Sunday, August 10, 2025

 సాంప్రదాయం - సమస్యలు

రచన : *లక్ష్మీమదన్* 

________________

సంయుక్త పూల సజ్జ తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. పెరడంతా పూసిన పువ్వులతో ఆహ్లాదంగా ఉంది. 

ఎక్కువగా రోజు దేవుడి కోసం మందార, గన్నేరు, చామంతి పూలను కోయడం అలవాటు. వారం చూసుకుని కొన్ని తులసి దళాలు కోసి సజ్జలు పెట్టి దేవుడు గదిలో పెడుతుంది. 

స్కూలుకు వెళ్లక ముందు స్నానం చేసి దేవుడికి సంబంధించిన పనులు చేయమని తల్లి, తండ్రి నేర్పించారు. చెల్లి కూడా ఈ పనిలో సహాయం చేస్తుంది. 

స్మార్త సాంప్రదాయం పాటించే తండ్రి నారాయణ శాస్త్రి, పూజా చాలా నిష్ఠతో చేస్తాడు. శివుడికి అభిషేకం చేయడం, సాలగ్రామ పూజ చేయడం నిత్యకృత్యం.

పూజా కార్యక్రమం ముగించి, భార్య మడితో చేసిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి, భోజనం చేసి ఆఫీస్ వెళ్లడం అలవాటు.

"అమ్మ! పూల సజ్జ దేవుడి గదిలో పెట్టాను. మాకు టైం అయిపోతుంది భోజనం పెడతావా" ? అన్నది సంయుక్త. 

"అమ్మ! నేను దేవుడి గది శుభ్రం చేశాను. ఇంకా ఎంతసేపు భోజనం పెట్టు ? అన్నది చెల్లి స్వయంప్రభ.

అప్పుడే దేవుడి గదినుండి నైవేద్యం గిన్నెను తీసుకువస్తున్న చంద్రకళ..

"ఇదిగో నైవేద్యం ఇప్పుడే అయింది. కాస్త తొందరగ పీటలు  వేసి, కంచాలు పెట్టేసేయండి. అందరికీ ఒకేసారి వడ్డిస్తాను"అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళింది. అందరికీ వడ్డించసాగింది. ఉదయం హడావుడిగా ఉంటుంది కాబట్టి పప్పు, అన్నం మాత్రం తినేసి వెళతారు పిల్లలు.

నారాయణ శాస్త్రిగారు పూర్తి భోజనం చేసి వెళ్తారు. ఆయన బయట తినరు కాబట్టి మళ్ళీ రాత్రి వరకు ఏమి తినే అవకాశం ఉండదు. రాత్రికి ఇంటికి వచ్చాకే ఆయన భోజనం. 

ఇలా అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతుండేవి. అదే సాంప్రదాయం ఒంట బట్టించుకొని పిల్లలు పెరిగి పెద్ద వాళ్లవుతున్నారు. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.

పిల్లలకు పెళ్లి వయసు వచ్చింది. తగిన సంబంధం కోసం వెతుకుతూనే ఉన్నారు.

ఒకరోజు సంయుక్త..

"నాకు ఇక సంబంధాలు చూడకండి. నేను ఆఫీసులో నా కొలీగ్ సందీప్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత తను వాళ్ళింట్లో, నేను మన ఇంట్లో చెప్పాలని అనుకున్నాము" అని అన్నది. 

ఇంటి సభ్యులు పరిణితి కలిగిన వాళ్లు కాబట్టి దీనిని సానుకూలంగానే తీసుకున్నారు. అప్పట్లో కులం ఒకటే అయినా, శాఖ భేదా లు  ఎక్కువ చూసుకునేవారు.

తెలిసింది  ఏమిటంటే, అబ్బాయివాళ్లు వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు. ఇంట్లో పెద్దగా వ్యతిరేకత ఏమీ రాలేదు కానీ బంధు వర్గంలో నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. 

ఇటు అబ్బాయి సందీప్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. కాకపోతే స్మార్త సాంప్రదాయంలో పెరిగింది కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో పద్ధతి ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. అందుకు సంయుక్త అంగీకారం తెలిపింది. 

అన్ని అనుకూలంగా కలిసి వచ్చి, పెళ్లి ముహూర్తం కూడా దగ్గరికి వచ్చింది. సంప్రదాయాల గురించి ఎంతో చర్చ వచ్చింది. కానీ ఎవరికి వారు అడ్జస్ట్ అయిపోయారు. 

అత్తవారింటికి వెళ్ళాక సంయుక్త అసలు సమస్యలు ఎదురయ్యాయి. కొత్త సాంప్రదాయం గురించి ఏమీ తెలియని ఆమెకు వాళ్ళు చెప్పేవి అర్థం కావడానికి సమయం పట్టేది. దానికి వాళ్లు వెటకారంగా మాట్లాడే వాళ్లు..

"మీ సాంప్రదాయంలో మడి ఆచారం తప్ప, పూజల గురించి పెద్ద తెలియదులే" అని ఓ మూలకు ఉన్న ముసలమ్మ ములుగు మూల్గింది.

ఎంతో బాధ కలిగింది సంయుక్త కి. "పెరిగిన వాతావరణం బట్టి అలవాట్లు వస్తాయి కదా! అయినా తాను మారను అని ఏమీ అనడం లేదు. అయినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు" అని బాధపడేది. 

వంట చేసినా, దేవుడి దగ్గర దీపం వెలిగించినా, చివరికి బొట్టు పెట్టుకున్నా కూడా ఏదో ఒక తప్పు వెతికే వాళ్ళు. 

"ఏంటి ఈ వంట ? ఇలా చేయకూడదు. మా ఇంట్లో ఇలా చేస్తే చెత్తలో పడేయడమే! నేర్చుకో" అని అత్తగారి సన్నాయి నొక్కు నొక్కింది. 

"అలా నిలువు దీపం పెట్టావ్ ఏంటి ? అలా పెట్టకూడదు. దేవుడు వైపు వత్తులు చూపిస్తున్నట్లుగా ఉండాలి.  వత్తులు పైకి పెడితే దీపం ఎవరికి అన్నట్టు ? ఇది కూడా తెలియదా ?"అని ఆడపడుచు ఒక ఈటెలాంటి మాట విసరడం. 

"ఇలా గుండ్రని బొట్టు పెట్టుకోవడం ఏంటి ? బొట్టు పొడుగ్గా పెట్టుకోవాలి. మన సాంప్రదాయం కాదు ఇది" తోటి కోడలు మూతి విరుపు. 

ఇలా అన్నింటికీ ఇబ్బంది పడుతూనే వీలైనంతవరకు సాంప్రదాయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. 

మా సాంప్రదాయంలోకి నువ్వు రావడం నీ పూర్వ జన్మ అదృష్టం. లేకుంటే మీ శాఖలోనే ఉంటే రేపు మనం పోయాక స్వర్గం వరకు మాత్రమే వెళ్తావు. అదే మా సంప్రదాయంలో ఉంటే చక్కగా విష్ణువును చేరుకుంటాము. ఏ జన్మ అదృష్టమో! మా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు" అని ఆ ముసలమ్మ మాట్లాడేది. 

"నువ్వు శాస్త్రోక్తంగా సమస్రేనాలు కావాలమ్మ. అప్పుడే మా ఇంట్లోవాళ్ళు నీ చేత మంచినీళ్లు తాగుతారు. లేదంటే ఇలా బయట పని చేస్తూనే ఉండాలి" అని తీర్మానించారు. 

"ఏంటి ఇలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాను. చదువుకున్న చదువు చెట్టు ఎక్కిపోయింది. కనీసం బయటకు వెళ్లే అవకాశం లేదు. ఉద్యోగం చేయడానికి ఎవరు సుముఖంగా లేరు. అందుకు తోడు సాంప్రదాయం అంటూ చిన్నచిన్న వాటిని ఈకలు పీకుతున్నారు" అని బాధ పడసాగింది. కొన్నాళ్ళకి పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పింది. అప్పటికే సమస్రేనాలు కూడా చేయించుకుంది సంయుక్త. 

పుట్టింటికి రాగానే ఇక్కడ కాస్త హాయిగా ఉంటుందనుకుంటే! ఇక్కడ అదే మొదలైంది. సంయుక్త బాబాయిలు వచ్చి..

"ఏంటి చేతులకు ఆ వేడి ముద్రలు వేయించుకున్నావా ? ఏంటి అనాగరికం ? అలా వేయించుకుంటేనే భక్తి ఉన్నట్లా ? అయితే నాలుకకు కూడా వేయించుకో! కనీసం కాదు అని కూడా చెప్పలేకపోయావా ?"అని అనేవారు. 

"ఏంటమ్మా! శివరాత్రి ఉపవాసం ఉంటావా వాళ్ళు వద్దన్నారని మానేస్తావా ?" అన్నారు తండ్రి. 

నీకు పుట్టిన పిల్లలకు మాత్రము ఇలాంటి ఆచారాలు నేర్పించకు. మన పద్ధతి ప్రకారమే చేయించాలి" అని అన్నారు. 

విపరీతమైన సంఘర్షణకులో నై  సంయుక్త ఇటు ఆచారం పాటించాలా ? అటు సాంప్రదాయం పాటించాలా ? అర్థం కాకపోయేది. చివరికి దేవుడిని పూజించాలంటేనే విరక్తి కలిగే పరిస్థితికి వచ్చింది. 

అయినా సరే వివేకంతో ఆలోచించింది. "నేను పెళ్ళి చేసుకోని అడుగు పెట్టింది వైష్ణవ సంప్రదాయంలో కాబట్టి, ఆ పద్ధతి నేర్చుకుంటాను" అనుకొని అన్ని పద్ధతులను చాలా జాగ్రత్తగా గమనించి చక్కగా అన్నీ నేర్చుకుని పాటించేది. కొంతలో అత్త ఇంటివారు సంతోషపడ్డారు. 

పుట్టింటి వైపునుండి మాత్రము ఏదో ఒక కామెంట్ వింటూ ఉండేది. మనసంతా అయోమయంగా ఉండేది. 

శివరాత్రి ఉపవాసం ఉండాలని అనుకుంటే అత్తవారింట్లో పెద్ద గొడవే జరిగింది. "అదేంటి నువ్వు శివుడిని పూజించకూడదు. అప్పుడు మళ్ళీ నీ చేత మంచినీళ్లు కూడా మేము తాగము" ఇలా వాడిగా వేడిగా చర్చ జరిగింది. 

ఏ దేవుడిని పూజించాలో ఒకరు నిర్ణయిస్తే ఎలా ?  మనకు మనసులో ఎవరైతే ఇష్టంగా అనిపిస్తారో ? ఎవరిని తలుచుకుంటే భక్తిగా అనిపిస్తుందో ? ఆ దేవుడిని మనం పూజిస్తాం కదా! చిన్నప్పుడు పెంచిన తల్లిదండ్రులకు కూడా ఆ హక్కు లేదు. ఎవరికి వారు ఏ దేవుడిని పూజించాలో నిర్ణయించుకోవాల్సి వస్తుంది. 

బలవంతంగా కన్నీళ్లతో తల వంచింది. కానీ అక్కడే ఉన్న భర్త అదేంటి ఏ దేవుడు పూజ చేస్తే ఏంటి ? తనకు చిన్నప్పటినుండి ఉన్న అలవాటుని మనం మధ్యలో మాన్పించేస్తే, తన మనసు బాధపడుతుంది కదా! అని అండగా నిలిచాడు. 

కానీ రెండు సాంప్రదాయాల మధ్యలో నలిగిన సంయుక్తకి బాధ కలిగేది. 

అప్పుడు తాను అనుకుంది పిల్లలకి భక్తి నేర్పాలి. దేవుడిపై నమ్మకం నేర్పించాలి. అంతేకానీ, ఈ దేవుడినే పూజించు. ఆ దేవుడిని పూజించు. ఇలా ఉండు అలా ఉండు అనేది మాత్రము చెప్పకూడదు. అలా బలవంతంగా చేస్తే మనసులో భక్తి కలుగుతుందా ? ఏదో వారి తృప్తి కోసం పైపైన చేస్తారు" ఇలా ఆలోచించింది. 

నెమ్మదిగా తనకు ఏ దైవం ఇష్టమో ఆ దైవాన్ని ఆరాధించుకుంది.

సాంప్రదాయం అనేది చక్కని మార్గం చూపేదిగా ఉండాలి. అంతే కానీ మరొక సాంప్రదాయాన్ని దూషిస్తూ, మనదే గొప్పది అని చెప్పుకునే స్థితి మాత్రం ఉండకూడదు. ఏ సాంప్రదాయమైనా చెప్పేది ఒకటే,

ధర్మంగా ఉండమని. ఇతరులకి కష్టం కలిగినప్పుడు ఆదుకొమ్మని, కరుణ కలిగి ఉండాలని. ఇవన్నీ పాటిస్తూ మనకు ఇష్టం ఉన్న దైవాన్ని మనసులో స్మరిస్తూ చేసుకుంటే సరిపోతుంది కదా. 

ఇన్ని గంటలు పూజ చేయాలని కొందరు చెప్తారు.  కానీ అందరికీ కుదరకపోవచ్చు. మనసులో ఆ దైవాన్ని స్మరిస్తూనే, మన నిత్య కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎదుటివారిని గౌరవంగా చూడటం అనేది ముఖ్యమైన సంప్రదాయం. ఇంటికి వచ్చిన మనుషులను పట్టించుకోకుండా, "అయ్యో! మన పూజకి వీళ్ళు ఆటంకం కలిగించారే ?" అనే భావన  ఉండకూడదు. ఏ రూపంలోనైనా నువ్వు భగవంతుని తలుచుకోవచ్చు.  ఇంటికి వచ్చిన అతిథిలో కూడా దేవుడు ఉంటాడు. అందుకే అన్ని సమన్వయం చేసుకొని మనకు నచ్చినట్లు చేసుకుని, ఇతరులను నొప్పించకుండా మెలిగితే చాలని నేను అనుకుంటాను. 

________🌹_____

No comments:

Post a Comment