*ప్రాచీన గాథాలహరి - 14*
🪷
రచన: పిలకా గణపతిశాస్త్రి
*గోపాల గవేషణ -2*
🐄
ఆనాడు ఆళవీ గ్రామంలో అరుణోదయ కాంతులు, కాషాయాంబర ధారులైన బౌద్ధ భిక్షుక సమూహాలు ఒకేసారిగా ప్రత్యక్ష మైనాయి. ఆ భిక్షువులతో గౌతమదేవుని ముఖజ్యోతి అప్పుడప్పుడే ఉదయిస్తున్న భానుబింబంలా మెరిసింది.
అది చూచి ఆళవీ గ్రామస్థులందరు భిక్షు వులందరికీ ఎదురేగి అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. విశాల వట వృక్ష చ్ఛాయల్లో వారందరికీ విడుదులేర్పాటు చేశారు.
పిమ్మట క్రమక్రమంగా భిక్షా సమయం ఆసన్నమయింది. భిక్షుకులందరు తమ తమ భిక్షాపాత్రలు ధరించి ఆళవీ గ్రామం లోకి ప్రవేశించారు. కాని గ్రామస్థులెవ్వరు దాని కనుమతించలేదు. తామంతా ప్రత్యేకంగా వారికి విందు చేయబోతున్నా మనీ, ఆ విందారగించవలసిందనీ పరిపరివిధాల ప్రాధేయపడ్డారు. భిక్షువులు మొదట తమ భిక్షాధర్మం విసర్జించడాని కంగీకరించలేదుగాని చిట్టచివరికి ఆచార్య దేవుని అనుజ్ఞపై ఆ విందు భోజనాని కంగీకరించారు.
పిమ్మట కొంతసేపటికి శ్రమణకులందరు భోజనాలు ముగించుకొని ప్రశాంత వట తరుచ్చాయలో సమాసీనులైనారు. అప్పటి కించుమించుగా రెండు యామాల కాలం గడిచిపోయింది. తథాగతుడు వట వృక్ష మూలంలో అమర్చిన సుఖాసనంపై విశ్రమించి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఆళవిగ్రామం పొలిమేరల వై పవలోకిస్తున్నాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
భోజనానంతరం ఆయన చేసే ధర్మబోధలు ఆలకించవలెననే ఆసక్తితో ఆళవీ గ్రామస్థు లందరూ అక్కడికి చేరుకొన్నారు. ఇంకా పరిసర గ్రామాలనించి వచ్చినవారెంద రెందరో ఆ ధర్మబోధ లాలకింపవలెనని ఉత్కంఠతో తహతహలాడిపోతున్నారు. కాని వారందరికి బుద్ధదేవుని ముఖంలో కేవలం ప్రశాంత మౌన ముద్ర మాత్రమే ప్రత్యక్షమైంది. అలా ఎంతసేపు వేచి ఉన్నా ఒక్క పలుకైనా ఆయన నోటినుండి వెలువడలేదు.
క్రమక్రమంగా మూడో యామం కూడా గడిచిపోయింది. గౌతమ దేవుని విశాల నేత్రాలప్పు డెవరికోసమో నిరీక్షిస్తున్నట్టుగా స్ఫురిస్తున్నాయి. ఆ నిరీక్షణ తాత్పర్య మేమో ఎవరికీ అవగాహన కాలేదు. కొందరు భిక్షుకుల కదేమీ బోధపడక ఆచార్యునివలెనే తాము కూడా దిక్కులు చూడడం మొదలుపెట్టారు. కాని ఎంత సేపటికి ఏమీ ఫలితం కలగలేదు.
అంతట అనతి దూరంలో గంభీరంగా ఒక 'అంబా' రవం వినిపించింది. అందరు అటు వైపు చూచారు. గౌతమబుద్ధుని నేత్రా లంతకు పూర్వం నుంచి ఆ వైపే పరికిస్తున్నాయి.
అంతలో గోవును వెంటబెట్టుకుని తొందర తొందరగా అంగలు వేసుకుంటూ వస్తున్న నందగోపాలుడనతి దూరంలో వారికి ప్రత్యక్షమైనాడు. కాని భిక్షువు లెవరూ అతని వైపంత ఆత్రంగా పరిశీలించలేదు. అయితే గౌతముని నేత్రాలు నిశ్చలంగా అతని ఆగమనమే నిరీక్షిస్తున్నట్లున్నాయి. దాని కారణమేమో వారెవరికీ బోధపడలేదు.
నందు డంతలో గోవును వట వృక్ష చ్ఛాయలో నిలిపి నురుగులు గక్కుకుంటూ పరుగెత్తుకు వచ్చి బుద్ధదేవుని పాదాలపై సాగిలపడ్డాడు. కొంతసేపటికి లేచి అతి వినయంగా దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. చివరి కెలాగైనా దర్శన భాగ్యమైనా లభించింది గదా! అని ఎంతో సంతోషించాడు. వెంటనే గౌతముడు లేచి నిలబడ్డాడు. వెనువెంటనే భిక్షువు లందరు లేచి నిలుచున్నారు! బుద్ధదేవుడెంతో ఆత్రంగా పక్కనే నిలబడిన భిక్షువులతో-
“ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా?" అన్నాడు.
భిక్షువులు "లేకేమి? సమృద్ధిగానే ఉన్నాయి" అన్నారు.
“అయితే వెంటనే ఆ నందగోపునికి తృప్తిదీరా భోజనం పెట్టించండి! తొందరగా వెళ్ళండి!" అన్నాడు.
వెంటనే కొందరు భిక్షువులు నంద గోపాలకుని వెంటబెట్టుకొని భోజనశాల లోకి వెళ్ళిపోయారు. నందగోపునికి అన్నం కంటబడగానే పంచప్రాణాలూ లేచి వచ్చాయి. గత రాత్రి నించీ ఆ క్షణంవరకు అత డాకటితో నకనకలాడుతున్నాడు. ఆకలితో నవనాడులు కుంగిపోతున్నాయి. అయినా ఆ అన్నం చూచేసరికి అతనికి ఇంటి దగ్గర కట్టివేసిన ఆవు దూడ జ్ఞాపకం వచ్చింది. అక్కడి కతని ఇల్లు కొంచెం దగ్గరలోనే ఉంది.
ఇక అతని కా అన్నం మీద దృష్టిపోలేదు. అంతలో ఇంటి దగ్గర లేగదూడ 'అంబా' అని గొంతెత్తి అరిచింది. అది వినగానే మర్రి నీడ కింద నిలబడిన నందగోపుని గోవు అంతకన్నా గట్టిగా అరిచింది. నందగోపుడు అన్నం తినకుండా లేచి నిలుచున్నాడు. కాని అతని కెదురుగా గౌతమ బుద్ధుడు నిలబడి చిన్న చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు.
"నాయనా! నీ లేగదూడ పలుపు తెంచుకుని మర్రినీడలో నిలబడిన తల్లి దగ్గరికి వచ్చి తనివితీరా పాలు కుడుచు కుంటున్నది. తొందర లేదులే! నెమ్మదిగా భోజనం చెయ్యి!" అన్నాడు.
గౌతముడు వటచ్చాయ విడిచిపెట్టి భోజనశాలలో ప్రవేశించిన ట్లేంతవరకు నందగోపుడు గమనించనేలేదు. ఆయన స్వయంగా అక్కడికి వచ్చి నందగోపునికి కావలసిన భోజన పదార్థాలన్నీ వడ్డింప జేస్తున్నాడు. ఆ ఆప్యాయత చూచేసరికి నందగోపుని హృదయం ద్రవించి నీరైపోయింది.
తథాగతుడు నందగోపుని భోజనం పూర్తి అయ్యేవరకు అతని ప్రక్కనే కూర్చున్నాడు. ఎంతో ఆప్యాయంగా అతని గోవును గురించీ, కోడె దూడను గురించీ ఎన్నెన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు తన కోడెదూడ నుదుటిమీది నల్లని మచ్చలను గురించీ, ఒంటిమీది సుడులను గురించీ ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలెన్నెన్నో ఏకరువు పెట్టాడు. ప్రత్యేకంగా వంశపారంపర్యతః గ్రహించిన కొన్ని గో సాముద్రిక రహస్యాలను ఆచార్యదేవుని కెరుకపరిచాడు. ఆయన అవ్వన్నీ విని తిరిగీ కొన్ని కొన్ని చిన్న సందేహాలు తీర్చవలసిందని నందగోపుని అభ్యర్థించాడు. నందగోపు డెంతో చనువుతో అవ్వన్నీ ఆచార్యదేవుని కుపదేశించాడు!
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అంతేగాని నందగోపుని భోజనం ముగిసే వరకు ఆయన ధర్మబోధ లేమీ తలపెట్టనే లేదు. చుట్టూరా నిలిచిన కొందరు భిక్షువులకు వారి ప్రసంగాలన్నీ కేవలం ఇద్దరు వెర్రిగొల్లల ప్రసంగాలలా వినిపించాయి! వారంతా నోట మాటలేక అలాగే ఆ విడ్డూరమే తిలకిస్తూ నిలుచుండిపోయారు!
📖
నందగోపుని భోజనానంతరం బుద్ధదేవు డతనిని వెంటబెట్టుకుని నెమ్మదిగా వట వృక్షచ్ఛాయకు తిరిగివచ్చాడు. వెంటనే అష్టాంగధర్మ ప్రవచనం ప్రారంభమైంది. అమృతవర్ష ప్రాయమైన ఆ ప్రసంగం ఆలకిస్తూ భిక్షువులు, ఆళవీ గ్రామస్థులు ఆనంద తరంగాలలో తలమునకలైనారు. ధర్మ ప్రవచనం చేస్తూన్నంతసేపు బుద్ధ దేవుడు చిరునవ్వులతో నందగోపాలుని వై పలవోకగా తిలకిస్తూనే ఉన్నాడు.
అది చూచి బౌద్ధ బిక్షువు అనేకులెంతో ఆశ్చర్యపడ్డారు. మరి కొందరిలో కొంచెం అసూయ కూడా బయలుదేరింది. అయినా కొందరు ధర్మ ప్రవచనం ముగిసేవరకు ఎలాగో అలాగ నిగ్రహం అవలంబించారు. క్రమక్రమంగా కొంతసేపటికి ధర్మ ప్రవచనం ముగిసిపోయింది. పిమ్మట బుద్ధదేవుడు నందగోపునికి ధర్మదీక్ష అనుగ్రహించాడు.
వెంటనే శ్రమణకులు, గౌతమ బుద్దుడు శ్రావస్తినగరానికి ప్రయాణమైనారు. దానితో అంతదాకా నిగ్రహం అవలంబించిన శ్రమణ కులలో కొంచెం చలనము, కలకలము బయలుదేరాయి. మరికొందరు కొంచెము బిగ్గరగానే గుసగుసలు మొదలుపెట్టారు!
వారి గుసగుసలకు కొంచెం కారణము లేకపోలేదు. ఇన్నాళ్ళనించీ జరుగుతున్న ధర్మ ప్రసంగంలో గౌతమదేవుడు స్వయంగా ఎవరినీ భోజన విషయమై ప్రశ్నించి ఉండలేదు. ఈనా డాయన ఎంతో సేపటినించి వేచివున్న భిక్షువులను, ఆళవీ గ్రామస్థులను ఉపేక్షించి స్వయంగా దగ్గర కూర్చుని నందగోపునికి భోజనం ముగిసే దాకా ధర్మప్రవచనం ప్రారంభించనే లేదు. ఇక నందగోపుని విషయం చూస్తే అతడేమీ అంతటి బ్రహ్మణ్యుడు కాడు. వట్టి వెర్రిగొల్ల!
అలాంటి సామాన్యుని భోజన విషయంలో గౌతమదేవుని కంతటి పక్షపాతం కలగ వలసిన అవసర మేమి కలిగింది?
వారి గుసగుసలా విధంగా సాగిపోయాయి. క్రమంగా అవి బుద్ధ దేవునికి వినిపించే అంత బిగ్గరగా విజృంభించాయి.
ప్రశాంతంగా శ్రావస్తీ నగరం వైపు సాగిపోతున్న సిద్ధార్థుడా మాటలు విని మరి అడుగు వెయ్యకుండా అలాగే దారిలో నిలబడి గుసగుసలాడుతున్న శ్రమణకుల వైపు చూచాడు. వారిలో ఒక శ్రమణకునితో ఆ గుసగుసలకు కారణమేమని ప్రశ్నించాడు. దానితో భిక్షువులందరు నిలబడిపోయారు. ఒక శ్రమణకుడు ఆచార్యునికి భిక్షువుల రహస్య సంభాషణ లన్నీ తెలియజేశాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అవి విని బుద్ధుడొక చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు చూచి భిక్షువులందరు నిర్ఘాంతపడి నిలుచున్నారు.
బుద్ధదేవుడతి ప్రశాంత స్వరంతో ఇలాగన్నాడు:
"నందగోపాలకుడు నిన్నటినించి ఎంతో క్షుధార్తుడై ఉన్నాడు. కనకనే అతనికా విధంగా భోజనం పెట్టించాను. క్షుధ యాతన అన్నింటిలోను అత్యంత దుస్సహమైన యాతన ! జీవ చైతన్యమే ఆ యాతనా నిదానం! ఇది సమ్యగ్బుద్ధితో అవగాహన చేసుకొన్న వారందరికీ నిర్వాణం కరతలామలకం!"
అది వినగానే శ్రమణకులందరు పశ్చాత్త పులై వంచిన తల లింక ఎత్తలేదు. అంతలోనే గౌతముని గంభీరవాణి తిరిగీ ప్రతి ధ్వనించింది:
"నాయనా! నందగోపాలకుని సరళ వర్తనము, సాధుస్వభావము మీరెరుగరు. ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా అతడు తన గోపాలక ధర్మం విస్మరించలేదు! అతని గోవాత్సల్యం అపారం! ముప్ఫయి క్రోశాల దూరం నడిచి, ఇంతగా శ్రమపడి ఈ ఆళవీ గ్రామాని కెందుకు వచ్చానో మీరెవరైనా ఎరుగుదురా?”
ఆ ప్రశ్నతో గుసగుసలాడిన శ్రమణక బృందం శిరస్సులింకా బాగా కిందికి వంగిపోయాయి.
'ఆ నందగోపాలకుని కోసమే!' అన్నాడు బుద్ధదేవుడు.
అది విని శ్రమణకులందరు దూరంగా నిలబడి వీరి వైపే చూస్తున్న నందగోపాలకు నివైపెంతో గౌరవ భావంతో చూశారు. కొందరతనిని సమీపించి సవినయంగా చేతులెత్తి నమస్కరించారు.
గో గోవత్సాలతో ఆళవీగ్రామం పొలిమేర వరకు బుద్ధదేవుని వెంట సాగిపోతున్న నందగోపాలు డాచార్యదేవుని మాటలు విని గౌతమదేవునికి, శ్రమణకులకు ఎంతో భయభక్తులతో సాగిలపడి, లేచి నిలబడి అమాయకంగా ఇలాగన్నాడు:
"బాబూ! నేనేమీ ఎరగని వట్టి వెర్రిగొల్ల వాణ్ణి! అయితే ఆ మహారాజులు నాలాంటి వెర్రి గొల్లలే! మందలో ఒక్క గోవు తప్పిపోయినా మరి వారి కిక అన్నపానాలు సయించవు! వారి మనసు అప్పుడే తీసిన వెన్నపూసలాంటిది!" ఆ అమాయిక ప్రసంగం వినగానే శ్రమణకులందరి ముఖా లలోనూ చిరునవ్వులు తాండవించాయి.
తరవాత నందగోపు డెంతో ఆప్యాయంగా లేగను దగ్గరకు తీసుకొని దాని నుదుటిపై ముద్దుల వర్షం కురిపించాడు. దాని మూలంగానే తనకంతటి అదృష్టం కలిగిందని లోలోపల ఎంతైనా మురిసి పోయాడు. అది అతని చేతి వేలొకసారి కుడుచుకొని గొంతెత్తి 'అంబా' అని అరిచింది.
🐮
(రేపు మరొక చక్కని కధ)
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment