Tuesday, February 22, 2022

మళ్ళీ మళ్ళీ లేనిచోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🍎🥭🍍శుభోదయం 🍍🥭🍎
💐💐💐💐💐💐💐💐💐💐💐

జీవితం ఒక సినిమాలాంటిదే. నిజం కాదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే.నేను, నా ఎదురుగా ఉన్నవాడూ, వాడికి సమస్యను సృష్టించిన వాడూ అందరూ ఆ భగవంతుని రూపాలే'— అనే జ్ఞానం సదా నిలిచి ఉంటుంది. మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందేవరకు ఈ భ్రాంతులు తప్పవు.

మనం సినిమాకి వెళ్ళినప్పుడు అందులోని నవరసాలను మన జీవితంలోనే జరుగుతున్నట్లుగా తాదాత్మ్యం చెంది అనుభవిస్తూనే ఉంటాం కానీ అంతర్లీనంగా
'ఇది కేవలం సినిమా మాత్రమే. నిజం కాదు.' అనే జ్ఞానం మనకు సదా ఉంటుంది. అందుకే సినిమాలో బాంబు పేలితే మనం అక్కడినుంచి లేచి పారిపోము, హత్య జరిగితే పోలీసులకి ఫోన్ చెయ్యము. మహాత్ములకి నిజ జీవితంలో కూడా నిరంతరం ఈ జ్ఞానం ఆరూఢమై ఉంటుంది.

ఒకసారి ఇద్దరు మిత్రులు సినిమాకు వెళ్లారు. సినిమాలో హీరో గుఱ్ఱం మీద వెళ్తున్నాడు. మొదటి మిత్రుడు,
"ఇప్పుడు ఆ హీరో గుఱ్ఱం మీదనుంచి పడిపోతాడు. కావాలంటే వంద రూపాయలు పందెం" అన్నాడు. ఆ హీరో పడిపోడని రెండవ మిత్రుడూ పందెం కాసాడు. మరికొద్ది నిముషాలలో ఆ హీరో పడిపోవడం, రెండవ మిత్రుడు మొదటివానికి వంద రూపాయలు ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఆ మొదటి మిత్రుడు, "నేను ఈ డబ్బులు తీసుకోలేను. నేను నిన్ను మోసం చేశాను. నేను ఈ సినిమా ఇదివరకే చూసేసాను" అన్నాడు.

అప్పుడా రెండవ మిత్రుడు,
"నేను కూడా ఈ సినిమా ఇదివరకే చూసాను. అయినా ఆ హీరోకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఒకసారి గుఱ్ఱం మీదనుంచి పడ్డవాడు రెండవసారి జాగ్రత్తగా ఉంటాడులే అనుకొని నీతో పందెం కాసాను. కానీ ఆ బుద్ధిలేని హీరో మళ్ళీ అలాగే పడిపోయాడు" అన్నాడు.

ఇది వింటే ఆ రెండవవాడి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం. కానీ ప్రతిరోజూ మనం చేస్తున్నది కూడా అదే. మన జీవితంలో ప్రతిరోజూ ఇలాంటి భ్రమలకు, భ్రాంతులకు లోనవుతున్నాం. ఎలాగో చూద్దాం. మనకు ప్రధానంగా ఆరుగురు శత్రువులని పెద్దలు చెబుతారు కదా! అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మన ప్రబల శత్రువులని చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాం. అలాగే వీటి దాహం తీరనిదని, ఎంత సమర్పించుకున్నా ఇంకా ఇంకా అగ్నిలా ప్రజ్వరిల్లుతూనే ఉంటాయని సాక్షాత్తు భగవానుడే గీతలో చెప్పాడు కదా! అయినా మనం ప్రతిసారీ
'ఈ ఒక్కసారికి వాటి మాట విని వాటి ఆకలి తీరిస్తే మళ్ళీ మన జోలికి రావులే' అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటికి లొంగిపోతూనే ఉంటున్నాం.

ఒకరికి విపరీతమైన షుగర్ వ్యాధి ఉంటుంది. కానీ తీపి అంటే ఎంతో ఇష్టం.
'ఈ ఒక్కసారికి తినేస్తే ఆ కోరిక తీరిపోతుందిలే. ఆ తరువాత ఇంకెప్పుడూ తినద్దు' అనుకుంటూ తినేస్తాడు. అయితే ఆ కోరిక అక్కడితో ఆగుతుందా? మళ్ళీ మళ్ళీ తీపివైపుకు లాగుతూనే ఉంటుంది, వీడు మళ్ళీ మళ్ళీ దానికి లొంగుతునే ఉంటాడు.

చివరికి వాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. అలాగే ఒకడికి విపరీతమైన కోపం ఉందనుకోండి. అది తప్పు అని వాడి బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినాసరే
'ఈ ఒక్కసారికి నా పిల్లవాడిమీద కోపం చూపిస్తే తరువాత వాడే నా మాట వింటాడులే' అనుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు మాట వినేదెప్పుడు? వీడి క్రోధం అణిగేదెప్పుడు? రెండూ కల్లలే. చివరికి ఆ పట్టరాని క్రోధంలోనే ఏదో జరగరాని అనర్థం జరుగుతుంది.

అలాగే లోభగుణం ఎక్కువగా ఉన్నవాడు ఎవరికైనా ధన సహాయం చేయవలసి వస్తే
'ఈ ఒక్కసారికి దాచుకుందాంలే. వచ్చేసారి నుంచి నా శక్తికొలది తప్పకుండా దానం చేస్తాను' అని ప్రతిసారి అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలాగే మన కళ్ళముందే మనం మోహం పెంచుకున్న ఎందరో బంధువులు, స్నేహితులు వెళ్లిపోతున్నా మళ్ళీ మళ్ళీ 'ఈ ఒక్కసారికే' అనుకుంటూ క్రొత్త వారి(టి)పై మోహం పెంచుకుంటూనే ఉంటాం. ఇక ఎన్నిసార్లు 'నీ సత్తా ఇంతేరా!' అని భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నా 'అమ్మో! వచ్చేసారి జాగ్రత్తగా ఉండాలి' అనుకుంటూనే ఉంటాం, అయినా మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు 'నా అంతవాడు లేడు' అనుకుంటూ మదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. ఇలాగే ఎప్పటికప్పుడు 'ఇది తప్పు. భగవంతుడు నాకు ఇవ్వాల్సింది బాగానే ఇచ్చాడు' అనుకుంటూనే మళ్ళీ ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం రూపాల్లో మాటిమాటికి మాత్సర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం.

అయితే పైన చెప్పుకున్న కథలో మొదటివాడు ఎందుకు భ్రాంతిలో పడలేదు? రెండవవాడు ఎందుకు పడ్డాడు? అని విచారిస్తే మొదటివాడు
'ఇది సినిమా. ఎన్నిసార్లు చూసినా ఇందులో మార్పేమీ ఉండదు. అది ఎప్పటికీ నిజం కాబోదు' అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇక రెండవవాడు సత్యానికి, కల్పనకి భేదం తెలుసుకోలేక ఆ కల్పనే నిజమని భ్రమించి ఎప్పటికైనా అది మంచిగా మారకపోతుందా అనుకుంటూ అందులో లీనమై మళ్ళీ మళ్ళీ ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు.

ఇదే మనకీ, జ్ఞానులైన మహాత్ములకు ఉన్న తేడా. మనం ఈ చూసే ప్రపంచమంతా సత్యమేననే భ్రమలో పడి
'ఇందులో రమించడం మన ఆథ్యాత్మిక ఉన్నతికి అవరోధం' అని మన బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నా 'ఎప్పటికైనా ఇందులోనే మనకు కావలసింది దొరక్కపోతుందా'* అని మళ్ళీ మళ్ళీ లేనిచోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

సేకరణ

No comments:

Post a Comment