. *తల్లి కౌసల్యను ఆదరించమని*
*రాముడు తండ్రిని కోరుట*
*꧁❀❀━❀🧶🌏🧶❀━❀❀꧂*
*కైకేయి సీతకు కూడా నారచీరల్ని కట్టబెట్టడం చూసి వసిష్టుడు మున్నగు పెద్దలేకాక జనంకూడా “ఛీ” అన్నారు. అది వింటున్న దశరథుడికి దుఃఖంతో బ్రతుకు మీదా, కీర్తి మీదా అసహ్యం వేసింది. నిట్టూరుస్తూ కైకేయితో ఇట్లా అన్నాడు.*
*దశరథుడు: ఓ కైకా! సీత నారబట్టలు ధరించాల్సిన అవసరం లేదు. ఆమె ఇంకా యౌవనంలో ఉంది, సుకుమారి. ఆమె ఇంతవరకు సుఖాలే అనుభవించిందిగాని, వనవాసం గూర్చి ఏమీ తెలియదు. ఆమె జనక మహారాజు కుమార్తె. ఆమె ఎవరికి ఏం అపకారం చేసిందని ఈ విధంగా నారచీరలు కట్టి దీనంగా నిలబడాలి? సీతను గూర్చి నీకేమీ నేను వాగ్గానం చెయ్యలేదు. అందువలన ఈ జనకపుత్రి ఆభరణాలను ఉత్తమమైన వస్తువులను తీసుకొని అడవులకు వెళ్ళవచ్చు.*
*ఓ కైకా! నాకు మరణం దగ్గరపడింది. అందువల్లనే నువ్వు అడగ్గానే, నీ కిచ్చిన వరాలు తీరుస్తున్నాను.* *నేను నీకు బానిసనయ్యాను. రాముణ్ణి అడవులకు పంపటానికి ఒప్పుకున్నాను. వెదురుకర్రకు పూచిన పుష్పమె ఆ వెదురు పొదనంతా కాల్చివెసినట్లు నీ మూర్ధత్వమే నా మరణానికి కారణమవుతుంది. ఓసీ! పాపాత్మురాలా! రాజ్యంకోసం నువ్వు రాముడిపై పగ పట్టావన్నా అర్ధంచేసుకోగలం కానీ, సీత నీకేమి అపకారం చేసింది? నువ్వు నిశ్చయంగా పాపాత్మురాలవే. రాముణ్ణి అడవులకు పంపటమే కాకుండా ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తున్నావు.*
*ఓ కైకా! రాజ్యాభిషేకానికి ముందు రాముడితో నువ్వు ఏం చెప్పావో, అంతవరకే నీకు నను ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నువ్వు నా ప్రతిజ్ఞను అతిక్రమించి సీతచేత నారచీరలు ధరింపజేయాలని చూస్తున్నావు. నువ్వు ఘోరమైన నరకానికి పోతావు సుమా! దశరథుడు ఎంతగా విలపించినా కైకేయి మనస్సు కరగలేదు. నేలచూపులు చూస్తూ దుః ఖాసాగరంలో మునిగి ఉన్నాడు.*
*రాముడు: తండ్రీ! మీరు పరమధార్శికులు. నా తల్లి కౌసల్యాదేవి ఉత్తమురాలు; వృద్దురాలు. నన్ను అడవులకు పంపినా ఆమె మమ్మల్ని నిందించడం లేదు. నేను వనాలకు పోగానే ఆమె దుః ఖంతో మంచాన పడుతుంది. ఆవిడ ఇదివరకు ఎన్నడూ ఇటువంటి దుఃఖాలూ పొందలేదు. కాబట్టి మీరే ఆమెను కనికరించాలి. దయతోను, సానుభూతితోను చూసి ఆమెను ఆదరించాలి. నేను అడవులకు పోయిన తరువాత మీరు తప్ప ఆమెను ఆదరించేవారెవరూ ఉండరు. నా మీద ప్రేమచేత కృశించిపోతూ ఉంటుంది. ఆమె ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరే ఆమెను కాపాడాలి. మీరు కోరిన కోరికలివ్వడంలో దేవేంద్రుడంతటివారు. నాకు ఇంతకన్నా ఇంకే కోరికా లేదు.*
*┈┉┅━❀꧁హరే రామ్꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🏹🍁 🙏🕉️🙏 🍁🏹🍁
No comments:
Post a Comment