Thursday, September 25, 2025

 *శ్రీ శివ మహా పురాణం* 
*384.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-మూడో అధ్యాయం* 

*నైమిషోపాఖ్యానము* 

*బ్రహ్మ ఇట్లు పలికెను:* 

పరమేశ్వరుని చేరుకొన (వర్ణించ) లేక వాక్కులు మనస్సుతో సహా వెనుదిరుగుచున్నవి. ఆనందస్వరూపుడగు పరమేశ్వరుని తెలుసుకున్న జ్ఞాని దేనివలనైననూ భయపడడు. బ్రహ్మా, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, సర్వభూతములు మరియు ఇంద్రియములతో సహా ఈ సర్వము సృష్ట్యాదియందు ఆయననుండి ఉద్భవించుచున్నది. సర్వకారణములను సృష్టించే పరమకారణము పరమేశ్వరుడే. ధ్యానము చేయువాని స్వరూపము ఆయనయే. ఈ జగత్తు ఏ కాలమునందైననూ ఆయనకంటె భిన్నముగా మరియొక కారణమునుండి ఉద్భవించుట లేదు. సకలములగు ఐశ్వర్యములతో పూర్ణుడై యున్న ఆయనకు స్వయముగా సర్వేశ్వరుడని పేరు. మోక్షమును కోరువారందరిచే శంభుడు హృదయాకాశములో ధ్యానింపబడుచున్నాడు. ఆయన మున్ముందుగా నన్ను తన పుత్రునిగా సృజించి నాకు జ్ఞానమునొసంగెను. ఆయన అనుగ్రహముచే మాత్రమే నేనీ ప్రజాపతి స్థానమును పొందియున్నాను. అద్వితీయడగు ఆ పరమేశ్వరుడు స్వప్రకాశస్వరూపమునందు వృక్షము వలె అవికారియై ప్రతిష్ఠితుడై యున్నాడు. సర్వజగత్తు ఆత్మగా గల పరమేశ్వరునిచే ఈ జగత్తు అంతానిండియున్నది. పుట్టి మరణించే ప్రాణులు స్వతః క్రియాశక్తి కలవి గావు. వాటియందు క్రియాశక్తిరూపములో ఈశ్వరుడే ఉన్నాడు. అద్వితీయుడగు ఆ మహేశ్వరుడే మాయాశక్తిని అనేకప్రాణుల రూపములో ప్రకటింపజేయుచున్నాడు. ఆ ఈశ్వరుడే జీపులతో నిండియున్న ఈ లోకములను పాలించుచున్నాడు. ఆ రుద్రభగవానుడు అద్వితీయుడు. అనగా, ఆయనకంటె భిన్నముగా రెండవ వస్తువు లేదు. కంటికి కానవచ్చే జగత్తునకు సర్వకాలములలో అధిష్ఠానమై యున్న పరమేశ్వరుడు సర్వదా జనుల హృదయములో సుస్పష్టముగా ప్రకటమగు చున్ననూ సామానయజనులకు కానరాకున్నాడు. అనంతశక్తిస్వరూపుడగు ఆ అద్వితీయ పరమాత్మ కాలాతీతములగు కారణములకు అన్నింటికీ కూడ అధిష్ఠానమై యున్నాడు.

ఈశ్వరునకు రాత్రింబగళ్లు (కాలము) లేవు. ఈశ్వరునితో సమానమైనవాడు గాని, ఆయన కంటె అధికుడు గాని లేడు. నిత్యము, జ్ఞానక్రియారూపము మరియు సర్వకారణము అగు మాయాశక్తి దానికి కారణము, అవినాశి, చావు పుట్టుకలు లేనిది అగు మాయాశక్తి అనే రెండు ఆ అక్షరపరబ్రహ్మయే ఆత్మగా కలిగియున్నవి. అట్టి అద్వితీయ స్వయంప్రకాశ పరంబ్రహ్మ శివుడే. ఏ మానవుడు సాత్త్వికమగు అంతఃకరణము గలవాడై ఆ పరం బ్రహ్మను ధ్యానించునో, ఆతడు సర్వసమర్థుడగును. ఆతని విషయములో ఈ మాయ తొలగిపోవుటచే జీవభావము నిషిద్ధమై ఆతడు జీవన్ముక్తుడగును. మెరుపు, సూర్యుడు, చంద్రుడు అనే జ్యోతిస్సులు ఈశ్వరుని ప్రకాశింప జేయలేవు. ఈ సర్వము ఈశ్వరుని ప్రకాశముననుసరించి ప్రకాశించుచున్నదని శాశ్వతమగు వేదవచనములు చెప్పుచున్నవి. స్వయంప్రకాశస్వరూపుడు, మహాదేవుడు అగు మహేశ్వరుడు అద్వితీయుడని తెలియవలెను. ఆయనకంటె ఉత్కృష్టమైన పొందదగిన గమ్యము మరియొకటి ఏదియు కానవచ్చుట లేదు. ఈ పరమేశ్వరుడు ఆది-అంతములు లేనివాడు, స్వభావము చేతనే దోషరహితుడు, స్వతంత్రుడు మరియు పరిపూర్ణుడు. చరాచరజగత్తు ఆయన ఇచ్ఛకు అధీనమై యుండును. నిర్గుణుడు, వాక్కులకు మనస్సును గోచరము కానివాడు, ముక్తుడు, ముక్తిని ఇచ్చువాడు, కాలాతీతుడు, కాలమును ప్రవర్తింప జేయువాడు అగు పరమేశ్వరుడు దివ్యమగు దేహముతో శోభిల్లుచున్నాడు. ఆరు రకముల మార్గములతో కూడియున్న ఈ జగత్తునకంతకూ ప్రభువు, సర్వమునందు ఆత్మరూపముగా నుండే సర్వజ్ఞుడు అగు పరమేశ్వరుడు సర్వమునకు పైన నివసించియున్నాడు. ఒక దానికంటె మరియొకటి గొప్పది అనే గణనములో అంతమునందు ఆ ఈశ్వరుడు సర్వోత్కృష్టుడై యుండును. ఆయనకు పైన మరియొకటి లేదు. తేనెయందు తుమ్మెదవలె ఆయన అనంత-ఆనంద-ఘన-స్వరూపమునందు ప్రతిష్ఠితుడై యుండును. ఔదార్యము, సామర్థ్యము, గాంభీర్యము మరియు మాధుర్యము అను గుణములకు నిధియగు పరమేశ్వరుడు విశాలమగు బ్రహ్మాండములను తనలో ఇముడ్చుకొనుటలో దిట్ట.

ఆ పరమేశ్వరునితో సాటి వచ్చే వస్తువు గాని, అధికమగు వస్తువు గాని ఏదియూ లేదు. సాటి లేని ఆ ఈశ్వరుడు రాజులకు రాజుగా నిలబడియున్నాడు. లీలలను నెరపే ఆ ఈశ్వరుడు ముందుగా ఈ జగత్తును సృష్టించును. ప్రళయకలమునందు అది మరల ఆయనలో లీనమగును. ప్రాణులు ఆయన వశములో నుండును. సర్వమును నియంత్రించువాడు ఆయనయే. పరా (సర్వోత్కృష్టమగు) భక్తిచే మాత్రమే ఆయన కానవచ్చును. ఆయనను కనుటకు మరియొక మార్గము లేదు. వ్రతములు, సకలదానములు, తపస్సులు మరియు నియమములు అంతఃకరణశుద్ధికొరకు సహకరించునని పూర్వము పెద్దలు చెప్పియున్నారు. దీనిలో సందేహము లేదు. విష్ణువు, నేను, రుద్రుడు మరియు ఇతరదేవతలు ఆయనను చూడగోరి ఈ నాటికీ కఠోరమగు తపస్సులను చేయుచున్నారు. పతితులు, మూర్ఖులు, దుష్టులు, నీచప్రవృత్తి గలవారు ఆయనను చూడలేరు. భక్తులు ఆయనను తమలో మాత్రమే గాక బయట కూడ పూజించి, ఆయనతో సంభాషించుచుందురు. ఆయనకు స్థూలము, సూక్ష్మము మరియు పరము అనే మూడు రూపములుగలవు. మావంటి వారలకు స్థూలరూపము కానవచ్చును. కాని, యోగులు సూక్ష్మరూపమును చూచెదరు. ఈ రెండింటికీ అతీతమైనది, నిత్యము, జ్ఞాన-ఆనంద-ఘనము మరియు వినాశము లేనిది అగు రూపమును ఆయనయందు నిష్ఠ గలవారు, ఆయన మాత్రమే చరమలక్ష్యముగా గలవారు, ఆయనయొక్క వ్రతమును ఆశ్రయించినవారు అగు భక్తులు గాంచెదరు. ఈ విషయములో ఇన్ని మాటలేల? శివునియందలి భక్తి రహస్యములలోకెల్లా రహస్యమైనది. అది గలవాడు నిస్సందేహముగా మోక్షమును పొందును.మొక్కనుండి విత్తు, విత్తునుండి మొక్క వచ్చినట్లుగా, శివుని అనుగ్రహముచే మాత్రమే ఆ భక్తి అబ్బును; అనుగ్రహము భక్తి వలన కలుగును.

సర్వకాలములలో జీవునకు అనుగ్రహము వలన మాత్రమే సర్వకార్యములు సిద్ధించును. సాధనములన్నింటిచే అంతములో సాధింపబడేది ఆ అనుగ్రహము మాత్రమే. అనుగ్రహమునకు సాధనము ధర్మము. ఆ ధర్మమును వేదము బోధించుచున్నది. నిత్యము ధర్మమును అనుష్ఠించుట వలన పూర్వమునందలి పుణ్యపాపములు సమానమగును. ఇట్లి సామ్యము వలన సాధకునకు పరమేశ్వరుని అనుగ్రహముతో సంపర్కము కలుగును. దాని వలన వాని ధర్మము ఇనుమడించును. ధర్మము ఇనుమడించుట వలన జీవుని పాపములు పూర్తిగా క్షయమగును. ఈ విధముగా నశించిన పాపములు గల వ్యక్తికి అనేకజన్మలలో క్రమముగా జగన్మాతతో కూడియున్న ఆ సర్వేశ్వరునియందు జ్ఞానపూర్వకమగు భక్తి ఉదయించును. అంతఃకరణశుద్ధిని అనుసరించి ఈశ్వరుని అనుగ్రహములో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈశ్వరుని అనుగ్రహముచే కర్మసన్న్యాసము సిద్ధించును. కర్మసన్న్యాసమనగా కర్మల ఫలమును త్యాగము చేయుట మాత్రమే; వాస్తవముగా కర్మలను విడిచిపెట్టుట కాదు. అట్టి కర్మఫలత్యాగము వలన శుభకరమగు శివధర్మనిష్ఠ లభించును. శివధర్మము గురువును అపేక్షించేది మరియు గురువుయొక్క అపేక్ష లేనిది అని రెండు రకములుగా నున్నది. వాటిలో గురువు యొక్క అపేక్ష గల ధర్మము ముఖ్యమైనది; గురువుయొక్క అపేక్ష లేనిదానికంటె వంద రెట్లు గొప్పది. ఈ శివధర్మనిష్ఠ యందు శివజ్ఞానము కూడ సమ్మిళితమై యుండును. శివజ్ఞానముయొక్క సమన్వయము వలన సాధకుడు సంసారములోని దోషములను దర్శించును. దానివలన ఇంద్రియ సుఖములయందు వైరాగ్యము కలుగును. వైరాగ్యము అంతః కరణశుద్ధికి సాధనము. అంతఃకరణశుద్ధి గలవాని నిష్ఠ ధ్యానమునందే గాని కర్మయందు ఉండదు. జ్ఞానము మరియు ధ్యానము అనువాటితో కూడిన పురుషునుకు యోగము ఆరంభమగును. అట్టి యోగముచే పరాభక్తి (సర్వోత్కృష్టమగు భక్తి) నెలకొనును. దాని వెనువెంటనే ఈశ్వరానుగ్రహము కలుగును. జీవుడు అట్టి అనుగ్రహముచే మోక్షమును పొంది, శివునితో సమానుడగును.

అనుగ్రహము ఈ క్రమములో మాత్రమే లభించునని చెప్పుటలో తాత్పర్యము లేదు. పురుషుని యోగ్యత ఎట్టిదియో, వానికి దానికి తగిన అనుగ్రహము లభించును. ఒకడు తల్లి కడుపులో నుండగనే ముక్తుడగును. మరియొకడు పుట్టుచుండగనే ముక్తుడగును. ఇంకొకడు బాల్యములో, ¸°వనములో లేదా వృద్ధాప్యములో ముక్తుడగును. ఒకానొక జీవి పశుపక్ష్యాదిదేహములో నుండగా ముక్తుడగును. మరియొకడు నరకములోనుండగా ముక్తిని పొందును. మరియొకడు స్వర్గాదిపుణ్యలోకమును పొంది, అచట పుణ్యము క్షీణించి, ఆ లోకము జారి పోవుచుండగా ముక్తుడగును. ఒకానొకడు పుణ్యలోకమును కొల్పోయిన తరువాత మరల భూలోకములో జన్మించి ముక్తుడగును. మరియొకడు ఈ విధముగా తిరిగి వచ్చే మార్గములో ఉంటూ ఉండగానే ముక్తుడగును. కావున, మానవులు ఒకే విధములో ముక్తులగుదురని చెప్పుట తగదు. జ్ఞానమునకు మరియు అంతఃకరణశుద్ధికి అనురూపమగు అనుగ్రహము వలన మాత్రమే ముక్తి లభించును. కావున, మీరందరు శివుని అనుగ్రహము కొరకై వాక్కులో మరియు మనస్సులో దోషములను విడిచిపెట్టి, భార్య పిల్లలు మరియు అగ్నులతో కూడినవారై అద్వితీయుడగు శివుని మాత్రమే ధ్యానిస్తూ, శివునియందు నిష్ఠ గలవారై, శివుడే పరమలక్ష్యముగా గలవారై, శివునియందు లగ్నమైన మనస్సులు గలవారై, శివుని శరణు పొంది, ఆయనను మాత్రమే మనస్సులో నిలుపుకొని, కర్మలను అన్నింటినీ చేయుడు. వేయి సంవత్సరములు సాగే దీర్ఘసత్రయాగము మీచే ఆరంభించ బడినది. ఈ సత్రయాగము పూర్తి కాగానే, మంత్రముల ప్రభావముచే ఇచటకు వాయుదేవుడు రాగలడు. ఆయనయే మీకు మోక్షమును దానికి కావలసిన ఉపాయములతో సహా బోధించగలడు. తరువాత మీరు పవిత్రమైనది, మిక్కిలి సుందరమైనది అగు వారాణసీ నగరమునకు వెళ్లుడు. అచట శోభాయుక్తుడు, పినాకధారి అగు శివుడు పార్వతీదేవితో కూడి భక్తులననుగ్రహించుట కొరకై సర్వదా విహరించుచుండును.

ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! అచట గొప్ప అద్భుతమును చూచి నా వద్దకు రండు. అపుడు మీకు మోక్షము కొరకై ఉపాయమును బోధించెదను. దాని వలన ఒకే ఒక జన్మలో మోక్షము మీకు కరతలామలకము కాగలదు. ఆ మోక్షము మీకు అనేకజన్మల సంసారబంధమునుండి విముక్తిని కలిగించును  నేను ఈ మనస్సుచే సృష్టించబడిన చక్రమును విడిచిపెట్టుచున్నాను. దీని అంచు ఏ చక్రమును మనస్సుతో సృష్టించి, మహాదేవునకు నమస్కరించి దానిని విడిచిపెట్టెను. ఆ బ్రాహ్మాణులు కూడ చాల సంతోషించి జగత్తులకు ప్రభువగు బ్రహ్మకు నమస్కరించి, ఆ చక్రముయొక్క ధార విరిగినస్థలమునకు బయలు దేరిరి. ఆ విధముగా విడిచిపెట్ట బడిన ఆ మృదువైన చక్రము స్వచ్ఛము మరియు రుచికరము అగు నీరు గల అడవిలో ఒకానొక స్థలములో సుందరమగు రాతి పలకపై పడెను. ఆ కారణముచే మహర్షులచే పూజించబడే ఆ వనమునకు నైమిషారణ్యము అను పేరు వచ్చెను. ఆ వనము అనేకులగు యక్ష గంధర్వ విద్యాధరులతో రద్దీగా నుండును. పురూరవ మహారాజు ఊర్వశితో కూడి విహరిస్తూ దైవముచే ప్రేరేపించ బడినవాడై సముద్రములోని పదునెనిమిది ద్వీపములను దాటి అచటకు వెళ్లెను. ఆయన అజ్ఞానముచే బంగరు యజ్ఞవాటికను అక్రమముగా హరించుచుండగా, మిక్కిలి కోపించిన మునులు అచట ఆయనను దర్భలను వజ్రములుగా మార్చి పడగొట్టిరి. పూర్వము బ్రహ్మచే ఆజ్ఞాపించబడి జగత్తును సృష్టించగోరి ప్రజాపతులు ఇచటనే గార్హపత్యాగ్నిని ఆశ్రయించి సత్రయాగమునారంభించిరి.

అచట వ్యాకరణ-మీమాంస-తర్కశాస్త్రములలో నిష్ణాతులు, విద్వాంసులు అగు ఋషులు శక్తితో, జ్ఞానముతో మరియు కర్మయోగభావనతో కర్మలను అనుష్ఠించిరి. అచట నిత్యము అతివాదులగు వేదవేత్తలు వేదధర్మమునుండి బహిష్కరింపబడిన వారిని వాదము మరియు జల్పము (ఇతరుల సిద్ధాంతమును పరుషముగా ఖండించి తన సిద్ధాంతమును స్థాపించుట) అనువాటి బలముచే ఇబ్బంది పెట్టుచుండిరి. స్ఫటికములతో నిండియున్న పర్వతముల క్రింది భాగములయందు గల రాళ్లనుండి జారిపడే అమృతతుల్యమైన స్వచ్ఛమగు నీటితో సుందరమైనది, మిక్కిలి రుచికరమగు పళ్లతో కూడిన చెట్లతో నిండియున్నది, హింసను విడనాడిన మృగములు గలది అగు ఆ నైమిషారణ్యము మునుల తపస్సునకు అనుకూలముగా నుండెను.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో పూర్వభాగమునందు నైమిషోపాఖ్యానమనే మూడవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment