Thursday, March 17, 2022

'ఈర్ష్య' వెంట మరో మూడు..!

'ఈర్ష్య' వెంట మరో మూడు..!

“అతడు బాగా సంపాదిస్తున్నాడు. అందుకే ఆ బడాయి!"

“ఆమెను చూడు! ఎంత గర్వమో! మంచి పేరు, ప్రతిష్ఠలున్నాయని పొగరు"

”అతడికి గొప్పపేరుంది. ఏం లాభం అన్నీ వ్యసనాలే!"

“ఇప్పుడు మంచి సంపన్నులు కనుక తెగమిడిసి పడుతున్నారు! ఎప్పటికో అప్పుడు 'కరిమింగిన వెలగపండు'లా అంతా నాశనం కాకపోతుందా!”

... ఇలా రకరకాల మాటలు మన జీవితాల్లో వినబడుతుంటాయి. అలా అనే వాళ్లలో మనమూ ఉంటుంటాం అనడంలో సందేహం లేదు.

ఈ ఈర్ష్యాజనిత భావాలు ఎందుకు పుడుతున్నాయి?

మనిషి తన అవసరం, తన సౌఖ్యం కోసం ఏమి ముఖ్యమో వాటిని సంపాదించడం తప్పులేదు. కానీ మరొకరితో పోల్చుకోవడం వల్ల రకరాల విపరీత భావాలు పుడతాయి. వినబడుతుంటాయి.

ధనంలోకానీ, పదవిలోకానీ, విద్యలోకానీ, కీర్తిలో కానీ మన కంటే ఒకడు అధికంగా ఉంటే, అదీ మన సమీపస్థుల్లో ఉంటే... వెంటనే ఈర్ష్య కలుగుతుంది. ఒకే రంగంలో మనతో పాటు ఉన్న వ్యక్తి ఎదిగినా ఇదే బాధ!

ఈ భావం ఎన్నో వైపరీత్యాలకు దారితీస్తుంది. అతడి ఆధిక్యాన్ని దెబ్బతీయాలని యత్నించే కుటిలత్వం కొందరు చూపిస్తే, అతడిలో ఇతర బలహీనతల్నీ, కొద్దిపాటి లోపాల్నీ భూతద్దాలలో చూసి, చూపించి 'అతగాడు చాలా వ్యర్ధుడు' అని అనుకొని తృప్తి పడడమో లేదా వాటిని అక్రమాలు, నేరాలుగా ప్రచారం చేసి అప్రతిష్ఠపాలు చేసి సంతోషించడమో కొందరు చేస్తారు. వీరికి మీడియా కూడా తోడైతే మరీ వ్యాప్తిచేసి వినోదిస్తారు.

మరికొందరు...
లోలోపల ఈర్ష్యతో వేదనపడుతూ, న్యూనతా భావానికి కూడా గురౌతారు.

ఇంకొందరు... వారి వలె తామూ ఉన్నతస్థితికి వెళ్ళాలనుకుంటారు. ఇది సరియైన ఆలోచనే! దీనిని 'ఈర్ష్య' అనకుండా, 'ఆదర్శంగా గ్రహించడం' అనవచ్చు. ఈ భావం మనలో స్ఫూర్తినీ, ప్రయత్నశీలతనీ వృద్ధిచేసి లక్ష్యాలను సాధించడంలో తోడ్పడుతుంది.

అలా కాకుండా - అక్రమ మార్గాలలో, కుటిలయత్నాలతో లక్ష్యసాధన కోసం ముందుకుసాగితే ఇది మళ్లీ 'ఈర్ష్యాది' దుర్గుణాలలోకే చేరుతుంది.

అవతలివాడి అభ్యున్నతిని చూసి ఓర్వలేనితనం 'ఈర్ష్య' అయితే - దానినంటిపెట్టుకున్న చతుష్టయంలో మరో మూడు దుర్గుణాలు తయారౌతాయి .

అవి…
అసూయ, ద్వేషం, హింస. అవతలి వారిలోని సుగుణాలని కూడా దోషాలుగా చూసి, చూపించే దుర్గుణమే అసూయ. దానికి మిగిలిన రెండు (ద్వేషం, హింస) కూడా తోడైతే మరీ ప్రమాదం. ఈ భావాలు అవతలి వారికే కాదు, తమకే విపత్కరమని గ్రహించగలగాలి.

ప్రతాపంతో, విస్తరణార్ధం, తద్వారా సుస్థిర సౌఖ్య పాలనార్ధం యుధిష్ఠిరుడు రాజసూయయాగం చేశాడు. విశాలపృథ్వికి చక్రవర్తి అయ్యాడు. ఆయన, సోదరులు ధర్మబద్ధంగా సాధించిన గొప్ప ప్రగతి ఇది. దానితో వచ్చిన వైభోగాలు, సంపదలు ధర్మమయ అర్ధాలుగా అనుభవించారు.

కానీ ఈర్ష్యాపరుడైన దుర్యోధనుడు రగులుకు పోయాడు. తన దుర్గుణానికి 'మానధనుడు' అనే బిరుదునిచ్చుకుని తృప్తిపడ్డాడు.

అతడినీ, అతడి అవలక్షణాలనీ మెరమెచ్చుల కోసం, స్వార్థపరులై కీర్తిస్తూ పైకెత్తారు శకుని, కర్ణ, దుశ్శాసనులు. అందునా - కర్ణునికి అర్జునుని పట్ల ఉన్న ఈర్ష్యాసూయలు జతపడ్డాయి.

ఈ దుర్లక్షణాలకి ఫలమే కుఱుక్షేత్ర సంగ్రామం. సమూల కౌరవ వంశనాశనం, భయంకరమైన జననష్టం.

విద్యలలో, వాణిజ్యంలో స్పర్ధ ఒక విధంగా మంచిదేగానీ, దానిని ధర్మమయమైన పద్ధతుల్లో, అణచివేతలు లేకుండా కృషితో, పట్టుదలతో సాధించగలిగితే గొప్పవిషయమే.

'స్పర్ధయా వర్ధతే విద్య' అన్నారు.

విద్య స్పర్ధతోనే వృద్ధి చెందుతుందట. కానీ అది చక్కని ఆరోగ్యకరమైన పోటీగా ఉంటే మంచిదే
అలాకాక బాలదుర్యోధనుడిలా భీముని నీటిలో పడేయడం, విషం పెట్టి చంపాలని ప్రయత్నించడం లక్కయింటిని తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడరాదు.

”పూనుస్పర్ధలు విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్....”
అని గురజాడవారి మాట.

మనకి సరిపోయేటంత సుఖానికి లోటులేనంతగా మన దగ్గరున్నా, మన కంటే మన దగ్గర్లోవాడు సంపదాదుల్లో అధికంగా ఉన్నాడని కడుపుమంట కొందరిలో ఉంటుంది.

ఇది లేని దారిద్ర్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. దీనితో తెలియని విసుగు, చిరాకు, అశాంతి ముప్పిరిగొంటాయి.

”కంటికి నిద్ర వచ్చునే, సుఖంబగునే రతికేళి,
జిహ్వకున్ వంటక మిచ్చగించునె”
అని శ్రీనాథుడు వర్ణించినట్లుగా స్పర్ధతో జీవితం ఉన్న సుఖాలని కూడా గుర్తించనీయకుండా, సుఖపడకుండా సాగిపోతుంది.
తాము దెబ్బతిన్నా ఫరవాలేదు. ఎదుటివాడిని ఎదగన్వికూడదనే వింత క్రౌర్యం కలవారూ ఉంటారు.

మొత్తానికి - అనేక వైపరీత్యాలకీ, మానసిక వికారాలకీ హేయమైన ఈర్ష్యను జయించగలగడం శాంతికరమైన సాధన.✍️
----బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.
.

సేకరణ

No comments:

Post a Comment