*📖 మన ఇతిహాసాలు 📓*
*మౌసల పర్వము*
9️⃣
*అర్జునుఁడు శ్రీకృష్ణుని కొఱకు వెదకుట*
అర్జునుఁడు ఆ తరువాత కృష్ణుని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అర్జునుఁడు మనసులో " అయ్యో కృష్ణా ! నువ్వు నీ తండ్రిని సంరక్షించడానికి నన్ను హస్థిన నుండి ద్వారకకు పిలిపించావు. నేను ఇప్పుడు మీ తండ్రి మరణవార్తను నీకు చెప్పడానికి నీ వద్దకు వస్తున్నాను. ఎవరికైనా ఇంతటి దౌర్భాగ్యము కలుగుతుందా ! అయినా నేనిప్పుడు వసుదేవుడి మరణవార్తను బలరామ, కృష్ణులకు చెప్పడము ఎందుకు ? మీరు చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేసాను అని చెపితే సరిపోతుంది కదా ! " అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఇంతలో అర్జునునికి గాంధారి ఇచ్చిన శాపము మనసులో మెదిలింది. గాంధారి శాపము ఇచ్చే సమయములో అర్జునుఁడు కృష్ణుడి ప్రక్కనే ఉన్నాడు. గాంధారి " ఎవ్వరూ నీ పక్కన లేనప్పుడు నువ్వు దిక్కు లేకుండా చస్తావు " అని శపించింది. అయినా మహానుభావుడైన శ్రీకృష్ణుని మీద ఇలాంటి శాపాలు ఫలిస్తాయా ! ఇలా పరిపరి విధముల ఆలోచిస్తూ అర్జునుఁడు శ్రీకృష్ణుడి కొరకు పిచ్చివాడిలా పరితపిస్తూ వెతకసాగాడు. అర్జునుడి వెంట వస్తున్న వాళ్ళకు ఇటు కాదు అటు అని చెప్పడానికి సాహసించ లేక పోతున్నారు. అలా కొన్ని రోజులు వెదికిన తరువాత ఒక రోజు ఒక బోయవాడు వారితో " మీరు దేని కొరకు వెదుకుతున్నారు? "అని అడిగాడు. అర్జునుడు " ఇక్కడ ఎక్కడో శ్రీకృష్ణుఁడు తపస్సు చేసుకుంటున్నాడఁట అతడి కొఱకు మేము వెదుకుతున్నాము " అన్నాడు. ఆ బోయవాఁడు " నేను శ్రీకృష్ణుని చాలా రోజుల క్రిందట చూశాను. తరువాత చూడలేదు. నేను కూడా మీ వెంటవచ్చి వెతుకుతాను రండి " అన్నాడు. ఆ బోయవానితో చేరి అర్జునుఁడు కృష్ణుని కొఱకు వెదకసాగాడు. ఆ బోయవాడు చెప్పిన గుర్తులననుసరించి వారు కృష్ణుఁడు పడివున్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు దిక్కు లేకుండా దివ్యకాంతులు వెదజల్లుతూ పడి ఉన్న శ్రీకృష్ణుని పార్ధివదేహాన్ని చూశారు. ఆ దృశ్యము చూసిన అర్జునుఁడు అక్కడకక్కడే మూర్ఛిల్లాడు. ప్రక్కన ఉన్నవారు నీరు తీసుకువచ్చి అర్జునుని ముఖము మీదఁజల్లారు. అర్జునుఁడు మూర్ఛ నుండి లేచి శ్రీకృష్ణుని శరీరాన్ని కౌఁగిలించుకుని భోరున ఏడ్చాడు. అప్పటి వరకు ఉన్న ధైర్యమూ నిగ్రహమూ శ్రీకృష్ణుని అలా చూసేసరికి సడలిపోయాయి. కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారి పోతున్నది. నోటమాట రాలేదు. ప్రక్కన ఉన్నవారికి అర్జునుని పలకరించి, ఓదార్చే సాహసము చేయలేక పోయారు. కొంచెము సేపటికి తెప్పరిల్లిన అర్జునుఁడు " అయ్యో ! కృష్ణా ! నీకా ఈ దురవస్థ. నీ వంటి మహాత్ముఁడు ఇలా కటిక నేల మీదఁబడి ఉండటమా ! అంటూ కృష్ణుని పాదాల వంక చూసి అరికాలులో దిగిన బాణము గమనించాడు. అతడికి దుర్వాసుని మాటలు గుర్తుకు వచ్చాయి. అర్జునుఁడు ఒక్కసారిగా ఆశ్చర్యపొయాడు. కృష్ణుని దేహము అంతా గాయాల కొఱకుఁబరికించి గాలించాడు. అరికాలు మాత్రము నల్లగా కమిలిపోయుంది. మిగిలిన దేహము దివ్య కాంతులు వెదజల్లుతూ ఉంది. నిదురిస్తున్నట్లు కనిపిస్తున్న శ్రీకృష్ణుని అర్జునుఁడు కన్నులార్పకుండా చూడసాగాడు. ప్రక్కన ఉన్నవారు " అయ్యా ! తరువాత కార్యక్రమాలు చూడండి. మనము పోయి ద్వారకలో ఉన్న వారిని పిలిచి అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దాము. లేకున్న శ్రీకృష్ణుడి శరీరాన్ని ద్వారకకు తీసుకు వెళదాము. ఎలా చెయ్యాలో మీరే సెలవీయండి " అన్నారు.
*అర్జునుఁడు శ్రీకృష్ణబలరాములకు దహనక్రియలు నిర్వహించుట*
అర్జునుఁడు ఆలోచించి చూడగా ద్వారక మునిగి పోతుంది అన్న రోజు మరునాఁడే అని గ్రహించాడు. అర్జునుఁడు తన వెంట వచ్చిన వారితో " రేపు ఉదయము ద్వారక సముద్రములో మునుగుతుంది. కనుక మనము ఈ రాత్రికి ద్వారకకు వెళ్ళాలి. అందరినీ సమాయత్తము చేసి రేపు ఉదయానికి ముందుగా ద్వారకను విడిచి పెట్టాలి. లేకున్న అంతు లేని ప్రాణనష్టము జరుగుతుంది కనుక మనము శ్రీకృష్ణుని నిర్యాణము గురించి ఎవ్వరికీ ఇప్పుడు చెప్పవద్దు. ప్రస్తుతము శ్రీకృష్ణుని అంత్యక్రియలు మనము నిర్వహిద్దాము " అన్నాడు. బరువెక్కిన హృదయముతో శ్రీకృష్ణుని అంత్యక్రియలు చేశాడు అర్జునుఁడు. శ్రీకృష్ణుని పార్ధివదేహాన్ని వేదోక్తంగా దహనము చేశాడు. బలరాముఁడు కూడా ఆ పరిసరాలలో ఉంటాడని అనుకుని చుట్టుప్రక్కల వెదుకసాగారు. కొంత సేపటికి వారిశ్రమ ఫలించి ఒక చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న యోగసమాధిలో ప్రాణములు వదిలిన బలరాముని పార్ధివ శరీరము వారికి కనిపించింది. అర్జునుడికి ఏడవడానికి కూడా సమయము చిక్కలేదు. భక్తిశ్రద్ధలతో బలరామునికి దహన సంస్కారము చేశాడు. ఆ విధముగా అర్జునుఁడు శ్రీకృష్ణ బలరాములకు అత్యంత భక్తిశ్రద్ధలతో దహనసంస్కారములు చేసాడు. తరువాత తనవెంట వచ్చిన వారిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. మార్గమధ్యములో దారుకునితో " దారుకా ! మనము చేసిన పని సరి అయినది అని నేను నమ్ముతునాను. లేకున్న శ్రీకృష్ణుని మరణవార్తను విన్న రుక్మిణీ, సత్యభామా మొదలైన భార్యల దుఃఖము ఆపడము మనతరమా చెప్పుము. వారంతా సహగమనము చేస్తాము అంటే మనమాపగలమా ! రాత్రంతా వారిని ఓదారుస్తుంటే తెల్లవారిన తరువాత సముద్రము పొంగి ద్వారక మునిగి పోతుంటే ద్వారకవాసులను కాపాడ లేదన్న అపఖ్యాతి నాకు వస్తుంది. పైగా శ్రీకృష్ణుని మాట తప్పిన వాఁడనౌతాను. కనుక మనము త్వరగా ద్వారకకు చేరుకుందాము " అన్నాడు. అందరూ కలసి త్వరగా ద్వారక చేరుకున్నారు.
*మిగతా భాగం రేపటి "📖 మన ఇతిహాసాలు 📓" లో...*
No comments:
Post a Comment