🔔🌺🔔🌺🔔🌺🔔🌺🔔
*🙏చంద్రఘంటా దుర్గా🙏*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రా కారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.
శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికివస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి, తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషంమార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో, లెక్కలేనన్ని నగలతో తయారవు
తాడు. అప్పుడు ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివ,పార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించ మని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు.
ఆమెను తన తమ్ముడు నిశుంభుని కిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్ర లోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్ర లోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.
చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్భాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తంమాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ,
సింహంమీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాల భాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసి పోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.
పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా, ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈఅమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు.ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు.
రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసా యని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ, ఎంతో మధురంగా వినపడు తుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో, ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.
*ధ్యాన శ్లోకం:-*
*పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా!!*
🔔🌺🔔🌺🔔🌺🔔🌺🔔
No comments:
Post a Comment