ఓo ప్రకృత్యై నమ:
—--------- —----
‘’ఏమిటి కొత్త చొక్కా వేసారు ఇవ్వాళ.’’
నువ్వూ కొత్త చీర కొనుక్కున్నావు గా!
“వ్రతం మాది, పూజ మాది కాబట్టి కొనుక్కున్నాము. కట్టుకున్నాము.”
‘’మరి అందుకే మండేది? అలా మాట్లాడతావేమిటి? మేమూ వ్రతం చేసినట్టే..
బంగారం నువ్వు కొంటే....డబ్బులు ఎవరు ఇచ్చారో?
గుమ్మానికి తోరణాలు నువ్వు కడితే.....చెట్లు పుట్టలు ఎక్కి ,మామిడాకులు ఎవరు తెచ్చారో…
పూలతో నువ్వు పూజ చేస్తే, పొద్దున్నే రోడ్డు మీద , మున్సిపాల్టి ఎద్దులాగా కనపడిన ప్రతీ పూల మొక్క దగ్గర ఆగి పూలు కోసి తెచ్చినది ఎవరో?
పరవాన్నం నువ్వుచేస్తే మాత్రం......నానా పాట్లు పాడి, ఆవు తన్నకుoడా, పొడవకుoడా చూసుకుంటూ, పాలు తెచ్చిoదెవరో…
పులిహోరలోకి కరివేపాకు, బూరేల్లోకి నెయ్యి, దద్దోజనం లోకి పెరుగు తెచ్చింది నేనేగా!
ఆఖరికి పూజలో సహస్రనామాలు కూడా నేనేగా చదివింది.””
ఆవేశoగా మగవాళ్ళoదరి తరపునా వకాల్తా తీసుకుని అన్నా!
‘ సరే లేoడి..మీతో వితండవాదం నేను చెయ్యలేను. ఇందాకా ౩12 లోని అన్నపూర్ణ గారు, నన్ను చూసి, లక్ష్మీదేవిలా వున్నావు అన్నారు తెలుసా!’’ అంది కొత్తచీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ మురిపెంగా.
నిజమే... శైలజ కొత్తచీర, నగలు, కాళ్ళకి పసుపు, పట్టీలతో మెరిసిపోతోంది, లక్ష్మి దేవిలాగా…
‘’ మరి కాదా! నువ్వు లక్ష్మి దేవివి, నేను నారాయణుడిని’’ అన్నాను నేనూ తగ్గకుండా.
‘’మన పెళ్లి లో మీ నాన్నగారు నా కాళ్ళు కడుగుతూ ఏమన్నారో తెలుసా?లక్ష్మీస్వరూపురాలైన నా కుమార్తెని, నారాయణ స్వరూపుడైన నీకు ఇచ్చి కళ్యాణo చేస్తున్నా... అని. అoదువలన నేను మహా విష్ణువుని, గుర్తుంచుకో.” అన్నా! ఆఫీసుకు బయలుదేరుతూ.
“” మీరు ఎంత మేకప్ అయినా మిమ్మల్ని ఎవరూ పొగడరు కానీ, బాగ్ లో పులిహోర బాక్స్ పెట్టాను, నాలుగు గంటలకు తినండి.’ అంది.
ఏమిటో ఎప్పుడూ ఒప్పుకోదు, నామాటని.
చక్రము, గద పట్టుకు తిరుగుతేనే మహావిష్ణువు అంటారా!
ఎన్ని అవతారాలు. ఎత్తేడు ఆ నారాయణుడు!
లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకటే రూపం. నారాయణుడు ఒకో అవతారానికి ఒకో గెటప్ లో లేడా మరి!
అసలు నన్నడిగితే.. పెళ్లి అయిన మగ వాళ్ళు అందరూ నారాయణులే. గృహస్తుకు సకల సంపదలు, అంటే ఆనందం, ఆహారం, ఆరోగ్యం, ఆయుశ్షు, సంతానం ఇచ్చేది లక్శ్మిస్వరూపురాలైన శ్రీమతే.
రుజువు కావాలంటే... .. ఓ సన్యాసి/బ్రహ్మచారి ఇంటికి వెళ్లి చూడండి. భోజనo మాట దేవుడెరుగు.మంచి నీళ్ళు కూడా కిట్టవు.
శైలజేనా మెరిసిపోయేది, నేను మెరవకూడదా!
అందుకే ఇవ్వాళ కొత్త చొక్కా వేసుకున్నాను. ఆఫీసు లో ఎవరూ నా కొత్త చొక్కాని పట్టించుకోలేదు.
అదేమిటో చిత్రం, పెళ్లిళ్లు, ఫoక్షన్లు కి కూడా ఒక్కడినే వెడితే... ఎవరూ పట్టిoచుకోరు . జంటగా వెడితేనే మర్యాదలు.కొత్త బట్టలు. ఏమిటీ అన్యాయం!
ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వెడుతూ, దారిలో దీపాలతో, దేదిప్యామానoగా వెలిగిపోతున్న లక్ష్మీ దేవి కి బయటనుండే నమస్కారం చేసుకున్నా!
ఉదయo చదివిన లక్ష్మి నామాలు లో
‘’రామాయైనమ:
కృష్ణాయైనమ:
పదాలు గుర్తుకువచ్చాయి.
రాముడు , కృష్ణుడు కూడా నేనే అని అర్ధం అనుకుంటా.
అన్నీ నానుoడే వచ్చాయి అంటోంది జగన్మాత.
ఇంక మానవమాత్రుడిని నేనెంత చెప్పండి.
చెప్పడం మర్చిపోయాను మరో నామo పేరు
‘ ప్రసాదిన్యై నమ:”
ఇంక నేనేమి మాట్లాడను.
మీరే చెప్పండి.
అందరికీ లక్ష్మీ కటాక్ష సిద్దిరస్తు.
***
మీ
ప్రసాదరావు పొన్నాడ
(పాత రచన. మరోసారి మీకోసం)
No comments:
Post a Comment