శివయోగం
శివయోగం అయిదు విధములుగా ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది.
జ్ఞానం శివమయం శైవీ భక్తిః ధ్యానం శివాత్మకం!
శివార్చన, శివవ్రతం శివయోగోహి పంచధా!!
ముందుగా శివుడు అంటే ఏమిటో శాస్త్రముల ద్వారా, శాస్త్రానుసారంగా గురువులు చెప్పేటటువంటి మాటల ద్వారా గ్రహించడం శివజ్ఞానం. ముందు ఎరుక కలిగి ఉండాలి. ఎందుకంటే ఎరిగి చేసినటువంటి కర్మకి బలం ఎక్కువ. అందుకే మొదటి స్థానం శివునికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉండుట.
శివుని గురించి తెలుస్తూ ఉంటే శివునిపై ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతితో ఆయననే ఆశ్రయించాలి అనే బుద్ధి ఏర్పడుతుంది. ఈ ప్రీతి పూర్వకమైన ఆశ్రయాన్ని భక్తి అంటారు. రెండవ స్థానం శివభక్తి.
మూడవది ఎప్పుడైతే భక్తి, ప్రీతి ఏర్పడ్డాయో మనస్సు ఆయనయందు నిలబడుతుంది. ఇది ఒకదాని తర్వాత ఒకటి సిద్ధిస్తూ ఉంటాయి. మనస్సు ఆయనయందే ఏకాగ్రంగా నిలపడాన్ని ధ్యానం అంటారు. అందుకు మూడవది ధ్యానం శివాత్మకం అన్నారు.
జ్ఞానము, ధ్యానము, భక్తి – ఈ మూడింటితో కూడుకున్నప్పుడే అది చక్కని పూజ అవుతుంది. అది విశేష ఫలాన్నిస్తుంది. కనుకనే శివయోగంలో నాలుగవది శివార్చన అని చెప్పబడుతున్నది. ఈ నాలుగూ నిత్యం చేస్తున్నటువంటి వాడు యోగి అవుతాడు.
ఇక అయిదవది శివ వ్రతములు. వ్రత పాలన అంటే శివుని యొక్క వ్రతములను ఆచరించుట. వ్రతములు అనేక రకాలుగా ఉన్నాయి. దీక్షగా పాటించే నియమాలని వ్రతం అంటాం. అలా ప్రతి నెలా ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉండవచ్చు. నిత్య వ్రతం ఉన్నది. నిత్యమూ శివార్చన చేయడం, బిల్వార్చన చేయడం, కొంతకాలం బిల్వాలతో అర్చన, కొంతకాలం కమలాలతో అర్చన అని పద్ధతులు పెట్టుకోవడం ఇలా ఏదో ఒక నియమాన్ని అనుసరించి శివారాధన చేస్తే అది నియమపాలన. అలాగే వారాలలో శివునికి ప్రీతిపాత్రమైన ఆదివారం కానీ, సోమవారం కానీ ఉపవాసంతోనో, అభిషేకంతోనో, జపంతోనో సాధన చేస్తే అది కూడా శివవ్రతపాలనే. ముందు వారపాలన ఇది.
అదే విధంగా తిథి పాలన. శివునికి ప్రీతిపాత్రమైన తిథి చతుర్దశి అంటారు. అర్థరాత్రి చతుర్దశి పడినటువంటి సమయాన్ని మాస శివరాత్రిగా ప్రతినెలా అనుష్టించడం అనే సంప్రదాయం ఒకటి ఉంది.
ఇంకొక వ్రతం ప్రదోష వ్రతం. ప్రదోషం అంటే సంధ్యా సమయంలో అనగా సూర్యాస్తమయమై రాత్రి వస్తున్న సమయంలో త్రయోదశి తిథి కానీ ఉంటే దానిని ప్రదోష వ్రతము అని అంటారు. ఈ ప్రదోషము ఉభయ పక్షములలోనూ శుక్లపక్ష కృష్ణ పక్షాలలో కూడా ఆచరిస్తే ఇది ఒక వ్రతాచరణ అని చెప్పబడుతుంది. అలాంటి వ్రతములు మాస వ్రత, పక్ష వ్రత, వార వ్రతములు ఇలా చెప్పబడుతూ ఉన్నాయి.
ఇంకొక ప్రత్యేకమైన వ్రతము మహా వ్రతం అని చెప్పబడుతున్నది ఆ మహా వ్రతము శివరాత్రి వ్రతము. శివయోగంలో ఉన్నటువంటి వారు మిగిలిన మాస పక్ష వ్రతాలు పాటించలేకపోయినా ఈ మహా వ్రతం మాత్రం పాటించి తీరాలి అని అన్నారు. దీనితో మిగిలిన నాలుగు యోగములు పరిపూర్ణం అవుతున్నాయి. ఈ అయిదూ కలుపుకొని శివయోగం అని చెప్పబడుతున్నది. శివ జ్ఞానము, శివ భక్తి, శివ ధ్యానము, శివార్చన, శివ వ్రతపాలన. ఈ అయిదూ శివ యోగులు పాటించవలసిన విధానము. ఈ అయిదూ పాటించే వారే శివుని కోసం సాధన చేస్తున్న వారు. వీరు ఏనాటికైనా శివ ప్రాప్తితో ధన్యులు అవుతారు, ముక్తి పొందుతారు అని శాస్త్రము చెప్తున్నటువంటి విషయం. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment