. *సీతారామలక్ష్మణులు రథంపై*
*అడవులకు బయలుదేరడం*
*꧁❀❀━❀🐙🌏🐙❀━❀❀꧂*
*సీతారామలక్ష్మణులు దశరథ మహారాజుకు పాదాభివందనం చేశారు. హృదయంలో నుండి వచ్చే దుఃఖం ఆ ముగ్గురి ముఖాలలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముఖాలు దీనంగా పెట్టుకొని ఆయనకు ప్రదక్షిణం చేశారు. తండ్రి నుండి సీతను, లక్ష్మణుని కూడా తనతో తీసుకొని వెళ్ళేందుకు రాముడు అనుమతి పొందాడు. ప్రక్కనే దుఃఖీస్తున్న తల్లిని చూశాడు. రాముడి మనసంతా దుః ఖంతో నిండి మూఢుడైపోయాడు. సీతా లక్ష్మణులతో కలసి ఆమెకు కూడా శిరస్సువంచి నమస్కరించాడు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రాదేవి వద్దకు పోయి శిరస్సు వంచి నమస్కరించాడు. ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. బావురుమని ఒక్కసారి బిగ్గరగా ఏడుస్తూ పాదాలకు నమస్కరిస్తున్న లక్ష్మణుని రెండు చేతులతో పైకి లేవనెత్తింది. కౌగలించుకొని శిరస్సుపై వాసన చూసింది.*
*సుమిత్రాదేవి: కుమారా! లోక కల్యాణం కోసం* *కౌసల్య రాముణ్ణి కన్నది. నిరంతరంగా రాముడికి సేవచేసేందుకే నిన్ను నేను కన్నాను. నాయనా మీరిద్దరూ కారణజన్ములు. కాబట్టి రాముణ్ణి ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండు. రాముడికి సేవలు చేసేందుకే నువ్వు జన్మించావు. కంటికి రెప్పలాగా రాముణ్ణి చూసుకో. ఒక్క రాముడే కాదు, సీతను కూడా నువ్వు అట్లాగే కనిపెట్టుకొని ఉండాలి.*
*కుమారా! కష్టాల్లో ఉన్నా, మహారాజైన రాముడే దిక్కని నమ్ముకో. పెద్ద అన్నగారిని అనుసరించుకొని బ్రతకడమే సత్పురుషుల ధర్మమని శాస్త్రం వచిస్తోంది. దానధర్మాలు చెయ్యడం, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం, యుద్ధంలో దేహాన్ని త్యాగం చెయ్యడం అనేవి మన వంశంలో అనాదిగా వస్తున్న పద్దతులు.*
*పుత్రా! రాముడే నీకు దశరథుడని భావించుకో. సీతయే నేననుకో. నువ్వు ఉండబోయే అడవియే అయోధ్య అని తలచుకో. నాయనా! అన్నగారితో సుఖంగా వెళ్ళిరా. (ఇచట “దశరథమ్” అన్న వాల్మీకి ప్రయోగాన్ని పక్షి వాహనుడైన విష్ణువుగాను, “మామ్” అన్న ప్రయోగాన్ని లక్ష్మీదేవిగాను, “అయోధ్యామ్” అన్న ప్రయోగాన్ని యుద్ధంచేయ శక్యం కాని వైకుంఠంగాను కొందరు విశేషార్గాన్ని స్వీకరించారు. అంటే శ్రీరాముడే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువని, సీతయే లక్ష్మీదేవి అని, రాముడు నివసించే అడవియే వైకుంఠమని అన్వయించి చెప్పారు.) అప్పుడు సుమంత్రుడు రాముని వద్దకువచ్చి చేతులు జోడించి నమస్కరించాడు. “మహానుభావా! రథం సిద్ధంగా ఉంది. తామంతా ఈ రోజే అరణ్యానికి వెళ్ళాలని కైకేయీదేవి ఆదేశించింది. ఈ రోజే బయలుదేరితే, పద్నాలుగు సంవత్సరాల వనవాస దీక్ష ప్రారంభమైనట్లవుతుంది” అన్నాడు.*
*చక్కగా అలంకరించుకొని లక్ష్మీదేవిలా ఉన్న సీత ముందుగా రథం ఎక్కి కూర్చుంది. తరువాత రాముడు, లక్ష్మణుడూ రథం ఎక్కారు. అనంతరం పద్నాలుగు సంవత్సరాలకు సరిపడే నగలు, చీరలు, రామలక్ష్మణుల కోసం వివిధ రకాల ఆయుధాలు, కవచాలు, కందమూలాలు త్రవ్వుకునేందుకు చిన్న గునపాలు, దుంపలు వేసుకునేందుకు గంపలు ఆ రథం మధ్యభాగంలో పెట్టించారు. ఆ తరువాత రథం నడపటంలో నేర్పరి అయిన సుమంత్రుడు రథాన్ని కదల్చాడు.*
*అలా రథం కదలగానే, అయోధ్యానగరం యావత్తు ఒక్కసారిగా అట్టుడికినట్లు కంపించిపోయింది. దుఃఖంతో ఏమీ తోచనివారై జనం నిశ్చేష్టులయ్యారు. సైనికులు కూడా కలవరం చెందారు. వాళ్ళు ఎక్కి కూర్చున్న ఏనుగులు ఒక్కసారిగా కోపంతోను, దుఃఖంతోను ఘీంకారం చేశాయి. గుర్రాల కాళ్ళకు కట్టిన గజ్జెలు, గిట్టల చప్పుళ్ళతో రౌతుల మాట వినకుండా పట్టణమంతా కలయతిరిగాయి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్దులు రాముడి రథం వెనుక పరుగులు పెట్టారు. వాళ్ళంతా రథాన్ని నాలుగు పక్కలనుండి ముట్టడించారు. అందులో కొంతమందికి రామదర్శనం కాలేదు. వాళ్ళంతా పెద్దగా ఏడుస్తూ “ఓ సుమంత్రా! రథాన్ని మెల్లగా పోనివ్వు. మేమంతా రాముణ్ణి చూడాలి. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తామో?” అంటూ కేకలు వేశారు.*
{ఇంకా ఉంది}
*┈┉┅━❀꧁హరే రామ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🏹🍁 🙏🕉️🙏 🍁🏹🍁
No comments:
Post a Comment