Monday, December 19, 2022

అంతిమయాత్ర-మరణభీతి

 అంతిమయాత్ర-మరణభీతి

ఈశ్వరుడు-
కన్ను తెరిస్తే సృష్టి.
కన్ను మూస్తే లయం.
అంటారు.

నువ్వు కన్ను తెరచినా, కన్ను మూసినా 
జరిగేది కూడా అదే కదా! 
నీకన్నా ఈశ్వరుడేం గొప్ప? అన్నారు గురువుగారు.

శ్వాస పీలిస్తే జననం.
శ్వాస వదిలితే మరణం.
ప్రతి శ్వాసా ఓ జన్మే అన్నారు.

గతశ్వాసే గతజన్మ.
మరుశ్వాసే మరుజన్మ.

* * *

అసలు నీ Enjoyment  కోసమే దేవుణ్ణి, జీవుణ్ణి సృష్టించుకున్నావు... వారిద్దరి కంటే నీవు గొప్పవాడివి కావా? అని అన్నారు.

* * *

కవుల గురించి ప్రస్తావన వచ్చింది-

కవి అంటే కల్పన చేసేవాడు...

ఏ కవి చేసిన కల్పన నిజమైపోతుందో
ఆ కవియే ఈశ్వరుడు....అన్నారు గురువుగారు.

సినిమాహాళ్లు వేఱువేఱుగా ఉన్నప్పటికీ 
సినిమా ఒకటే అయినట్లు
కవులు వేఱువేఱుగా ఉన్నప్పటికీ
వారిలోని కల్పనాత్మక తత్త్వం ఒకటే...అన్నారు.

కవీశ్వరుడు అంటారు...
కవి, ఈశ్వరుడు ఇద్దరూ ఒకటే...
ఇద్దరూ కల్పన చేస్తారు...

కవి కల్పన కల్పనగానే ఉంటుంది.
ఈశ్వరుని కల్పన అదే క్షణంలో వాస్తవమైపోతుంటుంది.

* * *

ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్పేవాణ్ణి సత్యవంతుడు అంటాం.

రివర్స్ లో చూపేవాడు ఈశ్వరుడు.
అనగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా... 

* * *

కుక్క ప్రత్యేకత 
విశ్వాసం కలిగి ఉండడం అంటారుగానీ,
నిజానికి విశ్వాసంగా ఉండడం అనేది
దాని బలహీనత. 
* * *
కుక్క ప్రత్యేకత ఏమంటే
తాను కదలకనే తోకను కదిలించగలగడం.
* * *
తాను అచలంగా ఉంటూనే 
చలనరూపంగా ఉండగలిగే 
అతిశయశక్తి పరమేశ్వరునిలో ఉంది.

* * *

వెనకా ముందు ఎవరూ లేనివాణ్ణి
మనం 'అయ్యో పాపం' అంటాం.
నిజానికి వెనకా ముందు లేనివాడు పరమేశ్వరుడు.

వెనకా ముందు ఉన్నవాణ్ణే మనం 
 "అయ్యో పాపం...!" అనాలి.

* * *

పొద్దున పూసి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగయుగాలే కాలగర్భంలో నిమజ్జనాలైపోతుంటే, ఇక ఈ జీవితమెంత? అంటాడు ఠాగూర్....

పీచుమిఠాయి చూడ్డానికి పెద్దదిలా కనిపిస్తుంది...
అదిమి అదిమి చూస్తే చిన్నదైపోతుంది...
ఈ జీవితమూ అంతే... అన్నారు గురువుగారు...
తరచి తరచి చూస్తే రెప్పపాటే జీవితం...

కన్ను తెరిస్తే ఉయ్యాల...
కన్ను మూస్తే మొయ్యాల...
అన్నారు జాలాది...

* * *

మా ఇల్లు ఉండేది శ్మశానానికి వెళ్లే దారిలోనే...
ప్రతీరోజూ శవయాత్రలు చూస్తూనే ఉంటాము...

ప్రతిరోజూ సెల్ ఫోన్ చార్జింగ్ చేసుకున్నట్లు
నా మనసు వైరాగ్యాన్ని చార్జింగ్ చేసుకుంటుంది
ఆ అంతిమయాత్రల దృశ్యాలను చూసి...

గురువుగారిని ఒకరు అడిగారు-
మరణభీతిగా ఉంది...మార్గం చూపండీ...అని.

గురువుగారు ఇలా పరిష్కారం చూపారు...
ప్రతిరోజూ నీవు పడుకునే ముందు...నీవు మరణించినట్టు...బంధుమిత్రులంతా వచ్చి రోధించినట్టు...పాడె కట్టి...నిన్ను శ్మశానానికి తీసుకుపోతున్నట్టు...గుంటతవ్వి అందులో పడేసి పూడ్చివేసినట్టు...ఊహించుకుంటూ నిద్రలోకి జారుకో...ఇలా కొద్ది కాలం చేస్తూ ఉండు...మొదట్లో భయంగానే ఉంటుంది...కొంతకాలానికి మరణభీతి పోతుంది...అన్నారు.

నిజమే...
మరణభీతి ఉండేది, మరణంతో సహవాసం లేకనే. 

మరణంతో సహవాసం చేసినప్పుడు 
మరణమంటే భయం పోతుంది...

* * *

నా చిన్ననాటి మిత్రుడొకడు-
కారులో ఎవరైనా వెళుతుంటే "ఒరే బాబూ! ఎప్పుడ్రా మనం ఆ విధంగా పోయేది...!" అనడం అతనికి అలవాటు....

ఒకరోజు మేమిద్దరం మాట్లాడుతుండగా....
పాడె మీద శవం పోతోంది....
ఒరే...! ఎప్పుడ్రా మనం ఆ విధంగా పోయేది...! అన్నా...
అంతే... నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు సుత్తి వీరభద్రరావు టైప్ లో ...

మరణం అనే మాట వినగానే అపశకునంగా భావిస్తారు...

కానీ అది మంగళప్రదమైన పదం.
అందుకే రమణభగవానులు 'ఉన్నది నలుబది' గ్రంథం మంగళశ్లోకంలో 'మరణం' అనే పదాన్ని ఉపయోగించారు...

రమణుడు మరణానుభవం పొందేకే...మనిషి ఋషి అయ్యారు...
UG అనుభవించిన calamity కూడా అదే...
చచ్చి బ్రతకడం...అనే విపత్తు అది.

తల్లికి శిశువు సాక్షాత్కరించాలంటే
ప్రసవవేదన పడవలసిందే...

వ్యక్తికి స్వరూప సాక్షాత్కారం కలగాలంటే
మరణవేదన(calamity) పడవలసిందే.

కానీ ఆ వేదన సహజంగా దానికదే కలగాల్సిందే తప్ప, మన ప్రయత్నాలతో నిమిత్తం లేదు...

అనుకరించడం వలన కలుగదు....

రమణునికి మృత్యానుభవం కలిగిన గదిలో మనం పడుకుంటే రాదు.

UG కి పార్క్ లో బెంచి మీద కలిగిన 'సంవేదన', మనం అదే బెంచి మీద కూర్చుంటే రాదు.

"అది" కలుగుతుంది.అంతే.
ఎలా? అని మాత్రం అడక్కు.
ఎలా? అనేదానికి భగవంతుడు కూడా చెప్పలేడు.
అన్నారు గురువుగారు.
* * *

చావు అంటే ఎందుకింత భయం?

నేను పోయాక కూడా ఈ ప్రపంచం ఇలానే ఉంటుంది...మిగతావారంతా జీవించేవుంటారు అన్న ఒకే ఒక్క తప్పుడు భావనే కారణం.

నేను పుట్టక ముందు ఏదీ లేదు.
నేను గిట్టిన తర్వాత ఏదీ ఉండదు.

ఇది పరమసత్యం.
పై రెండువాక్యాలు స్ఫురణలో ఉంటే మృత్యుభీతి పోతుంది.

'నాది' అనుకోవడానికి నీ వద్ద ఏమీ లేదని తెలిసినప్పుడు మృత్యుభీతి పోతుంది.

భగవంతుణ్ణి స్మరించడం కంటే,  
రోజులో ఒక్కసారైనా మృత్యువును స్మరిస్తే చాలు. మృత్యుభీతిపోతుంది.

'నేను' అని ఊరక ఉండిపో...
దానికి ఒక్క అక్షరం కూడా చేర్చకుంటే
మృత్యుభీతి పోతుంది.

మనసులో-
అది-ఇది
అక్కడ-ఇక్కడ
అప్పుడు-ఇప్పుడు
అతడు-ఇతడు
అనే భేదభావం పోయినప్పుడు మృత్యుభీతిపోతుంది.

మాటవరుసకు కూడా రెండవ వస్తువును అంగీకరించకుంటే మృత్యుభీతి పోతుంది.

* * *

ప్రవహించే నదిలో క్షణక్షణానికి నీరు మారుతున్నట్టు
క్షణక్షణానికి ప్రపంచం మారిపోతోంది.
గత క్షణంలో ఉన్న బాబు, ప్రస్తుతక్షణంలో లేడు.
ప్రస్తుతక్షణంలో ఉన్న బాబు, మరుక్షణంలో లేడు.

ప్రతిక్షణం నీతో సహా ప్రతీది జారిపోతోంది...మారిపోతోంది...
అందుకే ప్రపంచం అశాశ్వతం అన్నారు...

నదిగట్టున ఉన్న చెట్టువలె కాలప్రవాహాన్ని సాక్షిగా ఉండి చూసేవాడివి 'నీవు'.

నామరూపచిత్రములకు ఆధారవస్త్రము 'నీవు'.

నీవే మహాద్రష్టవు.
నీవే మహాకర్తవు.
నీవే సర్వసాక్షివి.

"ఎందుకు" అన్న ప్రశ్నను నీకు నీవే వేసుకో.
ఇతరులకు వేయవద్దు.
ఇతరులు నీ నీడలు.
నీవు ఏకాత్మరూపుడవు...
IAM THAT IAM అని జ్ఞప్తికి తెచ్చుకో...
అదే జ్ఞానం...
అదే మోక్షం...

* * *

సాధన అంటేనే వాయిదా వేయడం అంటారు JK.
అంటే ఇప్పుడు ఇక్కడ పొందటం నీకిష్టం లేదన్నమాట...

మరోజన్మకు వాయిదా వేయకుండా
జన్మ-కర్మ అనే అనవస్థాదోషభూయిష్టమైన సిద్ధాంతాన్ని పట్టుకుని వ్రేళ్లాడకుండా

ఇప్పుడు-ఇక్కడ-ఇలా-నీలా ఉన్నట్లున్నాను...
కానీ లేనే లేను...
నేను "మాత్రమే" ఉన్నాను...

అనే పరమపద మకరందాన్ని జుర్రుకొని...భ్రమరంలా ఈ లోకంలో
ఆనందవిహారం చేయి....

ఇదే తొలి-చివరి జన్మగా భావించి 
శ్వాసించే  ప్రతి శ్వాసా అంతిమ శ్వాసే...
జీవించే ప్రతిక్షణమూ అంతిమయాత్రే.....

* * *

No comments:

Post a Comment