Friday, February 18, 2022

వశిష్టుడు - విశ్వామిత్రుడు, వేయి సంవత్సరాల తపోశక్తి vs అర్ధ గంటకాలం మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం

వశిష్టుడు - విశ్వామిత్రుడు

ఒక రోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి విచ్చేసాడు. ఇద్దరూ అనేక విషయాలను చర్చించారు. వశిష్టుడు వీడుకోలు చెప్పినప్పుడు విశ్వామిత్రుడు , వశిష్టునికి కలకాలం జ్ఞాపకం వుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని తన వేయి సంవత్సరాల తపశ్శక్తిని ధారపోశాడు.

వశిష్టుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.

ఆ తర్వాత మరి కొన్నాళ్ళకు వశిష్ఠుని ఆశ్రమానికి విశ్వామిత్రుడు వచ్చాడు. వశిష్టుడు విశ్వామిత్రుని కి
సకలోపచారాలు చేస్తాడు. పుణ్యమునకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు గురించి మాత్రమే మాట్లడుకున్నారు. వీడ్కోలు సమయాన
వశిష్టుడు ,విశ్వామిత్రుని కి బహుమతిగా అంతవరకు వారు మాట్లాడుకున్న విషయాల పుణ్యఫలాన్ని యిస్తున్నాను అన్నాడు.

ఇది విన్న విశ్వామిత్రుని ముఖం చిన్న బోయింది.
' మీరు నాకిచ్చిన వేయి సంవత్సరాల తపః ఫలం,
యీ అర రోజు మాటల పుణ్యఫలం ఎలా సమమౌతాయని ఆలోచిస్తున్నారా ' అని వశిష్టుడు అడిగాడు.

విశ్వామిత్రుడు అవునని తలవూపాడు. ఈ విషయంగా బ్రహ్మదేవుని అడిగి తెలుసుకుందామని ఇద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళేరు. బ్రహ్మకి జరిగినది
చెప్పేరు. ఈ విషయంగా నేను తీర్పు చెప్పలేను .శ్రీ మహావిష్ణువు ని అడగమని చెప్పాడు బ్రహ్మ. వారు శ్రీ మహావిష్ణువు వద్దకి వెళ్ళి అడిగారు. నా కంటే కూడా తపోబలాన్ని గూ‌ర్చి పరమశివునికి బాగా తెలుసు. పరమశివుని అడిగితే ఆయనే సరిగ్గా జవాబివ్వగలవాడని అని అన్నాడు శ్రీ మహావిష్ణువు.
వారిద్దరూ అక్కడనుండి కైలాసం చేరుకొని తమ సందేహం తీర్చమని వేడుకొన్నారు. పరమశివుడు కూడా మీ సందేహం తీరాలంటే పాతాళలోకంలోని ఆది శేషువే తీర్చాలని చెపుతాడు.

వశిష్టుడు ,విశ్వామిత్రుడు పాతాళలోకానికి వెళ్ళి ఆదిశేషువును తమ సందేహం తీర్చమని అడిగారు. ఆదిశేషువు ఆలోచించి సమాధానం చెప్పడానికి కొంచం వ్యవధి కావలసి వున్నది. నేను బదులు చెప్పేదాకా నేను మోస్తున్న యీ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయ వలసి వుంటుంది. తలమీద పెట్టుకుంటే బరువుగా వుంటుంది, కనుక , ఆకాశం లో నిలబెట్టి వుంచండి అని అన్నాడు. విశ్వామిత్రుడు వెంటనే తన వేయి సంవత్సరాల తపః ఫల శక్తిని ధార పోస్తాను. ఆ తపఃశ్శక్తితో , భూమి ఆకాశంలో నిలబడుతుంది అని అన్నాడు.అయితే, భూమిలో ఏ చలనం రాలేదు. అది ఆదిశేషుని తలపై అలాగే వుంది.
అప్పుడు వశిష్టుడు అన్నాడు. అర్ధగంటసేపు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను, ఆ శక్తితో భూమి
ఆకాశం లో నిలబడాలని కోరుకుంటున్నానని
అన్నాడు. వశిష్టుడు అలా అనగానే ఆదిశేషువుతలమీద వున్న భూమి అంతరాన నిలబడింది.

ఆది శేషువు తిరిగి భూమిని తన తలమీద పెట్టుకొని
యిద్దరు మహర్షులు వెళ్ళవచ్చునని అంటాడు. అడిగినదానికి బదులు యివ్వకుండా వెళ్ళమంటే ? దాని అర్ధం ఏమిటని ఇద్దరు ఋషులు ఒకే సారి అడిగారు. మీ ఎదురుగానే నిరూపణమయింది , చూశారు కదా , యింక వేరే తీర్పు చెప్పడానికి ఏమున్నది?

వేయి సంవత్సరాల తపోశక్తి ధారపోసినపుడు కదలని భూమి ఒక అర్ధ గంటకాలం మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం ధారపోయడం వలన ఆకాశం లో నిలబడడం మీరు గమనించారు.
"సజ్జన సాంగత్యం వలన, సత్చింతన వలన కలిగిన
పుణ్యమే, తపోబలం యిచ్చే ఫలం కన్న మిన్న " అని ఆదిశేషువు తీర్పు.

సస్సంగత్యే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వ నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః

సేకరణ

No comments:

Post a Comment