Wednesday, May 7, 2025

****అరుణగిరినాథర్

 


*అరుణగిరినాథర్*
------------------------

అరుణాచలేశ్వరుని ప్రధాన రాజగోపురం దాటగానే కుడివైపు వేయిస్థంబాల మండపం....

ఆ మండపమే మన బాల రమణుడికి తొలి విడిది(1-9-1896)

ఇంటి నుంచి మూడు రోజులపాటు చేసిన ప్రయాణ బడలిక  తరువాత విశ్రాంతిగా కూర్చొన్నది ఇప్పుడే, ఈ మండపంలోనే.

శివునికి సర్వస్య శరణాగతి చెంది పరమవిశ్రాంతిలో ఉన్నాడు.

ముప్పొద్దులా పుష్టిగా తినే 16 ఏళ్ళ యువకుడు....ఆకలితో నకనకలాడుతున్నాడు....

ఆకలి శారీరక రోగం.
అన్నం ఆకలికి వైద్యం.

తననే నమ్ముకుని వచ్చిన బిడ్డను 
శివుడు ఎలా వొదులుతాడు.

ప్రాప్తం ఉంటే అడవిలో ఉన్నా 
అన్నం దొరుకుతుంది అంటారు.

శివసామ్రాజ్యమైన అరుణాచలంలో శివశిశువులకు అన్నం దొరకదా?

వేయికాళ్ళ మండపం పక్కనే గోపురసుబ్రహ్మణ్యేశ్వరాలయం ఉంది. 

ఆ ఆలయంలో మౌనస్వామి అని ఓ సాధువు ఉండేవాడు. భిక్ష చేసుకుని, గోపురం సుబ్రహ్మణ్యస్వామి నీడలో గడిపేవాడు.

ఈ మౌనస్వామి బాలరమణుణ్ణి తొలిసారిగా గమనించాడు.

బాలరమణుని అలక్ష్యాన్ని, స్థిమితత్వాన్ని చూసి దగ్గరకు వచ్చాడు...

బాలుడు ఆహారంలేక నీరసంగా ఉన్నట్టు కనబడ్డాడు...

ఆ స్వామి నిన్న తాను తెచ్చుకున్న భిక్షాన్నం రాత్రంతా నీళ్లలో నాన బెట్టింది తెచ్చాడు....

పెద్ద పెద్ద మెతుకులు...
పైన ఉప్పుకల్లు....
అడుగున పుల్లటి నీళ్లు...
నంచుకునేందుకు ఊరగాయ బద్ద...

ఆ భిక్షాన్నమే ఆదిభిక్షువు ప్రసాదించిన తొలిభిక్ష.

కొన్ని దశాబ్దాల క్రితం ఈ గోపురసుబ్రహ్మణ్యేశ్వర ఆలయ గోపురం పైకెక్కి ఓ విరక్తుడు తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి కిందకు దూకేసాడు.....

సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే ప్రత్యక్షమై, తన రెండు చేతులు జాచి ఆ విరక్తుణ్ణి కాపాడాడు....

ఆ విరక్తుడే - అరుణగిరినాథర్.

* * *

అరుణగిరినాథర్ పుట్టింది అరుణాచలమే. 

ఓ వేశ్యా కుటుంబంలో పుట్టాడు.

తల్లి చనిపోతూ.... ఇతణ్ణి తన కూతురి చేతిలో పెట్టి, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోమ్మా... అంటూ కన్నుమూసింది....

స్వాతహాగానే ఏ అక్కకైనా తమ్ముడంటే ప్రీతి ఉంటుంది. పైగా తల్లికి మాట ఇచ్చింది. 

అక్క సంరక్షణలో గారాబంగా పెరిగాడు అరుణగిరినాథర్.

వయసొచ్చేసరికి స్త్రీలోలుడయ్యాడు...

అక్క తన వేశ్యావృత్తిలో "కాయ"కష్టంతో సంపాదించినదంతా తన ప్రియురాళ్లకు దారబోస్తున్నాడు. 

అక్క దాచిన ధనాన్నంతా దోచుకెళ్ళాడు.
అక్క వొంటి మీదున్న నగలన్నీ వొలుచుకెళ్ళాడు.

ఇల్లు, ఒళ్ళు గుల్ల అయ్యింది...

ఇక తమ్ముడికి ఇవ్వడానికి తన వద్ద ఏమీలేదు...

ఓ రోజు వచ్చి డబ్బు కావాలని హఠం చేసాడు....

"తమ్ముడూ... నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ మిగిలి లేదురా...! ఇక మిగిలింది నా ఒక్క శరీరమే.... నీకు ధనం కావలసింది స్త్రీ సుఖం కోసమేగా.... మనకు తల్లి ఒకటేగానీ, తండ్రులు వేరే. కాబట్టి నా శరీరాన్ని నీ సుఖం కోసం వాడుకో తప్పులేదు..." అంటూ తమ్ముడి ముందు వలువలు వొలిచి నగ్నంగా నిలబడింది.

అదిరిపోయాడు అరుణగిరినాథర్...
బుర్ర తిరిగి పోయింది...
ఊహించని పరిణామం...

అమ్మ తరువాత అమ్మ - అక్క.
అక్కను అలా చూడలేక కళ్లు మూసుకున్నాడు.

తన కళ్ళకు కమ్మిన పొరలన్నీ తొలిగిపోయాయి....

మనోఫలకంలో ... అరుణాచలేశ్వర ఆలయం గోచరించింది.

శివసన్నిధిలో తన పాపపంకిలమైన జీవితాన్ని అంతం చేసుకోవాలని అనిపించింది.

పరుగున అరుణాచలేశ్వర ఆలయంలోకి ప్రవేశించాడు...

రాజగోపురం దాటి, వేగాళ్ళ మండపం దాటుకుని, గోపురసుబ్రహ్మణ్యేశ్వర ఆలయ గోపురం పైకెక్కి, గబాలున అక్కణ్ణుంచి దూకేసాడు...

సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే ప్రత్యక్షమై, తన పవిత్రహస్తాలను చాపి, పరివర్తనం చెందిన తన బిడ్డను రక్షించాడు.

బండల మీద పడి, ముక్కలు కావలసిన తన శరీరం, విచిత్రంగా మెత్తటి అమృతహస్తాలపై పడి ఉండడం గమనించాడు.

స్వయంగా సుబ్రహ్మణ్యుడే అతనికి జపమాల ఇచ్చి, అరుణగిరినాథర్ నాలుకపై శ-ర-వ-ణ-భ-వ అనే షడాక్షర మంత్రాన్ని వ్రాసి దీక్షనిచ్చారు.

అరుణగిరినాథర్ జీవితం క్షణాల్లో మారిపోయింది.

అరుణగిరినాథర్ ఇప్పుడు విరాగి, యోగి, భక్తుడు, కవి, గాయకుడు.... 

తన ఇష్ట దైవమైన సుబ్రహ్మణ్యేశ్వరునిపై వేల కీర్తనలు రచించి పాడారు. 

అవే "తిరుప్పుగళ్" అనే పేరుతో లోకప్రసిద్ధ మైనాయి.

* * *

ఆ రోజుల్లో అరుణాచలం ప్రౌడదేవరాయులు రాజ్యలో ఉన్నది.

అరుణగిరినాథర్ యొక్క కవిత్వం, సంగీతం నచ్చి, అతనంటే అభిమానం ఏర్పడింది రాజుకు.

ఆస్థాన కవి సంబంధ ఆండన్ కు అరుణగిరినాథర్ మీద అసూయ ఏర్పడింది. 

సంబంధ ఆండన్ రాజును రెచ్చగొట్టాడు -

ప్రభూ...! అరుణగిరినాథర్ నిజమైన స్వామి భక్తుడే అయితే, మీకు కూడా స్వామి దర్శనం చేయించవచ్చును కదా...అన్నాడు.

నిజమే కదా అనిపించింది రాజుకు.

రాజు అరుణగిరినాథర్ ను ఆదేశించాడు...
అరుణగిరినాథర్ స్వామిని ప్రార్ధించాడు...

"ఓ అరుణాగిరీ...విను...!
అన్య మతాన్ని ఆదరిస్తున్న ఆ రాజుకు నా దర్శనం వల్ల కంటిచూపు పోయే ప్రమాదం ఉంది." అని కుమారస్వామి హెచ్చరించాడు.

అరుణగిరినాథర్ అదే విన్నవించాడు రాజుకు.

"కళ్లు పోయినా పర్వాలేదు, ఈ కళ్ళతో స్వామిని దర్శించాల్సిందే" అని పట్టుబట్టాడు రాజు.

వెంటనే అరుణగిరినాథర్ స్వామిపై స్తోత్రం పాడాడు...

అరుణాచల దేవాలయంలో నాట్యమండపంలోని ఈశాన్య స్థంభంలో స్వామి తేజోమూర్తిగా గోచరమయ్యాడు.

వెంటనే, రాజుకు చూపు కోల్పోయి, అంతా అంధకారం అలుముకుంది.

రాజుకు బుద్ధి రాలేదు సరికదా...
పైగా అరుణగిరినాథర్ పై కక్ష పెంచుకున్నాడు...

స్వర్గానికెళ్లి, పారిజాతపుష్పాలను తీసుకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు...

యోగవిద్యలో ఆరితేరిన అరుణగిరినాథర్ పరకాయ ప్రవేశ విద్యతో తన శరీరాన్ని విడిచి, ఓ  చిలుకశరీరంలోకి ప్రవేశించి, స్వర్గానికి ఎగిరాడు...

ఈ లోపు అరుణగిరినాథర్ శరీరాన్ని కాల్చి బూడిద చేస్తాడు  రాజు. 

చిలుకరూపంలో ఉన్న అరుణగిరినాథర్ తిరిగి పుష్పాలను తీసుకొచ్చి చూడగా...
తన మానవశరీరం కనబడలేదు. 

ఇక చేసేది ఏమీలేక పాపం ఆ మహా యోగి చిలుక రూపంలోనే ఉంటూ, తన పరివారంతో అరుణాచల గోపురాలను ప్రదక్షిణం చేసుకుంటూ... "స్కంద అనుభూతి" అనే కావ్యాన్ని శివునికి చిలుక భాషలో గానార్చన చేసుకుంటూ కాలం గడిపాడు.

ముఖ్యంగా ఆరుపడైవీడు(ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు) మీద అనేక కీర్తనలు వ్రాసారు.

దక్షిణాదివారు "ఆరుపడైవీడు" యాత్ర చేస్తుంటారు...

1. తిరుప్పరం కుండ్రమ్.
2. తిరుచ్చెందూర్
3. పళని
4. స్వామిమలై
5. తిరుత్తణి
6. పళముదిర్ చోళై 

ఈ ఆరు క్షేత్రలూ తమిళనాడులోనే ఉన్నాయి.

* * *

ఈ అరుణగిరినాథర్ కథకు సాక్ష్యాలుగా ఇప్పటికీ ఆయా కట్టడాలు అరుణాచలంలో చెక్కుచెదరక నిలబడి ఉండడం నేటి తరం చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవాలి.

1. గోపురసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి.
2. కిళి(చిలుక) గోపురం.
3. కంబత్తు ఇలయనార్(స్థంభ సుబ్రహ్మణ్యేశ్వర గుడి)
4. అరుణగిరినాథర్ దేవాలయం.

అరుణాచలేశ్వర ఆలయాన్ని కుటుంబ సమేతంగా... కాదు, కాదు... బంధు మిత్ర సమేతంగా దర్శించవలసిన ఆలయం.
 
ఇదొక పుణ్యభూమి. 
ఇక్కడ అడుగుపెట్టినవాడు ధన్యజీవి.

అరుణాచలానికి ఉన్నపళంగా బయలుదేరండి రమణుడిలా...

అటువంటి వారి కొరకు శివుని హస్తాలు ఎప్పుడూ  చాచబడే ఉంటాయి.

అవి గోపురాలు కావు...
భక్తుల విజయ కేతనాలు...

* * * 

అరుణగిరినాథర్ దివ్యగాధను విని నా శిష్యురాలు కిరణ్మయి తన్మయమై వ్రాసిన గీతిక -

విధివశాన చిలకవై
కిళి గోపురం మీద నెలవై
అరుణగిరి దర్శకులకు దార్శనికతనందించి, 
గోపురానికి నామధేయాన్నొసగేంతటి
మహిమాన్విత భక్తి
జీవితాన్ని జీవించిన 
అరుణగిరినాథా...!
అఖండ భక్తిని మాకు ప్రసాదించరాదా...!

* * *

జ్ఞానశిశువు
9533667918

No comments:

Post a Comment