పెసరట్టు..!
---------------
పెసరట్టు ఇష్టపడనివారు ఉండరు సాధారణంగా..!
అల్లం జీలకర్ర ఉల్లి పచ్చిమిర్చి పల్చగా చల్లి దోరగా కాల్చి అందిస్తే అదొక మైమరపు..!
పెనం మీద పెసరట్టు కాలుతుంటే సువాసన..నోట్లో లాలాజలాన్ని బయటకు లాక్కొస్తుంది.
మా చిన్నప్పుడు మా ఊళ్ళో పంపన ముసలయ్య ఉండేవాడు..!
సెంటర్లో వారికి హొటలుండేది..!
అచ్చంగా పెసరట్లు మాత్రమే వేసేవారు..!
ముసలయ్య హొటల్లో బెల్లం టీ స్పెషల్..!
ముసలయ్య కుటుంబం హొటల్లోనే నివాసం..!
రోజూ తెల్లారేసరికి వాళ్ళావిడ కట్టెల పొయ్యి దగ్గర కూర్చునేది..!
రాతి పెనం..!
అంటే నాపరాయి..అట్లు వేసి వేసి నీళ్ళు చల్లి చల్లీ చీపురు తో తుడిచి తుడిచి బాగా సాఫుగా నాన్ స్టిక్ పెనం లా మారిపోయింది.
ఒక ట్రిప్పుకు రెండు అట్లు మాత్రమే వచ్చేవి.
లేత ఆకుపచ్చని పెసరపిండి..!
పెనం నిండుగా రెండు పెసరట్లు..!
వాటి మీద అల్లం జీలకర్ర ఉల్లి పచ్చిమిర్చి..!
అప్పట్లో గానుగ లో ఆడిన నువ్వుల నూనె దారాళంగా వేసి..!
మడత పెట్టి ఇస్తుంటే కనీసం ఏడెనిమిది మంది వరుసలో ఉండేవారు..!
ముసలయ్య హొటలు కాడ ఆ సందడి ఉదయం తొమ్మిది వరకు ఉండేది..!
చాలా రుచి గా ఉండేవి పెసరట్లు..!
నాటు పెసలు..నాణ్యమైన నూనె..!
రాజమండ్రి లో హొటలు కెళితే పెసరట్టు ఉప్మా..!
ఎమ్మెల్యే పెసరట్టు అనేవారు ఎందుకో మరి..!
సాధారణంగా అన్ని చోట్ల పెసరట్టు బాగుండేది.
రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో ఒక చిన్న కేంటీన్ ఉండేది.
లేట్ నైట్ తెల్లారే వరకు ఉండేది.
అక్కడైతే అల్టిమేట్..!
చాలా చోట్ల చిట్టి పెసరట్లు ఫేమస్..!
చాలా రుచి గా ఉంటాయి.
ఇప్పుడు ఆయిల్స్ తేడా నాణ్యత తక్కువ..!
నెయ్యి వాడి నేతి పెసరట్టుగా అందిస్తున్నారు.
అసలు పెసల్లోనే తేడా వచ్చేసింది.
కమ్మదనం తగ్గింది.
ఏది ఏమైనా ప్లెయిన్ పెసరట్టు కంటే అన్నీ వేసిన పెసరట్టు బాగుంటుంది.
ఉప్మా పెసరట్టు కాంబినేషన్ కి తిరుగే లేదు.
టెంపోరావు అని డిటెక్టివ్ నవలా రచయిత అప్పట్లో పాప్యులర్..!
ఆయన సృష్టించిన పాత్ర డిటెక్టివ్ పరశురామ్ మద్రాస్ పామ్ గ్రోవ్ హొటల్లో పది పెసరట్లు తిని నాలుగు కప్పుల ఫిల్టర్ కాఫీ తాగి త్రిబుల్ ఫైవ్ సిగరెట్టు అంటించి గుండెలనిగుండెలని డా పొగ పీల్చి రింగులు రింగులు గా వదిలారు అని వ్రాసేవారు.
అపరాధ పరిశోధన నవల్లో కూడా స్ధానం సంపాదించి నోరూరించేది పెసరట్టు..!
రాముడు భీముడు సినిమాలో అమాయకుడు పాత్రధారి కి పెసరట్టు పెట్టనంటాడు వంటవాడు.
అది స్పెషల్ నీకు లేదు అంటాడు..!
పెసరట్టు కోసం పెద్ద పంచాయితీ..!
యన్టీఆర్ సినిమా లో పెసరట్టు గురించి ఒక సీన్..!
అదీ పెసరట్టు ప్రత్యేకత..!
ఇప్పటి వారు పెసరట్టు అసలు సిసలు రుచి చూడాలనుకుంటే..ఏజెన్సీ లో పోడు వ్యవసాయం ద్వారా పండించే నాటు పెసలు తెప్పించుకోవాలి.
వాటి రుచే వేరు..!
వారానికి ఒకసారైనా పెసరట్టు ఉపాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
అడుసుమిల్లి శ్రీనివాసరావు
No comments:
Post a Comment