఎందుకు తెచ్చుకోవటం” అని అన్నారు. 

‘మనము ఏమీ చేయలేము. ఇదంతా మనము చేసుకున్నదే. దీన్ని వాయిదా వెయ్యటంకంటే ఇప్పుడు చేసెయ్యడమే మంచిది’ అని తీర్మానించుకున్నారు.

ఒక రోజు ఊళ్ళో ఉన్న కొంతమంది దృఢకాయులు అందరూ కలిసి పలుగు పార పట్టుకుని చెరువు పూడిక తీసే పని ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత ఒకడు భూమిని కొట్టగా “టంగ్” మన్న శబ్ధం వినిపించింది. అతడు ఇక్కడ ఏదో ఉన్నదని అందరినీ పిలిచాడు. వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం (పోయిన విగ్రహం కాదు). మరి కొద్దిసేపటి తరువాత మళ్ళా “టంగ్” మన్న శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం. తరువాత ఒక్కొక్కటిగా నంది, పార్వతి, దుర్గా, కార్తికేయుడు, బలిపీఠం మొత్తంగా శివ పరివారమే లభించింది. 

అందరూ వెంటనే కాంచీపురానికి బయలుదేరారు. ”మేము మహాస్వామిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము. కానీ  మాకు ఇప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది” అని వారి ఆనందానికి అవధులు లేవు.

“చెరువు ప్రక్కన ఒక కొట్టం వేసి, ఆ విగ్రాహాలను అక్కడ ఉంచి దీపారధన చేసి పళ్ళు పూలతో రోజూ పూజించండి“ అని మహాస్వామి వారు చెప్పారు.

“మరి దేవాలయం?” అడిగారు ఊరి పెద్దలు. 

“వినాయకుడు వచ్చాడు కదా? ఇంకేం అంతా ఆయనే చూసుకుంటాడు” అన్నారు మహాస్వామి.✍️```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
 “కంచిపరమాచార్యవైభవం”🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment