Sunday, February 27, 2022

మరణించీ జీవించు!

మరణించీ జీవించు!
‘పుణ్యాత్ములు,
మహానుభావులు,
పండితులు,
ధర్మాత్ములు కీర్తిశరీరాలతో జరామరణాలను అతిక్రమించిన యోగుల్లా సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు’ అంటాడు భర్తృహరి.
కీర్తికాంక్ష కలవారు జీవించేది మరణంవరకే.
విద్య, సంపద, పదవివల్ల పేరు ప్రఖ్యాతులు లభించవు. లభించినా అవి శాశ్వతమైనవి కావు.
జ్ఞానం, సచ్ఛీలం, సత్కర్మ, సత్యసంధత, నిరాడంబరత వల్లనే యశస్సు ఒనగూడుతుంది.
చిత్తశుద్ధి, సంస్కారం, మేధస్సు కలవాడు వినమ్రుడై పదిమందిలో మంచివాడనిపించుకుంటాడు. పోతన మహాకవి సామాన్య జీవన విధానానికి శ్రీనాథకవి సార్వభౌముడే అచ్చెరువొందాడు. తన భౌతిక సంపదకు బతికినన్నాళ్లు తానొక ధర్మకర్తగానే మనిషి భావించుకోవాలి. మనిషి కీర్తి వెంటపడక, కర్తవ్య దీప్తి వెంటపడాలి. వృత్తిని దైవంగా, ప్రవృత్తిని ధర్మబద్ధమైనదిగా భావిస్తే, మన్నన దానంతట అదే లభిస్తుంది. ఏ పని వెనకైనా కీర్తి కాముకత ఉంటే- దానికి విలువే లేదు... గెలుపూ ఇవ్వలేదు. పైగా అటువంటి కీర్తి కాంక్షాపరులు నలుగురిలో చులకనైపోతారు.

‘కీర్తికాంక్షకు మోహమే మూలం. ఆ మోహమే బుద్ధిహీనతకు వినాశానికి దారి తీస్తుంది’ అంటాడు వాసుదేవుడు. కీర్తి కోసం అహంకారపూరితుడై బలిచక్రవర్తి పాతాళాన పడిపోయాడు. కౌరవ సైన్యంలో ద్వేషం, వ్యక్తిగత ఖ్యాతి కోసం పాకులాడేవారు ఉండటం వల్ల వారంతా కురుక్షేత్రంలో పరాజితులయ్యారు. ‘విశ్వశ్రేయస్సు కోసమే కావ్యరచన’ అన్న సత్సంకల్పంతో నిర్మలచిత్తంతో లోక కల్యాణం కోసం రామాయణ, మహాభారత రచన చేసిన వాల్మీకి, వ్యాస మహర్షులు చిరయశోశిఖరాయమానులయ్యారు. సామాన్యుడైన విదురుడు హితమైన బోధలతో మాన్యుడయ్యాడు. అమేయమైన భక్తివల్ల శివుడికి తన కన్ను అప్పగించి కన్నప్ప లోకవంద్యుడయ్యాడు. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు తమ జీవితాలను కీర్తికోసం పరమాత్మకు అంకితం చేయలేదు. ఆదిశంకరులు ప్రధాన జీవన లక్ష్యాలను ఖ్యాతికోసం ప్రచారం చేయలేదు.
ఎవరైనా మృత్యుదేవతకు బానిసలే. మంచి మరణం ధర్మవ్రతుడికే లభిస్తుంది. ఆ ధర్మమే మరణం తరవాత అతణ్ని బతికిస్తుంది. పాప జీవితం గడిపినవాడే మరణానికి భయపడతాడు. మమకారం వీడినవాడు మరణం ముందు ధైర్యంగా నిలబడతాడు. చచ్చిన తరవాత నలుగురే మోస్తారు. బతకడంలో తేడా వస్తే లోకం అంతా మోస్తుంది చరిత్రహీనుడంటూ!
మరణ సమయంలో నిశ్చింతగా పోయేవాడు జీవితాన్ని గెలిచినవాడే. అతడే ఆధ్యాత్మిక చక్రవర్తి. ఉన్నతమైన ఆసనం మీద కూర్చున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కారు. ఉన్నతమైన ఆలోచనలు, ఆశయాలుండి కింద కూర్చున్నవాడే మహాత్ముడు, మహోన్నతుడు అంటాడు భాస్కర శతక కర్త. సాధన, ప్రయత్నం, దృఢ సంకల్పం, దీక్ష అనేది లేకుండా కీర్తి కండూతితో వక్రమార్గంలో సన్మానాలు, సత్కారాలు అందుకోవడానికి తాపత్రయపడటం- ఎండమావిలో నీటికోసం అన్వేషించడం లాంటిదే! స్వావలంబనతోపాటు పారమార్థిక చింతన ఉన్న మనిషిని మాత్రమే ఖ్యాతి వరిస్తుంది. ప్రతిభ ఉంటే ప్రశంస పరుగెడుతూ వస్తుంది. ప్రశంస కోసమే పరుగులు పెట్టేవాడు ప్రతిభకు దూరమైపోతాడు. మనోవాక్కాయ కర్మల్లో పవిత్ర ప్రవర్తన కలవాడే మరణానంతరం చిరస్మరణీయుడవుతాడు. మరణించాక జీవించాలంటే బతుకంతా తపస్సు చేయాలి
.

సేకరణ

No comments:

Post a Comment