Sunday, August 10, 2025

 *_ఆగస్టు 09,..... "ప్రపంచ ఆదివాసీ దినోత్సవం" సందర్భంగా..._*

*=========(((🥳)))=========*
_[ఒక విజ్ఞప్తి:.... ఈ విషయం మొత్తం చదవండి. చివరలో ఒక విశేషం ఉంది. ఏంటంటే... గిరిజన ఆవాసాలలో నేను వారితో కలసి పన్నెండు రోజుల పాటు గడిపిన నా స్వీయ అనుభవాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలనూ జతచేయడమైనది.... --వెలిశెట్టి నారాయణరావు 🙏]_ 

*"ఆదివాసీల హక్కులు - వారిజీవనప్రమాణాలు" పెంచాలంటూ 60 దేశాల సంతకాలతో ఐక్యరాజ్యసమితి 1994 డిశంబర్లో దీనిని డిక్లెయిర్ చేసింది.* 

*భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆచారాలు,  దుస్తులు మొదలైనవి ఇతర వ్యక్తుల నుండి భిన్నంగా ఉంటాయి. సమాజంలోని ప్రధాన స్రవంతి నుండి తొలగించబడిన కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రజలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారు. ఏదేమైనా, సమాజంలోని ప్రధాన స్రవంతితో వారిని కలపడానికి, ముందుకు సాగడానికి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలు,  ప్రభుత్వేతర కార్యక్రమాలు దేశవ్యాప్తంగానూ.. ప్రపంచమంతా అమలు చేస్తున్నారు.  మనదేశ విషయానికి వస్తే.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో  గిరిజన సమాజంలోని ప్రజలు ఎంతో దోహదపడ్డారు. బిర్సా ముండా జార్ఖండ్, చోటనాగ్పూర్ ప్రాంతంలోనూ, అలాగే ఏపీలోని విశాఖ జిల్లా మన్యం ప్రజలు ఇంకా వివిధ ప్రాంతాల గిరిజన ప్రజలు మన స్వాతంత్రోద్యమంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. ఈ రోజు (ఆగస్టు 9) ప్రపంచ గిరిజన దినోత్సవం. ఈ సందర్భంగా గిరిజన దినోత్సవం గురించి ముఖ్య విశేషాలు తెలుసుకుందాం.*

*ప్రపంచంలోని 90 కి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు 37 కోట్లు. ఇందులో దాదాపు 5000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి. వారికి సుమారు 7 వేల భాషలు ఉన్నాయి. అయినప్పటికీ, గిరిజన ప్రజలు తమ ఉనికిని, సంస్కృతిని, గౌరవాన్ని కాపాడటానికి పోరాడవలసి వస్తుంది. నేడు, ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకారం, వర్ణవివక్ష, సరళీకరణ వంటి అనేక కారణాల వల్ల, గిరిజన ప్రజలు తమ ఉనికిని, గౌరవాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. జార్ఖండ్ మొత్తం జనాభాలో 28 శాతం గిరిజన సమాజానికి చెందిన ప్రజలు. వీరిలో సంతాల్, బంజారా, బిహోర్, చెరో, గోండ్, హో, ఖోండ్, లోహ్రా, మాయి, పహరియా, ముండా, ఒరాన్ మొదలైన ముప్పై రెండు కంటే ఎక్కువ గిరిజన సమూహాల ప్రజలు ఉన్నారు.*

*గిరిజన సమాజాన్ని ఉద్ధరించడం, వారి సంస్కృతి అదేవిధంగా, వారి గౌరవాన్ని కాపాడటమే కాకుండా గిరిజన తెగలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా నిర్వహిస్తారు.*

*ఈ రోజున, ఐక్యరాజ్యసమితి, అనేక దేశాల ప్రభుత్వ సంస్థలు, అలాగే గిరిజన సంఘాల ప్రజలు, గిరిజన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సామూహిక వేడుకలను నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమాలలో, వివిధ చర్చలు, సమావేశాలతో పాటూ పలు రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.*

*_అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?..._* 

*1994 లో అమెరికాలో మొదటిసారిగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి, ప్రతి ఏటా ఆగస్టు 9 వ తేదీని ప్రపంచవ్యాప్తంగా గిరిజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1994 లో మొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల సంవత్సరంగా ప్రకటించింది.*

*అదే సమయంలో, 1995-2004 మొదటి అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు.  2005-2015ని 2004 లో రెండవ అంతర్జాతీయ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి  ప్రకటించింది.* 
*ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, 23 డిసెంబర్ 1994 లో  49/214 తీర్మానం ద్వారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 9 ని అంతర్జాతీయ దినంగా ప్రకటించింది. దీని తరువాత, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని మొదటిసారిగా 9 ఆగస్టు 1995 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.*

*_ఆగస్టు 9వ తేదీనే ఎందుకు?_*

*ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడంలో అమెరికాలోని గిరిజనులకు ముఖ్యమైన సహకారం ఉంది. కొలంబస్ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 12 న అమెరికా దేశాలలో జరుపుకుంటారు. కొలంబస్ వలస పాలన వ్యవస్థను ప్రోత్సహించారని ఆదివాసులు విశ్వసిస్తారు. దీంతో పెద్ద ఎత్తున మారణహోమం జరిగిందని అక్కడి గిరిజనులు భావిస్తారు.  అందువల్ల, కొలంబస్ డే కాకుండా, గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు.*

*1977 లో, జెనీవాలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. ఇక్కడ కొలంబస్ దినోత్సవానికి బదులుగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని డిమాండ్ తెరమీదకు గట్టిగా వచ్చింది.  దీని తరువాత, పోరాటం కొనసాగింది. తరువాత ఆదివాసీ సంఘం 1989 నుండి అదేరోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. దీనికి మరింత ప్రజా మద్దతు లభించింది. తరువాత అక్టోబర్ 12, 1992 న, అమెరికా దేశాలలో కొలంబస్ డే స్థానంలో గిరిజన దినోత్సవాన్ని జరుపుకునే పద్ధతి ప్రారంభమైంది.*

*తరువాత ఐక్యరాజ్యసమితి ఆదివాసీ సంఘం హక్కుల కోసం అంతర్జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది, దీని మొదటి సమావేశం 1982 ఆగస్టు 9 న జెనీవాలో జరిగింది. ఈ సమావేశం జ్ఞాపకార్థం, ఆగస్టు 9 తేదీని ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఆగస్టు 9వ తేదీ గిరిజన దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.*

*వాస్తవానికి మానవజాతి మొత్తం ఆదివాసీ తెగకు సంబంధించినదే. తొలిమానవుని ప్రస్థానం మొదలైంది దట్టమైన అటవీ ప్రాంతపు పర్వతసానువులలోనే... అయితే తెలివి పెరిగేకొద్ది అడవులను వదిలి మైదానప్రాంతాలకు వలసవచ్చి స్థిరపడ్డారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో నాగరికత అంటే ఏమిటో తెలియని ఆదివాసీ తెగలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడువేల భాషలుంటే అందులో నాలుగువేలభాషలు ఆదివాసీలు మాట్లాడేవే..*  

   *మనదేశంలో కూడా చాలా ఆదివాసీ జాతులున్నాయి.... గోండులు, కొలాములు, కోయలు, సంతానులు, మాళవులు, బిల్లులు, ముండా, చెంచులు, చల్లాయానాదులు, ఇలా ఎక్కువగా వున్నారు. అండమాన్ నికోబార్ దీవులలో ఈ నాటికీ నాగరికత మొహం చూడని ఆదివాసీలుండగా అందులో ఒక తెగ మన తెలుగుభాష మాట్లాడుతుంది.*
     *ఆదివాసీలు ఎక్కువగా అటవీసంపద, వేటాడటం ద్వారా జీవనం సాగిస్తారు. కట్టుబాట్లు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. సొంత వైద్యవిధానం వీళ్ళ సొత్తు. చాలావరకు స్వతంత్రంగా ఉండేందుకే మక్కువ చూపిస్తారు.* 

*అయితే కొందరు స్వార్థపరుల వల్ల అటవీ సంపద కరిగిపోవడం, బహుళార్థ సాధక  నీటిప్రాజెక్ట్ ల వల్ల వారి జీవనానికి ప్రమాదం ఏర్పడి, మైదానప్రాంతాలకు రావలసివస్తుంది. అయితే ప్రభుత్వాలు అంత శ్రద్ధపెట్టక పోవడం వల్ల వారి ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వస్తుంది. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వాలు వారికి తగిన పునరావాసం కల్పించాలి. మన రాష్ట్రంలో చల్లాయానాదుల పరిస్థితి చాలా ఘోరంగా వుంది. అన్నింట్లో వాళ్ళు చాలా వెనకబడిపోయారు. ఇంకా చిన్నచిన్న పూరిపాకలు, చెట్లక్రింద నివాసం సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వారి అభివృద్దికి తగినచర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.*
    
*కొండకోనల్లో అడవుల మధ్య బతుకుతూ.. ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. కల్మషం లేని మనస్సు వారి సొంతం. డోలు చప్పుళ్ళు, నృత్యాలు, గుస్సాడి, ధింసా.. వేషధారణల మేళవింపు గిరిజనుల జీవన శైలి..*
  
  *_Today.... Tuesday, 9th August 2022... "International Indigenous Day" 2022: అడవి బిడ్డలకు వందనం... నేడు "అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం_*

 *కొండకోనల్లో అడవుల మధ్య బతుకుతూ.. ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. కల్మషం లేని మనస్సు వారి సొంతం. డోలు చప్పుల్లు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు గిరిజనుల జీవన శైలి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఆదివాసీల జీవనస్థితిగతుల్లో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించదు. నేటికి వైద్యం, విద్య, మౌలికవసతుల కల్పన వంటి వాటికి గిరిజన గ్రామాలు ఇంకా దూరంగానే ఉన్నాయి.*  

*75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో పాలకులు మారినా అడవి బిడ్డల బతుకులు మారడంలేదు. అడవి తల్లిని వదిలి బయటకు రావడానికి గిరిజనులు ఇష్టపడరు. కష్టమైనా.. నష్టమైనా అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. నేటికి ఆదీవాసీల గ్రామాల్లో రవాణా వ్యవస్థ సరిగ్గాలేదనది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆదివాసీ బిడ్డను దేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకుని ఆదివాసీలకు తగిన గౌరవం ఇచ్చిన ఘనత భారతదేశ ప్రజాస్వామ్యానికే దక్కుతుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి పీఠమెక్కడం బ్యూటీ ఆఫ్ డెమెక్రసీగా చెప్పుకోవచ్చు.. అయితే కేవలం ఒక గిరిజన మహిళను అత్యున్నత పీఠంపైకి ఎక్కించడంతోనే సరిపోదు.* 

*దేశవ్యాప్తంగా గిరిజన ప్రజలకు వారి హక్కుల పరిరక్షణతో పాటు, ఆహార భద్రత, ఆరోగ్య భద్రతతో జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు నిజాయితీగా చేయాలి. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతోమంది గిరిజన నాయకులు ప్రముఖ పాత్ర పోషించారు.*
*=-=-=-=-=-=-=-=-=-=-=-=-=*
*_{ఇదంతా సేకరించిన విషయమే కానీ...  ఇప్పుడు నా సొంత అనుభవాలను కూడా మీతో పంచుకోవాలి అనిపిస్తోంది._* 
*_అప్పుడే... 1997 లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  'District Primary Education Programme' (DPEP) అమలులోకి వచ్చింది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ కి State project Director గా... శ్రీ గిరిధర్, IAS గారు ఉన్నారు. అలాగే శ్రీ సోమేష్ కుమార్, IAS.. గారు (ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ) special officer గా ఉంటూ.. "Community Mobilisation Training" ను డిజైన్ చేసి స్టేట్ రీసోర్స్ గ్రూపును తయారు చేశారు. అందులో నేనూ ఒక SRG నే!!!... తర్వాత మాద్వారా రాష్ట్రంలోని District Resource Persons (DRP) కూ, వారిద్వారా Mandal Resource Persons(MRP) కి ఆ శిక్షణ ఇప్పించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో అనేక సెంటర్లలో జరిపే అలాంటి శిక్షణా కార్యక్రమంలో భాగంగా.. 1998 మార్చి నెలలో... 30 మంది DRP లకి విశాఖ జిల్లా, అరకువేలి లోని 'ప్రభుత్వ గిరిజన ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం' లో జరిగే కార్యక్రమంలో నన్ను, నాకు సహాయకులుగా మరో ఇద్దరినీ ట్రైనర్స్ గా పంపారు. అరకులోయ సెంటర్ కి ప్రత్యేకంగా నన్ను శ్రీ సోమేష్ కుమార్ IAS గారే కావాలని ఎంపిక చేశానని నాతో చెప్పారు. ఆ శిక్షణ ఎలా ఉంటుందంటే... మొదట ఐదు రోజులపాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆ 30మంది డి. ఆర్. పీ. లకు PRA.. technics..లో (Participatory Rural Appraisal,) శిక్షణ ఇవ్వాలి, తర్వాత  వారిని ఆరు గిరిజన తండాలలో ఐదేసి మందిని కేటాయించి పంపుతాము. వారు అక్కడ ఆదివాసీలతో నాలుగు రోజుల పాటు కలసి మెలసి ఉంటూ... వారికి పిల్లల విద్య యొక్క అవసరం గురించి అర్థమయ్యేలా PRA technics ను practical గా నేలపై గీయించి వివరించి చెబుతూ చైతన్యం చేయాలి. ఆ సమయంలో SRGలం అయిన మేము ఆ తండాలను రోజూ పర్యవేక్షించాలి. ఆ నాలుగు రోజుల అనుభవాలను వారు ఒక బుక్ లెట్ గా తయారు చేయాలి. తరువాత తిరిగి శిక్షణా కేంద్రానికి రావాలి. ఆపై మరలా మూడు రోజుల పాటు మొత్తం కార్యక్రమంపై సమీక్ష జరుపబడుతుంది._*

*_అప్పుడు ఆ గిరిజనుల సమక్షంలో మేమందరం కూడా చాలా వింతైన అనుభూతికి లోనయ్యాము. మొదటలో వారి స్వాగతం.... మూడు రోజులపాటు మాతో కలసి సహకరించడం.... చివరలో వారి ప్రసిద్ధ నృత్యం.. "థింసా" ను ప్రదర్శించి, మమ్మల్ని కూడా ఆ నృత్యంలో భాగస్వాములను చేసి, ఆనంద పరచినతీరూ... అదొక అమోఘమైన అనుభవం. ఇంకా వారి స్త్రీల వేషధారణ లాగా నాకు, మరియు నా కో-ట్రైనర్. కు వేసి.. అంటే చీరకట్టి, టవలుతో తలకు కొప్పులా చుట్టారు. వాళ్ళు సామూహికంగా ఒక పాటను పాడుతూ.. మాచేతకూడా పాడించారు. ఇంకా ఆ మూడు రోజులూ మా ట్రైనీస్ కి అత్యంత రుచికరంగా మంచిమంచి వంటలు వండి ఆప్యాయంగా తినిపించారట. నేను విజిట్ కు వెళ్లిన చోట నాకు మాత్రం ప్రత్యేకంగా శాకాహారమే వండిపెట్టారు. ఎందుకంటే అప్పటికే నేను మాంసాహారం మానేసి ఏడు సంవత్సరాలైంది. అన్నింటికన్నా ముఖ్యంగా... ప్రతి తండాలోనూ చివరిరోజు వీడ్కోలు పలికిన విధానం మరువలేని జ్ఞాపకమైంది. ముందుగానే ప్రతి కుటుంబం వారూ.. అడవిలో పూచే రకరకాల పూలను మాలలు కట్టి పెట్టుకున్నారు. ఆరోజు సాయంత్రం ఊరి చివరిదాకా తండా జనమంతా మా వెంట వచ్చారు. అక్కడ మమ్మల్ని ఆపి తండావైపు తిరిగి నిలబడమన్నారు. బిందెలతో తెచ్చిన నీళ్ళతో మాకు పాదాభిషేకం చేసి, పూలమాలలు మా మెడల్లో వేశారు. పళ్ళెంలో కర్పూరం వెలిగించి హారతిచ్చారు. నుదుట బొట్టు పెట్టారు. మేము బయలుదేరాక, వారు అలాగే నిలబడి మేము కనిపించినంత సేపూ చేతులు ఊపుతూ వీడ్కోలు పలికారు.. ఇది నాకైతే.. ఈ జన్మకు దక్కిన గొప్ప అదృష్టం అనిపిస్తోంది... అప్పట్లో సెల్ ఫోన్లు లేవుగనక ఫోటోలూ, వీడియోలూ తీయలేకపోయాం. టి. టి. సి. ప్రిన్సిపాల్ దగ్గరున్న ఒక కెమెరాతో కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ఫోటోలే తీయగలిగాము._*

*_ఇదీ విషయం. కొంచెం సుదీర్ఘంగానే ఉందికదా! అయినా ఇంతసేపూ ఓపికతో చదివినందుకు మీ సంస్కారానికి నిదర్శనం... ధన్యవాదాలతో.. --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా 🙏}_*

No comments:

Post a Comment