*మనవళ్లకు తాతల పాఠం* (కథ)
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
గోపాలం, భూపాలం ఇరుగు పొరుగున ఉంటారు. ఇద్దరికీ ఒకే వయసున్న మనవళ్లు ఉన్నారు. పేర్లు గోపి, గిరి . ఏడవ తరగతి చదువుతున్నారు. గోపి హుషారుగా, చలాకీగా ఉంటాడు. గిరి నీరసంగా, నిస్సత్తువుగా కనబడుతుంటాడు.
“ గిరి ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాడు” అని గోపాలంతో ఓసారి మాటల సందర్భంలో అన్నాడు భూపాలం. “చదువుకు సంబంధించిన ఒత్తిడి అయి ఉంటుంది” అని బదులిచ్చాడు గోపాలం.
“ గోపిది కూడా అదే తరగతి. బాగానే ఉంటాడుగా మరి ” తిరిగి అడిగాడు భూపాలం . ‘అవును. నిజమే’ జవాబిచ్చాడు గోపాలం.
తరువాత భూపాలాన్ని కొన్ని ప్రశ్నలడిగి జవాబులు రాబట్టాడు గోపాలం.
“ రేపు తెల్లారుతూనే గిరిని నిద్ర లేపు. నేను గోపిని తీసుకొస్తాను. అలా బయట తిరిగొద్దాం” అని చెప్పాడు గోపాలం. సరేనన్నాడు భూపాలం.
మరునాడు పొద్దున్నే మనవళ్లతో కలసి బయల్దేరారు తాతయ్యలు. గోపాలం చేతిలో వస్త్రపు సంచి ఉంది.
బయట సన్నగా మంచు కురుస్తుండడం వలన పిల్లలకు చలిగా ఉంది. అరచేతులు రుద్దుకోమని తాతయ్యలు చెప్పగానే …. పిల్లలు అలాగే చేసారు. కాస్త నయంగా అనిపించడంతో హుషారుగా నడిచారు మనవళ్లు.
కొంత దూరం వెళ్లేసరికి ఒక కూడలి వచ్చింది. అక్కడ మూసివేసి ఉన్న దుకాణం ముందు ఇద్దరు బిచ్చగాళ్ళు చలికి వణుకుతూ కూర్చున్నారు. సంచిలో చెయ్యి పెట్టి రెండు దుప్పట్లు తీసాడు గోపాలం. పిల్లలిద్దరి చేతుల్లో పెట్టి వాళ్లకు ఇమ్మన్నాడు. పిల్లల చేతుల మీదుగా వాటిని అందుకుని దీవించారు బిచ్చగాళ్ళు.
అక్కడకి కాస్త దూరంలో నాలుగు ఆవులు కూర్చుని నెమరు వేస్తున్నాయి. ఈసారి అరటి పండ్లను బయటకు తీసి పిల్లలకిచ్చి ఆ ఆవులకు పెట్టమన్నాడు గోపాలం. ఆ పండ్లను నోటితో అందుకుని తిన్నాయవి. పిల్లల ముఖాల్లో సంతోషం కనబడింది.
ఇంకోచోట కుక్కలున్నాయి. సంచిలో చెయ్యి పెట్టి బిస్కట్లను తీసిచ్చాడు గోపాలం. గిరి భయపడుతుంటే “ఫర్వాలేదు. అవేమీ చెయ్యవు” అని ధైర్యంగా బిస్కట్లను కుక్కల నోటికి అందించాడు గోపి. బిస్కట్లను తిన్న కుక్కలు తోక ఊపుతూ వాళ్ళిద్దరి చుట్టూ తిరిగాయి. వాటిని చూసి పిల్లలిద్దరూ ఆనందించారు.
తర్వాత కాసేపటికి కొంత దూరంలో ఉన్న ఉద్యానవనంలోకి వెళ్లారు. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. పిల్లలను ఆడుకోమని వదిలేసి, తాతయ్యలు నడక దారిలో వేగంగా నడవసాగారు.
కాసేపయ్యాక … మనవళ్లు దగ్గరకు రాగానే ఉద్యానవనానికి మరో వైపున్న పెద్ద వృక్షం దగ్గరకు తీసుకెళ్లాడు గోపాలం. అక్కడ కాకులు, పక్షులు ఉన్నాయి. సంచి నుండి పక్షుల తిండి గింజలున్న పొట్లం తీసి పిల్లల కిచ్చాడు. పక్షుల వైపు చల్లమనగానే పిల్లలిద్దరూ …. అలాగే చేశారు. కావు కావు మని అరుస్తూ కాకులు వచ్చాయి. గింజలను తిన్నాయి. వాటి పిలుపు విని మరి కొన్ని వచ్చాయి. ఆ దృశ్యాన్ని పిల్లలు నవ్వుతూ చూసారు.
ఇంటికి తిరిగి వెళుతుండగా.. మనవళ్లను ఒక పాల వ్యాపారి ఇంటికి తీసుకెళ్లాడు గోపాలం. మూత ఉన్న పాత్రను ఇచ్చి పాలు పోయించుకున్నాడు. పశువులు, చెంగుచెంగున ఎగురుతున్న దూడలను చూస్తూ కొత్త అనుభూతి పొందారు పిల్లలు.
అక్కడ నుంచి వెళుతున్నప్పుడు గిరి ముఖంలో ఏదో తెలియని కళను గమనించాడు భూపాలం. వెంటనే ‘ ఏం మాయ చేసారో కానీ గిరి ప్రవర్తన ఆశ్చర్యంగా మారిపోయింది” అన్నాడు భూపాలం .
గోపాలం నవ్వేసి “ ఏ మాయా లేదు. బడిలో చదువులు, ఇంటి పని అంటూ పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెడుతున్నాం. దాన్ని దూరం చేసేందుకు ఒకప్పుడు ఆటలు ఆడించేవారు. ఇప్పుడు బడిలో ఆట స్థలం కనబడడం లేదు. వీధిలో ఆడుకోవాలంటే ఖాళీ స్థలమే కరవైంది. వినోదం అనగానే టీవీ, సెల్ ఫోను ఇస్తున్నారు పెద్దలు. అదే పనిగా తెరని చూడడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే పిల్లలను తరచుగా బయటకు తీసుకుని వెళుతుండాలి. ప్రకృతిని పరిచయం చేస్తుండాలి. ఆటలాడించాలి. అప్పుడే వాళ్ళకి శారీరక శ్రమ తెలుస్తుంది. చెరువులు, జలపాతాల దగ్గరకు తీసుకెళ్లాలి. తమ మీద పడే నీటి తుంపరులకు ఎంతో మురిసిపోతారు. నీటిలో ఈదే చేపలను, కప్పలను చూసి ఉత్సాహం పొందుతారు. ఉన్న దాంట్లోనే పరులకు దానం చెయ్యడం, మూగ జీవులతో ప్రేమగా మెలగడం నేర్పించాలి. వాళ్లలో భూత దయ పెరుగుతుంది. తాత్కాలిక కష్టాలను మరిపించే శక్తి వాటికుంది. ఇవన్నీ పిల్లల్లోని ఒత్తిడిని దూరం చేస్తాయి. అందుకే వీలున్నప్పుడల్లా గోపిని బయట తిప్పుతుంటాను. గిరి విషయంలో ఈరోజు చేసిందీ అదే. పిల్లల్లో ఒత్తిడి దూరమైతే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువు మీద శ్రద్ధా పెరుగుతుంది. ఫలితాలు బాగుంటాయి” అని చెప్పగానే నిజమేనన్నట్టు తలూపాడు భూపాలం.
సేకరణ. మానస సరోవరం
No comments:
Post a Comment