స్వామి వారి జీవితం లో జరిగిన ఒక అద్భుత లీల.
పుణ్య జలస్నానం ముదుసలికి ముక్తిని ప్రసాదించడం
ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తిరుత్తల యాత్రలో ఉన్నప్పుడు, వళువత్తూరు అనే గ్రామంలో తన భక్తుడు రామస్వామి ఇంట్లో బస చేశారు.
ఒక రోజు సాయంత్రం, దర్శనాలన్నీ పూర్తయ్యాక, మహాస్వామి వారు రామస్వామిని పిలిచి,
“పశువుల పాక లోఉన్న పాత్ర తీసుకుని దానిలో సగం నీళ్లు పోసి, అందులో రెండు చేతులనిండా సరిపడ ఉప్పు వేసి తీసుకురా!” అని ఆజ్ఞాపించారు.
రామస్వామి చెప్పినట్టు చేసి తీసుకొచ్చాడు. మహాస్వామి వారు కాస్త ఎత్తైన తిన్నె మీద కూర్చుని, తన రెండు కాళ్లను ఆ ఉప్పు నీటిలో ఉంచారు.
వింతగా అనిపించడంతో స్వామి వారి చుట్టూ జనాలు గుమిగూడి ఉన్నారు.
అప్పుడు స్వామి వారు
“ఈరోజు చాలాసేపు కదలకుండా కూర్చున్నాను అందుకే కాళ్లు బాగా గట్టిపడి ఉన్నాయి .అందుకే ఇలా చేస్తున్నాను!” అని చెప్పారు.
కొద్ది సేపటికి తరువాత స్వామి వారు ఆ పాత్ర నుండి తన కాళ్లను బయటకు తీసుకున్నారు. జనాలు వెంటనే ఆ నీటిని తీర్థంగా తీసుకుని తలపై చల్లుకున్నారు.
అప్పుడు మహాపెరియవా ఒక్కసారి ఇలా అన్నారు:
“ఆ నీరంతా ముగించకండి ఒక చెంబులో కొంచెం తీసుకుని ఉంచండి.”
అందరికీ ఆశ్చర్యం వేసింది, కానీ ఎవ్వరూ ఎందుకు అనలేదు. చెంబులో కొంత నీరు తీసి పెట్టారు.
అరాత్రి సమయం దగ్గర పడుతోంది. ఒక వృద్ధ ముసలామె అక్కడికి వచ్చి, పరమాచార్యుల ఎదుట నిలబడి ఏమీ మాట్లాడకుండా కళ్ళలో కన్నీరు పెట్టుకుంది.
కాస్త నిశ్శబ్దంగా ఆమె వైపు చూసి స్వామి వారు ఆలస్యంగా మృదువుగా ఆమెను ప్రశ్నించారు:
ఎమ్మా “కాశీ, రామేశ్వరానికి వెళ్లాలనుకున్నావా?
కానీ చేతిలో డబ్బు లేదు కదా… అందుకే ఇలా వచ్చావా?”
అని అడిగారు.
ఆమె కంట నీరు కారుస్తూ "అవును స్వామి "అని మాత్రమే అంది.
మహా స్వామి వారు ఏమీ మాట్లాడకుండా లోపలికి తిరిగి రామస్వామిని పిలిచి:
“ఆ చెంబులో ఉన్న నీటిని తీసుకురా!” అని ఆదేశించారు.
తీసుకొచ్చిన నీటిని
“ఆ ముసలిమె తలపై పోయించు!” అని చెప్పారు. అక్కడ ఉన్న స్వామి వారి సేవకుడు అలానే చేశారు
తర్వాత మహాపెరియవా తన కమండలం (సన్యాసుల పవిత్ర జలంతో నిండిన పాత్ర) నుండి నీటిని ఖాళీ చెంబులో పోసి:
“ఇదీ ఆమె తలపై పోయించు!” అన్నారు.
“మొదట రామేశ్వరం… తరువాత కాశీ… ఈ రెండు పుణ్య తీర్థాలలో స్నానం చేసిన ఫలితం నీకు వచ్చేసింది.
ఎలాంటి ఆందోళన లేకుండా వెళ్లిపో.
అంతా శుభమే జరుగుతుంది!”
అని ఆశీర్వదించి పంపారు.
ఆ ముదుసలి అంతులేని ఆనందం,తృప్తితో అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఇప్పటివరకు జరిగినదంతా సాధారణంగానే అనిపించింది. కానీ రెండు రోజుల తర్వాత వచ్చిన వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ ముసలామె, మహాపెరియవాను దర్శించిన మరునాడు ముక్తి పొందిందట.
ఈ విషయాన్ని రామస్వామి స్వయంగా మహాపెరియవాకు చెప్పగా,
“అందుకే నిన్ననే నీతో ఆమెకు పుణ్య తీర్థ స్నానం చేయించేశాను. ఎలాంటి కష్టం లేకుండా ముక్తి పొందింది!” అని శాంతంగా స్పందించారు.
ఈ సంఘటన ద్వారా మహాపెరియవా:
ఒక వృద్ధ భక్తురాలి మనసు లోపల దాచిన ఆశయాన్ని ముందుగానే గ్రహించారు.
రామేశ్వరం సముద్రానికి ప్రతీకగా ఉప్పు నీటిని,
కాశీ తీర్థానికి ప్రతీకగా తన కమండల నీటిని ఆమె తలపై అభిషేకించారు.
ఆమె తీరని తపస్సును తీర్చుతూ, జీవనాంత్యంలో ముక్తిని ప్రసాదించారు.
ఇది సాధారణ చరిత్ర కాదు… ఒక పరమహంస, జ్ఞాని, దైవిక శక్తి ఎలా పని చేస్తుందో చూపించే పరమాద్భుతమైన లీల
।అపార కరుణా సింధుం జ్ఞానదo శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।
।జయ జయ శంకర హర హర శంకర।
No comments:
Post a Comment