Friday, December 23, 2022

నాయకత్వం ఎలా ఉండాలో దీని గురించి తెలుసుకుందాం

 నాయకత్వం ఎలా ఉండాలో దీని గురించి తెలుసుకుందాం.
 
విశాలమైన అడవికి రాజైన సింహం  ఒక రోజు   షికారు బయల్దేరింది. కొన్ని జంతువులు ఏదో పనిచేస్తున్నట్టు కనబడగా  చెట్టు చాటున నిలబడి  వాటిని చూసింది. 

 ఒక ఏనుగు  కర్ర పట్టుకుని అజమాయిషీ  చలాయిస్తూ  మిగతా వాటితో పని చేయిస్తోంది.  రాలిన ఆకులను, విరిగి పడిన కొమ్మలను కుప్ప పెడుతోంది గుర్రం. వాటిని  దూరంగా పడేస్తోంది ఎలుగుబంటి. మొక్కలు లేని   జాగాను కోతి చూపిస్తుంటే  గొయ్యిని తవ్వుతోంది కొండముచ్చు . తన సంచి నుంచి మొక్కలు తీసి నాటుతోంది కుందేలు. కొత్తవిత్తనాలను భూమిలో వేస్తోంది జింక. నీరు  తెచ్చి మొక్కలు, విత్తులు తడుపుతోంది జీబ్రా.  
 ఏ జంతువైనా సరిగ్గా పని చేయకపోతే  కర్రతో కొట్టి భయపెడుతోంది ఏనుగు.  అవన్నీ  భయపడుతూ పని చేస్తున్నాయి. 

అప్పుడే ఏనుగు దగ్గరకు మేక వెళ్ళింది.   దూరాన నిద్రపోతున్న మరో  ఏనుగును చూపించి ‘మీ తమ్ముడు పని మానేసి పడుకుందని” చెప్పింది.     ‘నా  తమ్ముడినేమీ అనకు. పోయి పని చూసుకో. ఇంకోసారి పితూరీలు చెప్పావంటే  తొండంతో విసిరేస్తా”  అని  భయపెట్టి పంపేసింది.   
 అంతవరకు జరిగింది చూసిన  సింహం వాటి ముందు కెళ్ళింది. 

“అడవిలోకి  జన సంచారం పెరిగింది. చెట్లు తగ్గిపోయాయి. చిన్న జంతువులెలాగైనా  నెట్టుకొస్తాయి కానీ మాకైతే    సరిపడినంత ఆహారం లేకపోతే కష్టం. దట్టంగా చెట్లు లేకపోతే  సులువుగా మేం దొరికిపోతాం.  మా జాతిని రక్షించుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాను” అంది ఏనుగు.  
వాటిని అభినందించిన సింహం ముందుకు వెళుతుంటే ఇంకో చోట చెరువు తవ్వుతూ కనబడ్డాయి ఇంకొన్ని జంతువులు. చెట్టు చాటు నుండి వాటినీ చూసింది. 

  ఒక  పల్లపు ప్రదేశంలో లోతుగా, వెడల్పుగా నేలను తవ్వుతున్నాయవి.
ఒక  ఎలుగుబంటి తన పని తాను చేసుకుంటూనే తోటి జంతువులకు సూచనలిస్తోంది. నక్కలు, తోడేళ్ళు  నేలను తవ్వుతుంటే ఆ మట్టిని ఎత్తి దూరంగా గట్టు కడుతున్నాయి అడవి దున్నలు. నేలను తడుపుతూ పని సులువు చేస్తున్నాయి కోతులు. వాటికెదురుగా చెట్టు మీద  కూర్చుని  పాడుతున్నాయి  కోకిలలు. దాంతో కష్టం తెలియకుండా పని  చేసుకుంటున్నాయి జంతువులు.   చాలా జంతువులు ఉన్నప్పటికీ క్రమశిక్షణతో పని చేసేటట్టు చూస్తోంది ఎలుగుబంటి.  పని చేయడం రాని జంతువు  దగ్గరకు వెళ్లి ఎలా చెయ్యాలో నేర్పిస్తోంది.  ఒక నెమలి  దాని దగ్గరకు వెళ్లి “ మీ అక్కని చూడు. అక్కడ చెట్టెక్కి తేనెతుట్ట కదిలిస్తోంది” అని చూపించింది. 

వెంటనే అక్క దగ్గరకు వెళ్లింది ఎలుగుబంటి.  “చెరువు తవ్వడం పూర్తయితే మనందరికీ లాభం . నువ్వెళ్ళినట్టే అవీ వెళ్ళిపోతే మన లక్ష్యం నెరవేరదు” అని నచ్చజెప్పి పనిలోకి తీసుకువచ్చింది.  

అప్పటివరకు చెట్టు చాటున ఉన్న సింహం బయటకు వచ్చింది. సింహానికి  నమస్కరించాయి జంతువులు. 
“ పోయినేడాది నీటి కొరతతో చాలా జంతువులు చనిపోయాయి. మళ్ళీ  అలా జరగకూడదని మేము చెరువు  తవ్వుతున్నాం” అన్నాయి జంతువులు. 
 ఈ ఆలోచన ఎలా వచ్చిందని’ అడిగింది  సింహం. ఎలుగుబంటి వైపు  చూపించాయి జంతువులు. ఏదో ఆలోచన స్ఫురించినట్టు అక్కడ నుండి వెళ్ళిపోయింది సింహం.

 నెల తరువాత పెద్ద సభ జరిపింది సింహం. జంతువులన్నీ హాజరయ్యాయి.  “మన అడవి చాలా విశాలమైనది. నేనొక్కణ్ణే   అంతా తిరిగి పరిపాలించడం కష్టమౌతోంది. పశ్చిమ ప్రాంతానికి ఎలుగుబంటిని నాయకుడిగా  నియమిస్తున్నాను” అని ప్రకటించింది. 
ఏనుగు కోపంగా  ముందుకొచ్చి “ నేనుండగా ఎలుగుబంటిని నియమిస్తారా? అదేమైనా నా కంటే గొప్ప నాయకుడా  ? ” అనడిగింది.  

“మీ రెండింటి పనితీరు, ప్రవర్తన ఆరోజు  చూసాను. నువ్వు తోటి జంతువుల మీద అజమాయిషీ చలాయించావు. తమ్ముడి విషయంలో బంధుప్రీతి చూపించావు. 
నాయకుడికుండాల్సిన లక్షణాలు నీలో కనబడలేదు” అంది సింహం. మరే  లక్షణాలున్నాయి?”  పెడసరంగా అడిగింది ఏనుగు. 

“మీరు చేయండి అంటాడు యజమాని. మనం చేద్దాం అంటాడు నాయకుడు. నీవన్నీ యజమాని లక్షణాలు. తప్పు చేస్తే దండించడం,ఇతరులే పని చేయాలనుకోడం,  స్వజాతి మీద ప్రేమ, స్వార్ధం నీలో కనబడ్డాయి. నీలా కాకుండా  అందరికోసం ఆలోచించింది ఎలుగుబంటి. వాటితో సమానంగా అదీ పని చేసింది. తన అక్క విషయంలో కూడ పక్షపాతం చూపించలేదు. తోటి జీవుల అవసరాలను  గుర్తిస్తూ పని చేయించింది” అంది సింహం. 
వాటికే  మురిసిపోయి పదవి ఇచ్చేస్తారా?” అనడిగింది ఏనుగు. 

సింహం ప్రక్కనే ఉన్న మంత్రి కుందేలు ముందుకొచ్చి “ఆ రోజు మృగరాజా వారికి తెలియకుండా నేనూ అనుసరించాను.  ఎలుగుబంటిలో నాయకుడికి కావలసిన లక్షణాలను గుర్తించాను. మీ రెండూ చేసింది మంచి పనే అయినా తనలో ప్రత్యేకతలు కనబడ్డాయి. ఒక లక్ష్యం వైపు జట్టుని ఐకమత్యంగా నడిపించడం,ముందుచూపుతో చెరువు అవసరం గుర్తించడం,  శక్తి యుక్తుల్ని సమకూర్చుకుని ఎవరిచేత ఏ పని చేయించాలో తెలుసుకోవడం, సరైన వైఖరిని అలవరచుకోవడం, ఇతర జంతువుల్లో ప్రేరణ కలిగించడం, స్పష్టంగా తన  భావాలను చెప్పడం, పక్షపాతం చూపించక పోవడం మొదలైన లక్షణాలతో తన అర్హతలు నీకంటే మెరుగ్గా ఉన్నాయి”   అంది. ఆ మాటలకు జంతువులన్నీ జేజేలు పలికాయి.  తల దించుకుంది ఏనుగు.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

No comments:

Post a Comment