Sunday, August 10, 2025

 *_క్విట్ ఇండియా కీ_* 
*_ఏక్ కహానీ..!_*

క్విటిండియా..
దశాబ్దాలుగా 
పరాయిపాలనతో
విసిగి వేసారిన 
ఒక జాతి నినాదమది..
విశ్వం మొత్తం 
రెండో ప్రపంచ 
యుద్ధ భయం గుప్పిట్లో
అల్లాడుతున్న వేళ 
మర ఫిరంగులే తుళ్ళిపడేలా..
తూటాల మోతలే ఆదిరిపోయేలా
భరతజాతి మొత్తం
ఒకే గళమై..
సమైక్య స్వరం భూగోళమై..
తెల్లదొరలు గందరగోళమైన
ప్రళయ భీకర నాదమది..
ప్రతి భారతీయుడి 
గుండె గొంతుకై
దిక్కులు పిక్కటిల్లితే
బ్రిటీషోడి కుత్తుక 
ఆ శబ్దానికే తెగిపడుతుందా
అన్నంతగా...అనంతంగా
హోరెత్తిన మహానాదమది..
మరో వేదమది..!

1942..ఆగస్టు 8..
బొంబాయి వేదికగా ఇదే రోజున
ఓ పిలుపు..ఓ మలుపు..
అహింసా మార్గం అనుసరిస్తూనే 
ఓ చరుపు..
పీక్కు తిన్నది..
పీకింది చాలు..
ఇక వెళ్ళండని..
బ్రిటిష్ ముష్కరులకు హెచ్చరిక
అక్కడ లండన్లో కదలిక
ఒకే మాట..పేలిన తూటా..
చర్చిల్ చర్చలే చర్చలు..
భయంతో మూర్ఛలు..
ఉత్తర క్షణమే ఉత్తర్వులు..
కదిలింది సైన్యం సర్వం
మొదలైంది అరెస్టుల పర్వం..
జైలు అలవాటే..
అక్కడా పోరుబాటే!

ఉద్యమం ఆగింది..
స్వరాజ్యకాంక్ష పెరిగింది..
పొండిరా పొండి..
ఇదే మాట ప్రతి భారతీయుడి
గుండెలో ఉప్పొంగి..
ఒకే నాదమై..రణనినాదమై..
తెల్లవాడి గుండె జారి..
పట్టు వీడి..ఆగింది నాడి..
చల్లారింది వేడి..
ఉద్యమం ప్రతి భారతీయుడి
ఇంటి మాధ్యమమై...
స్వరాజ్య సాధనే ప్రాధాన్యమై..
తెల్లవాడి అధికారం ధైన్యమై
చేసేది శూన్యమై..
అయిదేళ్ల ఆరు రోజుల పిదప
ఆగస్టు 14..
అర్ధరాత్రి స్వతంత్రం..
అంతమైంది కుతంత్రం..
తెల్లదొరలు క్విట్ ఇండియా..
భరతజాతి అయింది 
ఇండిపెండెంట్ ఇండియా..!

క్విట్ ఇండియా ఉద్యమం
స్మృతులతో..
సమరయోధులకు 
నివాళి అర్పిస్తూ..

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

No comments:

Post a Comment