Thursday, September 22, 2022

మహాభరతం నుండి…. విదురుడు!

 ii. Xi.    1-6.  200922-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
మహాభరతం నుండి….

                    *విదురుడు!*
                   ➖➖➖✍️

*విదురుడు గొప్ప జ్ఞాని. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాడు. జ్ఞానాన్నిచ్చి ఇతరుల్ని కూడా దైవం దిశగా తిప్పడ మన్నదే దానాల్లోకల్లా గొప్పదానం.

*వేదమనే మాట ఏ క్రియ నుంచి ఏర్పడిందో (విద-జ్ఞానే) ఆ క్రియతోనే విదురుడనే పేరు ఏర్పడింది. ‘రా’ అంటే, ఈయడమని అర్థం.  

అన్నగారైన ధృత రాష్ట్రుడికి జ్ఞానోపదేశాన్ని చేసేదెప్పుడూ విదురుడే. గుడ్డివాడు గనక ధృతరాష్ట్రుడికి రాజ్యం రాలేదు;   పాండురాజు చని పోయిన మీదుట రాజ్యం విదురుడికి రావాలి గానీ,    అలా కాకపోవడానికి కారణం అతను ఒక దాసీదానికి పుట్టడమని చెబుతారు.

గుడ్డివాడొకడూ, పాలి పోయిన దేహంతో ఉన్నవాడొకడూ పుడతారని తెలిసిన అత్తగారు... పెద్దకోడల్ని తిరిగి వ్యాసమహర్షి సమక్షానికి పంపుదామని అనుకొంది.

 *అయితే ఆ కోడలు వ్యాసుడి గుబురు గెడ్డాలకు బెదిరిపోయి, తన దాసీకి తనలాగే వేషం వేసి వ్యాసుణ్ని సేవించడానికి పంపించింది.                           దాసి అయినా ఆవిడ చాలా శ్రద్ధగా సేవించడం వల్ల విదురుడి లాంటి మహాజ్ఞాని పుట్టడం జరిగింది. కానీ రాజు కావడానికి, ఎంత జ్ఞాని అయినా అతనికి దాసీ పుత్రత్వం అడ్డొచ్చింది. 

*జ్ఞానీ విరాగీ అయినవాడు రాజ్యాన్ని   ఏ స్వార్ధమూ లేకుండా పరి పాలించగలడు. కానీ దాన్ని ఏ వ్యవస్థలోనూ పడనివ్వరు. ఏదో ఒక కారణం చెప్పి తప్పిస్తూ ఉంటారు. 

తనకెంత సామర్ధ్యమున్నా విదురుడు                    ఆ రాజ్యపదవి కోసం వెంపర్లాడలేదు. మంత్రిగా ఉండి అన్నగారిని ఉద్ధరించడానికే జీవితం పొడుగునా ప్రయత్నించాడు.                   
ఇంతటి మహాజ్ఞానీ వైరాగ్యవంతుడూ దాసీ కడుపున పుట్టడానికి కారణమేమిటా అంటే ఒక కథను చెబుతారు….
******************
 **మాండవ్యుడనే ఒక ఋషి తన ఆశ్రమం ముంగిట్లో ఉన్న ఒక చెట్టు కింద తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. 

*ఒక రోజున దొంగిలించిన ద్రవ్యాన్ని తీసుకొని కొంతమంది దొంగలు అటు పరిగెత్తు కొంటూ వచ్చారు.

*తరుముకొంటూ వస్తూన్న భటుల చేతిలో చచ్చిపోతామన్న భయంతో,                                ఆ వస్తువుల్ని ఆశ్రమంలో దాచిపెట్టి, ఆశ్రమం కనక తమకు రక్షణ ఉంటుందని అక్కడే దాక్కున్నారు. 

రక్షకులొచ్చి ఆ ఋషిని దొంగల ఆచూకీ అడిగితే అతను మౌనంలో ఉన్నవాడు గనక మాట్లాడలేదు. 

రాజభటులకు అనుమానం వేసి ఆశ్రమంలో వెదికి దొంగల్నీ, ధనాన్నీ కైవసం చేసుకొన్నారు. 

వాళ్లతో కుమ్మక్కయ్యాడన్న అనుమానంతో వాళ్లు మునితో సహా అందర్నీ రాజు ముందు నిలబెట్టారు.

 *రాజు వాళ్లందరికీ మరణ దండన విధించాడు. ఒక్కొక్కర్నీ శూలాల మొనల మీద దిగగొట్టి తలారులు వెళ్లిపోయారు. 

కొన్ని రోజుల తరువాత  వచ్చిన తలారులకు, శూలం గుచ్చుకొని ఉన్నా                  ఏ బాధా పడకుండా ఈ ఋషి ఒక్కడే తపస్సు చేసుకొంటూ కన్పించాడు. 

భయపడి రాజుకి చెప్పారు. ఆయన వచ్చి శూలం మీద నుంచి దింపించి….         ‘నా అజ్ఞానం కొద్దీ తప్పు జరిగింది,                       కోపం తెచ్చుకోవద్దు. ప్రసన్నులు కండి’ అని వేడుకొన్నాడు. 

*ఆ శూలమ్మొన ముక్క అతని కింద భాగంలో ఉండిపోయింది. అప్పణ్నించీ అతన్ని ‘అణీమాండవ్యుడ’ని పిలవడం మొదలు పెట్టారు.

 *రాజునేమీ తప్పుపట్టలేదు గానీ ఋషి, ఈ పాపదండాలను అమలుపరిచే యమ ధర్మరాజు మీద మండిపడ్డాడు. తన తపశ్శక్తితో యమలోకానికి వెళ్లి, ‘నేను ఏం తప్పు చేశానని ఈ దుష్ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది?’ అని సూటిగా అడిగాడు. 

*‘బాల్యంలో నువ్వు తూనీగల తోకల్లోకి సూదిగా ఉండే గడ్డిమొనల్ని గుచ్చడం వల్ల’ అన్నాడు యముడు. 

*‘ధర్మశాస్త్రం రీత్యా పన్నెండేళ్ల దాకా 
 పిల్లలేది చేసినా అది వాళ్లను అంటదు. కానీ నేను చేసిన చిన్న పాపానికి నువ్వు నాకు పెద్ద దండాన్నే వేశావు. అంచేత శూద్రుడిగా పుట్టి నువ్వు ఈ దోషం నుంచి బయటపడాలి’ అంటూ యుముణ్ని శపించాడు ఋషి. 

*అలా యముడే అణీమాండవ్యుడి శాపం వల్ల విదురుడిగా పుట్టాడు. 

*తర్వాత ఇతనిలాగానే పుట్టిన ఒక కన్యని విదురుడికిచ్చి పెళ్లిచేశారు. 

*దంపతులిద్దరూ భక్తిపరులు; రాయబారానికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యమిచ్చి చరితార్థులయ్యారు వాళ్లు.

 *ధృతరాష్ట్రుడికి మంచి చెప్పే మంత్రిగా విదురుడు తన పని చేసుకొంటూ ఉండే వాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు వచ్చిన ఉత్పాతాలను చూసి అన్నగారితో, ‘ఈ కుర్రాడు కులాన్ని అంతం చేసి దౌర్భాగ్యుడవుతాడు. వీణ్ని విడిచిపెడితేనే రాజ్యానికి శాంతి; రక్షించి పోషిస్తే మాత్రం గొప్ప ఉపద్రవమే వచ్చిపడుతుంది’ అని  చెప్పాడు.

*పుత్రమోహంతో ధృతరాష్ట్రుడు ఆ పనిని చేయలేదు.

 *కణికనీతికి ప్రభావితుడై, తన కొడుకు ఆశలకు అడ్డని, తమ్ముడి కొడుకులని కూడా ఆలోచించకుండా పాండవుల్ని కుంతితో సహా వారణావత నగరానికి పంపి, అక్కడ పురోచనుడిచే కట్టించిన లక్క ఇంట్లో కాల్చేద్దామని ప్రణాళిక వేశారు ధృతరాష్ట్రాదులు.

*నెయ్యీ నూనె కొవ్వూ లక్కా మట్టితో కలిపి మర్దించి ఆ ఇంటి గోడలకు పూత పూయించారు. వీళ్ల దుష్ర్పణాళికను విదురుడు ముందే కనిపెట్టి, ధర్మరాజుకు అర్థమయ్యేలాగాను ఇతరులకు అర్థం కాని తీరుగానూ తెలియచెప్పాడు: 

*విదురుడే ఉప్పందించకపోతే, లక్క ఇల్లే పాండవుల పాలిటి శ్మశానవాటికై ఉండేది.

 *ధృతరాష్ట్రుడు విదురుడితో సంప్రదిం చనిదే ఏ పనీ చేసేవాడు కాదు. అను మానం రాకుండా ఉండడానిగ్గానూ జూదమాడడానికి రావాలని పిలవడానికి యుధిష్టిరుడి దగ్గరికి విదురుణ్నే అతను పంపించాడు. అక్కడ యుధిష్ఠిరుడు విదురుడి మాట వినగానే కజ్జా వస్తుందే మోనన్న సందేహాన్ని వెలిబుచ్చాడు. ‘నాకు తెలుసును జూదమెంత చేటు తెస్తుందో. దాన్ని ఆపుదామని ప్రయత్నించాను. కానీ నన్ను నీ దగ్గరికి పంపాడు. నువ్వు తెలిసిన వాడివి. ఏది శ్రేయస్సో అదే చెయ్యి’ అని విదురుడు సలహా ఇచ్చాడు. 

‘రాజుగారి మాట కాదనేదెలాగ? అతనేమో కొడుకు వశంలో చిక్కుకొన్నవాడు. సరే, పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదన్నది నా వ్రతం’ అని యుధిష్ఠిరుడు బయలుదేరాడు.

 *జూదం మధ్యలో కూడా అన్నగారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు విదురుడు:  ‘ఈ దుర్యోధనుడు భరత కులానికే చేటు. వీడు జూదమోహంలో తన పతనం గురించి పట్టించుకోవడం లేదు. అర్జునుడి చేత వీణ్ని బంధింపజేసి కులానికి సుఖాన్ని కలగజెయ్యి. పాండవుల ధన, రాజ్య ప్రాభవాలను మొత్తం లాగేసుకొందామన్న యావకొద్దీ వాళ్లకు ద్రోహాన్ని తలపెడితే వచ్చే నష్టం మీరు అంచనా వేయటం లేదు’ అని చిలక్కి చెప్పినట్టు చెప్పిచూశాడు. 

*చివరికి విదురుడి ప్రేరణతోనే ధృతరాష్ట్రుడు   ద్రౌపదికి వరాలనిచ్చి పాండవులకు పట్టిన దాస్యాన్ని పోగొట్టాడు.

 *రెండోసారి జూదానికి మధ్యేమార్గం నుంచే తీసుకొని రావడానికి మళ్లీ విదురుణ్నే పంపించాడు ధృతరాష్ట్రుడు. 
పాండవులు వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు ముసలిదైన కుంతిని తన ఇంట్లోనే ఉండమని ధార్తరాష్ట్రుల పీడ నుంచి కాపాడాడు. 
*ఒకరోజున ‘మాకూ పాండవులకూ హితవేమిటో చెప్పు’ అని అడిగిన ధృతరాష్ట్రుడితో ‘దుర్యోధనుడనే అహితుణ్ని అదుపులోకి తీసుకొని యుధి ష్ఠిరుణ్ని రాజుగా చెయ్యి. 
దుశ్శాసనుడిని నిండు సభలో భీముణ్నీ, ద్రౌపదినీ క్షమించమని అడగమను. ఇదే మీకందరికీ మంచిది’ అని చెప్పాడు.

 *దృతరాష్ట్రుడికి పట్టరాని కోపం వచ్చి విదురుణ్ని ‘నీఇష్టమొచ్చిన చోటుకు పో!’ అని కసురు కొన్నాడు. 

*వెళ్లిపొమ్మన్నాడే గానీ విదురుడి మాట వినపడనిదే నిముషమైనా ఉండ లేడు అతను. మరుసటిరోజునే సంజయుణ్ని పంపించి వనవాసం చేస్తూన్న పాండవుల దగ్గరికి వెళ్లిపోయిన విదురుణ్ని తిరిగి పిలిపించుకొన్నాడు.

*విదురుణ్ని కౌగిలించుకొని క్షమించమని అడిగాడు. ‘అదేమిటన్నయ్యా, నువ్వు నా గురువువి. ధర్మాత్ములు దీన జనులవైపే ఎక్కువగా మొగ్గి ఉంటారు. నువ్వు రమ్మనగానే నిన్ను చూడటానికి పరుగు పరుగున వచ్చాను’ అని అన్నగారి దీనత్వాన్ని పోగొట్టడానికి తానెంతగా ప్రయత్నిస్తూ ఉంటాడో చెప్పకుండానే చెప్పాడు.
*******************
 *సేనలు పోగుకావడం మొదలైన దగ్గర్నుంచీ ధృతరాష్ట్రుడికి కునుకే లేదు. విదురుణ్ని పిలిపించుకొని ‘నాకు ధర్మ యుక్తమూ కళ్యాణప్రదమూ అయిన మాటను చెప్పు’ అని అడిగాడు. 

*‘బల వంతుల సర్వస్వమూ దొంగిలించి, వాళ్లతో విరోధం పెట్టుకొన్న దుర్బలుడికీ, కాముకుడికీ, దొంగవాడికీ రాత్రుళ్లు నిద్ర పట్టడం కరువైపోతుంది. శత్రువును మిత్రుడిగా చేసుకొనేవాడూ మిత్రుణ్ని ద్వేషించి హింసించేవాడూ ఎప్పుడూ చెడ్డపనుల్ని చేసేవాడూ మహామూఢుడవు తాడు. 
ఎవరి పరాజయం మనకు ఇష్టం లేదో వాళ్లకు అడగకుండానే మంచీ చెడూ ఇష్టమూ అనిష్టమూ ఏదైనా తప్పకుండా చెప్పాలి.

 *ప్రాణం పోతున్నా సరే ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మం నిత్యం. సుఖమూ దుఃఖమూ మారిపోతూ ఉంటాయి. ప్రజలందర్నీ వారి వారి ధర్మాన్ని నిర్వర్తించేలాగ చేయడం రాజుగా నీ ధర్మం. ఇప్పుడు నువ్వు ధర్మరాజును క్షత్రధర్మం నుంచి దూరం చేశావు. ఇప్పుడతన్ని తిరిగి రాజధర్మంలో ఉండేలాగ చేస్తేనే నీకు హితం’ అని నీతిని బోధించాడు విదురుడు. 

*దీన్నే లోకంలో ‘విదురనీతి’ అని చెప్పుకొంటూ ఉంటారు.

*యుద్ధమంతా అయిపోయిన తరవాత ధృతరాష్ట్రుడూ, గాంధారీ, కుంతీ తపస్సు చేసుకోడానికి వనానికి వెళ్లినప్పుడు, వాళ్లను చూడ్డానికి ధర్మజుడు వెళ్లాడు.   అక్కడ ధృతరాష్ట్రుడిని చిన్నాన్న విదురు డెక్కడున్నాడని అడిగాడు.

  *అతను ఈ అడవిలోనే తపస్సు చేసుకొంటూ ఉన్నా డని చెప్పేసరికి ధర్మజుడు ఒక్కడూ అతన్ని వెదుక్కొంటూ వెళ్లాడు. ఒక చెట్టు మొదట్లో నిలుచున్న విదురుడు యోగబలంతో ధర్మరాజులో కలసి పోయాడు. ఇద్దరూ యమధర్మరాజు అంశలేగదా! ఇంతదాకా ఒకడు అటుండి అంతర్వాణిగా ధర్మాన్ని ధృతరాష్ట్రుడికి చెబుతూ వచ్చాడు. యుద్ధమైపోయిన తరువాత ఆ అవసరం తీరిపోయింది. 

*ధృతరాష్ట్రుడు మనస్సుగా సంకల్ప వికల్పాలు చేస్తూ సందేహంలో కూరుకుపోతూ ఉంటే, విదురుడతని అంతర్వాణి అయి హితాన్ని చెబుతూ వచ్చాడు. 
అతను మోహానికి లోబడి వినకుండా పూర్తిగా చెడిపోయాడు. మనం అందరం కూడా మన అంతరాత్మ పదే పదే ఎంత చెబుతున్నా వినకుండా అతనిలాగే చెడిపోతూనే ఉంటాం!

 *‘గడ్డీగాదమూ ఎండిన చెట్లూ ఉన్న అడవి అంటుకొన్నప్పుడు, నేలలోని కలుగుల్లో ఉండే జంతువులు నిప్పుకు ఆహుతి కాకుండా ఉండగలుగుతాయి. చుట్టూ తిరిగి ఆనుపానాల్ని ముందే ఆకళించుకొని, చుక్కల జాడలను బట్టి దిక్కుల్ని అర్థం చేసుకోవాలి’ అని..!✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
🙏

No comments:

Post a Comment