⚜️🕉️🚩ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః🌹🙏
పుణ్యాల రాశీ శ్రీలక్ష్మి. సర్వజగత్తుకు కల్పవల్లి. దారిద్య్ర నాశిని. సౌభాగ్య దాయిని. పాలసంద్రంలో పుట్టిన బంగారం ఆ తల్లి. లోకంలో కన్నీటి శోకాలను తుడిచేస్తుంది. వానజల్లులతో పన్నీటిని చిలకరిస్తుంది.
లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకూ అధిదేవత. లక్ష్మి ఎవరింట ఉంటుందో.. అక్కడ శ్రీహరి కూడా కొలువుదీరుతాడు. మనిషి మనుగడ సజావుగా సాగాలంటే.. లక్ష్మి అనుగ్రహం తప్పనిసరి.
సదాచార సంపన్నులు, సత్కర్మలలో పాలు పంచుకునే వాళ్లు, నీతిమంతులను అమ్మవారు అనుగ్రహిస్తుంది. వ్యసనాలకు లోబడే వారిని, మానసిక శుద్ధి లేనివారిని, దుష్టబుద్ధి కలవారిని శ్రీమహాలక్ష్మి విడిచి వెళ్లిపోతుందని జైమినీ భారతం చెబుతున్నది. అందుకే, డబ్బుకన్నా.. సద్గుణాలను ప్రసాదించమని అమ్మను ప్రార్థించాలి.
'దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్’ అని వేదోక్తి. లోకంలోని సకల దారిద్య్రాలను పారద్రోలే దేవత మహాలక్ష్మి. సర్వ ఉపద్రవాలనూ నివారించే శక్తి ఆమెది. అందుకే శంకరాచార్యులు అమ్మవారిని ‘సంపత్కారిణి’ అని కీర్తించారు.
ధర్మ సమ్మతమైన ఏ వరం కోరినా.. అనుగ్రహించే దైవం కాబట్టి.. శ్రావణ లక్ష్మిని ‘వరలక్ష్మి’ అని సంబోధించారు. ఆ తల్లి కరుణా కటాక్షాలను పొందడానికి ఉద్దేశించినదే ‘వరలక్ష్మీ’ వ్రతం.
అమ్మవారు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించాలని శాస్త్ర నియమం. వ్రతం అంటే.. అలంకారాలు, పూలు, పండ్లు ఈ తంతు కాదు.
‘వ్రతవ్యే అనేత అనయావా ఇతి వ్రతం..’ అంటే.. జీవితంలో ఒక దీక్షగా దేనిని పాటిస్తామో అది వ్రతం. సిరులిచ్చే వరలక్ష్మిని సాక్షాత్కరింపజేసుకునే అరుదైన అవకాశం ఈ వ్రతం. పూజలు, స్తోత్రాలు ఇందుకు ఉపకరిస్తాయి.
సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి!
శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా!!
కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారపు శుభదినాన వేకువనే లేచి ఇంటిని శుభ్రపరిచి, గుమ్మాలకు పచ్చని తోరణాలను కట్టి స్నానాదులను ముగించి, పసుపు, కుంకుమ, పుష్పాక్షతలచే దేవిని పూజించాలి.
లక్ష్మీదేవిని పూజకు స్థాపించే ప్రదేశంలో పిండితో నేలపై పద్మాన్ని వేయాలి. బంగారు, వెండి, లేదా ఏదైనా లోహపు కలశానికి పసుపురాసి, గంధము పూసి ఆపై కుంకుమబొట్టు పెట్టాలి.
కలశాన్ని నీటితో నింపి, దానిలో మామిడాకులు, అక్షతలు ఉంచి పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మంపై కొత్త రవికలగుడ్డను పరిచి బియ్యంపోసి, దానిపై కలశాన్ని స్థాపించాలి.
కొందరు కొబ్బరికాయకు పసుపురాసి, పిండితో ముక్కు, చెవులను, కాటుకతో కళ్ళను దిద్ది, బొట్టుపెట్టి కలశంలో వరలక్ష్మీ దేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఈ విగ్రహాన్ని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. అలాగే మరికొందరు కొబ్బరికాయకు బంగారు లేదా వెండి ముఖాన్ని అమర్చి శుభ్రమైన పువ్వులతో, ఆభరణాలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఏవిధంగా అయినా యధా శక్తి అలంకరించుకోవచ్చు
ముందుగా ఒక రాగిపళ్ళెంలో బియ్యంపోసి దానిపైన ఒక తమలపాకులో పసుపు వినాయకుని ప్రతిష్టించి విఘ్ననాయకుడైన ఆ విఘ్నేశ్వరునికి పూజ చేయాలి.
తరువాత వరలక్ష్మీదేవిని ఆహ్వానించి శోడషోపచారాలతో అమ్మను పూజంచాలి. తొమ్మిది పోసలు వేసి, తొమ్మిది గ్రంధులతో కూడిన తోరాన్ని దేవికి సమర్పించాలి.
అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే #తోరం.
వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తయిదువకు అన్నమాట.
ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.
నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు... నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట!
ఈ నవసూత్రాన్ని తయారుచేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి.
ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథిపూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథిపూజ.
ఇందుకోసం ఒకో ముడినీ పూజిస్తూ ఒకో మంత్రం చదవాలి.
ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి
ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి
ఓం విశ్వజనన్యై నమ: చతుర్థ గ్రంథిం పూజయామి
ఓం మహాల క్ష్మైనమ: పంచమ గ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టి గ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యై నమ: సప్తమ గ్రంథిం పూజయామి
ఓం చంద్రోసహోదర్యై నమ: అష్టమ గ్రంథిం పూజయామి
ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి
ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత...
‘బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే’
అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి.
పై శ్లోకంలో దక్షిణేహస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలన్నమాట.
అంతేకాదు! చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. కానీ తోరాన్ని కనీసం ఒకరాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని నమ్ముతారు.
💥వరలక్ష్మీ వ్రతం కథ:
వరలక్ష్మీ వ్రతం కథను స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కందపురాణంలో చెప్పబడింది. లోకంలో స్త్రీలు అష్టైశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలైన ఒక వ్రతాన్ని తనకు వివరించమని పార్వతీదేవి కోరగా, ఆ మహాశివుడు వరలక్ష్మీవ్రతాన్ని చేయమని చెప్పాడు. ఈ సందర్భంలో ఆ మహాశివుడు పార్వతీదేవికి చారుమతీదేవి కథను వివరించాడు.
చారుమతీదేవి గయ్యాళికాక, పెనిమిటిని పూజిస్తూ, అత్తమామలకు సర్వోపచారములను అందిస్తూ ఉండేది.
ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నమున వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై శ్రావణ శుక్లపూర్ణిమకు ముందు వచ్చే శుక్ర వారాన తనను పూజించినట్లయితే కోరిన వరములను ఇచ్చెదనని చెప్పి మాయమయ్యెను.
ఆ చారుమతి అట్లే ఆచరించి సకలైశ్వర్యములను పొందెనని, అప్పటి నుంచీ ఆ వరలక్ష్మీవ్రతము చారుమతీ మొదలగు స్త్రీలందరూ ఆచరిస్తున్నట్లుగా ఈ కథ తెలియచెప్తుంది.
కావున ప్రతివారూ ఈ వరలక్ష్మీవ్రతమును చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను పొంది సుఖముగా ఉంటారు. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పొర్ణమి ముందు వచ్చే శుక్రవాతం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు.
తొమ్మిది రకాల పిండివంటలు వండి షడ్రసోపేతంగా మహానైవేద్యాన్ని సమర్పించాలి. ముత్తయిదువులకు తాంబూలాదులు సమర్పించి వారి దీవెనలను అందుకోవాలి. అనంతరం అమ్మవారిని కొలుస్తూ మంగళహారతి పాటలతో మంగళహారతులు అర్పించాలి. వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆ కథను విన్నా శుభం కలుగుతుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
No comments:
Post a Comment