*ధనమేహమూ ప్రమాదమే*
సాధారణంగా యంత్రాలకు విద్యుత్తు, చమురులాగా శక్తిని విడుదల చేసే ఇంధనం ఏదో ఒకటి అవసరం. అలాగే మన శరీరానికీ పని చేయడానికి ఇంధనం కావాలి. గాలి, నీరు, ఆహారం ఆ బాధ్యత నిర్వర్తిస్తాయి. ఆహారమనే ఇంధనంలో ప్రకృతిసిద్ధంగా ఉండే చక్కెర వల్లనే మనం చేస్తున్న పనికి సరిపడా శక్తి లభిస్తుంది. చక్కెర తక్కువైతే అశక్తత ఆవహిస్తుంది. ఎక్కువైతే స్థూలకాయం, ఇతర సమస్యలు మొదలవుతాయి. చేస్తున్న పనికి సరిగ్గా సరిపడా చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం అందరికీ అన్నివేళలా సాధ్యం కాదు. అయితే ఆరోగ్యవంతుడి శరీరంలో చక్కెర హెచ్చుతగ్గులు సమస్యాత్మకం కాకుండా నియంత్రించే వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంటుంది. ఏ యంత్రానికైనా ఇంధన వినియోగంలో సరైన నియంత్రణ లేకపోతే పర్యవసానం ప్రమాదకరం కావచ్చు.
ఆరోగ్యవంతమైన జీవనానికి మంచి ఆహారంతో పాటు మౌలిక అవసరాలు మరికొన్ని ఉన్నాయి. అవన్నీ సమకూర్చుకునే శక్తినిచ్చే ఇంధనమే ధనం. జీవన గమనానికి అదే ఇంధనం. యంత్రానికి ఇంధన నియంత్రణ ఆవశ్యకతలాగే జీవితానికి ధన నియంత్రణ అవసరం. అందుకే ధనార్జన, వ్యయాల పరిమితుల్లో విచక్షణ లేకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చేతినిండా డబ్బుంటే ఆకర్షణీయంగా కనిపించే ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఆడంబరంగా బతకాలనిపిస్తుంది. సమయం కాకపోయినా, ఆకలి వేయకపోయినా రుచికోసం తినాలనిపిస్తుంది. జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుందన్న ఆలోచనే రాదు. మనోనియంత్రణతో ఆరోగ్యంగా జీవించాలనే విషయం జ్ఞాపకం ఉండదు. ఆరోగ్యానికి నష్టం కలిగించనంతవరకు సంపాదన ఎంతున్నా పరవాలేదు.
చక్కెర వ్యాధిని మధుమేహం అన్నట్లు, ధన వినియోగ నియంత్రణలో లోపాన్ని ధనమేహం అనవచ్చు. ధనంతో అనేక వస్తువులు కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేం. సంపాదనే ప్రధానంగా పగలూరాత్రి తేడా లేకుండా పడే శ్రమవల్ల శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా కష్టమే. చికిత్స కన్నా నివారణ ఉత్తమమైంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పాడైన భాగాన్ని సాధారణ స్థితికి తేవడం అసాధ్యం. ఎంతటి ఆస్తిపరులకైనా అనారోగ్య సమస్య కలిగితే జీవితం స్వాధీనం తప్పుతుంది. అలాంటి జీవితం ఎవరికైనా బాధాకరమే.
నిజానికి ధనంవల్ల, బలంవల్ల, పదవివల్ల కార్యసాధక శక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అయితే అహంకారంగా మారనంతవరకే ఏ శక్తి అయినా నియంత్రణలో ఉన్నట్లు. పెరుగుతున్న సంపాదన నిరాడంబరంగా బతకాలనుకునే యోగిని సైతం భోగిలా మారుస్తుంది. భోగిగా మారే మనిషి కష్టపడటానికి ఇష్టపడడు. ఏ రకమైన శారీరక శ్రమా లేనప్పుడే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ధనార్జన శక్తి, అవకాశం భగవంతుడి ఆశీస్సులతో ప్రాప్తిస్తున్నాయనే భావన ఉన్నంత కాలం అహంకారం చోటు చేసుకోదు. భగవంతుడిపట్ల కృతజ్ఞతతో, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారికి జీవితం నల్లేరుపై బండి నడకలాగ క్షేమంగా సాగుతుంది.
~దువ్వూరి రామకృష్ణ వరప్రసాదు
(ఈనాడు అంతర్యామి)
No comments:
Post a Comment