Sunday, August 10, 2025

 88e7;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

      *లక్ష్మి ఎక్కడ ఉంటుంది..?* 
                 ➖➖➖✍️
                  
```
ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి.

లోకులంతా లక్షించేది లక్ష్మిని..!  

లక్షించటం అంటే..
చూడటమని అర్థం..!

లక్ష్మి తన చల్లని చూపులతో.. లోకాన్ని చూస్తూ ఉంటుంది.  అంటే..! పాలిస్తున్నదన్నమాట..!

లక్ష్మి ఒక్క సంపద రూపంలోనే ఉంటుందనుకుంటారు కొందరు. 

*వాస్తవానికి లక్ష్మి..
జ్ఞానం..
ఆనందం..
తృప్తి..
మోక్షం..
ఐశ్వర్యం..
తదితర అనేక రూపాల్లో..
మన దరికి చేరుతుంది..!

*భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు జన్మించింది లక్ష్మి. 
భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే శుక్రవారానికి భృగువారమని పేరు..!

*లక్ష్మికి 'భార్గవి' అనే పేరు కూడా ఉంది..!

*భృగువు లక్ష్మిని.. శ్రీమన్నారాయణమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు.

లక్ష్మిని.. 
సిద్ధలక్ష్మి..
మోక్షలక్ష్మి..
జయలక్ష్మి..
సరస్వతి.. 
శ్రీలక్ష్మి..
వరలక్ష్మి..
తదితర రూపాల్లో.. ఆరాధిస్తారు.

'లక్ష్మీదేవి.. తనను.. ఆరాధించేవారందరినీ.. శిష్టులు-దుష్టులు..అనే తేడా లేకుండా.. అనుగ్రహించడం మొదలు పెట్టిందట..! 
అధర్మవర్తులను సైతం ఇలా అనుగ్రహిస్తుంటే చూసిన  విష్ణుమూర్తి..”నువ్వీ జన్మ చాలించి.. పాలకడలిలో జన్మించు..!” అన్నాడు. 

మందహాసం చేస్తూ.. మాటపట్టింపు కొద్దీ లక్ష్మి ఆ అవతారం చాలించి.. పాలకడలిలో ఉద్భవించింది.

దుర్వాస మహర్షి ఇంద్రుణ్ని శపించినప్పుడు, ఇంద్ర సంపద స్వరూపిణి అయిన లక్ష్మి సముద్రంలో పడిందన్న మరో కథనమూ కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది.

క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీమహావిష్ణువు మళ్ళీ చేపట్టాడు. 

సర్వ జగతికీ మూలస్వరూపం కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు. 

లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో మొట్టమొదటి పదం 'ప్రకృతి.’  ప్రకృతి రూపంలో సర్వత్రా గోచరమవుతున్న లక్ష్మికి చేసే స్తోత్రమది..! 
ఇంద్రాదులచే పూజలు అందుకుంటున్న
ఆ జగజ్జనని నారాయణుడి హృదయంలో కొలువు తీరింది. ఫలితంగా దేవతలకు కష్టాలు తొలగిపోయి అమృతం లభించిందని పురాణాలు చెబుతున్నాయి.

*ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి... 
ఇలా ఎనిమిది రూపాల్లో అష్ట లక్ష్మీదేవిగా లక్ష్మి అర్చనలు అందుకుంటోంది.

ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుద్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలగడం - ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షాలే..! 

వీటన్నింటినీ మించిన లక్ష్మి - అంటే - 'నాకు అన్నీ ఉన్నాయి' అనుకునే ఆత్మతృప్తి..! 
ఈ ఆత్మతృప్తి కనిపించిన.. చోటును లక్ష్మీ దేవి వదిలిపోదు..! 

ఇవాళ డబ్బు, బంగారం, భూమి, ఇల్లు, మహిళ, పదవి, హోదా, నాయకత్వం, ఆధిపత్యం వంటి అశాశ్వతమైన వాటి కోసం మనిషి ఎంతటి నైచ్యానికైనా వెనకాడటంలేదు. వీటి కోసం అత్యాచారాలు, ఆక్రమ ణలు, హత్యలు, వేధింపులు- ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగేచోట లక్ష్మి స్థిరంగా నివసించదు. అటువంటి ప్రదేశాల్లో లక్ష్మి అక్క జ్యేష్ఠాదేవి దారిద్ర్య(మహాత్మ్యాన్ని) ప్రభావం చూపిస్తూ ఉంటుందంటారు.

లక్ష్మి చాపల్యం గలది..!
చంచల మనస్కురాలని అంటూ ఉంటారు..! 
ఇది భ్రమ..!

విద్య, ధాన్యం, స్వర్ణం, కీర్తి, సంతానం, ఆయువు, ఆరోగ్యం, పదవి, ధైర్యం ఇవన్నీ శ్రీలక్ష్మీ అష్టస్వరూపాలే! 
ఇవన్నీ లభించాలంటే.. ఇంట్లోనివారు నియమ నిష్ఠలు.. పాటించాలి. ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, ఐక్యత, పరస్పరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యం,
అతిథుల పట్ల ఆదరణ,
ఇవి లక్ష్మీకృపకు కారణాలుగా పెద్దలు చెబుతారు.

 జ్ఞాన ధ్యానాసక్తి 
 సాధుసేవ 
 మిత భోజనం
 మితనిద్ర 
 ఆస్తికత
 తులసి పూజ 
 వృక్ష పోషణ
 ఇవన్నీ ఉన్న గృహంలో లక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షణాలు నిరంతరం పరివ్యాప్తమై ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

తామరపూలు, కొలనులు, వృక్షాలు, ఫలపుష్పాలు, పుణ్యక్షేత్రాల్లో లక్ష్మి సర్వదా నిలిచి ఉంటుందన్నది శాస్త్రవచనం.

ఈ సత్యం గ్రహించి శాస్త్రానుసారమైన ఆచరణతో శ్రీలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాం..!✍️```                
        *-: శ్రీమాత్రేనమః :-*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment