*ఇల్లాలు* !
రచన : *సరళ*
(ఇది నా స్వీయరచన)
ఉదయం నాలుగున్నరకి అలవాటుగా అలారం మోగింది...
శకుంతల కళ్ళు తెరిచి, అలారం నొక్కింది..వళ్ళంతా నొప్పులుగా ఉండి లేవలేక పోయింది. పదినిమిషాల తర్వాత లేవచ్చనుకుని కళ్ళు మూసుకుంది.. కాని అలసట వలన నిద్ర పట్టేసింది.
ఆరింటికి వసంత గదిలో అలారం మోగింది. రోజూలాగ తల్లి వచ్చి అలారం ఆపలేదు. కప్పుకున్న దుప్పటి ముసుగు లోంచే అరిచింది,
"అమ్మా..! అలారం ఆపు.." శకుంతల రాలేదు. అలారం మోగుతూనే ఉంది.
"శమూ..! దాన్నాపవే..", పక్కనే పడుకున్న చెల్లెల్ని ఉద్దేశించి, విసుగ్గా అంది వసంత. కళ్ళు మూసుకునే చేయి చాపి అలారం నోరు నొక్కింది శమంత.
ఏడింటికి మెలకువ వచ్చిన శమంత ఇంకా పడుకునే ఉన్న వసంతని, తట్టిలేపింది. " ఇవాళ కాలేజ్ లేదా? " బధ్ధకంగా కళ్ళు విప్పిన అక్కని చూసి అంది.
"ఎందుకు లేదూ...", అంటూ కంగారుగా లేచిన వసంత టైము చూసి " అమ్మా ..", అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళింది.
తల్లింకా పడుకునే ఉండటం చూసి , 'ఏమైందీవిడకి ? ఇంకా లేవలేదు.' అని గొణుక్కుంటూ బాత్రూమ్ కేసి పరిగెత్తింది.
అప్పటికే శమంత బాత్రూం లోపల తలుపేసుకునే సరికి విసుక్కుంటూ రెండో బాత్రూమ్ లోకి వెళ్ళి ధడాలుమని తలుపేసుకుంది !
కూతుళ్ళు చేస్తున్న హాడావిడికి మెలకువ వచ్చిన పార్వతీశం గారు టైము చూసి "ఆపరేషనుంది, తొందరగా లేపమంటే లేపలేదేం!"
అంటూ పక్కన ఇంకా పడుకునే ఉన్న ఇల్లాలిని చూసి ఆశ్చర్య పోయారు!
దగ్గరగా జరిగి వణుకుతున్న భార్యని చూసి దుప్పటి కప్పి, 'ఇప్పుడెలా....' అని తనలో తానే గొణుక్కుంటూ లేచారు.
రెండు బాత్రూమ్ లు ఖాళీ లేకపోవడంతో పైనున్న బాత్రూమ్ కి కాళ్ళీడ్చుకుంటూ మెట్లెక్కి వెళ్ళారు.
పార్వతీశం గారు ఎనస్తీషియా డాక్టర్. ఆయన భార్య శకుంతల. ఆవిడ భర్తకి చదువుకుంటున్న ఇద్దరు కూతుళ్ళుకి వేళకన్నీ అమర్చి
పెట్టే ఉత్తమ గృహిణి!
పై పనులు పనిమనిషి చేసినా, మిగిలిన ఇంటి పనులన్నీ తనే స్వయంగా చేసుకుంటుంది.
ఇంటర్ సెకండియర్ చదువుతున్న శమంత, ఇంజనీరింగ్ పస్టియర్లో ఉన్న వసంతల కాలేజ్ బస్సులు రెండూ అటుఇటుగా ఏడున్నరకి
వీధి చివర సెంటర్ దగ్గరకి వస్తాయి.
తెల్లవారుఝామునే లేచిన శకుంతల, కూతుళ్ళిద్దరికీ లంచ్ బాక్సులు సర్దేసి, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ఉంచుతుంది.
తల్లి పదేపదే లేపాక, అలకలు, బతిమాలింపులతో తయారయి టిఫిన్ తినడం ముగించి హడావిడిగా బస్ అందుకునేందుకు పరిగెడతారు వసంత, శమంత.
పిల్లలు వెళ్ళాక, పొగలు కక్కే కాఫీ కప్పుతో వెళ్ళి భర్తని లేపుతుంది, శకుంతల.
కాఫీ సేవించి తన పనులన్నీ తాపీగా ముగించుకుని తొమ్మిదిన్నరకి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు పార్వతీశం గారు.
అప్పటికి శకుంతలకి తన పూజా కార్యక్రమాలు, ఆ రోజు చదువుకోవలసిన
దైవ స్తోస్త్రాలు పూర్తిచేసుకుని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
పార్వతీశంగారికి కాఫీ అయినా టిఫినయినా, భోజన మయినా వేడివేడిగా పొగలు కక్కేలా ఉండాలి! అందుకని శకుంతల అప్పటికప్పుడు వేరేగా ఆయన టిఫిన్ కోసం, ఇడ్లీలో, దోసెలో వేడివేడిగా చేసి వడ్డిన్తుంది. ఆయన టిఫిన్ తినడం పూర్తి చేసేలోపల పాలు పొంగించి రెడిగా ఉన్న డికాషన్ ఫిల్టర్ లోంచి తీసి పొగలు కక్కే కాఫీ భర్తకి అందిస్తుంది.
పార్వతీశం గారు వెళ్ళాక బాత్రూంలో పిల్లలు సరిగా కట్టకుండా వదిలేసిన కుళాయిలు షవర్లు కట్టేసి అడ్డ దిడ్డంగా పడేసిన భర్తవీ
పిల్లలవీ విడిచిన బట్టలు పోగేసి వాషింగ్ మెషీన్ వేస్తుంది. ఆ పనయాక గదుల్లో భర్తా, పిల్లలు చిందరవందరగా పడేసిన సామాన్లంన్నింటినీ యధాస్తానాల్లో సర్ది పనిమనిషి చేత గదులన్నీ క్లీన్ చేయిస్తుంది. ఆ తర్వాత ఆరిన బట్టలన్నీ తెచ్చి ఇస్త్రీకీయవలసిన బట్టలు వేరుచేసి మిగిలిన బట్టలు మడతలు పెట్టి ఎవరి బీరువాలో వారి బట్టలు సర్దుతుంది. పనిమనిషి చేత వీధి చివర ఉన్న షాపుకి ఇస్త్రీకి ఇయ్యవలసిన బట్టలు పంపి, అపుడు భర్తకోసం వేడి వేడిగా వండి భోజనం రెడీ చేస్తుంది.
భోజనమయాక మధ్యాహ్న సమయంలో కూడా ఖాళీగా ఉండదు శకుంతల.
ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూనో పుస్తకాలు చదువుకుంటూనో పిల్ల లు భర్త వచ్చేదాకా కాలం గడుపుతుంది.
ఇది శకుంతలకి రోజువారీ పగటి దినచర్య!
కాని ఈరోజు శకుంతల రోజూ లాగ లేవలేదు! పనులేవీ పూర్తి చేయలేదు!!
******
వసంత, శమంత ఇద్దరూ, బాత్రూమ్ లో స్నానం చేయడం దగ్గరనించీ వాదులాడుకుని, తయారై వచ్చేసరికి ఎనిమిది దాటిపోయింది.
ఆలశ్యమై పోయిందని స్నానానికి సెలవిచ్చి హడావిడిగా డ్రస్ చేసుకుని వస్తున్న పార్వతీశం గారికి బిక్క మొహాల్లో ఎదురైయారు కూతుళ్ళిద్దరూ..
"ఏమైందమ్మా", బూట్లు తొడుక్కుంటూ అడిగారు.
ఎనిమిది దాటిపోయింది, డాడీ! బస్ వెళ్ళి పోయుంటుంది. కాలేజికెలా వెళ్ళడం?, ఏడుపు గొంతుతో అంది శమంత
అవునమ్మా అమ్మకీరోజు వంట్లో బాలేక లేవలేక పొయింది. దాంతో అన్నీ లేటయిపోయాయి. ఇవాళ నేనూ ఓ సర్జరీకి అటెండ్
అవ్వాల్సి ఉంది, పదండి! తొందరగా మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను."
కూతుళ్ళనెక్కించుకుని, కారు స్టార్ట్ చేశారు పార్వతీశం గారు.
కారులో.....
ఏమ్మా వసూ!, మీరిద్దరూ పెద్ద వాళ్ళవుతున్నారు. మీ పనులు తొందరగా తెముల్చుకుని మమ్మీకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా!
పాపం మన పనుల్తో తనెంత అలిసి పోతోందో చూడండి. ఇవాళ జ్వరం కూడా వచ్చి లేవలేకపోయింది. .మనకేమీ చేయలేక పోయింది. అమ్మ ఆరోగ్యం కూడా మనకి ముఖ్యం కదా!
రేపటినుండి మీ పనులన్నీ మమ్మీ ప్రమేయం లేకుండా మీరే చేసుకుని తొందరగా తెమిలి ఇద్దరూ మమ్మీకి ఎంతోకొంత మీరు చేయగలిగిన సాయం చేస్తుండాలి. సరేనా... అన్నారు
అలాగే డాడీ, రేపటినుంచి అలారం మోగగానే మమ్మీ లేపకుండానే లేస్తాం. మా పనులు మేమే చేసుకుంటాం !" వసంత వెంటనే అంది.
అవును డాడీ, ఇద్దరం కలిసి మమ్మీకి హెల్ప్ కూడా చేస్తాం!" శమంత కూడా హామీ ఇచ్చేసింది.
సాయంత్రం ఇంటికి రాగానే ఇద్దరూ మర్చిపోకుండా అమ్మ కెలా ఉందో కనుక్కోండి. నేను నా పనవగానే ఇంటికొచ్చేసి మమ్మీ సంగతి చూసుకుంటాను.
శమంత కాలేజి దగ్గర కారాపుతూ అన్నారు పార్వతీశం గారు.
******
ఆపరేషన్ పోస్ట్ ఫోనవడం వలన పార్వతీశం గారు తొందరగా ఇంటికొచ్చేసారు. వస్తూనే పనిమనిషి కాంతాన్నడిగారు...
అమ్మగారు లేచారా.. టాబ్లెట్ వేశావా ? అని.
లేదయ్యగారు. అమ్మ గార్ని రెండుసార్లు లేపానండి , ఊ..ఊ. అంటున్నారే కాని లెగటం లేదండి...
సరే! నే చూసుకుంటా గాని ఇక నువెళ్ళిపో. కాంతాన్ని పంపించేసి, పార్వతీశం గారు శకుంతల మొహం తడి టవల్తో మృదువుగా తుడిచారు.
దాంతో శకుంతల మగత నించి తేరుకుని కళ్ళు తెరిచింది.
ఇప్పుడెలా ఉంది, శకూ.. ఆదుర్దాగా అడిగారు పార్వతీశం గారు.
నాకేమయింది! బాగానే ఉన్నా..., అంటూ లేవబోయిన భార్యని వారించి ఫ్లాస్కులోంచి కాఫీ వంచి ఇస్తూ...
ముందీ కాఫీ తాగు కాస్త నీరసం తగ్గుతుంది! తర్వాత టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుని, కాసేపు పడుకున్నావంటే జ్వరం పూర్తిగా
తగ్గిపోతుంది. ఈలోగా భోజనం ఏర్పాట్లు చూస్తాను.
అయ్యో, వద్దండీ.. ఇపుడు నాకు బాగానే ఉంది. అన్నట్టు పిల్లలు.. వాళ్ళకి లంచ్..."
పిల్లలకేం, హాయిగా కాలేజీల కెళ్ళారు..! ఇద్దరినీ లంచ్ బైటే చేసేయమన్నాను. వాళ్ళ గురించి బెంగపడక హ! ఇవాళ నువ్వు
పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందే. నాకు వంట రాదనుకున్నావేమోనీ అంత రుచిగా చేయలేనేమో కాని, ఫర్వాలేదు, బాగానే చేయగలనన్న
నమ్మకమైతే ఉంది.
అబ్బే.....అదేం కాదండి నాకిపుడు బాగానే ఉంది లేచి .......
అదేం ... వీల్లేదు ఇవాళంతా నువు రెస్ట్ తీసుకోవలసిందే ! రోజూ మా కోసం కష్టపడే నీకు ఆరోగ్యం బాలేనపుడు ఒక్కరోజు నేను
నీ కోసం ఆ మాత్రం చేయ తగనా చెప్పు!"
మౌనంగా చూపులతోనే అంగీకారం తెలిపింది శకుంతల.
అలా రోజంతా పిల్లలు భర్తా ఆమెనే పనీ చేయనీయకుండా రాత్రి భోజనంతో సహా అన్నీ తామే చేశారు!
******
ఉదయం, నాలుగున్నరకి రోజూలాగే అలారం మోగింది!
లేవబోయిన శకుంతలని చేయి చాపి ఆపారు పార్వతీశం గారు!
లేవకు శకూ, రెండు రోజులు నువు రెస్ట్ తీసుకో! పిల్లలు నేను పనులన్నీ చేసుకుంటాం!!
అదేం వద్దు! నిన్నంతా మీరు చెప్పినట్టే విన్నాను. ఇపుడు నాకు బాగానే ఉంది. ఇక నా పని నన్ను చేసుకోనివ్వండి!
వద్దన్నా వినక తన రోజువారీ కార్యక్రమాల్లోకి దిగిపోయింది శకుంతల.
వసంత, శమంతలు కూడా రోజుకన్నా పెందలాడే లేచి ఎంత వారించినా వినకుండా అమ్మకి పనుల్లో సాయపడ సాగారు.
*****
పార్వతీశం గారు కూడా తన పూర్వపు అలవాట్లు మార్చుకుని భార్యకి అనుకూలంగా మారడంతో ఆ ఇల్లు స్వర్గసీమగా మారిపోయింది!!
నిజంగా ఇలా జరిగితే........!
ఇల్లాలి అలసటని గుర్తించి కుటుంబ సభ్యులు తమ సహకార మందించిననాడు ఆ ఇల్లు స్వర్గసీమనే తలపిస్తుంది!
- *సరళ*
(శుభం)
No comments:
Post a Comment