Tuesday, February 15, 2022

జీవితాన్ని యథార్థదృష్టితో చూడాలనుకుంటే పోలికలు పెట్టడం మానుకోవాలి. అదే బుద్ధుడు చూపిన మార్గం.

ఒక వ్యక్తి బుద్ధుడి జీవితం గురించి విన్నాడు. తను కూడా బుద్ధుడి అంత ఆధ్యాత్మిక ఔన్నత్యం సాధించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఎందరో గురువులను కలిశాడు. కానీ, వాళ్ల దగ్గర శిష్యరికం అతణ్ని సంతృప్తి పరచలేకపోయింది. ఒకరోజు ‘ఫలానా పర్వత శిఖరాగ్రం మీద ఒక గురువు ఉన్నాడు. ఆయన బుద్ధుడి గురించి సమస్తమూ తెలిసిన జ్ఞాని. నీ ప్రశ్నలేవో ఆయన్ని అడిగావంటే, తప్పక సమాధానాలు దొరుకుతాయి’ అని ఎవరో చెప్పారు. ఆ గురువును వెతుక్కుంటూ ఆయన ఆశ్రమానికి చేరుకున్నాడా శిష్యుడు. ఆశ్రమంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. వారికి పాఠాలు చెబుతున్నాడు గురువు. కొత్తగా వచ్చిన వ్యక్తిని చూసి ‘ఏం కావాలి నాయనా?’ అని అడిగాడు గురువు. ‘నేను బుద్ధుడి బోధనలు సమగ్రంగా తెలుసుకోవాలని తిరుగుతున్నాను. ఇప్పటికే చాలామంది పండితులను కలిశాను. కానీ, వాళ్లెవరూ నా సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేదు. మీరు నా అనుమానాలు నివృత్తి చేయగలరని ఇక్కడికి వచ్చాను’ అన్నాడు శిష్యుడు.

విద్యార్థులందరూ వెళ్లిపోయాక చివరికి కొత్త శిష్యుడి దగ్గరికి వచ్చాడు గురువు. ‘నాతో రా!’ అని పిలిచాడు. గురుశిష్యులు ఇద్దరూ కొండపై నడుస్తూ వెళ్లారు. కొంతదూరంలో వాళ్లకు పచ్చని చెట్లు కనిపించాయి. వాటిని చూపిస్తూ ‘ఇవేమిటో తెలుసా?’ అని ప్రశ్నించాడు గురువు. ‘వెదురు చెట్లు’ అన్నాడు శిష్యుడు. ఆ వెదురు చెట్లకు పక్కగా పుట్టుకొస్తున్న లేత వెదురు రెమ్మలను చూపుతూ ‘ఇప్పుడు వీటిని చూస్తే, నీకెలా కనిపిస్తున్నాయి?’ అని అడిగాడు గురువు. ‘ఆ వెదురు మొక్కలు బాగా పెరిగి, పొడుగ్గా ఉన్నాయి. ఈ వెదురు రెమ్మలు ఇంకా ఎంతో పెరగాల్సి ఉంది. ఇవింకా చిన్నవిగా, పొట్టిగా ఉన్నాయి’ అన్నాడు. ‘ఇవీ వెదుళ్లే!’ అని చెప్పి తన కుటీరం వైపు వెళ్లిపోయాడు గురువు.

జీవితాన్ని యథార్థదృష్టితో చూడాలనుకుంటే పోలికలు పెట్టడం మానుకోవాలి. పోలికల ఆధారంగా ‘ఇది ఉన్నతం, ఇది అథమం, పొడవు, పొట్టి, అందం, వికారం’ అని నిర్ణయించడం సరికాదు. ఏ వస్తువునైనా సమదృష్టితో చూసే అలవాటు ఉండాలి. అదే బుద్ధుడు చూపిన మార్గం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment