అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-155.
275d3;259e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣5️⃣5️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️.```
(సరళమైన తెలుగులో)
```
*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*8. వ శ్లోకము:*
*”జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియఃl*
*యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనఃll”*
“శాస్త్రములను చదివి సంపాదించిన జ్ఞానముతోనూ, ఆ జ్ఞానమును ఆచరించి ఆర్జించిన విజ్ఞానముతోనూ తృప్తి చెందిన మనసు కల వాడు, చలించని మనసు కలవాడు, ఇంద్రియములను తన అదువులో ఉంచుకున్నవాడు, తన ఎదురుగా కనపడుతున్న బంగారము, రాయి, మట్టి బెడ్డలను ఒకేవిధంగా భావిస్తాడు. అటువంటి వాడిని “యుక్తుడు అయిన యోగి” అని అంటారు.
```
ఇక్కడ యోగి అనే పదం వాడారు. యోగి అంటే ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న జీవాత్మను వెనుకకు మళ్లించి, తన నిజస్వరూపమైన ఆత్మ స్వరూపముతో, పరమాత్మలో కలపడానికి ప్రయత్నించే వాడు యోగి.
యోగము అంటే కలయిక. మనకు యోగులు చాలామంది కనపడతారు. కాని యోగులలో “యోగయుక్తులు”కొంతమందే ఉంటారు. అటువంటి వారి లక్షణములు ఇక్కడ వివరిస్తున్నాడు.
యోగులు వేదములు, శాస్త్రములు అధ్యయనము చేసి అపారమైన జ్ఞానము సంపాదిస్తారు. ఆ జ్ఞానమును ఆచరణలో పెడతారు. దానినే విజ్ఞానము అంటారు. ఆ జ్ఞానవిజ్ఞానముల చేత తృప్తి పొందుతారు.
జ్ఞానము అంటే వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి సంపాదించినది. గురువుల వలన ఉపదేశము పొందినది. పెద్దల ద్వారా వినినది, జ్ఞానము.
విజ్ఞానము అంటే తానుపొందిన జ్ఞానమును ఆచరణలో పెట్టడం, కొంత మంది శాస్త్రములు వేదములు చదివి తమకు అంతా తెలుసు అనుకుంటారు. అది తప్పు. నేర్చుకున్న జ్ఞానమును ఆచరణలో పెట్టినపుడే అది విజ్ఞానము అవుతుంది.
పుస్తకములు చూచి, తన తల్లి, అత్తగారు, ఇంకా ఇతర పెద్దవారు చేస్తూ ఉండగా చూచి వంట చేయడం నేర్చుకోవడం జ్ఞానం.
తానే స్వయంగా వంటచేసి, అందరికీ వడ్డించడం విజ్ఞానము.
రెండూ అవసరమే. అలాగే ముందు పరమాత్మ గురించి, ఆయన తత్వము గురించి, ఆయనను పొందే మార్గము గురించి తెలసుకోవడం జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానమును ఆచరించి పరమాత్మలో ఐక్యం కావడం విజ్ఞానము.
వీటివలన ఆత్మ తత్వాన్ని తెలుసుకొని తృప్తిపడిన వాడు యోగయుక్తుడు. ఇక్కడ తృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందడం, లేని దాని కొరకు ఆరాటపడకపోవడం.
కొంత మంది వేదములు, శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతూనే ఉంటారు. వల్లెవేస్తుంటారు. వారికి తృప్తి అంటూ ఉండదు. కాని వాటిని ఆచరణలో పెట్టడం శూన్యం. వారికి కేవలం శాస్త్ర జ్ఞానము తప్ప వేరే ఉండదు. తృప్తి అనేది అసలే ఉండదు. తృప్తి లేని వాడికి ఎంత జ్ఞానము ఉన్నా ఏం లాభం లేదు. పైగా చదివింది చాలదు. ఇంకా ఇంకా చదవాలి అని నిరంతర అశాంతితో బాధపడుతుంటాడు. అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానమును, ఆచరణలో పెట్టినవాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్న దానితో తృప్తి చెందుతాడు. లేని దాని కొరకు పాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా, ప్రశాంతంగా గడుపుతాడు.
రెండవ లక్షణము: కూటస్థుడు.
అంటే ఎవరేమన్నా ఏ విధమైన వికారము చెందని వాడు. కూటము అంటే కమ్మరి వాడి దిమ్మె.
దానిని సుత్తితో ఎంత కొట్టినా చలించదు. దాని మీద బంగారం పెట్టి కొట్టినా, రాగి పెట్టి కొట్టినా, ఇనుము పెట్టి కొట్టినా అది చలించదు. అలాగే బయట ఉన్న విషయములు తనను ఎంత ప్రలోభ పెట్టినా చలించని వాడు, నిర్వికారుడు, కూటస్థుడు అనబడతాడు.
సుఖదుఃఖములు, లాభనష్టములు, మానావమానములను సమంగా ధరించేవాడే కూటస్థుడు, అట్టివాడే యోగయుక్తుడు.
ఇంక మూడవ లక్షణము: “విజితేంద్రియః” అంటే జయింపబడిన ఇంద్రియములు కలవాడు. అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు. సాధారణంగా జితేంద్రియః అంటారు కాని ఇక్కడ ‘విజితేంద్రియః‘ అన్నారు. అంటే బాగుగా, ప్రకృష్టంగా, అని అర్ధం.
ఏ మాత్రం సందేహం లేకుండా ఇంద్రియములను జయించిన వాడు అని అర్థం. అంటే ఏది కనపడితే అది కావాలిన కోరుకోవడం, దానికొరకు ఆరాటపడటం, స్పర్శ సుఖం కోసం పరితపించడం, దాని కొరకు చెయ్యకూడని పనులు చేయడం. ఇవన్నీ ఇంద్రియములు మన అధీనంలో లేకపోవడం వలన జరుగుతుంది. కాబట్టి ఇంద్రియములను ఎల్లప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి.
ఇంక నాల్గవ లక్షణము:
సమదృష్టి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు పరమాత్మ.
“సమలోష్టాశ్మ కాంచనః లోష్టము” అంటే మట్టి బెడ్డ, మట్టి గట్టిబడితే అశ్మము అంటే రాయి. కాంచనము అంటే బంగారము, అది కూడా మట్టి నుండే వస్తుంది. ఈ మూడింటినీ సమానంగా చూచేవాడు అని అర్థం.
మనం బంగారాన్ని దాచిపెట్టుకుంటాము. రాయిని, మట్టిని బయట పారవేస్తాము. వాటి వాటి విలువలను బట్టి ప్రవర్తిస్తాము. కాని యోగి అలాకాదు. మూడింటినీ సమానంగా చూస్తాడు. దాని అర్ధం మట్టిని బీరువాలో దాస్తాడు అని కాదు. నిర్వికారంగా ఉంటాడు. దేనికీ ఆశపడడు. బంగారము విలువ కలది అది రేర్ మెటల్. కాని రాయి ఎక్కడైనా దొరుకుతుంది. అది మన మానసిక కల్పన. యోగికి బంగారం ఇచ్చినా ఏమీచేసుకోలేడు. అందుకే అతనికి బంగారము రాయితో సమానము, మనం అవసరం ఉన్నా లేకపోయినా, గొప్పకోసం, మా దగ్గర ఇంత బంగారము ఉంది అని చెప్పకోడానికి, విపరీతంగా బంగారము కొని దానిని దాచుకొని, దానిని ఎక్కడ దొంగలు ఎత్తుకుపోతారేమో అని నిరంతరం భయపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటాము. ప్రశాంతతను కోల్పోతాము. అశాంతిని కొనితెచ్చుకుంటాము.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ లోకంలో ఉన్న సమస్త పదార్థాలు పంచభూతాత్మకములు.
అంటే ఐదు ధాతువుల వలననే ఏర్పడ్డాయి. పర్వతములు, చెట్టు, పుట్ట, ఈ దేహము, రాయి, బంగారము, వెండి ఇనుము ఇతర లోహములు అన్నీ పంచభూతముల నుండి ఏర్పడ్డాయి.
ఈ విషయం తెలిసిన వాడికి ఏ వస్తువు చూచినా ఒకటిగానే కనపడుతుంది కానీ వేరుగా కనపడదు, అటువంటి వాడు అన్నింటిలోనూ సమత్వాన్ని చూస్తాడు.
ఒక వస్తువుకు ఉన్న విలువను మన మనస్సు నిర్ణయిస్తుంది. అంతే కానీ ఆ వస్తువు కాదు. రాళ్లు మట్టి అధికంగా లభిస్తాయి. కాని బంగారము అరుదుగా లభిస్తుంది. టన్ను మట్టి నుండి ఔన్సు బంగారము దొరుకుతుంది. అందుకనే దానికి విలువ ఎక్కువ. చిన్న పిల్లవాడి ముందు బంగారము పెట్టినా మట్టిబెడ్డ పెట్టినా వాడికి ఒకటే.
పైగా వాడు మట్టిబెడ్డ తీసుకొని నోట్లోపెట్టుకుంటాడు. కాబట్టి వస్తువులలోని హెచ్చుతగ్గులను, విలువలను మన మనస్సు నిర్ణయిస్తుంది. తన ఆఫీసరును చూచి తండ్రి గడగడవణుకుతాడు కాని కొడుకు ఆ ఆఫీసరును అస్సలు లక్ష్యపెట్టడు. పైగా ఆయన నీకు ఆఫీసరు! నాకు కాదు అని ఎదురు చెబుతాడు. ఎందుకంటే కొడుకు దృష్టిలో ఆ వ్యక్తికి విలువలేదు. కొడుకు గౌరవించే వాడిని తండ్రి లక్ష్యపెట్టడు. దీనికంతా మన మనసే కారణము. కాబట్టి జ్ఞానము, విజ్ఞానములతో తృప్తి పొందిన సాధకుడికి ఈ ప్రపంచం అంతా పంచభూతాత్మకంగానే కనపడుతుంది కానీ వేరుగా కనిపించదు. అటువంటి వాడిని యుక్తుడు, యోగి అని అంటారు.✍️```
```(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
No comments:
Post a Comment