Tuesday, February 22, 2022

️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో కేవలం ప్రేమను ఇవ్వడం లేదా తీసుకోవడం కాకుండా, మనమే ప్రేమగా ఎలా మారగలం?

✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో


కేవలం ప్రేమను ఇవ్వడం లేదా తీసుకోవడం కాకుండా, మనమే ప్రేమగా ఎలా మారగలం?

మాతృ భిక్ష

ఇది దాదాపు 175 ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన యధార్థ సంఘటన. వెనుకబడిన కులానికి చెందిన ధని అనే ఒక స్త్రీ ఉండేది, ఆమె చాలా దయగలది. ఆమె గ్రామ కమ్మరి భార్య, బిడ్డ పుట్టినప్పుడు సహాయపడే ఒక మంత్రసానిగా పనిచేసేది.

ఆ రోజుల్లో, ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంట్లో బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ పుట్టడంతో, కమర్పుకూరు ఊరి వాతావరణంలో ఒక మార్పు వచ్చినట్లుగా అయ్యింది - అంతటా పక్షుల కిలకిలరావాలు వినిపించాయి, పువ్వులు వికసించాయి, ఊళ్ళో చెట్లకు కొత్త ఆకులు రావడం మొదలైంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రశాంతపరిచే విధంగా వాతావరణం మారింది. ఆ బిడ్డ పుట్టుక ఆనందాన్ని తీసుకొచ్చింది, కుటుంబం మొత్తానికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని తెచ్చింది.

ధని అక్కడ మంత్రసానిగా, సంరక్షకురాలిగా పని చేయడం ప్రారంభించి, ఆ బిడ్డను చూసుకునేది. కాలక్రమేణా, ఆమెకు ఆ శిశువుతో ఒక అనుబంధం ఏర్పడింది. ధని ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేది. ఆ పిల్లవాడు కూడా ఆవిడతో ఒక భిన్నమైన, మాతృ సంబంధాన్ని పెంచుకున్నాడు. ధనీకి ఆ బిడ్డతో చెప్పలేని ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది.

చూస్తూండగా ఆ అబ్బాయికి 9 ఏళ్లు వచ్చాయి. ఒకరోజు మంత్రసాని ఆ బ్రాహ్మణ బాలుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. ఒక తల్లి ఏదో బాధ్యతను కోరుతున్నట్లుగా, పిల్లవాడు ఆమెకు వాగ్దానం చేస్తున్నట్లుగా కనిపించింది. తర్వాత ఆ మంత్రసాని చెమ్మగిలినకళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

9 సంవత్సరాల తరువాత, ఆ బాలుడి కుటుంబ సభ్యులు అతనికి ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ కుర్రవాడి అన్నగారు ఆ ఆచారం, దాని ప్రవర్తనా నియమావళి యొక్క అంతర్భావాల గురించి అతనికి సూచనలు ఇస్తున్నాడు.

"మాతృ భిక్ష (తల్లి నుండి భిక్ష)" అనేది ఉపనయనంలో ఒక ముఖ్యమైన ముగింపు కార్యం. (మగ శిశువుకు ఒక నిర్దిష్ట వయస్సు వచ్చినప్పుడు, అతనికి పవిత్రమైన దారాన్ని [ యజ్ఞోపవీతాన్ని శరీరంపై వికర్ణంగా] ధరింపజేయడం బ్రాహ్మణులలో ఒక ముఖ్య ఆచారం. గాయత్రి మంత్రం కూడా అతనికి చెప్పబడుతుంది.
ఈ వేడుక బాలుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఒకటి, ఎందుకంటే ఈ వేడుక తర్వాత మాత్రమే బాలుడు సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడని ఒక నమ్మకం.) ఈ సమయంలో, బాలుడు తన తల్లి నుండి మొదటి భిక్ష (ఒక పాత్రతో అన్నం, పండ్లు) అందుకుంటాడు. తల్లే అతనికి మొదటి ఆశీర్వాదం ఇస్తుంది. ఇది ప్రతి తల్లికీ చాలా గర్వకారణమైన విషయం.

అన్నయ్య ఈ ఆచారం గురించి చెబుతుంటే, ఆ పిల్లవాడు ఇలా అన్నాడు: "నేను ధనిఅమ్మ నుండి మొదటి భిక్ష తీసుకుంటాను, అలా నేను ఆమెకు వాగ్దానం చేసాను."

వారిది సనాతన కుటుంబం అయినందున, అన్నయ్య భయపడుతూ ఇలా అన్నాడు: "అది చాలా అసాధారణమైనది, ఆ మంత్రసాని ధని అమ్మ వద్దనుండి మొదటి భిక్ష తీసుకుంటే, గ్రామ పండితుల మధ్య మన గౌరవం పోతుంది."

ఆ అమాయకపు పిల్లవాడు వెంటనే ఇలా బదులిచ్చాడు "సోదరా, ఈ వేడుకలో ధనిఅమ్మకి నా తల్లిగా హక్కు ఇస్తానని నేను వాగ్దానం చేసాను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే, నేను ఈ పవిత్ర యజ్ఞోపవీతానికి అర్హుడిని కాదు."
అన్నగారు ఈ మాటలు నమ్మలేకపోయాడు.

త్వరలోనే, ఆ పవిత్రమైన రోజు వచ్చింది.

మంత్రోచ్ఛారణలు, శ్రావ్యమైన సన్నాయి వాయిద్యాల మధ్య వేడుక చక్కగా ప్రారంభమైంది. కుటుంబ సభ్యులందరూ, చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ సంబరాల్లో, వేడుక హడావిడిలో, ఇంతకుముందు వారిరువురికీ జరిగిన చర్చను తమ్ముడు మరిచిపోయాడేమో అని అన్నగారు అనుకున్నాడు.
మరి కొద్దిసేపట్లో " మాతృ భిక్ష" ఆచార కార్యక్రమం ప్రారంభంకానుంది. కుర్రవాడి తల్లి, ఇతర స్త్రీలు అందరూ 'భిక్ష' ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.

కానీ, భిక్ష ఇవ్వడానికి కొంత బియ్యం, పండ్లతో దూరంగా ఒక మూల నిలబడి ఉన్న ధనిఅమ్మ వైపు ఆ కుర్రవాడు చేతిలో బిక్ష సంచితో నడుస్తూ వెళ్లగా, అక్కడి వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు.

బ్రాహ్మణ పండితులందరూ చూస్తూండగా, స్త్రీలందరూ నిర్ఘాంతపోయి నిలబడిపోగా, సమాజంలో అంటరానితనం తారాస్థాయిలో ఉన్న సమయంలో, ఆ అమాయక బాలుడు, తాను ధనిఅమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా, ఆమె ముందు వంగి, ఒక వెనుకబడిన కులానికి చెందిన స్త్రీ అయిన ధని నుండి మొదటి "మాతృ భిక్ష"ను అందుకున్నాడు!
కళ్ళలో నీళ్లతో, హృదయంలో మాతృప్రేమ ఉప్పొంగుతూండగా, ధని ఆ బిడ్డకు తన ఆశీస్సులు ఇచ్చింది. ఆ నిరుపేద తల్లికి, ఆమె జీవితంలో ఉన్న కోరిక ఇదొక్కటే.

ఈ వేడుకలో అటువంటి సంఘటన జరిగినప్పుడు, దాని గురించి పెద్ద రభస, అలజడి జరుగుతుందని అందరూ ఊహించారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ వేడుకకు సంబంధించిన ప్రధాన పండితుడు మాత్రం ఆ పిల్లవాడి, "సత్య వాక్య పరిపాలనం" గురించి ప్రశంసించి, హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.

ఈ చిరస్మరణీయమైన నిశ్శబ్ద విప్లవం పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది, ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చిన బాలుడు "గదాధర్ ఛటోపాధ్యాయ", అతనే తరువాత రామకృష్ణ పరమహంసగా ప్రాచుర్యం పొందాడు.

ఈ అన్యోన్యమైన ప్రేమ, ఆప్యాయతల బీజం ఒక పేద స్త్రీ యొక్క మాతృ ప్రేమ నుండి అతనిలో ఉద్భవించింది ఉండచ్చు. బహుశా అదే రామకృష్ణ పరమహంస యొక్క ఔన్నత్యానికి పునాది వేసి ఉంటుంది.
తరువాతి సమయంలో స్వామి వివేకానంద ఆయన ప్రధాన శిష్యుడు అయ్యాడు.

మనలో నిజమైన ప్రేమ పెంపొందితే, అందరూ సమానంగా కనిపిస్తారు. ప్రేమ అంతిమ లక్ష్యానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది, ఎందుకంటే ప్రేమ ఒక అత్యుత్తమమైన శక్తి.

ప్రేమను పెంపొందించుకోవడానికి ఏకైక మార్గం నిరంతర స్మరణ.

♾️

మీరు ప్రేమతో మాత్రమే హృదయాలను గెలుచుకోగలరు. దానికి ఇంకో మార్గం లేదు. 🌼
లాలాజీ మహారాజ్


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

No comments:

Post a Comment