Friday, January 1, 2021

ఈ లోకంలో ఉన్నంతకాలం ఉండే ఆనందం అవధి కలిగినటువంటిదే!

🌻 వేదం యొక్క తాత్పర్యం ఏమిటో గ్రహించి, తెలుకోదగినది ఏదో, దానిని వెతుక్కుంటూ ప్రయాణించే వాళ్ళు వేదజ్ఞులని అనబడతారు. అలా కాని వాళ్ళు వేదపాఠకులు అనబడతారు.

ఈ ప్రపంచమంతా వేదమందున్నది. వేదంలోనే అది ఉనికిని కలిగి ఉన్నది.

కాబట్టి అట్లాంటి వేద మార్గములలో ఉండేటటు వంటి బ్రహ్మణులకు నేను కూడా నమస్కరిస్తాను అని కపిలుడు అన్నారు.

🌻 పోయిన జన్మలో మనం ఏదో పుణ్యం చేస్తాము. సిరిసంపదలు అన్నీ వస్తాయి. భార్యాపిల్లలందరూ బాగుంటారు. సంతోషమే. దానిని అనుభవిస్తున్న సమయంలో సత్త్వగుణంతో, అంటే సత్త్వగుణ ప్రధానుడై అనుభవించాలి.

దర్పంతో ఇదంతా తన ప్రయోజకత్వం అనే భావంతో కాదు. ఇతరులను తిరస్కరించి కాదు.

ఇతరులను అవమానించి తాను ధనవంతుడినని విర్రవీగకూడదు.

ఈ సంపదలన్నీ క్షణికములనే మాట గుర్తుపెట్టుకుంటూ వాటిని అనుభవించాలి.

ఎందుకంటే, తనుండగానే తన పుణ్యం ఖర్చయిపోయి సంపదలన్నీపోతాయి.

సంపదలుండగానే ఆయుర్ధాయం అయిపోతే, తను పోతాడు. కాబట్టి ఎలాగూ వియోగం తప్పదు.

ఈ రెండు విషయములలో కూడా సంపద యొక్క అనుభవం క్షణికమే!

ఏడుతరాలు అనుభవించగలిగిన ఆస్తి ఉండవచ్చు. కాని వ్యక్తి యొక్క అనుభవము క్షణికం మాత్రమే.

🌻 అందుకనే జ్ఞానభిక్ష పెట్టమని గురువును ఆశ్రయించాలి.’ ఈ క్షణికమయిన జీవితంలో అనుభవించటానికి అన్నీ ఉన్నాయి కాని, అనుభవించటం కోసమని నేనుండటం లేదు. నేనూ ఉండను-అవీ ఉండవు.

అందువలన నాకు మార్గోపదేశం చెయ్యి’ అని ఆర్తితో గురువును ఆశ్రయించి మోక్ష మార్గాన్ని అర్ధించే వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు.

వాళ్ళే అంకురితులు, పుష్పితులు, ఫలితులు.

జీవితంలో ఏ మార్గాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళనే ఫలితులు అంటారు. ముక్తి ఫలం పొందిన వాళ్ళు ఫలితులు.

🌻 మోక్ష ధర్మ మందు ఆపేక్ష మాత్రం కలిగి, ఆ ఆపేక్ష అంకురించిన హృదయంతో ముక్తి మార్గం అన్వేషిస్తే చాలు. ఎలాగైనా, యెప్పటికైనా నా కోరిక తీరుతుందేమో! గురువు లభిస్తాడేమో!

ఎప్పటికైనా ఈ సంసారంలోంచి నేను బయటికి రాగలుగుతానేమో!
అనేటువంటి దీక్ష, కోరిక కలిగినవాళ్ళు అంకురితులు.

ఆ తపస్సులో ప్రవేశించి సాధన చేస్తున్న వాళ్ళు పుష్పితులు. ఇలా మూడురకాలుగా ఉన్నారు.

🌻 వీళ్ళంతా గురుబోధిత జ్ఞానము వలన మోక్షాన్ని పొందుతారు.

గురువు-ఇది మార్గమని, ఇది గమ్యమని, ఇది కర్తవ్యమని చూపిస్తాడు.

ఆ తరువాత నీకు కర్తవ్యం లేదు. వెనక్కు తిరిగి చూడకు. ఈ సంసారం యొక్క అర్థం ఇంత కన్నా లేదు.

ఇది వ్యర్ధమయినటువంటిది. నీవు అటు చూడవద్దు. నీకు ఏవో ధర్మాలున్నాయని అనుకోవద్దు.

మోక్ష మార్గంలో వెళ్ళేవాడికి ధర్మాలున్నాయని జ్ఞాపకం రాకూడదు. అది పతన మవుతుంది” అని కపిలుని బోధ.

ముక్తిమార్గంలో వెళ్ళి అందులో ఉండే వాడికి, అందులోకి వెళ్ళిపోయిన తరువాత, ఇతర ఆలోచనలుండకూడదు.

ఏమిటో సన్యాసాస్రమం తీసుకున్నాను కాని చిన్నపిల్లకు పెళ్ళిచేయలేదూ ఇట్లాంటి ఆలోచనలేవీ ఉండకూడదు. వాటివలన భ్రష్టత్వం వస్తుంది.

ఒకానొక సమయంలో కలిగిన తీక్షణమయినటువంటి వైరాగ్య ప్రవృత్తిలో వెళ్ళిపోతే, మరి వెనుతిరిగి చూడకూడదు.

🌻 మనుష్యుడుకి (జీవుడికి) కర్మ, భక్తి, వైరాగ్యము, జ్ఞానము, యోగము అనేటటువంటి ఐదు పరిణామాలు ఉంటాయి.

పరాయ పరరూపాయ
పరమాత్మన్‌ పరాత్మనే
నమః పరమతత్వాయ
పరానందాయ ధీమహి

“పరాత్పరమైనటు వంటిది బ్రహ్మవస్తువు. దానికే నమస్కరించు. ఈ మధ్యలో దేనికీ కాదు.

ఈ జగత్తులో పొందే ఆనందానికి పరమై ఉండేటటువంటి ఒకానొక ఆనంద స్వరూప మయినట్టి వస్తువు అది.

పరమాత్మ దర్శనం చేత కలిగేటటు వంటి ఆనందానికి హేతువేదో, అది లోకాన్ని తరించిన తరువాత కలిగే ఆనందాన్నిచ్చేది.

ఈ లోకంలో ఆనంద దాయకమయిన వస్తువులు అనేకం ఉన్నాయి.

ఆ వస్తువులు లభిస్తే ఆనందం-లేకపోతే దుఖఃం కలుగుతవి.

లోకాన్ని తరించి బయటికి వెళ్ళిన తరువాత పరమాత్మ వస్తువు యొక్క భావన చేత కలిగే శాశ్వతమయిన, నిరంతరమయిన ఆనందానికి అవధిలేదు.

నిరవధిక ఆనందం అది. ఇంత అని చెప్పటానికి వీలులేదు. దానికొక హద్దు లేదు. ఒకనాటికి అది తరిగిపోయేది కాదు.

పరమాత్మయొక్క సాన్నిధ్యంలో పొందినటువంటి ఆనందం నిరవధికంగా ఉంటుంది.

ఈ లోకంలో ఉన్నంతకాలం ఉండే ఆనందం అవధి కలిగినటువంటిదే! ఏ వస్తువయినా ఆనందాన్ని కొంత కాలమే ఇస్తుంది. అవధి కలిగినటువంటి ఆనందాలు ఈ లోకంలో చాలా ఉంటాయి.

🌹 🌹 🌹 🌹 🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment