Sunday, August 10, 2025

 🦚 🙏 స్కాంద పురాణం 🙏🦚

Part - 33

♦️ అరుణగిరి ప్రదక్షిణా విధి  :

⛰️ అరుణగిరికి ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎవరు చేయినీ పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి.

⛰️ పరుగులు తీస్తూ హడావిడిగా గిరి ప్రదక్షిణ చేయకూడదు. 

⛰️ నడిచేవారి అడుగుల చప్పుడు కూడా వినపడకూడదు. 

⛰️ స్నానంచేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, భస్మాన్ని, రుద్రాక్షల్ని ధరించి పవిత్రంగా ప్రదక్షిణ చేయాలి. 

⛰️ ఈ పవిత్రమైన గిరిప్రదక్షిణని మనువులు, సిద్ధులు, మహర్షులు, దేవతలు అదృశ్యరూపంలో చేస్తారు. ఇది గ్రహించి వారి దారికి తాము అడ్డులేకుండా నడవాలని భావిస్తూ తమ ప్రదక్షిణ కొనసాగించాలి. 

⛰️ శివనామ సంకీర్తన చేస్తూ గానీ, శివనృత్యం చేస్తూగానీ భక్తులతో కలిసి వెళ్ళాలి. 

⛰️ మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః అన్న నామాన్ని నిరంతరాయంగా జపిస్తూ ముందుకు సాగాలి. 

⛰️ కృతయుగంలో అగ్నిమయం, త్రేతాయుగంలో మణిమయం, ద్వాపర యుగంలో బంగారుమయం, కలియుగంలో మరకతాచలంగా ఈ అరుణగిరి ఉండేదని భావించాలి. 

⛰️ పవిత్రమైన అరుణాచలం స్పటికమయమని, స్వయంప్రభావమైనదని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి. 

⛰️ పరమేశ్వరుణ్ణి అగ్నిమయ స్వరూపుడిగా భావిస్తూ ప్రదక్షిణ చేసేవారిని ఆయన సర్వదా రక్షిస్తాడు. ఈ అరుణగిరి ప్రదక్షిణ చేసేవాడి పాదాలు మోయడానికి దేవతల వాహనాలు పోటీపడుతుంటాయి. ఈ గిరిప్రదక్షిణ చేసిన వారికి దృఢమైన శరీరం ఏర్పడుతుంది. వారి వ్యాధులన్నీ నశిస్తాయి. అదృశ్యంగా ఈ గిరిప్రదక్షిణ చేసే దేవతలు తమతోపాటు ప్రదక్షిణ చేస్తున్న భక్తులకి ఎన్నో వరాలను ప్రసాదిస్తారు. పూర్వం 33 మంది మాత్రమే ఉన్న దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత 33 కోట్ల మంది అయ్యారు. 

♦️ అరుణగిరి ప్రదక్షిణ - ఫలితాలు :

ప్ర - బలంగా పాపాల్ని కొట్టి తరిమేసేది. 
ద - సకల కోరికలన్నీ తీర్చేది. 
క్షి - కర్మల ఫలితాలని క్షీణింపచేసేది.
ణ - ముక్తి ప్రదాయకమైనది అని అర్థం. 

▪️దుర్బలులు, కృషించిన శరీరం కలిగిన వారు ఎలాగో శ్రమపడి ఈ ప్రదక్షిణ చేస్తే సకల దోషాల నుంచీ పాపాల నుంచీ విముక్తులవుతారు. 

▪️అరుణగిరికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే, ముల్లోకాలకీ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. 

▪️ఉత్తరాయణ పుణ్యకాలంలో (మకర సంక్రమణం) పరమేశ్వరుడు స్వయంగా తన ప్రమధగణాలతో, ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షీణ చేస్తాడు. 

▪️ఉత్తరాయణ పుణ్యకాలంలో అరుణగిరికి ప్రదక్షిణ చేసే వారిని, జగన్మాత పార్వతీదేవి కరుణించి కాపాడుతుంది. 

▪️పవిత్రమైన అరుణగిరి ప్రదక్షిణని రథాలు, గుర్రాలులాంటి వాహనాలతో చేయకూడదు. కేవలం కాలినడకతోనే చేయాలి.

ప్రదక్షిణ ఫలితాలు :

1. ఆదివారం : ఈరోజు అరుణగిరి ప్రదక్షిణ చేసినవారు శరీర పతనానంతరం సూర్యమండలాన్ని ఛేదించుకుని యోగులలాగా శివలోకాన్ని చేరుకుంటారు. 

2. సోమవారం : శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే అజరామరత్వ ప్రాప్తి కలుగుతుంది. 

3. మంగళవారం : శుభప్రదమైన మంగళవారం నాడు చేస్తే అరుణగిరి ప్రదక్షిణ వల్ల సార్వభౌమాధికారం ప్రాప్తిస్తుంది.

4. బుధవారం : జ్ఞానప్రదమైన ఈ వారంలో గిరి ప్రదక్షిణ చేసేవారికి సర్వజ్ఞత్వం, మహాపాండిత్యం లభిస్తాయి. 

5. గురువారం : గురుసంబంధమైన ఈ వారంలో ప్రదక్షిణ చేసిన వారికి సకల దేవతలూ నమస్కరించదగ్గ గురుత్వం ప్రాప్తిస్తుంది. 

6. శుక్రవారం : మంగళప్రదమైన ఈ వారంలో గిరిప్రదక్షిణ చేసేవారికి సర్వసంపత్ర్పదమైన విష్ణులోకం లభిస్తుంది. 

7. శనివారం : అత్యంత ప్రభావంతమైనది శనివార ప్రదక్షిణ ఈరోజు అరుణగిరికి ప్రదక్షిణ చేసేవారికి సకల గ్రహబాధలు తొలగిపోయి అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. 

పూర్వం ఎంతో మంది నక్షత్ర దేవతలు, గ్రహదేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసి, శివానుగ్రహాన్ని పొందారు. అన్ని తిథులు, యోగాలు, కరణాలు, సకల ముహూర్తాలు, హోరలు, సౌమ్యాలు అన్నీ అరుణగిరి ప్రదక్షిణ చేసేవారికి అత్యంత సానుకూలంగా ఉంటాయి. 

(ఇంకా ఉంది)...

No comments:

Post a Comment