*శ్రీ శివ మహా పురాణం*
*386.భాగం*
*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఐదో అధ్యాయం*
*జీవ స్వరూప నిరూపణము*
*సూతుడు ఇట్లు పలికెను:*
ఆ సమయములో నైమిషారణ్యమునందు నివసించే మహాత్ములగు మునులు ముందుగా వాయుప్రభునకు యథావిధిగా నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి.
*నైమిషారణ్యవాసులగు మునులు ఇట్లు పలికిరి:*
ఈ శ్వరీయమగు జ్ఞానమును నీవు ఎట్లు పొందితివి? పరంబ్రహ్మయొక్క మాయాశక్తినుండి పుట్టిన బ్రహ్మ గారికి నీవు శిష్యుడవు ఎట్లు అయితివి?
*వాయువు ఇట్లు పలికెను:*
ఇరువది ఒకటవ కల్పమునకు శ్వేతలోహితకల్పమని పేరు. ఆ కల్పమునందు నాల్గుమోముల వేల్పు (బ్రహ్మ) సృష్టిని చేయగోరి తపస్సును చేసెను. బ్రహ్మకు తండ్రి, రూపము గలవారిలో శ్రేష్ఠుడు అగు మహేశ్వరుడు స్వయముగా దివ్యమగు కుమారుని రూపమును దాల్చి, శ్వేతుడనే మహర్షి రూపములో దివ్యమగు వాక్కులను పలుకుతూ, బ్రహ్మకు దర్శనమునిచ్చెను. బ్రహ్మకు అధిపతి, జగత్పతి అగు తన ఆ తండ్రిని చూచి బ్రహ్మగారు నమస్కరించి, గాయత్రితో సహా గొప్ప జ్ఞానమును పొందియుండెను. జగత్తును సృష్టించే ఆ నాల్గు మోముల వేల్పు (బ్రహ్మగారు ) ఈ విధముగా శివుని నుండి విజ్ఞానమును పొందినవాడై, స్థావరజంగమాత్మకమగు జగత్తును అంతనూ సృష్టించెను. బ్రహ్మ పరమేశ్వరునినుండి విని ఈ అమృతరూపమగు జ్ఞానమును పొందెను. అదే విధముగా నేను కూడ తపస్సుయొక్క బలముచే ఆ బ్రహ్మగారు చెప్పగా విని ఈ జ్ఞానమును పొందియుంటిని.
*మునులు ఇట్లు పలికిరి:*
నీవు పొందిన ఆ జ్ఞానము ఎయ్యది? శుభకరమగు ఆ జ్ఞానము సత్యములన్నింటికంటె గొప్ప సత్యము. దానియందు ఉత్కృష్టమగు నిష్ఠగల వ్యక్తి సుఖమును పొందును.
*వాయువు ఇట్లు పలికెను:*
నేను పూర్వము పశు-పాశ- పతుల జ్ఞానమును పొందియుంటిని. సుఖమును కోరు మానవుడు దానియందు తీవ్రమగు నిష్ఠ (స్థిరముగా నుండుట) ను చేయవలెను. అజ్ఞానము నుండి పుట్టే దుఃఖము జ్ఞానముచేత మాత్రమే తొలగును. వస్తుతత్త్వమును యథాతథముగా నెరుంగుటయే జ్ఞానమనబడును. జడము, చేతనము అని వస్తువు రెండు విధములుగా నున్నదని మహర్షలు చెప్పుచున్నారు. చేతనమునకు పశువు అనియు, జడమునకు పాశమనియు, వాటినిరెండింటినీ నియంత్రించే ఈశ్వరునకు పతి అ%ియు క్రమముగా పేర్లు. తత్త్వవేత్తలు తరచుగా ఈ మూడింటినీ క్రమముగా అక్షరము, క్షరము, క్షరాక్షరపరము అని వ్యవహరింతురు. పశువే అక్షరుడనబడును. క్షరమనగా పాశమని చెప్పబడినది. వాటి పతికి క్షరాక్షరపరమని పేరు.
*మునులు ఇట్లు పలికిరి:*
ఓ వాయుదేవా! క్షరమనగా నేమి? అక్షరమనగా నేమి? వాటికంటె పరమమగు తత్త్వమేది? ఈ విషయమును చెప్పుము.
*వాయువు ఇట్లు పలికెను:*
క్షరమనగా ప్రకృతి (మాయాశక్తి). పురుషుడే అక్షరుడనబడును. ఈ రెండింటినీ ప్రేరేపించే మరియొక తత్త్వమే పరమనబడే పరమేశ్వరుడు.
*మునులు ఇట్లు పలికిరి:*
ఈ ప్రకృతి అనగా నేమి? ఈ పురుషుడు ఎవరు? వీటి రెండింటికీ దేని మూలకముగా సంబంధము ఏర్పడినది? వీటిని ప్రేరేపించే ఈశ్వరుడెవరు?
*వాయువు ఇట్లు పలికెను:*
మాయయే ప్రకృతి యనబడును. పురుషుడు మాయచే కప్పబడియున్నాడు. మూలము నందు గల అజ్ఞానము మరియు కర్మఅనునవి ఈ రెండింటికీ సంబంధమునేర్పరచుచున్నవి. వీటిని ప్రేరేపించే ఈశ్వరుడే శివుడు.
*మునులు ఇట్లు పలికిరి:*
ఈ మాయా యనగా నేమి? మాయచే కప్పబడిన పురుషుని స్వరూపమెట్టిది? ఈ పురుషుని మూలము ఎట్టిది? ఎక్కడనుండి వచ్చినది? శివత్వము అనగా నేమి? శివుడు ఎక్కడి వాడు?
*వాయువు ఇట్లు పలికెను:*
మహేశ్వరుని శక్తియే మాయ. చైతన్యస్వరూపము మాయచే కప్పబడి యున్నది. చైతన్యమును మాలిన్యము కప్పివేయుచున్నది. ఈ దోషము లేని స్వభావసిద్ధమైన స్థితియే శివత్వము.
*మునులు ఇట్లు పలికిరి:*
సర్వవ్యాపకమగు చైతన్యమును మాయ ఎట్లు ఏ కారణముచే కప్పివేయు చున్నది? పురుషునకు ఈ ఆవరణము దేని కొరకు? ఇది దేనిచే తొలగిపోవును?
*వాయువు ఇట్లు పలికెను:*
చైతన్యము వ్యాపకమే అయిననూ, దానికి ఆవరణము తప్పదు. ఏలయనగా, వ్యాపకములగు కళ మొదలగునవి కూడ ఆవరించబడుచున్నవి. భోగమునకు కారణము కర్మ మాత్రమే. అది దోషముల నాశముచే తొలగి పోవును.
*మునులు ఇట్లు పలికిరి:*
కళ మొదలగునవి ఏవి? కర్మ అనగా నేమి? దానికి ఆది యేమి? అంతము ఏమి? దాని ఫలము ఏది? దానికి ఆధారము ఏది? భోగము ఎవరికి? భోగముచే భోగింపబడేది యేది ? ఆ భోగమునకు సాధనము ఏది? మాలిన్యమును ఏది పోగొట్టును? మాలిన్యము నశించిన పురుషుడు ఎట్లుండును?
*వాయువు ఇట్లు పలికెను:*
కళ మొదలగునవి యనగా కళ, విద్య, రాగము, కాలము మరియు నియతి. పురుషుడు వీటికి భోక్త యగుచున్నాడు. పుణ్యము మరియు పాపము అనే రూపము గల కర్మ సుఖము మరియు దుఃఖము అనే ఫలములనిచ్చును. ఈ కర్మదోషమునకు ఆది లేదు. అనుభవించుటచే నశించే ఈ కర్మ మిథ్యాత్మయగు జీవుని ఆశ్రయించి ఉండును. సుఖదుఃఖముల అనుభవము వలన కర్మ క్షయమగును. భోగము (భోగింపబడేది) అవ్యక్తమనబడును. బాహ్యమునందు ఉండే ఇంద్రియములు మరియు అంతరింద్రియమగు మనస్సు అను వాటిద్వారా ఈ శరీరము భోగమునకు సాధనమగుచున్నది. అతిశయించిన భక్తి వలన లభించే ఈశ్వరానుగ్రహము వలన ఈ మాలిన్యము క్షయమగును. జీవుని ఈ అజ్ఞానదోషము క్షీణము కాగానే, పురుషుడు శివునితో సమానుడగును.
*మునులు ఇట్లు పలికిరి:*
కళ మొదలగు అయిదు తత్త్వముల పని యేమి? భోక్త అనియు, పురుషుడు అనియు వేర్వేరుగా నిర్దేశించుటకు కారణమేమి? అవ్యక్తముయొక్క స్వరూపమెట్టిది? అది ఏ రూపములో భోగింపబడును? భోగమునందు దానికి ఆశ్రయము ఏది? శరీరమనగా నేమి?
*వాయువు ఇట్లు పలికెను:*
దిక్కును మరియు క్రియను తెలుపుడు చేయునది విద్య యనబడను. కాలము మరియు రాగము మానవుని కర్మలయందు ప్రవర్తింప జేయును. కాలము సర్వమును పరిచ్ఛిన్మము (ఆది- అంతములు కలిగియుండుట) చేయుచుండును. నియతి (పూర్వకర్మానుసారముగా ఫలము లభించి తీరుననే ఈశ్వరీయ - అధ్యాదేశము) సర్వమును నియమించుచుండును. జగత్తు యొక్క ఉపాదానకారణమునకు అవ్యక్తమని పేరు. జగత్తు దానినుండి పుట్టి దానియందే లయమగును. మూడు గుణములతో కూడియున్న ఈ అవ్యక్తమునకే ప్రధానమనియు, ప్రకృతి అనియు పేర్లు అని తత్త్వముల స్వరూపము తెలిసినవారు చెప్పుచున్నారు. సహజముగా అభివ్యక్తము (జగద్రూపముగా ప్రకటమగుట) కాని స్థితిలో మూడు గుణములు కలిగి ఉండే ప్రకృతి కళల వలన సుఖము దుఃఖము మరియు మోహము అవున్నవి రూపములలో అభివ్యక్తమై, పురుషునిచే భోగింపబడును. నువ్వులలో నూనెవలె, ప్రకృతి యందు సత్త్వము, రజస్సు మరియు తమస్సు అనే మూడు గుణములు సూక్ష్మ రూపములో నున్నవి. సుఖము మరియు సుఖహేతువు కలిపి సాత్త్వికము (సత్త్వగుణకార్యము) అని చెప్పబడుచున్నవి. దానికి విరుద్ధముగా దుఃఖము మరియు దాని హేతువు రాజసమగును. జడత్వము మరియు మోహము తామసమగును. సాత్త్వకప్రకృతి మనిషిని మరణించిన పిదప ఊర్ధ్వ (పుణ్య) లోకములకు గొనిపోవును. తామసస్వభావము మనిషిని క్రింది (పాప) లోకములకు తీసుకొని పోవును. రాజసస్వభావము మధ్యమ (భూలోకములో మనుష్యజన్మ) గతిని ఇచ్చునని మహర్షులు చెప్పుచున్నారు. అయిదు సూక్ష్మభూతములు (పృథివి, జలము, అగ్ని, వాయువు మరియు ఆకాశము), అయిదు స్థూలభూతములు, అయిదు జ్ఞానేంద్రియములు (ముక్కు, నాలుక, కన్ను, చర్మము మరియు చెవి), అయిదు కర్మేంద్రియములు (చేతులు, కాళ్లు, వాక్కు, విసర్జన- మరియు జనన - ఇంద్రియములు), సమష్టిబుద్ధి (మహత్తత్వము), అహంకారము మరియు మనస్సు అను వికారము (కార్యము) లతో కూడిన ప్రధానము జగత్కారణమగుచున్నది. అవ్యక్తమనగా సంగ్రమహముగా నిదియే. కారణావస్థలోనున్న జగత్తునకే అవ్యక్తమని పేరు. అది శరీరములు, ఘటములు మొదలైన కార్యముల రూపములో ప్రకటమగుచుండును. ఘటము మొదలగు కార్యములు మట్టి మొదలగు కారణముల కంటె అతీతముగా లేవు. అదే విధముగా, శరీరము మొదలగు ప్రకటరూపములు కారణమగు అవ్యక్తము కంటె భిన్నముగా లేవు. కావున, శరీరము, ఇంద్రియములు, వాటికి ఆధారమగు ప్రకృతివికారములు (పంచభూతములు మొదలైనవి) అను వాటికి అన్నింటికీ ఏకైకకారణము అవ్యక్తమే. అదియే భోగ్యము అగును. మరియొక భోగ్యము లేదు.
*మునులు ఇట్లు పలికిరి:*
బుద్ధి, ఇంద్రియములు మరియు శరీరము అని వాటికంటె విలక్షణమైనది, ఆత్మ అనే పదముచే వ్యవహరించబడునది అగు ఒకానొక తత్త్వము గలదు. దాని స్వరూపమేమి? అది ఎక్కడ నుండును?
*వాయువు ఇట్లు పలికెను:*
ఆత్మ అనే ఒకానొక తత్త్వము నిశ్చయముగా గలదు. సర్వవ్యాపకమగు ఆత్మ నిశ్చయముగా బుద్ధి, ఇంద్రియములు మరియు శరీరము అనువాటి కంటె విలక్షణమైనది. దీనికి కారణమును తెలియుట చాల కష్టము. స్మరణము ఖచ్చితమగు జ్ఞానహేతువని చెప్పుటకు వీలు లేదు. అశాశ్వతమగు ఈ దేహమునకు ఆత్మ సాక్షి యగుచున్నది. మరియు పూర్ణదేహము ఏకకాలములో అనుభవమునకు వచ్చుట లేదు. ఈ కారణములచే బుద్ధి, ఇద్రింయములు మరియు శరీరము అనునవి ఆత్మ కాదని విద్వాంసులు చెప్పుచున్నారు. కావుననే, స్మరింపబడే మరియు అనుభవింపబడే సకలదృశ్య (చూడబడే) పదార్థములను తెలుసుకొనే ఆత్మ అంతర్యామి యని వేదవేదాంతములయందు కీర్తింపబడుచున్నది. శాశ్వత మగు ఆత్మయందు సర్వము ఉనికిని కలిగియున్నది. ఆత్మ సర్వమునందు వ్యాపించి యున్నది అయిననూ, ఏ కాలమునందైననూ ఎవనిచే నైననూ ఈ ఆత్మ సుస్పష్టముగా దర్శించబడుట లేదు. ఈ ఆత్మ జ్ఞానముచే ప్రకాశింప జేయబడిన అంతఃకరణమునందు మాత్రమే నిశ్చయముగా దర్శించబడును. ఆత్మ పురుషుడు గాని, స్త్రీ గాని, నపుంసకుడు గాని కాదు. ఆత్మపైన గాని, క్రింద గాని, భూమికి సమతలముగా గాని, ఎక్కడనైననూ ఒకానొక విశిష్టదేశమునకు పరిమితమై లేదు. చంచలమగు ఈ దేహములయందు ఉపలభ్యమగుచున్న ఈ ఆత్మ శరీరము (శరీరమువలె శిథిలమయ్యేది) కాదు. వికారములు లేనిది, వినాశము లేనిది అగు ఆ ఆత్మను జ్ఞాని విచారముచే సర్వకాలములలో కనుగొనును. దీని గురించి ఇన్ని మాటలేల? పురుషుడు దేహము కంటె విలక్షణుడు. ఎవరైతే పురుషుని దేహము కంటె భిన్నముగా చూడరో, వారి దర్శనము అయోగ్యము. పురుషుని ఈ దేహముకంటె అపవిత్రము, అస్వతంత్రము, దుఃఖహేతువు, వినాశి అగునది మరియొకటి లేదని చెప్పబడినది. పురుషుడు ఆపదలకు నిలయమగు ఆ దేహముతో కూడియున్నవాడై, తన కర్మను బట్టి సుఖి, దుఃఖి మరియు మూఢుడు అగుచున్నాడు. నీరు పెట్టిన పొలములోని విత్తనము అంకురించిన విధముగా, అజ్ఞానముచే పోషించబడిన కర్మ దేహమును కలిగించును.
మిక్కిలి దుఃఖనిలయములు, సుతరాము నశించునవి అగు దేహములు ఈ పురుషునకు వేల సంఖ్యలో పూర్వము వచ్చియున్నవి, ఇంకనూ రాబోవుచున్నవి అని మహర్షులు చెప్పుచున్నారు. శిథిలమయ్యే అసంఖ్యాకములగు శరీరములను స్వీకరిస్తూ ఉండే ఈ శరీరధారియగు పురుషునకు ఏ విధముగనైననూ ఎక్కడనైననూ స్థిరమగు శరీరమునందు నివాసము లభించదు. ఆకాశమునందు చంద్రబింబమును ఒకప్పుడు చంచలమగు మేఘసమూహములు కప్పివేయగా, మరియొకప్పుడు మేఘములు ప్రక్కకు తొలగుచుండును. అదే విధముగా, పురుషుడు ఒకప్పుడు శరీరముచే కప్పబడి యుండును; మరియొకప్పుడు శరీరము లేకుండగా నుండును. చదరంగపు బల్లపై బంటు తిరుగాడినట్లు, జీవుడు అనేకములగు విభిన్నదేహములలో తిరుగాడుచుండును. జీవునకు ఎవ్వరైననూ తనవాడు కాడు. జీవుడు ఎవ్వరికైననూ తనవాడు కాడు. భార్య, పిల్లలు మరియు బంధువులు ఆను వారితోడి కలయిక ప్రయాణీకులకు మార్గమధ్యములో జనుల కలయిక వంటిది మాత్రమే. పెద్ద సముద్రములో ఒక కట్టె మరియొక కట్టె తో కలిసి మరల విడిపోవును. జీవునకు వివిధప్రాణులతో కలిగే సమాగమము అట్టిది మాత్రమే. జీవుడు శరీరమును చూచును. కాని, శరీరము జీవుని చూడజాలదు. వీరిద్దరినీ వీరి కంటె సూక్ష్ముడగు సాక్షిచైతన్యము చూచును. వీరిద్దరు ఆ సాక్షిని చూడలేరు. బ్రహ్మతో మొదలిడి గడ్డిపోచ వరకు గల సర్వ ప్రాణులకు పశువులని పేరు. పైన చెప్పిన దృష్టాంతములు సకలపశువులకు మాత్రమే వర్తించును. సుఖదుఃఖములననుభవించే ఆ ఈ పశువు త్రాళ్ల (రాగద్వేషముల) చే బంధింపబడి ఈశ్వరుని లీలలో సాధనములవంటివాడు అగుచున్నాడని పండితులు చెప్పెదరు. తనకు రాబోయే సుఖదుఃఖములను గురించి తెలియని అస్వతంత్రుడగు ఈ జీవుడు ఈశ్వరునిచే ప్రేరేపించ బడినవాడై స్వర్గమును పొందును; లేదా, నరకకూపములో పడును.
*సూతుడు ఇట్లు పలికెను:*
మునులు వాయుదేవుని ఈ వచనములను విని సంతోషముతో నిండిన మనస్సులు గల వారై, శైవాగమములో విద్వాంసుడగు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు పలికిరి.
*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో శివతత్త్వజ్ఞానమును వర్ణించే అయిదవ అధ్యాయము ముగిసినది.*
No comments:
Post a Comment