___________*సరదాకి కాస్సేపు*___________
*మేధావి*
*రచన - విజయారావు*
*(ఫోన్ 8897027778)*
"ఏమోయ్! నిలబడి, మంచి నీళ్ల
బాటిల్ ని పైకెత్తి గుటకలు వేస్తూ త్రాగకూడదంట. అలాగే పడుకున్నప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలంట. మనము ఊపిరి తీసుకుంటున్న పద్ధతి కూడా సరైన పద్ధతి కాదంట. మనమన్నీ తప్పుల మీద తప్పులే చేస్తున్నాము" హాల్ లో కూర్చుని, యూ ట్యూబ్ లో వీడియోలు తీరికగా చూసుకుంటూ, వంట గదిలో పనిచేసుకుంటున్న మా ఆవిడకు చెప్పాను.
"పొద్దస్తమానూ ఆ యూ ట్యూబ్ లో పనికిమాలిన వీడియోలు చూసుకుంటూ మీ బుర్రను ఖరాబు చేసుకుంటూ నా బుర్రను తినేయకండి. చేతనైతే వంట గదిలోకి వచ్చి నాకు కొంచం సహాయం చేయండి" పని వత్తిడిలో విసుక్కుంది శ్రీమతి.
"నీకు సహాయం చేద్దామని అనుకున్నా , నేను చేసే పని నీకు నచ్చదోయ్! అదలా చేయకూడదు, ఇదిలా చేయకూడదు, అని వంకలు పెడతావు" సమయస్ఫూర్తితో సమాధానమిచ్చి పని తప్పించుకున్నాను.
"ముందర కాళ్ళకు బంధం వేయడమంటే ఇదే. తెలివైనవారు కాబట్టి , ఏ పనైనా ఒకసారి సరిగ్గా చేస్తే మళ్ళీ ఇంకొక సారి చేయమంటారనే భయంతో మొదటి సారే మొక్కుబడిగా చేసి చేతులు దులిపేసుకుంటారు. రెండో సారి అడిగి చేయించుకునే సాహసం మళ్ళీ మేము చేయగలమా, ఏమిటి?" దులిపేసింది శ్రీమతి.
శ్రీమతి మాటలకు నవ్వుకుంటూ ...
"ఏమనుకోకుండా నీ పనైన తరువాత ఇంకో కప్పు కాఫీ పట్రావోయ్!" అని అభ్యర్థించాను.
"కాఫీ ప్రాణి, అదుంటే చాలు, అన్నం కూడా అక్కరలేదు" శ్రీమతి సణుగుడు నాకు లీలగా వినిపించింది.
పది నిముషాల తరువాత, పొద్దున్నే షుగర్ టెస్ట్ కు
వెళ్ళిన రిపోర్ట్ వాట్సప్ లో వచ్చినట్లు అలెర్ట్ వస్తే , దానిని చూసుకుని ' ఈ షుగర్ వ్యాధి కోరలకు నేను చిక్కేసానన్న మాట ' అని కొంచం నిరుత్సాహం చెందాను.
"ఏమిటి, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కాఫీ కప్ అందిస్తూ ప్రశ్నించింది శ్రీమతి.
ఆలోచనలలో నుండి తేరుకుని ...
"ఏమీ లేదోయ్! ఇక మీదట నేను మాట్లాడబోయే మాటలలో తియ్యదనం కొంచం ఉండబోవచ్చు" శ్రీమతితో పరిహసిస్తూ కాఫీ కప్పు అందుకున్నాను.
"ఏమంటిరి, ఏమంటిరి? మధురముగా, తమరు సంభాషించుటయా? అసంభవము. బ్రహ్మ దేవుని సృష్టికే అది విరుద్ధము" మూడ్ బాగుండడంతో శ్రీమతి కూడా తనలోని హాస్య చతురతను బయటపెట్టింది.
లౌక్యం లేకుండా ఎప్పుడూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే నా నైజాన్ని కాచి వడపోసిన మా ఆవిడ అన్న దాంట్లో నిజముండడంతో, ఆమె మాటలను ఖండించ లేక, ముఖం చిన్నబుచ్చుకుని ...
"మరేం లేదోయ్! పొద్దున్న షుగర్ టెస్ట్ కి వెళ్ళాను కదా? ఒంట్లో షుగర్ నిలవలు బాగానే పేరుకుంటున్నాయని రిపోర్ట్ ఇప్పుడే వాట్సప్ లో వచ్చింది" శ్రీమతికి అసలు విషయం నెమ్మదిగా చెప్పేశాను.
"అమ్మో, షుగర్ వ్యాధి వస్తే జీవితాంతం మందులు వాడాలి కదండీ?" శ్రీమతి ఆదుర్దా పడిపోసాగింది.
"నిజమే, కానీ భయపడ వలసిన అవసరం ఏమీ లేదు. ఈ రోజుల్లో షుగర్, బీ. పీ లతో సహజీవనం చేయడం ఎందరికో అలవాటైపోయింది" శ్రీమతికి ధైర్యం చెప్పాను.
"అలాంటి సహజీవనాన్ని మీరు పొరపాటున కూడా అలవాటు చేసుకోకండి. రేపు ఇంకెవరితోనో సహజీవనం చేయాలని మీకు అనిపించవచ్చు" నవ్వుతూ ఒక చురక వేసింది శ్రీమతి.
"ఈ మధ్య కామెడీ స్కిట్లు ఎక్కువగా చూస్తున్నట్లున్నావు. పంచ్ లు విసరడం బాగానే నేర్చుకున్నావ్"
"అది కాదండీ, షుగర్ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని అంటారు కదా? దానిని కానీ అదుపులో పెట్టుకోకపోతే శరీర అవయవాలు దెబ్బ తింటాయని విన్నాను. నా మాట విని వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి మందులు వాడడం మొదలు పెట్టండి" బ్రతిమలాడింది శ్రీమతి.
"షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకునే పద్ధతులు తెలిపే వీడియోలు యూ ట్యూబ్ లో ఎన్ని లేవు? నెల రోజులలో షుగర్ వ్యాధిని ఎలా రివర్స్ చేసుకోవచ్చో తెలిపే వీడియో కూడా ఈ మధ్యనే చూసాను. స్నేహితులందరూ ఈ వ్యాధిని అదుపు చేసుకోవడంలో ఏకంగా డాక్టరేట్లు సంపాదించేసుకున్నారు కాబట్టి, వాళ్ళ సలహాలు, సూచనలకు మనకు కొదవ ఏమీ ఉండదు" ఆత్మ విశ్వాసంతో చెప్పాను.
"మీరెన్ని చెప్పండి, నాకు మాత్రం ఈ షుగర్ వ్యాధంటే చాలా భయం"
"భయమెందుకోయ్, మరక కూడా మంచిదే అన్నట్లు షుగర్ వ్యాధి వస్తే , ఏది పడితే అది, ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు, తినలేము కదా? వేళకు మితంగా తింటూ, ప్రతి రోజు తప్పని సరిగా వాకింగ్ కి కూడా వెళ్ళాలి. మొత్తం మీద ఎలాంటి వారికైనా క్రమశిక్షణ అనేది వచ్చేస్తుంది కదోయ్!"
"బాగుంది సంబరం. క్రమశిక్షణతో జీవించడానికి జబ్బు అంటూ రావాలా ఏమిటి?" విస్తుపోయింది శ్రీమతి.
"మానవ నైజం తెలుసు కదా? జరిగినంత కాలం జరిపించుకుంటూనే ఉంటాడు. తప్పని సరి పరిస్థితులలో మాత్రమే మనిషి మారుతాడు" అందరికీ తెలిసిన విషయమే అయినా అదేదో కొత్త విషయం కనిపెట్టి చెప్పినట్లు ఫోజు కొట్టాను.
"అవునవును. నెత్తి, నోరు కొట్టుకుని ఎన్ని సార్లు చెప్పినా తమరి తిండి యావ తగ్గించగలిగానా?" దెప్పి పొడిచింది శ్రీమతి.
"తిన కూడని రోజు ఎలాగూ తినలేము కాబట్టి తిన గలిగిన రోజే తినేయాలోయ్" నన్ను నేను సమర్థించుకున్నాను.
"అదిగో, ఆ సిద్ధాంతంతోనే తమరు ఈ జన్మలోనే పది జన్మలకు సరిపడా తిండి తినేశారు" మళ్ళీ ఒక చురక వేసింది శ్రీమతి.
"నీకు చేత కానిది నాకు చేతనయ్యిందని అసూయ పడకూడదోయ్" నవ్వుతూనే నేనూ శ్రీమతిని గిల్లాను.
"సిగ్గు లేకపోతే సరి, మళ్ళీ సమర్థింపు కూడానా?" ముఖం చిట్లించింది శ్రీమతి.
"ఎవరి బలహీనతలు వాళ్ళకి ఉంటాయి. ఇక మీదట చూసుకో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో " నిజాయితీగా అన్నాను.
"చేతులు కాలాక ఆకులు పట్టుకునే నైజం మరి" మూతి వంకర్లు తిప్పింది శ్రీమతి.
" 'వంతెన రాక ముందే వంతెనను దాటడానికి ప్రయత్నించకూడదు' అన్న ఆంగ్ల సామెత గుర్తు లేదా? ఎప్పుడో రాబోయే కష్టాన్ని వచ్చేసినట్లు ఊహించేసుకుని గాబరా పడి పోవడం అవివేకం" నా పాండిత్యాన్ని ప్రదర్శించాను.
"అదే ఆంగ్లంలో ' రోగం కంటే టీకా నయం ' అనే భావన వచ్చే సామెత కూడా ఉంది. అది మీకు గుర్తు లేదా? అయినా మీ టెస్ట్ రిపోర్ట్ పట్టుకుని వైద్యం కోసం డాక్టర్ గారి దగ్గరకు వెళ్లకుండా స్వంత వైద్యం చేసుకోవడానికి ప్రణాళికలు రచించుకోవడం ఏమిటండీ బాబూ?" విసుక్కుంది శ్రీమతి.
"షుగర్ వ్యాధి అనేది ఒక పెద్ద మెడికల్ మాఫియా అని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఆ మెడికల్ మాఫియాతో చేతులు కలిపి అవసరమైతే షుగర్ లెవెల్స్ ను తగ్గించేస్తారని కొందరు చెప్పగా వినలేదా?" నాకున్న పరిమిత జ్ఞానంతో శ్రీమతిని ప్రశ్నించాను.
"మిమ్మల్ని మార్చాలని అనుకోవడం నా తెలివితక్కువతనం. మొండి వాడు రాజు కంటే బలవంతుడని ఊరికే అన్నారా?" చిరాకు పడుతూ భోజనాలు వడ్డించడానికి లేచింది శ్రీమతి.
---------------------------------------------------------------
"ఏం జరిగింది?" కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శ్రీమతిని నీరసంగా ప్రశ్నించాను.
"ఉన్నట్లుండి నిన్న మధ్యాహ్నం మీరు ఇంట్లో స్పృహ తప్పి పడిపోతే మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఇప్పుడు మీకు స్పృహ వచ్చింది" శ్రీమతి జవాబుకి ఆశ్చర్యపోతూ ...
"డాక్టర్ గారు ఏమంటున్నారు?" ఆతృతగా అడిగాను.
"మీకు షుగర్, బీ.పీ., చాలా ఎక్కువగా ఉన్నాయంట. అవి నార్మల్ కి వచ్చేదాకా మీరు హాస్పిటల్ లోనే ఉండాలని అంటున్నారు"
"అదేమిటీ, నాకు షుగర్ తగ్గలేదా? బీ.పీ., కొత్తగా ఎప్పుడు వచ్చింది?" ఇంకోసారి ఆశ్చర్యపోయాను.
"యూ ట్యూబ్ లో వీడియోలు చూసుకుంటూ నెల రోజుల నుండి మీరు చేసుకుంటున్న స్వంత వైద్యం వికటించి, మీకు షుగర్ వ్యాధి తగ్గక పోగా ఇప్పుడు బీ.పీ., మీకు బోనస్ గా వచ్చిందంట. సమయానికి మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకుని రాబట్టి మీకు పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్ గారు చెప్పారు" బొంగురు పోయిన గొంతుతో శ్రీమతి చెబుతుంటే నా ఒళ్ళు ఒక్కసారి జలధరించింది.
యూ ట్యూబ్ వీడియోలలో అంత మంది అంత నమ్మకంగా చెప్పిన పద్ధతులు నాకు ఎందుకు వికటించాయో అర్థం కాక బుర్ర గోక్కుంటూ వార్డుని పరిశీలిస్తుంటే డాక్టర్ గారు రావడం కనిపించింది.
"ఈ రోజుల్లో, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళే కాక అది లేని వాళ్ళు కూడా యూ ట్యూబ్ లో వీడియోలు విరివిగా పెట్టేస్తుండడంతో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితి. శరీర తత్వాలు, స్పందనలు, మనిషి , మనిషికీ మారుతుంటాయి. ప్రామాణికం కాని వీడియోల లోని పద్ధతులను గుడ్డిగా నమ్మి , ఆచరిస్తే , ఇలాగే కష్టాల పాలవుతారు" డాక్టర్ గారు నా పక్కన ఉన్న రోగితో చెబుతుంటే ఆ రోగి కూడా నా లాంటి మేధావే నన్న మాట అన్న భావన కలగగానే అంత నీరసంలోనూ నా పెదవుల పై చిరునవ్వు నాట్యం చేసింది.
*****************
దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని దిగువ ఫోన్ నెంబర్ కి వాట్సప్ ద్వారా తెలియజేయండి
*8897027778*
No comments:
Post a Comment