🌹 *మాట మహాత్యం*🌹
*యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు 'లోకంలో అత్యంత పదునైనది ఏదీ’ అని ప్రశ్నించి ఉంటే దానికి ధర్మరాజు 'మానవుడి మాట' అని సమాధానం చెప్పి ఉండేవాడేమో! ఎందుకంటే మన మాటకు అంతటి మహత్తర శక్తి ఉంది. ఈ శక్తి ఇటు అనుకూలంగానూ అటు ప్రతికూలంగానూ ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి ఒక మంచిమాట చాలు. అది వారికి సంజీవనిలా పనిచేస్తుంది. నిందతో కూడిన మాట పరుషంగా ఉంటుంది. అది ఎదుటివారిని మెత్తగా గాయపరుస్తుంది. వెరసి, మాట అగ్గిపుల్ల లాంటిది. దానితో దీపం వెలిగించుకోవచ్చు. దేన్నైనా తగులబెట్టవచ్చు. ఏ విధంగా చూసినా మన మాట చాలా శక్తిమంతమైనది.*
*ఏది ఒకరికి మేలు చేస్తుందో అది మంచి మాట. ఏది ఒకరికి కీడు చేస్తుందో అది చెడ్డ మాట. మంచి మాటలో సారాన్ని గ్రహించి మేలు పొందిన పురాణ పురుషులు ఎందరో ఉన్నారు. పెద్దలు చెప్పిన మంచి మాట విని ఉన్నత స్థాయికి ఎదిగిన మానవమూర్తులూ ఉన్నారు. చెడ్డ మాటలు విని అష్టకష్టాలు పడ్డ దేవతలూ ఉన్నారు, మానవులూ ఉన్నారు. కనుక మాటను వదలడంతో పాటు మాటను స్వీకరించడంలోనూ జాగ్రత్త వహించి వాడిన మాట, విసిరిన రాయి తిరిగి రావు అంటారు పెద్దలు. ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నాం అనే స్పృహ కచ్చితంగా ఉండాలి. మనకంటే చిన్న వాళ్ళతోనో, సేవకులతోనో మాట్లాడే సందర్భాల్లో మనకు తెలీకుండానే ఒక విధమైన అహం మనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని నియంత్రించుకుంటే మన మాటలు ఎదుటివారి మెడలో ముత్యాల మాలలవుతాయి.*
*లోకంలో అందరూ ఒకే విధమైన తెలివితేటలతో ఉండరు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో ఎవరో ఒకరిది పైచేయిగా ఉంటుంది. అది వారి విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తిని బట్టి ఉంటుంది. సమాజంలో ఎప్పుడూ ఇద్దరు వ్యక్తుల సంభాషణ అర్థవంతంగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకడు వివేకవంతుడైతే, రెండోవాడు చురుకైనవాడు. వివేకవంతుడికి ఏది మాట్లాడాలో ఏది కూడదో అనే వివేకం ఉంటుంది. చురుకైన వ్యక్తికి ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుస్తుంది. మన దగ్గర చాలా పాండిత్యం ఉండవచ్చు. కానీ ఏది అవసరమో అదే మాట్లాడటం వల్ల ఆ మాటలకు విలువ దక్కుతుంది.*
*మాటలు ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలో చాలా వేల ఏళ్ల క్రితం గౌతమబుద్ధుడు చెప్పాడు. వ్యర్థమైన మాటల కంటే మౌనం చాలా గొప్పదన్నాడు బుద్ధుడు. భిక్షాటన సమయంలో కొందరు గృహస్థులు బుద్ధుణ్ని దూషించేవారు. అటువంటి సందర్భాల్లో చిరునవ్వే సమాధానంగా ఇచ్చేవాడు బుద్ధుడు. ఎందుకంటే అటువంటివారితో వాదులాడటం వల్ల సమయం వృథా అని అతనికి తెలుసు. వారిని బుద్ధుడు నిందించడం కూడా చేసేవాడు కాదు. ఎందుకంటే పరనింద వల్ల తన ప్రశాంతత కూడా పోతుంది కదా!*
*మాట తీరు సంస్కారానికి నిదర్శనం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం గొప్ప కాదు. ఎదుటివారిని నొప్పించని మాట చిన్నదైనా గొప్పదే. అర్థవంతమైన మాటకు ఎప్పుడూ విలువ ఉంటుంది. సముచితమైన మాట సందర్భాన్ని సార్ధకం చేస్తుంది.*
🙏 *సర్వేజనా సుఖినోభవంతు* 🙏
No comments:
Post a Comment